శివయ్య ఉదయం లేచి వచ్చ్జి వసారాలో కూర్చుంటాడు. ఆ సంరంభం లేదు. ఆ సందడి లేదు. వంటరిగా కూర్చుంటాడు. వాకిలి సాంతం ఖాళీగా ఉంది, నిశ్సబ్దంగా ఉంది, శ్మశానంగా ఉంది. శివయ్యకు ఎదురుగా డస్కూ వుంది. పక్కన బీరువా ఉంది. కాని డస్కూ ముందు మనిషి లేడు. మల్లమ్మ ఛాయ్ తెచ్చి ఇస్తుంది. అందుకుని తాగుతాడు.
మల్లమ్మను చూస్తాడు. ఎందుకో ఆమెను చూస్తె జాలి కలుగుతుంది, మల్లమ్మకు తాను అన్యాయం చేశాడు. పరమయ్యను పారిపోయేట్లు చేశాడు. ఆమెను హింసించాడు. పిడికెడు నూకలు తీసి కెళ్ళిందామే తాను ఆమెను చావబాదాడు . మల్లమ్మ తనను విడిచి వెళ్ళిపోవచ్చు. ఊరంతా విడిచి పోయింది . ఆమెకు అవకాశం వచ్చింది . అన్న పెంటయ్య అనేక దుర్భాషలాడాడు అయినా ఆమె తనను విడువలేదు. ఆమె తన కిప్పుడు రక్ష . తాను నమ్ముకున్న భూములు, అధికారం, అప్పులు -- తుదకు తన భార్య తనకు కాలేదు. తన రక్షణకు రాలేదు. మల్లమ్మ తనను విడిచి వెళ్ళి పోతుందేమోనని గుబులు పట్టుకుంది.
"మల్లమ్మా!" తొలిసారి 'అమ్మా!" అని పిలిచాడు శివయ్య.
పనిలో ఉంది మల్లమ్మ పైటకు చేతులు తుడుచుకుంటూ వచ్చి నిలబడింది.
"మల్లమ్మా! నీకు శాన అన్యాయం చేసిన నేనే పట్నం పోత, పరామయ్యను తెస్త, బాకీ రద్దు చేస్త, నువ్వు ఈడనే ఉండు ఇన్నవా?" ఆశపెట్టి ఆమెను వుంచాలనుకున్నాడు.
'అట్లనే" అని వెళ్ళిపోయింది.
దొడ్లో పశువులు అంబారావాలు చేస్తున్నాయి. వాటిని విడువక చాలారోజులయింది. వాటిని తోలుకుపోవడానికి నర్శిమ్మకు భయంగా ఉంది. శివయ్యకూ భయంగానే ఉంది. అతను బయటికి వెళ్ళ లేకపోతున్నాడు . పొలాల్లో పంట పండి ఒరిగి ఉంది. ఒక్కసారి కళ్ళారా చూచుకుని వద్దామనుకున్నాడు వెళ్ళడానికి భయంగా ఉంది. బుగులుగా ఉంది గుండె గుబగుబ లాడుతుంది. ఊరిని వణికించాడు శివయ్య. ఇప్పుడు ఊరిని చూచి వణికి చస్తున్నాడు శివయ్య.
దీని'కంతటికీ కారణం ఎవరు? పావని . పావనిని తానేమీ చేయలేకుండా ఉన్నాడా? ఎందుకు? తానెందుకు చేయలేడు? పావనిని ఖతం చేస్తే? పావని ఎక్కడుంటుంది/ గూడెంలో ! అక్కడ మానవ దుర్గం ఉంది దాన్ని చేధించాలి. ఆమెను అంతం చేయాలి అంతేనా? అంతే! అయినా, ఎంతకాలం బతగ్గలరు కూలి జనం! కూటికి లేకుంటే వారే లొంగివస్తారు. చూతం "నర్శిమ్మా!' పిలిచాడు. నర్శిమ్మ వచ్చి నుంచున్నాడు.
"నర్శిమ్మా! నీ పేర భూమి రాసిస్తా, సార దుకాణం నీ పేర పెడ్త"
'అట్లనేనుండి"
"నర్శిమ్మా! నీ మనసులోని కోరిక నాకెరికే మల్లమ్మ నీక్కావలె, అంతేనా?"
'ఆవు దొర, అంతే అది చేయిరి నీ కాల్మొక్త"
"చేస్తర! జర ఓపిక పట్టు బల్లెం బాగున్నదిర"
"బాగున్నది బాంచెను, చూడుండి"
'అరె , తుప్పు పట్టిందిరా! తోము తళతళ మెరవాలే , ఇన్నావా?"
"అట్లనే బాంచను' - బల్లెం తీసుకొని బావి దగ్గరికి వెళ్ళిపోయాడు , మల్లమ్మ నీళ్ళు తోడుతుంది . ఆమెను చూడగానే నర్శిమ్మ వళ్ళు వేడెక్కింది. "మల్లీ! ఇటురా , జర నీలుపొయ్యి" ఆమె బొక్కనతో నీళ్ళు పోస్తుంటే నర్శిమ్మ మల్లమ్మనే చూస్తున్నాడు. బల్లెం కడగడం లేదు.
'అన్నా! ఏంది అట్ల చూస్తున్నావ్?"
అట్లేందుకంటవె! నిన్నే చూస్తున్న"
మల్లమ్మ బొక్కెన ఎత్తేసి అక్కడనుంచి వచ్చేసింది. ఆమె గుండె గుబగుబలాడుతుంది. ఏదో భయంగా ఉంది. వంటింటి కిటికిలోంచి చూసింది.
నర్శిమ్మ బల్లెం పదును పెడ్తున్నాడు.
పదును పెడ్తున్న బల్లెం మల్లమ్మ కళ్ళలో మెరిసింది. ఆమె గుండెలో భగ్గున మంట మండింది. ఏదో కుట్ర జరుగుతుంది అని గ్రహించింది . జాగ్రత్తపడాలనుకుంది. అప్రమత్తంగా వ్యవహరించాలనుకుంది.
రాత్రి భోజనాలయినాయి -- మల్లమ్మ పక్క వేసింది. శివయ్య మంచం మీద కూర్చుని సిగరెట్టు కాలుస్తున్నాడు.
"దొరా! ముంగల మనసాల్ల పంట చలి పెట్తాంది, బుగులుగున్నది"
"సరే, అట్లనే పండు"
"దొరా! నర్శిమ్మన్నను లోపట పండ పెట్టుకోరి ఊరంతా ఉడుకుతాంది పావనమ్మ పట్నం పొయిందట గూడెం మనుషులు మంచోరుకాదు"
శివయ్య ఆలోచనలో పడిపోయాడు పావని ఊళ్ళో లేదు. తన ప్లాను వాయిదా పడింది. మల్లమ్మ చెప్పిందే బాగుంది ఏది వచ్చినా ముందు మల్లమ్మ మీద పడుతుంది . మల్లమ్మను దూరంగానే ఉంచాలి. నర్శిమ్మకు -- వాడు దాహం తీర్చకుంటే అరిపోతాడు. సాహసం చేయలేడు. తన పని తీరింతరవాతనే మల్లమ్మను అప్పగించాలి అప్పగించాలా అసలు? అది తరవాత చూతాం అనుకున్నాడు .
'అట్లనే కానియ్యి" అన్నాడు.
నర్శిమ్మ మండిపోతున్నాడు అతని ఆశ నిరాశ అయింది. చాప ప్వేసుకుని గదిముందు మేను వాల్చాడు తాగి ఉన్నాడు ఆయినా నిద్ర పట్టడం లేదు. అతనిలో అగ్గి రగిలింది. ఆకలిగొన్న పులిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతనికి శివయ్య మీద మంటగా ఉంది. తనకు మల్లిని అప్పగుస్తానన్నాడు ఇప్పుడు గదిలో పెట్టి తలుపేశాడు. మండిపోతున్నాడు నర్శిమ్మ.
మల్లమ్మ వసారాలో మేను వాల్చింది- చింకి చాప మీద ఆమెకు నిద్ర రావడం లేదు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది రాత్రి గడిచిపోతుంది, అర్ధరాత్రి దాటింది. దూరంగా కుక్కల ఏడుపు వినిపిస్తుంది, కీచురాళ్ళు రొద చేస్తున్నాయి, గబ్బిలాలు ఎగురుతున్నాయి.
ఊరంతా నిద్రపోతుంది. మల్లమ్మ లేచింది. కిటికీలోంచి చూచింది. శివయ్య గుర్రు కొడ్తున్నాడు నర్శిమ్మ కనిపించలేదు. అతని అలికిడి వినిపించలేదు. చప్పుడు కాకుండా ముందరి తలుపుకు బెడం వేసింది. వసారాకు కటకటాల తలుపుంది . అది తీసుకుంది ఇంటి వెనక్కు వెళ్ళింది. కిటికీ లోంచి చూచింది, నర్శిమ్మ నిద్రపోతున్నాడు, వెనక తలుపు బెడం వేసింది. నవ్వుకుంది తాను పులిని బోనులో పెట్ట గలిగింది.
మల్లమ్మ వసారాలోకి వచ్చింది. తాళం చెవి చూసుకుంది. బీరువా తెరిచింది. దాన్నిండా కాగితాలున్నాయి దస్తరం ఉంది. ఈ కాగితాల్లోనే ఊరి బానిసత్వం ఉందని చెప్పాడు ధర్మయ్య. ఈ కాగితాలు -- వీటిలోని అక్షరాలూ తమను బానిసలు చేశాయి. ఊరిని బానిసలు చేశాయి. ఆ కాగితాలు పాముల్లా కనిపించాయి, తేళ్ళలా, పాముల్లా ఉన్నాయి. ఆమెలో ఏదో ఉత్సాహం పురి విప్పింది. ఆనందంతో గుండె గంతులు వేసింది. అన్నింటినీ తీసింది. దొంతులుగా కింద పేర్చింది.
మల్లమ్మ మళ్ళీ బయటికి పోయింది. ఆమె అన్నీ సమకూర్చి పెట్టింది. చాలా చాలా రోజులుగా ఈ ఆలోచన ఆమె మనసులో మసలుతుంది. కట్టెలన్నీ తెచ్చి పేర్చింది. అదొక పెద్ద చితిలా తయారయింది. ఆమె బానిసత్వానికి చితి పెరుస్తుంది. ఆమె ఉత్సాహానికి అంతులేదు. ఆమె గ్రామాన్ని విముక్తం చేస్తుంది. ఒకని ముక్తికే మనిషి ఉబ్బి తబ్బిబ్బవుతాడు. ఆమె గ్రామానికి విముక్తి ప్రసాదించబోతుంది.
మహా శక్తిలా కాష్టం పేర్చింది. అన్నీ ఒక్కసారి కాల్చడం ఆమెకు ఇష్టం లేదు. ఒక్కొక్కటీ కాష్టంలో తగలబడుతుంటే చూచి ఆనందించాలనుకుంది.
గూడెంలో పెంటయ్యకు మెలకువ వచ్చింది, మల్లమ్మ మీద అతనికి మహా కోపంగా ఉంది. మల్లమ్మ గూడేనికి మచ్చగా తయారయింది. ఆమె తన అక్క కావడం అతనికి తల కొట్టేసినట్లుగా ఉంది. ఈరోజు తేల్చుకోవాలనుకున్నాడు. మల్లమ్మను అంతమొందించాలనుకున్నాడు పీడ వదిలించుకోవాలని బయల్దేరాడు.
మల్లమ్మ కాడు మీద కిర్సనాయిలు పోసింది కట్టెల నన్నిటిని బాగా తడిపింది. అగ్గిపుల్ల గీసి అంటించింది. కట్టెలు భగ్గుమని అంటుకున్నాయి, మండుతున్నాయి. ఆ మంటకు మల్లమ్మ ముఖం వెలిగిపోతుంది. మల్లమ్మ నడికట్టు వేసింది. వెంట్రుకలు చెల్లాచెదురయి వున్నాయి.
మల్లమ్మ ఆ మంట చూచింది ఆమెలో అమితమయిన ఉత్సాహం పొంగింది. గుండె గంతులు వేయసాగింది. గట్టిగా కేకలు పెడ్తామనుకుంది, అరుద్దామనుకుంది, నాట్యం చేతామనుకుంది వాస్తవంగా శివం వచ్చినట్లుంది. ఆమెకు అనందం అవధులు దాటుతుంది.
మల్లమ్మ నిగ్రహించుకుంది పక్కన కాగితాల బొత్తలున్నాయి. వాటిని చూచింది చేత్తో అందుకుంది మంటలో వేస్తుంది. ఒక్కొక్క కాగితం ఖాతా బుక్కులు చించివేస్తుంది.
కాటి మంటకు ఆమె ముఖం ధగధగలాడుతుంది. ఆమె మనసు నిగనిగమెరుస్తుంది. ఆమె బానిసత్వాన్ని తగలబెడ్తుంది!!
గూడెం నుంచి బయల్దేరిన పెంటయ్యకు మంటలు కనిపించాయి. శివయ్య ఇల్లు తగలబడ్తుంది అనుకున్నాడు వెనక్కు తిరిగాడు. "శివయ్య ఇల్లు తగలబడ్తున్నది , శివయ్య కాలి చస్తున్నడు" అని కేకలు పెట్టి అందరినీ లేపాడు . వార్త చిచ్చులా పాకింది. వెంకయ్య లేచాడు. బ్రహ్మయ్య లేచాడు. కొమరయ్య లేచాడు. పావని లేచింది. గూడెం సాంతం లేచింది ఆశ్చర్యం లేదు - వార్త అలాంటిది .
