
21
రాత్రి పది గంటలవుతుండగా అంతా సిద్దమయ్యారు. రజియా, సుగుణ, వెనుక సీటులో కూర్చున్నారు. వసంత డ్రైవింగ్ సీటులో కూర్చుంది. రాజ్ ఆమె ప్రక్కనే కూర్చున్నాడు. స్లిమత్ కారు సిమెంటు రోడ్డు పై సాఫీగా సాగిపోతుంది...వసంత కారును నిర్లక్ష్యంగా నడుపుతుంది. ఇంతలో వెనుక ఏదో కారు వస్తుండగా సైడు తీసుకొంది. ఆ కారు తమ కారును దాటి పోతుండగా "టాటా" అని వినిపించి ఎవరా అని చూసి "ఆనంద్" అన్నాడు. క్షణం లో ఆ కారు మలుపు తిరిగిపోయింది.
"అందులో ఎవరేవరున్నారు , రాజ్?' అడిగింది రజియా. "సరిగ్గా చూడలేదు, రజీ" అని వసంత వైపు చూశాడు రాజ్. అతని ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకొని ఎక్సి లెటర్ ను నొక్కింది వసంత. కారు టాప్ తీసేసింది. కొన్ని నిమిషాలలోనే ఆనంద్ వాళ్ళు పోతున్న అంబాసిడర్ ను చేరుకో గలిగింది స్లిమత్. ఆ వెలుగు లో టాప్ తీసి ఉన్నా అంబాసిడర్ లో ఆనంద్ ప్రక్కనే ఉన్న అరుణ ను స్పష్టంగా చూశారు వారు. వసంత సైడు ఇవ్వమంటూ టిప్ కొట్టింది. కానీ ఆనంద్ సైడివ్వక కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. వసంత వేగం తగ్గించింది.
'మరి లతా, ఇందిరక్కయ్యా రావడం లేదా, రాజ్!"
"లత గోపీ తో అప్పుడే వెళ్ళిపోయింది. ఇందిర అమ్మకు తోడుండాలి అని రాలేదు."
దారికి అడ్డంగా నిలబడి ఉన్న కారును చూసి దాని వెనుకే తన కారు నిలిచింది వసంత. అక్కడ రెండు కార్లు ఉన్నాయి. ఒకటి అంబాసిడర్. మరొకటి ఎవరిదో ఫియట్. ఆ ఫియట్ టైరు బర్ట్ అయింది. జాకీ లేక దిగాలు పడి ఆ ఫియేట్ యజమాని అంబాసిడర్ ను ఆపాడు. కానీ అందులో ఉంటేగా? అంతా కలిసి స్లిమత్ కోసం ఎదురు చూశారు.
రాజ్ క్రిందికి దిగగానే ఆ ఫియేట్ యజమాని దగ్గరికి వచ్చి "మీ జాకీ ఒకసారి ఇవ్వగలరా, ప్లీజ్" అన్నాడు. రాజ్ ప్రశ్నార్ధకంగా వసంత ను చూశాడు. "డిక్కీ లో ఉంది. చూడండి." అంది వసంత. తీసి యిచ్చాడు రాజ్.
ఆ వ్యక్తీ టైరు మార్చు కొనేందుకు ఒక్కడే కష్ట పడసాగాడు. అతని భార్యేమో పాపం అతనికి సాయపడుతుంది. అప్పటికీ వారి కది లొంగలేదు. ఆనంద్ నిలబడి తమాషా చూస్తున్నాడు. వసంత కు వారు పడే అవస్థ చూసి నవ్వు వచ్చింది. వారి అవస్థ చూడలేక రాజ్ "మీరు తప్పుకోండి" అన్నాడు.ఆవిడ నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ ప్రక్కకు జరిగింది. త్వరలోనే ఆ టైరు స్థానం లో క్రొత్త టైరు వచ్చింది.
"థాంక్స్ అండీ" అన్నారు వారు.
"ఫరవలేదు లెండి" అని తిరిగి వచ్చాడు రాజ్.
ఆనంద్, రాజ్ తో మెల్లగా "ఒరేయ్! ఏమిట్రా, ఆడపిల్ల డ్రైవ్ చేస్తుంటే ప్రక్కన కూర్చున్నావు? స్టీరింగ్ తీసుకోరా" అన్నాడు.
రాజ్ జవాబు చెప్పలేదు. అది చూచి ఆనంద్ "ఓడిపోయావని ఒప్పుకో" అని కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.
"వసంతా, అలా ప్రక్కకు జరిగి కూర్చో" అన్నాడు రాజ్.
'ఆ! మీరు డ్రైవ్ చేస్తారా?' కంగారుగా అడిగింది వసంత. చిరునవ్వు విసిరాడు రాజు.
"ఫరవాలేదు లే . ప్రమాదాలు జరుగానివ్వను."
అనుమానం గానే ప్రక్కకు తప్పుకోంది వసంత.
"రాజ్, నీకు డ్రైవింగ్ తెలుసా!" నమ్మలేక పోయింది రజియా.
సుగుణ ఏం మాట్లాడకుండా మెల్లిగా నవ్వుతూ కూర్చొని ఉంది.
స్లిమత్ అతని చేతిలో గాలిలో తేలిపోయినట్లు పోతుంది. అసలతనికి డ్రైవింగ్ తెలియదనుకొన్న రజియా, వసంత అది చూసి ఆశ్చర్య పోవడమే కాక భయపడ్డారు. సుగుణ ఉత్సాహం అతిశయంగా కనుచూపు మేర దూరం లో ఉన్న అంబాసిడర్ ను చూసి, 'అన్నయ్యా, ఈ దెబ్బతో ఆనందన్నయ్య చిత్తు" అంది.
ఒక మలుపులో హరన్ నొక్కిపట్టి ఎక్సి లెటర్ మీద కాలు తీసివేసి అదే వేగంలో టర్నింగ్ త్రిప్పి తిరిగి ఎక్సి లెటర్ నొక్కబోయి ఎదురుగా లారీని చూసి ఆ ప్రయత్నం మానుకొన్నాడు రాజ్. టర్నింగ్ తిరిగి అదే వేగంలో వస్తున్న కారును చూసి దానికి సైడు ఇవ్వాలన్న మాటే మరిచి భయంతో బ్రేక్ వేశాడు. లారీ డ్రైవర్ లారీ పక్కకు తప్పుకొంటుందనుకొన్న రాజు అలా జరుగక పోవడంతో ప్రక్కలకు చూశాడు. ఆ లారీకి కుడి వైపు పోవడానికి వీలు లేదు. ఎడమ వైపు కారు మెల్లిగా పోగలిగే స్థలం ఉంది. కాని ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రక్కనే ఉన్న పెద్ద పెద్ద చెట్ల కు గ్రుద్దు కోవడం ఖాయం. అప్పటికే కారు లారీని సమీపించింది. అప్పటికి కారు వేగం తగ్గక పోవడం చూసి ఆ లారీ డ్రైవరు భయపడి మరో వైపు నుండి క్రిందికి పరుగెత్తాడు. కారులో నివారు కారు లారీకి గ్రుద్దుకోందని కెవ్వున కేక వేసి కళ్ళు మూసుకొన్నారు. లారీ సమీపించా గానే స్టీరింగ్ ఎడమ వైపుకు త్రిప్పి తిరిగి కుడి వైపుకు కట్ చేస్తూ రెండు చెట్లను తప్పించుకొని తిరిగి రోడ్డు మీదికి వచ్చాడు రాజ్.
కళ్ళు తెరిచినవారు తాము సురక్షితంగా కారులోనే కూర్చొని ఉండడం, కారు అతి వేగంగా ముందుకు పోతుండడం చూసి వెనుతిరిగి చూశారు. కానీ వారికా లారీ కనిపించలేదు. కారు దాటిపోగానే లారీ డ్రైవరు కారు పోయిన స్థలానికి వచ్చి చూశాడు. తన లారీకి ముందు భాగం లో పదడుగుల దూరంలో ఒక పెద్ద చెట్టు ఉంది. అంత చిన్న దూరం లోనే దాన్ని దాటి లారీని తప్పించుకు పోయిన వైనం చూసి "బాప్ రే' అనుకోని ముందుకు చూశాడు. కానీ ఆ కారు అతని చూపుకు అందలేదు.
క్షణం ముందు జరుగబోయిన ఆపదను తలుచుకొని జలదరించాయి ముగ్గురి గుండెలు. అతని ధైర్యాన్ని చూసి అదిరిపడింది వసంత.
అంతవరకూ ఉత్సాహంగా ఉన్న సుగుణ భయంగా "అన్నయ్యా, వేగాన్ని తగ్గించు" అంది.
"మరేం ఫరవాలేదు . రజీ సుగుణకు ధైర్యం చెప్పు."
"నేనే భయపడి చస్తుంటే ఆమె కేం చెప్పను. రాజ్!"
"మరి నువ్వు, వసంతా?"
"ఇప్పుడిప్పుడే భయం పోయి ఉత్సాహ మోస్తుంది."
"వెరీ గుడ్!' అని టర్నింగ్ త్రిప్పి అక్కడే ఉన్న అంబాసిడర్ ను చూసి హుషార్ అన్నట్లు హారన్ ఇచ్చాడు రాజ్.
వెనక్కు చూశాడు ఆనంద్. రాజ్ కారు నడుపుతుండడం "హయ్ హయ్ నాయకా" అని ఒక్క కుదుపుతో అంబాసిడర్ ను ముందుకు పోనిచ్చాడు.
ముందు అంబాసిడర్, వెనుక స్లిమత్ బాణాల్లా ఆ చీకటి రాత్రి లో ముందుకు దూసుకు పోతున్నాయి. ఆనంద్ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. రాజ్ చిరునవ్వుతో సారెసారెకు హరన్ నొక్కుతూ అంబాసిడర్ కు రెండడుగుల దూరంలో స్లిమత్ ను పోనిస్తున్నాడు. విసిగి పోయాడు ఆనంద్. వేగం తగ్గించాడు. అది చూసి నవ్వుకొని అంబాసిడర్ ప్రక్కనే కారును పోనిస్తూ "ఏరా, పొగరణిగిందా!" అన్నాడు రాజ్.
"ఓడిపోయానురా నాన్నా!" ఒప్పుకున్న ఆనంద్ మనసులో ఒక భావం మెదిలింది. రెండు కార్లూ ప్రక్క ప్రక్కనే పోతున్నాయి. ముందుకు పోనివ్వాలని ప్రయత్నించి , రాజ్ తన పధకం విఫలం చేయడంతో నిట్టూర్చాడు ఆనంద్. అరుణ, రజియా చిరునవ్వులతో పలుకరించుకొన్నారు. సుగుణ ప్రక్క ప్రక్కనే పోతున్న కార్లను చూసి ప్రాణాలను అరచేత బట్టుకోంది. వసంత సినిమాలో సస్పెన్సు ను చూసినట్లు చూడసాగింది.
