Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 31

కీ బోర్డు నుండి మెమరీ కోసం ఓ కమాండ్ నొక్కామనుకో....వీడియో డిస్ ప్లే యూనిట్ నుండి మొత్తం స్క్రీన్ మీదకొస్తుంది.
చూపెట్టమంటావా?
మీ అందరి బిహేవియర్స్ ఈ మైక్రో కంప్యూటర్ లో ఫీడ్ చేశాను.
మనం పాలిస్తున్నామా? పబ్లిక్ మనీకి కన్నం వేస్తున్నామా?
కోట్లు....కోట్లు....వందలు కాదు.....వేలుకాదు.....
కోట్లకు కోట్లు.....
మనిషి బ్రతకటానికి ఎంత కావాలయ్యా?
మహా రచయిత- లియో టాల్ స్టాయ్ కథ చిన్నప్పుడు చదువుకో లేదా?"
"చదవలేదు సార్!" అన్నట్టు అంబరీషుడు తల అడ్డంగా వూపాడు.
"చదవరయ్యా మీరు! చదువుకుంటే ఇంజనీర్లో, డాక్టర్లో అయ్యేవారు. చదువు ఎగ్గొట్టే వాళ్ళే ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తారు. మనమంతా అదే బాపతు. ఆ కథ చాలా సింపుల్! కానీ గొప్ప జీవితసత్యాన్ని చెప్పిందయ్యా!
చెప్తా విను.
ఒకడు డబ్బు మూటకట్టుకుని భూములు కొనటానికి ఒక ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ నీవిచ్చే మనీ మూతకు వారు భూమి యిస్తారు. ఎట్లా? నీవు ఒకరోజులో ప్రొద్దుగుంకే సమయానికి ఎంతదూరం చుట్టివస్తావో అంత ప్రదేశం నీకు సొంతం చేస్తారు. ఈ వెళ్ళినవాడు మనలాంటి ఆశబోతు....
ఎక్కువ చుట్టిరావాలని ఆశకుఅంతం లేనట్టు- వాడు వెళ్ళీ వెళ్ళీ ప్రొద్దుగూకే సమయానికి బయలుదేరిన చోటుకు తిరిగి రాలేక పరిగెత్తి- పరిగెత్తి గుండెలు పట్టి.....నురగలు కక్కుకుంటూవచ్చి, క్రిందపడి చచ్చాడు.
చివరికి వాడికి కావాల్సిన చోటెంతో తెలుసా?
ఆరడగుల గొయ్యి. అదీ కథ!
మనం పాలకులం- గజదొంగలం కాదు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళ పర్సుకు తూట్లు పొడవటానికి కాదు. వారి పర్సులోకి మరో రెండు రూపాయలు చేరే ఉపాయం మనం చెప్తామని. ఈ దేశాన్ని అభివృద్ధిచేసి, వారి రాబడి పెంచుతామని. ఫర్ కాపిటియా ఇన్ కం పెరిగితే- దేశం ప్రగతిపథంలోకి వెళ్ళినట్టు.
పరిపాలన ప్రజలదయ్యా!
నీదీ-నాదీ కాదు. అందుకే వారి ముందు మనం ఎలా పాలిస్తుందీ పెట్టాలి.
జన్మభూమి-జన్మభూమి....తెల్లవారి లేస్తే ఒకే రకంగా అరుస్తున్నాం. అప్పుడెప్పుడో తెల్లవాడు దేశాన్ని దోపిడీ చేశాడని గోలెట్టాం. మరిప్పుడు జరుగుతుందేమిటి?
పళ్ళురాలగొట్టెందుకు తెల్లరాయికీ, నల్లరాయికీ తేడా లేదని మనం రుజువు చేస్తున్నాం.
ఇలా అయితే ప్రజలు వూరుకోరు.
పేపర్లో ఆ అమ్మాయి ఒక పిలుపునిచ్చింది. చదివావా? జనాన్ని కదలమంది. చైతన్యవేదికలుగా ఏర్పడమంది. రీకాల్ అప్లయ్ చేయమంది.
ఇంతవరకు మన జనానికి అదంటే ఏమిటో తెలీదు. ఐదేళ్ళకొకసారే ఎన్నికలనుకుంటున్నారు. ఈ కరెప్టెడ్ పాలకులు నచ్చకపోతే-తిరిగి వెనక్కి పిలిచి, పదవులు వూడగొట్టే పద్దతి ఒకటి రాజ్యాంగంలో వుందని జనానికి తెలిస్తే వాళ్ళు క్షణం ఆగారు.
వెనక్కి పిలిచి ప్రజా కోర్టులు పెడతారు.
ఆ అమ్మాయి ఎవరు? నీవు సాగించిన కుంభకోణం గురించి అంత వివరంగా ఎలా వ్రాసింది?!
పాలముంతలో పిల్లుల్లా తలలు దూర్చి- పాలు త్రాగటం ఎవరూ చూడటం లేదనుకుంటే ఎలాగయ్యా? మన బాడీ స్ట్రక్చర్ మొత్తం బయటవుంటుందని తెలుసుకోవాలి.
ప్రజలు ఆ పాలముంతకు యజమానులు.
వారి చేతుల్లో ఓట్లూ, రీకాల్, రిఫెరెండమ్ లాంటి ఆయుధాలున్నాయి. మనమీద ఆగ్రహం వచ్చి ఒక్కటి మనకు వ్యతిరేకంగా విసిరినా- మన నడుములు విరుగుతాయి. ఎందుకు చేయటంలేదో తెలుసా?
మిస్టర్ అంబరీషుడూ! మనది మునుల దేశం. ఋషులు సందేశించిన దేశం. ఆగ్రహం అంత తేలిగ్గా వారికి రాదు. అది వస్తేమాత్రం మనపాలిటశాపంగా మారి, మొత్తం అతలాకుతలం అవుతుంది.
నేను ఆ పిల్లను పిలిపించి మరిన్ని వివరాల్ని సేకరిస్తాను. అవి ఋజువుకు నిలబడ్డాయో....నువ్వు రిజైన్ చేయటానికి సిద్దంగా వుండు. అంతేకాదు- ఆ మనీ మొత్తం నీ నుండీ, నువ్వు అడ్డంపెట్టి ఆడించిన నీ జనం నుండే సీజ్ చేస్తాను. పరువుగా బయటికొస్తావో, బార్స్ వెనక్కే వెళతావో - ఒక వారం టైం ఇస్తున్నాను. తేల్చుకో!" అన్నాడు.
అంబరీషుడు ముఖం కందగడ్డలా అయింది. తిరిగి ముఖ్యమంత్రి అన్నాడు-
"ఒక విషయం తెలుసా మిస్టర్ అంబరీషుడూ? నెపోలియన్ లాంటి మగా చక్రవర్తే-యుద్దాల్లో శత్రు సైన్యాన్ని గడగడలాడించిన వీరుడే ఒక మాటన్నాడు.
వెయ్యిమంది శత్రుసైనికులు ఆయుధులై ఎదురు నిలిచినా నాకేం భయంలేదు. వారిని ఈజీగా జయిస్తాను. కానీ ఒకే ఒక్క న్యూస్ పేపరంటే నాకు చచ్చేంత భయం" అని.
"ఈనాడు నెపోలియన్ కాలంనాటికంటే బలమయిన మాన్ మీడియాలు మనకున్నాయి. హైటెక్ సిటీల్లో వుంటున్నాం. నీవు ఎటు నుండి ఎటు పోతుందీ....నాకిక్కడ కంప్యూటర్ స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ రకంగా అవసరమయితేనే నేను టెక్నికల్ ప్రాసెస్ ను అమర్చుకోగలను" అన్నాడు.
అంబరీషుడు దానితో మరింతగా బిగుసుకుపోయాడు.
హైటెక్ సిటీ అంటే....కాగితాలు వాడకుండా కంప్యూటర్ లో మేటర్ ఫీడ్ చేయడం...ప్రతిదీ మేడీజీగా మలుచుకోవడం అనుకున్నాడు గాని....తన కదలికల్ని కూడా కంప్యూటర్ కి ఫీడ్ చేయడం-అవి ముఖ్యమంత్రి గారి ముందు స్క్రీన్ మీద కదలటం అనుకోలేదు.
తను ప్రభుత్వం ఇచ్చిన కార్లలో తిరుగుతున్నాడు. అంటే మైక్రోటెక్ పరికరాలు ఏవో తనకు తెలీకుండానే తన కారులో అమర్చి....తన మూవ్ మెంటును నిత్యం ఆయన పరిశీలిస్తాడన్నమాట! తను అనుమానించిన ప్రతి మంత్రికీ రేపు ఈ పద్దతే ఆయన అప్లై చేయవచ్చు.
అంబరీషుడికి ఈసారి మరింత భయం కలిగింది.
"సర్! నేను ఈ విషయంలో నిర్దోషిని కాకుంటే మనీ ఆ విధంగా మిస్ యూజ్ అయి....అధో 'స్కామ్'ళా తయారవుతుందని నాకు తెలీదు. ఈ విషయంలో మీకెంత ఆవేదన కలిగిందో-నాకూ అంతే కలిగింది. మీరు పిలవకుండానే చెపుదామనుకున్నాను.
నేను చేసిన పొరపాటు.....వారికి రికమెండ్ చేయటం.
నా సంతకం వుండటంతో వారు ఇంత చేయగలిగారు. వ్యవసాయంలో మన రాష్ట్ర అవసరం తీరుస్తానని ఆశపడ్డాను. విదేశీ ఎరువులంటే కల్తీ లేకుండా దొరుకుతాయి. రైతుకు వుపయోగంగా వుటుందని వారికి అన్ని స్టేజెస్ లోనూ మాట సాయం అందించాడు. చివరికి స్కౌండ్రల్స్ నన్నే మోసం చేశారు.
ఆ మనీ మొత్తం వారు తిరిగి బాంక్ కు జమ అయ్యేట్టు నేను చేస్తాను. త్వరపడి మీరు నా విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోకండి" అంబరీషుడు దీనంగా అన్నాడుముఖ్యమంత్రి కొద్దిగా మెత్తపడి....
"సీ మిస్టర్ అంబరీషుడూ.....! ఇది నీ విషయంలో మొదటి పొరపాటుగా తలుస్తాను. మనీ నీవు తిరిగి బ్యాంక్ కి రిమిట్ చేయగలిగితే నీ మీద తయారవుతున్న "ఫైల్ ఆఫ్ ప్రాడ్"ని కొన్నిరోజులు ఆపగలను.
నీవు వెంటనే జరిగింది పత్రికా ముఖంగా ప్రకటన యివ్వాలి. ఈ సాయంత్రం విలేఖర్ల సమావేశం జరిపి మరింత వివరంగా వారికి విషయం చెప్పు.
ఆ పాపని అనే అమ్మాయిని అభినందించు. ఒకసారి ఆ అమ్మాయితో నేనూ మాట్లాడతాను" అన్నాడు.
అంబరీషుడి ముఖంలో ఈసారి కాస్తంత వెలుగు కనపడింది. తను ఈ స్కాన్ నుండి బయటపడాలి. మరీ ఫూలిష్ గా ఇరుక్కోవటం జరిగిందనుకున్నాడు.
ముఖ్యమంత్రి దగ్గర సెలవు తీసుకుని ఆయన బయటపడ్డాడు. కానీ ఆయన బ్రెయిన్ నిండా ఆ పావని అక్షరాలే మెదులుతున్నాయి.
తన చుట్టూ కండలుపట్టిన ప్రైవేటు సైనికులున్నారు. తన ప్రైయివేటు ఛాంబరులో ఎ.కె.47 గన్స్ దగ్గర్నుండి చాలా పవర్ ఫుల్ గా పేలే బాంబులున్నాయి.
కోట్ల మనీ చీకటి గదుల్లో మూలుగుతోంది.
భవంతులున్నాయి.
ఖరీదయిన కార్లున్నాయి.
కానీ....వీటన్నింటినీ చుట్టూ పెట్టుకుని ఈరోజు ఒక పెళ్ళికాని పిల్ల...అదీ ఒక పేద పంతులు కూతురు-దాని చేతిలోని ఆరంగుళాల రీఫిల్ అమర్చిన ఒక రూపాయిన్నర ప్లాస్టిక్ కలం మొన ఎక్కుపెట్టిన విధానానికి తను భయపడి చావాల్సి వస్తోంది. దీని రీఫిల్ దెబ్బకి నా రైఫిల్స్ అన్నీ మౌనంగా వున్నాయి.
తన దగ్గరున్న ఏ.కె. 47 గన్స్ కక్కే బుల్లెట్లకంటే దాని కలం అక్షరాలకు భయపడాల్సి వచ్చింది.
అది అక్షరాల్ని కక్కితే...తను మౌనంగా ఓటమిని అంగీకరించి ముఖ్యమంత్రికి సంజాయిషీ ఇవ్వటమేనా? అయినప్పుడు తన దగ్గరున్న ఆయుధాలకు అర్ధం ఏముంటుంది? కండలు తిరిగేట్టు మేసిన తన ప్రైవేటు సైన్యం వుపయోగం ఏమిటి?
దాని కలం ఇక అక్షరాల్ని కక్కకుండా....ముందుగా ప్లాన్ చేసినట్టు-తన గెస్ట్ హౌస్ కి లాక్కొచ్చి జీవితకాలం గుర్తుండేట్టు ఒక పాఠం చెప్పాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS