42 వ. సర్గ
మారుతి అసురులతో యుద్ధము చేయుట :-
1. వనమున రేగిన - ధ్వనులకు అదిరి
లంకావాసులు - నిద్ర లేచిరి |
కావలియున్న - రాక్షస వనితలు
రావణు జేరి - విన్నవించిరి |
దశకంఠుడు మ | హోగ్రుడై పల్కె
వానరుని బట్టి - దండింపుడనే |
ఎనుబది వేల - కింకర వీరులు
హనుమంతునిపై - దాడి వెడలిరి .... ||శ్రీ||
2. శూల పట్ట సా | ది ఆయుధ ధారులు
రకరకములగు - కవచధారులు |
వేగవంతులు - రణశూరులు
ముద్గరపాణులు - ధనుర్ధారులు |
మహా దంష్ట్రులు - మహా బలులు
మహోదరులు - ఘోర రూపులు |
ఎనుబది వేల - కింకర వీరులు
హనుమంతునిపై | దాడి వెడలిరి .... ||శ్రీ||
3. మిడుతలదండు అగ్ని బడునటులె
అసురుల దండు క | పీశునిపై పడే |
సింహనాదమును - మారుతి చేసె
వాలము బెంచి - భూమిపై మోదే |
దిక్కులు అదరె - మృగములు బెదరె
పక్షులు చెదరి - నేలపై బడె |
ప్రళయరూపుడై - మారుతి ఎగసెను
తోరణ స్తంభము | పైన నిల్చెను ..... ||శ్రీ||
4. కేసరీ సుతుడు - కాయము బెంచెను
చేతి కమరిన - దండము బూనెను |
భీమరూపుడై - విజృంభించెను
కింకరులను మ | ర్దించి వధించెను |
చావగ మిగిలిన - అసురులు కొందరు
రావణు జేరగ - పారిపోయిరి |
మారుతి ఇంకను - పోరు పెంచగను
తోరణ స్తంభము - పైన నిల్చెను ..... ||శ్రీ||
5. ఎనుబది వేల - కింకర వీరుల
ఒక్క వానరుడు - హతము చేసెను |
ఈ వృత్తాంతము - వినిన రావణుడు
నిప్పులు గ్రక్కుచు - గర్జన జేసెను |
జంబుమాలిని - తగిన బలము గొని
ఆ వానరుని దం | డింప బొమ్మనెను |
జంబుమాలి ప్ర | హస్తుని సుతుడు
హనుమంతునిపై - దాడి వెడలెను .... ||శ్రీ||
__: 42 వ. స. సంపూర్ణము :__
43 వ. సర్గ
మారుతితో జంబుమాలి యుద్ధము :-
1. జంబుమాలి మ | హా బలవంతుడు
దొడ్డ కవచము | ధరించినాడు |
రక్తాంబరములు - దాల్చినాడు
మణిభూషణములు - ధరించినాడు |
ఖరములు లాగెడు - అరదము పైన
రణరంగమునకు | ఏతెంచినాడు |
అదిగని మారుతి - గర్జన చేయుచు
తోరణ స్తంభము | పైన నిల్చెను ..... ||శ్రీ||
__: 43 వ. స. సంపూర్ణము :__
44 వ. సర్గ
1. జంబుమాలి తన - వాడి శరములను
కపీశునిపై - ప్రయోగించెను |
శిరమును, ముఖమును - బాహు, వక్షమును
రక్తము చిందగ - గాయపరచెను |
రక్తసిక్తమై - మారుతి ముఖము
భానుకిరణ వి | ద్దాబ్జమై దోచె |
హరి కిశోరుడు - గర్జన చేయుచు
తోరణ స్తంభము - పైన ఎగసెను .... ||శ్రీ||
2. వజ్రకాయుడు - మారుతి విసరెను
భీకరమైన - పెద్ద బండను |
జంబుమాలి ఆ - వచ్చెడు బండను
పది శరములచే - పొడిపొడి చేసెను |
క్రోధావేశమున - అనిలాత్మజుడు
సాలవృక్షమును - పెరికి విసరెను |
జంబుమాలి ఆ - వచ్చెడు తరవును
పది శరములచే - తునకలు చేసెను ..... ||శ్రీ||
