"అవును అమ్మమ్మా- అవును డాడీ- అవును మామ్! వంశీ లేకుండా నేనూ బ్రతకలేను. హి ఈజ్ హాండ్ సమ్ యంగ్ మాన్! నాకోసం ఏమయినా చేస్తాడు.
మామ్!
ఒక స్త్రీ జీవితంలో కోరుకునేది తన మనసుకు నచ్చినవాడ్ని అయితే నేను అదే కోరుకున్నాను. అంతకుమించిన ప్రేమ నేనంటే అతని హృదయంలో వుంది. జీవితంలో నేనెవరినీ కోరను మామ్! నా వంశీనే కోరుకుంటాను" అంటూ అతనికి దగ్గరగా జరిగింది.
అలా ప్రక్కకు వచ్చి నిలబడిన నళినిని కుడిచేత్తో తనకు మరింత దగ్గరగా పొదుముకుని.....ఎడం చేత్తో చిటికెలు వేస్తూ వంశీ ఆవేశంగా పెద్దగా అన్నాడు.
"ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ క్షణమే మేము బయటికి పోయి రిజిస్ట్రార్ ఆఫ్ మారేజెస్ ని కలిసి నిర్ణయం చెప్పి మారేజ్ చేసుకుని మరీ వస్తాం. రా నళినీ!" అంటూ వారు ఆగమని బ్రతిమలాడుకున్నా ఆలస్యం చేయకుండా బయటకు బయలుదేరారు.
వసుంధర ఒక్కసారిగా వారికెదురుగా వచ్చి పెద్దగా అరిచి ముఖంమీద చేతులు పెట్టుకుని ఒక భావోద్వేగానికి గురయి నేలమీద అలా కుప్పగా కూర్చుండి ఏడవటం మొదలెట్టింది.
తమ సమస్య ఎవరికీ చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు? ఇలాంటిది ఎవరు ఎదుర్కొన్నారు గనుక!
అలా కుప్పగా కూర్చుండిపోయిన వసుంధర దగ్గరకు మధు, గీతిక పరిగెత్తుకు వచ్చారు."
బయలుదేరిన వంశీ, నళిని ఆగిపోయారు. ఆ యువజంటకు అయోమయమయింది.
* * * *
కథ మొత్తం చదివి పావని కొంచెం షాక్ తిని అలాగే కూర్చుండిపోయింది.
ఆమె ముఖంలోని అస్పష్టమైన భావాల్ని చదివి....
పావనీ! మధు, గీతిక ప్రాబ్లెమ్ కూడా దగ్గరదగ్గరగా నీకు అర్ధమయ్యే వుంటుంది.
ఇక్కడ వసుంధర ముగ్గురికి తల్లి.
ఒకరు తన కుమార్తె.
రెండు తన కొడుకు.
మూడు తనకు కోడలుగా రాబోయే పిల్ల.
ముగ్గురూ ఒకే రక్తం పంచుకుంటున్నారు. ఒకే గర్భసంచిలోని వెచ్చదనాన్ని అనుభవిస్తూ కణ విభజనకు గురయ్యారు. ఒకే తల్లి కడుపులో ప్రాణం పోసుకున్నారు.
సోదరత్వానికి ఒక స్త్రీ మాతృగర్భంలోంచి బయటికి రావటమే కొలబద్ద అయితే....వారు ముగ్గురూ ఏకోదరులవుతారు. కానీ జైగోట్ పరంగా ఆలోచిస్తే....ఆ పిల్లను వంశీ ప్రేమించటానికి అర్హత పొందుతాడు.
వివరంగా నేను చెప్పటం కాదు.
ఈ ఉదంతాన్ని కూడా కంప్యూటర్ కెక్కించి, నీ సమాధానం దాని క్రింద ఫీడ్ చేయి" సాజిత్ అన్నాడు.
పావని కాసేపు ఆలోచించి చివర్లో అడిగింది.
"డియర్! ఈ సమస్యలన్నీ నీ కల్పితాలా? నిజంగా మన దేశంలో జరిగాయా?"
అందులో ఆశ్చర్యమేముంది పావనీ! అవన్నీ మన దేశంలో సంభవాలే! మా ఆసుపత్రిలో జరిగినవే! మా సీనియర్స్ ఏర్పాటుచేసినవే! కాకుంటే ఆ సమయంలో వారు ముందు జరుగబోయే ఈ ఎథికల్ ప్రాబ్లమ్ నూ వూహించలేదు. కానీ తిరిగి తాము ప్రారంభించిన ఈ సైంటిఫిక్ ప్రాజెక్టుల్లో, అనూహ్యంగా తలెత్తిన ఈ సమస్యలకు వారే ఒక సొల్యూషన్ కూడా. ప్రతి సమస్యకూ చివర ఫీడ్ చేశారు" సాజిత్ చెప్పటంతో పావని వెంటనే రియాక్టయి-
"ఏమని ఫీడ్ చేశారు?"
"అబ్బ! ఏం ఆశరా- ఈ అందాల చిన్నదానికి! అవి చూపిస్తే ఇంకా నువ్వు చెప్పేదేముంటుంది? నీవుగా ఏం చెప్తావో అని కదా నా తపన."
"మిస్టర్ సాజిత్! ఈ ప్రాబ్లమ్ కు మీరు చెప్పిన సొల్యూషన్స్ సెంట్ పర్సెంట్ కరెక్టు అని మీరు నమ్ముకుంటే నాకభ్యంతరం వుండదు. కాని....అవి చూసి నేను కాపీ చేసి తిరిగి చెప్పేంత వీక్ మైండెడ్ మెయిడెన్నంటి మాత్రం నాకు బోలెడంత అభ్యంతరముంది. ఏది చెప్పినా మనకో శైలి, పద్దతీ వుంది. అందుకు డీవియేట్ అయి నేను నీకే కాదు, మరెక్కడా చెప్పను. కాకుంటే తమరు శాస్త్రవేత్తలు కదా!ఒక రకంగా ఈ గాడ్ క్రియేషన్ లో స్మాల్ క్రియేటర్స్! తమరి సమాధానాలు ఏవిధంగా వుంటాయో పరిశీలిద్దామని మాత్రమే అడిగాను. తమరికి చెప్పటానికి అభ్యంతరం అయితే....నో ప్రాబ్లెమ్!" అంటూ ఒక దరిని కూర్చుంది.
సాజిత్ ఆమెకు దగ్గరగా జరిగి-
"డియర్! నువ్వు చెప్పేది నువ్వు చెప్పేయి. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఏం చెప్పారో కూడా నీకు తరువాత నీ సమాధానాలతో కంపేర్ చేసి మరీ చెప్తాను. అప్పటివరకూ తమరు ఫీడ్ చేసింది కూడా మనసులోనే వుంచుకుంటాను" అన్నాడు.
పావని లేచి ఓ.కె! అని అతని మెడచుట్టూ చేతులువేసి అతని ముఖంలో ముఖంపెట్టి అతని పెదాల్ని గట్టిగా ముద్దెట్టుకుంది.
తను గదిలో ఒంటరిగా వున్నప్పుడు తనమీద అప్లై చేసిన హైటెక్ లవ్ ఇప్పటికీ తన శరీరంలో మైమరపు తరంగాల్ని తీయగా కదుపుతూనే వుంది.
ఈ ముద్దు వాటిని మరింతగా కదిపి.....అతన్ని గట్టిగా హత్తుకుపోయేట్టు చేసింది.
ప్రేమ ఒక మత్తు అయితే....
ఇప్పుడు తనా మత్తులో వుంది.
"సాజిత్!" ఆమె మరింత మత్తుగా అంది.
"వాట్ డియర్" సాజిత్ కూడా తీయగా పిలిచాడు..
"నీ మధు-గీతిక ప్రాబ్లమ్ నేను సమాధానం ఫీడ్ చేస్తే ఏమవుతుంది?"
మరలా నా శరీరంలోంచి బయలుదేరిన "లవ్ వేవ్స్" అసంఖ్యాలయిన సాజిత్ లను మేసుకుని అంతటా ప్రసరిస్తూ నీలో మాత్రమే మరోసారి ధ్వనిస్తాయి."
"వెరీఫైన్ సాజిత్! అవి తెలుసుకోవాలనే ఆసక్తి నాకీ మధ్య మరీ ఎక్కువగా వుంటోంది. ఎందుకంటే ఈ హైటెక్ సొసైటీలో అవి ప్రపంచానికి సరిక్రొత్త అనుభూతులు కదా!" అంది.
సాజిత్ మెల్లిగా నవ్వాడు.
తరువాత వారు మరోసారి ముద్దెట్టుకుని విడిపోయారు.
* * * *
అది ముఖ్యమంత్రిగారి హైటెక్ చాంబర్!
గది గోడలు గ్రీనిష్ ఫైబర్ షీట్స్ తో నిర్మించబడ్డాయి. లోపల అంతా ఏ.సి. చేయబడి వుంది. నేల మొత్తం మెత్తటి తివాచీ పరుచబడి వుంది.
ముఖ్యమంత్రిగారు తన ఖరీదయిన హైటెక్ చైర్లో కూర్చున్నారు. దానికి బటన్ సిస్టమ్ వుంది. అది ఎత్తుకు లేవాలన్నా, వెడల్పుకావాలన్నా, ఈజీగా పడుకోవటానికి, కాస్తంత ప్లాట్ గా వెనక్కి పరచుకోవాలన్నా, స్లోగా రొటేషన్ పద్దతిలో అటూ ఇటూ తిరగాలన్నా అన్ని పద్దతులూ వున్నాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రిగారు రొటేషన్ పద్దతిలో స్లోగా ఫ్యాన్ తిరిగినట్టు కుర్చీలో కూర్చుని తిరుగుతున్నారు.
ఆయన ముందు విశాలమైన టేబుల్ వుంది. ఆ టేబుల్ నలుచదరంగా లేదు. అర్ధచంద్రాకారంగా కోయబడి వుంది. దానిమీద రక-రకాల మైక్రో కంప్యూటర్స్ వున్నాయి. ఓ జెయింట్ కంప్యూటర్ కూడా ముఖ్యమంత్రిగారి అర్ధచంద్రాకారపు టేబుల్ ప్రక్కనే వుంది, అదీ ఆయనకు అందుబాటులో వుంది.
ఆయనకు ఏ కంప్యూటర్ అందకపోయినా తను కూర్చున్న హైటెక్ చైర్ బటన్ నొక్కుతారు. అది స్లోగా ముందుకూ, ప్రక్కకూ మూవ్ అవుతుంది. తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ఆయన ఆయా కంప్యూటర్స్ కీ బోర్డుమీది కమాండ్స్ ప్రెస్ చేస్తారు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ స్క్రీన్ మీద పడుతుంది. అవసరమైతే అనుసంధానంగా వున్న ప్రింటర్ కూడా ఆయన వాడుకుంటారు.
ఆయన గది తలుపులు ఆయన నడుస్తూంటే వాడంతటవే తెరుచుకుంటాయి. ఆయన లోనికి వెళుతుంటే వాటంతటవే మూసుకుంటాయి.
ఆయన లోపలికి వెళ్లటంతోనే గదిలోని లైట్సన్నీ వాటంతటవే వెలుగుతాయి.
ఆ రోజు ముఖ్యమంత్రిగారు కాస్తంత ఆగ్రహంగా తన హైటెక్ చైర్ మీద కూర్చుని వున్నారు. ఆయన కళ్ళు కొద్దిగా ఎరుపెక్కాయి.
ఆయన ముఖం గంభీరంగా వుంది.
ఆయన ఎప్పుడూ గడ్డం ట్రిమ్ చేసుకుంటారు. జుట్టు ప్రక్కకు దువ్వుకుంటారు. తెల్లగా వుండే ఫాంటూ, షర్టూ ధరిస్తారు. కళ్ళకు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలుంటాయి.
ఆయన ముందు అర్ధచంద్రాకారం టేబుల్ కు అవతల ఓ హైటెక్ కుర్చీమీద అంబరీషుడు కూర్చుని పన్నాడు.
అంబరీషుడి ముఖంలో నెత్తురుచుక్కలేదు.
అంతకుముందు ఆయనకూ, ముఖ్యమంత్రిగారికీ ఏం సంభాషణ జరిగిందో తెలీదు.
ముఖ్యమంత్రిగారు అంబరీషుడి ముఖంలోకి మరింత సూటిగా చూస్తూ__
"ఏమయ్యా! ఇది మామూలు యుగం కాదయ్యా! కంప్యూటర్ యుగం. హైటెక్ యుగం. ప్రెస్ మీడియా, టి.వి., మీడియా, ఎఫెక్టివ్ గా పనిచేస్తున్న యుగం. మనం మన ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తే-ఎక్కడో ఒకచోట ఓ మైక్రో కంప్యూటర్ లో అది రిజిస్టరు అవుతుంది. దాని స్టోరేజీలో మన జాతకాలుంటాయి.
