"పాముని చూసి ముంగిస ఎందుకు భయపడదూ?"
"వెరీ సింపుల్. పాము కాటుని తప్పించుకునే చాకచక్యం ముంగిసకి వుంటుంది. పాము ఎన్నిసార్లు కాటు వెయ్యడానికి ప్రయత్నించినా కూడా అది అందకుండా తప్పించుకుంటూ వుంటుంది. చివరికి పాము మెడ పట్టుకుని కొరికేస్తుంది. ఇదంతా మైనంపాటి భాస్కర్ నవల 'వేగుచుక్క'లో చదివాను నేను" అన్నాడు అంకుష్.
"దటీజ్ ఓల్డ్ హాట్!" అన్నాడు సాహస్.
"అది నిన్నటి నిజం. సైన్సు నిత్య నూతనం కదా! నిన్నటి సత్యం ఇవాళ్టి భ్రమ కావచ్చును. పామూ ముంగిసల వైరం గురించి సరికొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది."
"ఏమిటది?" అన్నాడు అంకుష్ ఆసక్తిగా.
"ఈ ప్రపంచంలో పాము విషం ప్రభావానికి గురికాని జంతువులు రెండే వున్నాయి. ఒకటి ముంగిస. రెండోదేమో ముళ్ళపంది. పాము విషం అనబడేది నిజానికి ఒక్క విషం కాదు. అది అనేక విషాల కాక్ టెయిల్ లాంటిది. వాటిల్లో ముఖ్యమైన రెండు విషాలని బంగారో టాక్సిన్స్-అల్ఫా బీటా అంటారు. కట్లపాము తెలుసుగా. కట్లపాముకి శాస్త్రీయ నామం బంగారూస్ మల్టీ సింక్టస్. అంటే బంగారు రంగులో వుండే చారికలు అని అర్థం. తమాషా ఏమిటంటే ఈ బంగారు అనే పదం తెలుగులోంచి వచ్చినదే. పాము విషంలోని అల్ఫా ఏ జంతువు శరీరంలోనైనా ప్రవేశించగానే నరాలకీ, కండరాలకీ మధ్య వుండే జంక్షన్ లని ధ్వంసం చేసేస్తుంది. బీటా విషమేమో ఒక కోణం నుంచి ఇంకో కోణానికి సమాచారం చేరవేయబడే రసాయనిక చర్యలని నాశనం చేసేస్తుంది. మరణం సంభవిస్తుంది" అని అలా చెబుతూనే పామూ, ముంగిసలవైపు చూస్తున్నాడు సాహస్.
ఆ పాము క్రమంగా శక్తి కోల్పోతుంది.
ముంగిస విజృంభిస్తోంది.
"పాము విషం పనిచెయ్యని ముంగిస ఒంట్లో విషయం మోలిక్యూల్ కి పట్టు ఇచ్చే రిసెప్టర్ నిర్మాణం తక్కిన జంతువులకంటే విభిన్నంగా వుంటుంది. అందుకే విషం పనిచెయ్యదు. అలాగే ముళ్ళపందికి కూడా" అని ఆగి, "పాము విషం పని చెయ్యని ఇంకో జంతువేదో చెప్పుకో చూద్దాం" అన్నాడు సాహస్.
"నెమలి" అన్నాడు అంకుష్.
"కాదు. పాము విషం పనిచెయ్యని ఇంకో జంతువు పామే" అన్నాడు సాహస్ నవ్వుతూ.
అతనేమి మాట్లాడుతున్నా కూడా అతని చెవుల దగ్గర ప్రగతి గొంతు వినబడుతూనే వుంది చాలా స్పష్టంగా.
"సాహస్! సాహస్! ఏమిటి? పోలీస్ కమిషనర్ కి ప్రేమేమిటి అనుకుంటున్నావా? పోలీస్ కమిషనర్ ని అయితే ఆడపిల్లని కానా?"
తల విదిలించి ముందుకి చూసాడు సాహస్.
పాము చాలా దీనావస్థలోకి వచ్చేసింది. చాలా నీరసపడిపోయింది. పోరాటంలో ఇంక తను నెగ్గలేనని గ్రహించి పలాయన మంత్రం పఠించే ప్రయత్నం మొదలుపెట్టింది. మెరుపు వేగంతో తన పుట్టలోకి జర్రున జారిపోయింది. అది పుట్టలోకి పూర్తిగా అదృశ్యమయ్యేలోగా దాని తోకని నోటితో పట్టేసుకుంది ముంగిస.
పాము ప్రాణ భయంతో గింజుకోవడం మొదలుపెట్టింది. ముంగిస పట్టు వదలలేదు.
వాటి పెనుగులాట ధాటికి పాము పుట్ట పగిలింది.
పాము పుట్టలోకి వెళ్ళిపోయింది.
దానితోబాటు ముంగిస కూడా!
చిన్న టార్చ్ లైట్ ని ఫోకస్ చేశాడు సాహస్.
వెంటనే -
"అరె ఇదేమిటి?" అన్నాడు.
భయం, విస్మయం గొలిపే దృశ్యం ఒకటి అక్కడ వాళ్ళకి కనబడుతోంది.
ఆ పాము పుట్ట లోపల-
ఒక చిన్న గుహలాంటిది వుంది.
అందులో-
ఒక ఎముకల కుప్ప!
కాదు కాదు - ఉత్త ఎముకల కుప్పకాదు.
ఒక మనిషి అస్థిపంజరం.
ఒక్క క్షణం తర్వాత అర్థం అయింది సాహస్ కి.
అది అస్థిపంజరం మాత్రమే కాదు.
బాగా పరిశీలించి చూస్తే -
అది పద్మాసనం వేసుకుని మోకాళ్ళమీద చేతులు ఆనించి తపోభంగిమలో వున్న ఒక మనిషి తాలూకు అస్థిపంజరం అని తెలుస్తోంది. కొలాప్స్ అయిపోయి ఎముకలు ఒకదానిమీద ఒకటి పడి వున్నా కూడా మొత్తానికి అది తపస్సు చేసుకుంటున్న మనిషి తాలూకు అస్థిపంజరం అని అర్థమైపోతూనే వుంది.
అది ఏ కాలంలోనో వుండిన మునీశ్వరుడా? సంకోచంగా మరింత దగ్గరికి వెళ్ళి చూశాడు సాహస్.
ఆ అస్థిపంజరం తాలూకు కపాలం చిట్లి వుంది.
అది కాలప్రభావమా?
