గౌతమి
"శీతే సుఖోష్ణ సర్వాంగీ, గ్రీష్మేతు సుఖశీతలా, భర్తృయుక్తాచయా నారీసా భవేద్వదవర్ణినీ." నిజముగ నీ గౌతమీ స్రవంతి వరవర్షినియె. గౌతమి మాతవలె, సోదరివలె, ప్రియభామిని వలె తనకు జల్లనై, స్నిగ్ధమై, అనురక్తయై తోచుచుండుటేలనో! ఆ నిర్మల వినీలనీరములలో నురికి, దేహమెల్ల నామె గౌగిలింప దన హృదయమూలములకు నామె ప్రేమ చొచ్చుకొనిపోవ, నీటిలోని మత్స్యమై యా నీలజలములోని కణమై యైక్యమైపోయి తేలియాడుచు, మునుగుచు, బాహువులు సారించి ఈదుచు, నీ గౌతమి బాలికతో నతడాడుకొన్నాడు. ఆమె కెరటాలతో పందెము వేచినాడు. లోతులలో మునిగి కన్నులు తెరచి, సూర్యకిరణములు చొచ్చుటచే గరుడపచ్చలయిన యాగామ్భీర్యమున విస్తుపోయినాడు. ఆమె హృదయమున దన సర్వాంగ చైతన్యము నుపసంహరించి తరుశాఖవలె తేలినాడు. ఉబికిపోవు నామె వక్షములతో ఎన్నిసారులో చంటిపిల్లవానివలె నాడుకొన్నాడు. గౌతమిదేవిలోని యనిర్వచనీయమగు నానందము తన యంత రాయముల జొరబాఱ నామెలో లీనమైనాడు. నారాయణరా వీయాలోచనతో గన్ను లరమూతలైపోవ నానంద మయుడైనాడు. వారి లాంచి కొవ్వూరు లంకకడ నాగినది. వారందరు లంకలో దిగి, యీ ఇసుక తిన్నెలలో నధివసించి మంతనములు సలుపుకొనుచుండిరి. నారాయణరావు గౌతమీ సమాహూతుడై బిరబిర లాల్చీ విప్పి, యద్దానిని, యుత్తరీయమును సేవకున కందిచ్చి, కట్టిన వస్త్రము వెనుకకు విరిచికట్టి నీటిలోనికి బరుగిడినాడు. 'లోతులుండును, జాగ్రత్త సుమీ' యని జమీందారు గారు హెచ్చరింప, స్నేహితులందఱు 'నారాయణరావు గజఈత గా'డని ధైర్యము చెప్పి తాముగూడ నీటిలోనికి దిగిరి. ఒక్క రాజారావునకు మాత్రము ఈత రాదు. అతడొడ్డుననే చంటిపిల్లని వలె నీటిలో చేతులు తట్టుచు వినోదించుచుండెను.
గౌతమీమాత కింకను వరదలు రాలేదు. నిర్మల వినీల జలములతో నామె యొక మహాసరస్సు వలె నున్నది. గోపీచందనపు బూతల వలె నిసుక తప్ప లచ్చటచ్చట తలలెత్తికొనియున్నవి. దూరాన పాపికొండలు స్పష్ట నీలలోహితములగు తమ శిఖరముల నా సంధ్యారుణరాగార్ద్ర గగనము లోనికి జొనిపి యానందించుచున్నవి. పశ్చిమమున లోహిత హరిద్రావర్ణ వికాసమై, మధ్య కర్బురరాగపూరితమై, దిశాంచలముల నవ్యక్తారుణచ్చవీ సుందరమై యాకాశము హృదయమును ద్రవింప జేయుచున్నది. కెరటముల హోరు షడ్జమమై, వాయు ప్రసారము రిషభమై, పక్షుల కలకలారావములు పంచమమైపోవ బ్రకృతిమాత మధుర సంగీతమున జొక్కుచున్నది.
పరమేశ్వరమూర్తి నెమ్మదిగా తేలియాడుకొనుచు రాజారావుకడకు వచ్చి, 'ఓ ముగ్ధ బాలుడా! చూడవోయి యీ ప్రకృతి అందం! నీలో నిద్రాణమైయున్న కవితాశక్తి మేల్కొలుపవోయి! అందులో కరిగి మరిగి లీనమై పోవోయి! నారాయుడు అడుగో శివమెత్తి ఆడుతున్నాడు. వేయి తీపులో నాలో ఒక్కసారిగా తలలెత్తుతున్నాయోయి' అనుచు హృదయము వొలుకవోసికొనియెను.
జమీందారుగారు చూపులన్నియు నీటిలోనుంచి వచ్చు సుందర మంజు శ్రీమూర్తియగు నల్లునిమీదనే యున్నవి. విశాలాంసలుడై విపులవక్షుడై గోమూర్దకటి సుందరుడై, అల్పమధ్యముడై, గంభీర వదనుడై, ఉన్నత శరీరుడై జలక్లిన్న ప్రకాశోజ్వల హరిద్రరోహితవర్ణుడై, నీటి చుక్కలు ముత్యములవలె రాలుచుండ గట్టునకు వచ్చి తడియారుకొనుచుండిన యల్లుని చూచిన యాయన కన్నులు చెమర్చినవి. ఈ బాలకుడవతారమూర్తియని యుబ్బిపోయినాడు. యమునా తీరము, బృందావనము, శ్యామసుందరుడు నాయన మనోవీధి దళుక్కున మెఱసి గోపికాభావ మాయన నావహించినట్లయినది.
రాత్రి యెనిమిది గంటలకు వారందరింటికి జేరినారు.
వారు గృహమధ్యశాలకు వచ్చునప్పటికి, అచ్చటి సోఫాలపై జగన్మోహనరావును శారదయు దగ్గరగా గూర్చుండి మాట్లాడుకొనుచుండిరి. శారద కిలకిల నవ్వుచుండెను. జగన్మోహనరావు మోము దరహాస ప్రఫుల్లమైయున్నది. వీరు లోన నడుగిడగనే శారద త్వరితముగ లేచి లోనికి జివ్వున పారిపోయినది. జగన్మోహనరావు మోమున గ్రోధచ్చాయ లించుక పొలసి తొలగిపోయినవి. శారద లేచిపోవుట ముందువచ్చిన జమీందారుగారికి నారాయణరావుకు ఆత్రమే కనబడెను. జమీందారు గారి హృదయమునందొక విధమగు జుగుప్స జనించెను. మెరుపు వలె మెరసి మాయమయిన శారదా బాలిక నారాయణరావు గుండియలో బాటపాడినది.
శారదపై నారాయణరాయని ప్రేమ నానాటికి గట్టలొరసి యఖండ గౌతమివలె పొరలిపోవుచున్నది. అతడందు మునకలిడుచు దేలియాడుచున్నాడు. వెడదలై, అర్ధనిమీలితములగు శారదానయనము లతని గలంచి వైచుచున్నవి. ఇతని ఇరువది రెండేండ్ల వయసు ముమ్మరము సలసల వెరలియాడుచున్నది.
వయసులోనున్న స్త్రీ, పురుషుల కొండొరులపై జనించు నీ వలపున కర్ధమేమో? చిన్నతనమున నొకచో బెరిగి యాటలాడుకొను బాలికా బాలకులకు మాత్రము ప్రేమలేదా? అవ్యక్తమధురము, సరళము నగు నా ప్రేమకూడా వియోగమును సహింపదు. ఆ బాలికా బాలకులిర్వురు నెపుడు గలసియుండగోరుదురు. ఒండొరులు భుజములపై చేతులిడుకొని తిరుగుచుందురు. ఆ యాట పాటలందే, ఒకరినొకరు 'ఏమోయి' యని నోరార బిలుచుకొనుటయందే వారికి తృప్తి. వారికి బరస్పర సౌందర్యముతో బనిలేదు. వారిరువురకు యౌవనోదయ మగుటతోడనే ఆ స్నేహము వలపుగా బరిణమించుటేలనో? వారి పలుకులు, చూపులు, చేతలు గూడ నూతన వికారమును బొంది క్రొత్త తలపులు రేకెత్తించుటేలనో? అట్టి చిన్ననాటి మిత్రుల యౌవన మొండొరుల యందు వివాహముచే జరితార్ధము కానినాడు వారి జీవితములు దుఃఖభాజనములైపోవుట వినుచుందుము.
అవ్యాజమధురమగు నా చిననాటి స్వచ్చ ప్రేమమే తారుణ్యోదయమున కామవతార మెత్తనేల? ప్రాణిధర్మమగు నీ కామమునకు దోడు సౌందర్య లాలస యేటికో? అట్లని సుందరియగు ప్రతి యువతిని ప్రతి పురుషుడును కామించునా? రతీచ్చవినా దేహసంశ్లేష మాత్రమున దృప్తిచెందు కామముండునా? తా నింతకుము న్నెందరు సౌందర్యవతులను గాంచియుండలేదు? అట్టివారెల్ల తన హృదయమును జూరగొనరైరేల? ప్రథమదర్శనమాత్రముననే శారదపై దనకు జనించినది ప్రేమమా, కామమా? అపరిచితయు, నజ్ఞాతయౌవనయు నగు నీ శారద తనకు భార్యయైనంతమాత్రమున తన దేహ మనఃప్రాణము లామెకై యిట్లు తహతాహ జెందనేల? దీనిని జననాంతర సౌహృదమందునా? లేక దాంపత్యమే యనవలయునా? నా యీ చిన్న శారదయు నేనును జన్మజన్మముల నొకరి నొకరిట్లు వెదకికొనుచు నేకమగుచున్నామా? ఈ సంయోగ వియోగముల కంతమెక్కడ? చరితార్థత యెక్కడ?
ఆలోచనాధీనుడగు నారాయణరావు భోజనము చేసి, యొంటిమై తాంబూలము వేసికొను శారద నల్లన జేరి, 'నాకు రెండాకులు రాసి ఇస్తావా?' యని యాచించెను. ఆమె యులికిపడి భర్తవంక నొక నిముషము చూచి, మారు మాట్లాడక యా లేత తమలంపుటాకులు చిలుకలు చుట్టనారంభించెను. నారాయణ సంతసము మై జిఱునవ్వు నవ్వుచు నచ్చటనే వేరొక యాసనముపై నధివసించెను.
నారాయణరావు రూపమానాడు శారద కేలనో సుందరతరమై కన్పించినది. వివిధ వర్ణ విద్యుద్దీపికల ప్రసన్న కాంతిలో నతనిరూపము మరింత మోహనమై కాన్పించినది. అవ్యక్తమధురములగు నూతనానుభవము లామెలో జాగరితములుగానోపు లజ్జచే నామె కపోలము లించుక చెమర్చినవి. ఆమె పెదవులలో జ్యోత్స్నలు నాట్యమాడినవి. తలవంచియే దీర్ఘములగు కంటిరెప్పల నెత్తి యా బాలిక భర్తను మరల గనుగొన్నది. తెల్లని పొందూరుపట్టు శాలీ ఖద్దరులాల్చీలో నుండి ముడులువడు నతని దేహసుభగత్వము వెలిగిపోవుచున్నది. ఉబికి విస్తరించియున్న యతని మెడకండరములు తొనలవలె తిరిగియున్నవి. గంభీరమగు నతని ముఖము, విశాల ఫాలము, తీరైన ముక్కు, చెవులు నతనికి దేవసేనానియగు కుమారస్వామి సౌందర్యమును ప్రసాదించినవి. శారదాదేవి స్తోకవక్షము లుప్పొంగినవి. విభ్రమవతియైనది. సానురాగయై భర్త చేతిలో సుగంధ ద్రవ్యములు గూర్చిన వక్కపొడియు, దమలపాకు చిలకలు పెట్టుచు స్పర్శసుఖమనుభవించినది. ఆ వ్రీడావతి శరీరము పులకరించినది. 'హాయి' యనుచు నామె హృదయ మానందపూరితమైనది.
నారాయణరాయు మృదుల మృదులమగు నా కరతలము గ్రహించి, 'నీ చేతి రేఖలు చూడవలె'నని యామెపాణి చూడ నారంభించెను. మెత్తని గులాబి మొగ్గవలెనున్న యామె చేతిలో రేఖలు స్పష్టములై యున్నవి. దీర్ఘములై లలితములగు నా వేళ్ళు తీగలే. గోళ్ళు ఎరుపులై సంధ్యారాగ తప్తములగు నక్షత్రములవలె ప్రకాశించినవి. నీలము పొదివిన తన చిటికినవ్రేలి యుంగరము తీసి యతడామె యనామికకు దోడిగి 'ఎంతవదులో!' యనుచు చిరునవ్వు నవ్వెను. ఆమె వజ్రపుటుంగరము తన కనిష్టికాంగుళికి దొడిగి 'జూచితివా, బిగు'వని మేలమాడుచు, దీపికా కాంతిలో నద్దాని గాంచుచు నిది నా ప్రాణప్రదమని ముద్దాడుకొనినాడు. 'చెన్నపట్టణము నుండి చక్కని యుంగర మొకటి తెచ్చి, యా చిట్టివ్రేలికి దొడిగికొందు'నని ప్రేమపూర్వకముగా ననుజ్ఞ వేడికొన్నాడు.
