"పరంజ్యోతి చేసినట్లు నిన్ను శాశ్వతంగా వుంచుకోమంటున్నావు. అవునా?"
ఆమె నిస్సహాయంగా తల ఊపింది.
"చూడు వాసంతీ! నువ్వు జోగినివి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని కొన్నాళ్ళు భంగపడ్డావు. ఇకనైనా ఆ ధోరణికి తోలోదకాలియ్యి. ఒక్కరితో శాశ్వతంగా వుండటం, ఒకరి బరువును జీవితాంతం మోస్తూ ఉండటం నావల్ల కాని పని. నీ జీవితంలో కూడ ఆ అధ్యాయం ముగిసిపోయింది. జరిగినదాన్ని ఊహించుకొని భ్రమలు పెంచుకోవడం కన్నా ఇప్పటికైనా కళ్ళు తెరు. అందరి జోగినులలా యధేచ్చగా బతుకు. సాధ్యమైనంత పుణ్యం మూట గట్టుకో."
ఆమెకు మగతగా ఉంది. నీరసం వల్ల కళ్ళు మూతలు పడుతున్నాయి.
"నువ్వు జోగినివి. జోగినివి" చెవుల్లో హోరు" కడుపులో ఆకలిబాధ. కళ్ళలో కోపం, కక్ష, దుఃఖం క్రమంగా చివరకు నిస్సహాయత...తలిదండ్రుల పోరు.
"నువ్వెందుకు రావు? ఎందుకు ఒప్పుకోవు? బలవంతాన నిన్ననుభవిస్తాం. ఏ చట్టం, ఏ మానవత నిన్ను కాపాడుతుందో చూస్తాం."
తన దగ్గరకొచ్చి నిరాకరించబడి వెళ్ళిపోయిన పురుష పుంగవుల సవాలు.
"ఏమంటావు?" చలమయ్య గొంతు దగ్గరలో వినిపించింది.
వాసంతి కళ్ళు విప్పింది. ఆ కళ్ళలో ఇప్పుడేమీలేదు. నిర్భీకత తప్ప.
"రండి" అన్నది చాలా హీనస్వరంతో. ఆమె చేతులు జాకెట్ గుండీల మీదకు వెళ్ళాయి.
"ఊహు" అన్నాడు చలమయ్య. "ఆ పని నేను చేస్తే నాకు సంతోషం."
అతని చేతులు ఆమె గుండెలమీద ఆనాయి గుండెలను ఛేదిస్తూ. శోకం కామంతో కరిగి పాపపంకిలమై పవిత్ర కార్య చిహ్నంగా సృష్టికి అంకిత మివ్వబడింది.
8
ఈ మధ్య శ్రీహర్షకు చలమయ్య యింటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఆయన అయినదానికి కానిదానికి ఏదో పని కల్పించి ఇంటికి పంపిస్తున్నాడు.
రత్నమ్మగారు ఇంట్లోనే ఉంటుందికానీ, అతను రాగానే మాట్లాడటానికి కూతురు వజ్రాన్నే పంపిస్తుంది.
వజ్రం అతన్ని "హర్షా?" అని చనువుగా పిలవటం మొదలుపెట్టింది. అతనడిగిన వస్తువు అందిస్తూ మెల్లగా చెయ్యి తగిలించేది.
"నీకు అదోలా లేదూ?"
"ఎందుకు?"
"నా వొళ్ళు నీకు తగిలినందుకు"
"మేము షాపులో పని చేసేటప్పుడు చాలామంది శరీరాలు మాకు తగులుతూ ఉంటాయి."
"మిగతావాళ్ళతో నన్ను పోలుస్తున్నావా?"
అతని కళ్ళలోకి ఓరగా, గీరగా చూసేది. అతనా చూపులు పట్టించుకోనట్లు కళ్ళు ప్రక్కకు త్రిప్పుకొనేవాడు.
"హర్షా!"
"ఊ"
"నన్ను చూడాలనీ, నాతో మాట్లాడాలనీ నీకనిపించటం లేదా?"
"వస్తాను" అని అతను జవాబు చెప్పకుండా వెళ్ళిపోయేవాడు. ఒకసారతనికి అందంగా మడచిన ఓ కాగితం కవరులో పెట్టి యిచ్చింది.
"ఏమిటిది?"
నీ గదికి వెళ్ళి తీరిగ్గా చదువు. ప్లీజ్"
ఆ సాయంత్ర మెప్పుడో సమయం చూసుకొని ఆమె రాసిన ఉత్తరం చదువుకొన్నాడు.
"హర్షా!
ఎన్నోసార్లు ఇన్ డైరెక్ట్ గా నా మనసులోని భావాన్ని నీకు చెప్పటానికి ప్రయత్నించాను. నీకర్థమయ్యే ఉంటుంది. అయినా పట్టించుకోనట్లు ప్రవర్తిస్తున్నావు. ఏం నేనంటే ఇష్టంలేదా? నేను నీకు నచ్చలేదా? హర్షా! నువ్వంటే నాకిష్టం. నిన్ను చూడకుండా నేనుండలేను. అంతేకాదు, మా అమ్మకీ, నాన్నకీ కూడా నువ్వంటే ఇష్టం. నన్ను నీకిచ్చి పెళ్లి చెయ్యాలని వాళ్ళ ఉద్దేశం. నువ్వు ఉలకవు, పలకవు. ఊ ఆనవు, ఆ ఆనవు. హర్షా! నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నిన్ను తప్ప ఇంకొకర్ని పెళ్లి చేసుకోలేను. నువ్వు నాకు కావాలి. తెలిసిందా? నా తలిదండ్రులకి నేనోక్కతే కూతుర్ని. నేను, నా ఆస్తి, నా సర్వస్వం నీకు అప్పగించటానికి నేను ఉర్రూతలూగుతున్నాను. రా ప్రియా! నన్ను స్వీకరించు_'వజ్రం.'
