ధర్మయ్య మంచంలోంచి గబుక్కున లేచాడు. దుమికాడు అతనికి కాళ్ళు వచ్చాయి. అది గ్రహించినట్లే లేడతను. అందరితో పాటు గునగునా ఉరికాడు. గూడెం సాంతం కదిలింది. ఊరు సాంతం కదిలింది.
"శివయ్య ఇల్లు తగలబడుతున్నది. శివయ్య కాలి చస్తున్నడు"
అరుస్తూ, కేకలు వేస్తూ ఊరంతా శివయ్య ఇంటివైపుగా ఉరుకుతుంది. పావని గ్రహించింది.
"మల్లమ్మ మన దేవత మన దేవి మన శక్తి మన కాళి . ఈమె మహత్కార్యం చేసింది. మిమ్ములను బానిసత్వం నుంచి విముక్తులను చేసింది. మీ అప్పు కాగితాలను మంట పెట్టింది. మీకిహ అప్పుల్లేవు. మీరు బానిసలు కారు. మీ పొలాలు తిరిగి మీకొచ్చేశాయి."
"మా పొలాలు ఇప్పించిన మల్లమ్మకీ జై!"
"మా బాంచతనం ఇడిపించిన మల్లమ్మకీ జై!"
ధర్మయ్య ముందు కురికాడు. మల్లమ్మను ఎత్తుకున్నాడు ఎగురుతున్నాడు.
"మా బాంచతనం పోయెనే
మేమంత మనుషులమైతిమే"
కాడు కాలుతున్నది. కాగితాలు యజ్ఞానికి ఆహుతి అవుతున్నాయి. మల్లమ్మ పట్టలేకపోయింది. వికటాట్టహాసం చేసింది. ఆ నవ్వుకు కొండలూ, కోనలూ ప్రతిధ్వనించాయి.
శివయ్య గబుక్కున లేచాడు. కిటికీలోంచి చూచాడు. నాల్కలు చాచి మంటలు మండుతున్నాయి. ఆ మంటలు మల్లమ్మ ముఖాన మండుతున్నాయి. విరబోసిన జుట్టూ - వీరాంగన లాంటి ముఖం కాంతులు విరజిమ్ముతుంది. కాగితాలు మంటలో పడేస్తుంది. గ్రహించాడు శివయ్యా "లంజముండా!' అని కేక పెట్టాడు.
మల్లమ్మ మండే ముఖంతో శివయ్యను చూసింది "ఊ ఊ ఊదేస్త కూరేస్త నరికేస్త" అరుస్తుంది మల్లమ్మ -- శక్తిలా ఉంది . మహాకాళిలా ఉంది దుర్గలాగుంది.
"అంతా ఉట్టిదే లంజముండా! నా కొంప ముంచినావు నిన్నేం చేస్తవో చూడు" అని ఉరికాడు రెండు తలుపులూ బయటి నుంచి గోళ్ళలు పెట్టి ఉన్నాయి. ఇల్లంతా తిరిగాడు నర్శిమ్మను లేపాడు. ఉద్దరూ గిజగిజ లాడారు. తలుపు కొట్టారు. బాదారు. ప్రయోజనం లేకపోయింది. కిటికీ దగ్గరకు చేరాడు. శివయ్య చేతికి అందిందల్లా మల్లమ్మ మీదికి విసురుతున్నాడు . కత్తిపీట మల్లమ్మ ముఖానికి తాకి చీరుకుపోయింది. నొసటి నుండి రక్తం కారుతుంది. మల్లమ్మ లక్ష్య పెట్టడం లేదు. చివరి పుస్తకం మంటలో వేయడానికి ఎత్తింది.
కేకలు, పెడ బొబ్బలతో ఊరు సాంతం అక్కడికి చేరింది. ముందర పావని ఉంది. ఆ దృశ్యం చూచి అంతా చిత్తరువులా నిలబడిపోయారు. చివరి బుక్కు మంటల్లోకి విసిరి పెద్ద కేక పెట్టింది మల్లమ్మ.
పావని గ్రహించింది ముందు కురికింది.
"మల్లమ్మా! నువ్వు మహత్కార్యం సాధించావు. ఊరంతటినీ బానిస బాధల్నుండి విముక్తం చేశావు" అని గట్టిగా కావిలించుకుంది ముద్దులు పెట్టుకుంది. ఆమెను ఎత్తుకుని ఎగిరింది గంతులు వేసింది. ఎదుట మండే మంటకు ఇద్దరూ ధగధగాయమానంగా వెలిగిపోతున్నారు.
వచ్చిన జనం నివ్వెర బోయి చూస్తున్నారు. వాళ్ళకేమీ అంతుపట్టటం లేదు. పావని గ్రహించింది .
"మల్లమ్మ మన దేవత మన దేవి మన శక్తి మన కాళి ఈమె మహత్కార్యం చేసింది. మిమ్ములను బానిసత్వం నుంచి విముక్తులను చేసింది. మీ అప్పు కాగితాలను మంట పెట్టింది. మీకిహ అప్పుల్లేవు మీరు బానిసలు కారు . మీ పొలాలు తిరిగి మీకొచ్చేశాయి."
"మా పొలాలు ఇప్పించిన మల్లమ్మకీ జై!"
"మా బాంచతనం ఇడిపించిన మల్లమ్మకీ జై!"
ధర్మయ్య ముందు కురికాడు, మల్లమ్మను ఎత్తుకున్నాడు ఎగురుతున్నాడు
"మా బాంచతనం పోయెనే.
మేమంతా మనుషులమైతిమే"
జనం ఆనందంతో గంతులేస్తున్నారు. కేరింతలు పెడుతున్నారు. ఆడుతున్నాడు, పాడుతున్నారు అంతా ఆనందంగా ఉంది అట్టహాసంగా ఉంది.
శివయ్య జనాన్ని చూచాడు. లోన నక్కాడు. వీరంతా తన దగ్గరికి బానిసలుగా వచ్చిన జనమే. ఇప్పుడు రుద్రుల్లా వచ్చారు, శివుల్లా వచ్చారు, పాలక్షుల్లా వచ్చారు. వణికి చచ్చిపోతున్నాడు శివయ్య.
పెంటయ్యకు అమాంతంగా గుర్తు వచ్చింది.
"శివయ్యగాడేడి? ఆ దొంగ భాడఖాన్ ఏడీ?" అని తలుపు దగ్గరికి ఉరికాడు.
"ఏడీ> వాడేడీ? వాని అంతు తెలుస్తం" -- జనం అంతా తలుపుల మీద పడ్డారు. బడుతున్నారు కొడుతున్నారు. ఒకడు గునపం తెచ్చాడు ఒకడు గొడ్డలి తెచ్చాడు. తలుపులు బద్దలు కొట్టడానికి ఉరుకుతున్నారు.
"ఆగండి " -- పావని కేక వినిపించింది అంతా వెనక్కు తిరిగారు. ఆమె గబగబా ఉరికి గుమ్మానికి అడ్డంగా నుంచుంది - చేతులు చాచి.
"మనం మనుషులమా/ రాక్షసులమా? చంపడం - చావడం తప్ప మనకేమీ తెలియదా? చంపడం - ముంచడం వాళ్ళ పని బతికించడం , సంపద పెంచడం మన పని . శివయ్యలో ఉన్న శక్తిని మల్లమ్మే కాల్చేసింది. శివయ్య ఆస్తిని నమ్ముకున్నాడు. అప్పులను నమ్ముకున్నాడు. అతను మనిషిని నమ్మలేదు. మానవత్వాన్ని నమ్మలేదు. అతను నమ్ముకున్న ఆస్తి అప్పులు నశించాయి. ఇహ అతను చచ్చినట్టే చచ్చినవాణ్ణి చంపి ఏం చేసుకుంటారు? మనిషి మాంసం తింటారా? మనిషి రక్తం తాగుతారా? వాళ్ళు అందరినీ చంపుతారు మనం అందరినీ బతికిస్తాం బతికించడం మనపని శివయ్య చచ్చిన "
ఇంకా మాట పూర్తీ కాలేదు - 'అయ్యో చస్తి " అన్న శివయ్య కేక వినిపించింది. తలుపు తీసుకుని బల్లెంతో బయటికి వచ్చాడు నర్శిమ్మ. నర్శిమ్మ రుద్రమూర్తిలా ఉన్నాడు. అతని బల్లెం నిండా రక్తం ఉంది.
శివయ్య లోన గిలగిలా తన్నుకుంటున్నాడు.
నర్శిమ్మ రక్తం నిండిన బల్లెంతో నరసింహమూర్తిలా ఉన్నాడు.
మల్లమ్మ రక్తం నిండిన నొసటితో , విరబోసిన జుట్టుతో అదిశక్తిలా ఉంది.
పావని సరస్వతిలా ప్రసన్నంగా ఉంది.
కాళ్ళూ, చేతులూ వచ్చిన ధర్మయ్య తనువు తెలియక ఆడుతున్నాడు.
అంతా నిశ్సబ్దంగా ఉంది.
శివయ్య మూలుగులు వినిపిస్తూనే ఉన్నాయి.
తూరుపు ఎర్రవారింది.
ప్రకృతి సాంతం ముక్త కంఠంతో పాడుతున్నట్లుంది -
"వెలుగులు చిమ్మే
వేకువ వచ్చెను
జగములు మేల్కొను
జిలుగులు తెచ్చెను
కలిమి లేములు
కల్లని చెప్పెను
కొందరు బతికే
కాలము చెల్లెను
అందరు బతికే
అందము లోలికెను!"
* అయిపోయింది *
