శివయ్య కాళ్ళకింద భూమి జరిగిపోతున్నట్లనిపించింది తాను పాతాళానికి దిగజారి పోతున్నట్లనిపించింది మొత్తం భూస్వాములు కలిసి ఏమీ చేయలేక పోయినందుకు వాళ్ళను నిందించాడు కాళ్ళు నెత్తిన పెట్టుకుని ఊరికి ఉరికి వచ్చాడు.
కుంగిపోతున్న శివయ్యను చూచింది సుభద్రమ్మ "ఏందండీ అట్లున్నరు? చూసుకుంట ఉరెందుకు పోసుకుంటరు? ఊరికి పగయి ఇట్లెట్లు బతుకుతం? ఏదో వాండ్ల మొఖాన పారెయ్యండి నాకెందుకొ బుగులుగ ఉన్నదండి నా మాట వినండి" - బతిమాలుతున్నట్లు చెప్పింది.
"పట్నం నుంచి చచ్చి, చెడి వచ్చిన ఇన్ని మంచి నీళ్ళన్న ఇయ్యక పోతివి నీతులు చెప్తాంటివి, నువ్వు కూడా వాండ్లల్ల కలిసినవా ఏమి?"
"అట్ల ఎందుకు అనుకుంటరుండి? మీకు ఇప్పుడు అందరు పగోళ్ళుగనే కనపడ్తాన్రు" అని గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది శివయ్య మంచినీళ్ళు తాగి, పంచెతో మూతి తుడుచుకుని మంచంమీద కూర్చున్నాడు.
"ఆ ముండ ఉన్నదా?"
"ఎవరు మల్లిముండా? పెరట్ల ఉన్నది, ఎందుకూ?"
"తలుపేసిరా"
"ఏందుండీ - పట్టపగలు -మనమింక అయసులున్నమా?" సుభద్రమ్మకు అర్ధం అయింది మరొకటి - ఆమె సిగ్గుపడిపోయింది.
"ఏసి రమ్మంటుంటే ఇంటవా? పోతవా?" కర్కశంగా గద్దించాడు శివయ్య సుభద్రమ్మ పిడుగుపడినట్లు వణికిపోయింది అంతకు ముందు భార్యను కనీసం కసిరి ఎరుగడు శివయ్య సుభద్రమ్మకు అన్నీ విపరీతాలు కనిపిస్తున్నాయి గుండెలో గుబులు చేరింది తలుపు వేయడానికి వెళ్ళినప్పుడు ఆకాశాన్ని చూచింది- పట్టపగలే చుక్కలు పొడవలేదు గదా అని.
"కూచో" - మాట కర్కశంగా ఉంది సుభద్రమ్మ గుండె గుబగుబలాడుతూంది పక్కగా నక్కి కూచుంది.
"ఆ ముండ ఇటు రాదుకద మన మాటలు వినదు కద?"
"అదేందుండి - దానికి బయపడ్తరు?"
"వాండ్లకు బయపడే కాలమొచ్సిందే!"
"ఏందోనుండీ, నాకు బుగులున్నది బ్రహ్మంగారు అన్ని చెప్పిండుగాని వాండ్లకు బయపడే కాలమొస్తదని చెప్పడాయె"
"బ్రహ్మంగారు కాదు, బ్రహ్మయ్యగాడు చెప్పుతాండు ఈ సర్కారున్నదే, మన కొంప నిలువున ముంచుతాంది"
"అదేందుండి అట్లంటరు -ఆడంత మనోళ్ళే ఉండిరి"
"అవు, ఉన్నది మనోండ్లే మనమాట మాట్లాడ్తలేరు మన కొంపలు ముంచుతాన్రు వాళ్ళ కొంపలు మునుగుతయని తెలుసుకుంటలేరు"
"ఏందుండీ! అసలు సంగతి చెప్పకపోతిరి మునుగుతాన్నయి మునుగుతాన్నయి అంటాన్రు నాకేందో బుగులుగున్నది"
"అసలు సంగతేమున్నది? మన బూములన్ని గుంజుకొని మాల మాదుగుల కిస్తరట మనం అరక దున్నాలె, వాడు దొరతనం చేస్తడు"
"అదేందుండి అట్లంటరు? ఎన్నడన్న ఉన్నదా? వాండ్లేమన్న మనకు పుట్టిన్రా?"
"నీతులు చెప్పుతే నడుస్తలేదు మనకు బూములు దక్కాల్నంటే నువ్వొక్క పని చెయ్యాలె"
"ఏందోనుండి, నాకేందో బుగులుగున్నది ఏం చెయ్యమంటరో చెప్పండి"
"ఏం లేదు, నువ్వు విడాకులియ్యాలే మనం విడుపు కాయిదాలు రాసుకోవాలె, నువ్వు నన్ను విడుచుకోవాలె ఇగో కాయిదం తెచ్చిన, దస్కతు పెట్టు" - జేబులోంచి కాగితం తీసి మంచంమీద పడేశాడు.
సుభద్రమ్మ ఆ కాగితాన్ని చూచింది, గడగడలాడిపోతూంది మంచంమీద ఉన్న కాగీతం తాచుపాములా కనిపించింది పడగ ఎత్తి కాటు వేయడానికి సిద్దంగా ఉన్నట్లుంది మంచంమీంచి చప్పున లేచింది ఆమెకు చమటలు పడ్తున్నాయి గుండె గుబగుబలాడుతూంది, కాళ్ళు వణకుతున్నాయి.
"ఏమండీ! మనం అగ్నిసాక్షిగ పెండ్లాడినమండి, మీరు నన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేసిన్రుండి బాపనాయన మంత్రాలు చదివి పెండ్లి చేసిండుండి"
"చదువమంటే బాపనాయన అప్పుడు పెండ్లికి చదివిండు ఇప్పుడు విడాకులకోసం కూడ చదువుతడు, ఊఁ, పెట్టు దస్కతు" - శివయ్యలో కర్కశత్వం పెరుగుతూంది, కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, ముఖంలో క్రౌర్యం తాండవం ఆడుతూంది.
"ఏమండీ, ఇది పవిత్ర బంధముండి, నూరేళ్ళ పంటండి, మనం బతికినన్నాళ్ళు కలిసి ఉండాల్నుండి వద్దండీ, ఈ పని చేయించకండి, మీకు దండం పెడ్తనండీ, కాళ్ళు మొక్కుతనండీ!" సుభద్రమ్మకు కన్నీరు దుముకుతూంది.
కసాయివాడు కత్తిపట్టుకుని నుంచున్నట్లున్నాడు శివయ్య సుభద్రమ్మను చూచి అతడు కరగలేదు మరీక్రూరంగా ప్రవర్తించాడు "ఊఁ నీతులు చెప్పకు దస్కతు పెట్టు" - కాగితం తీసి ఆమె మీదికి విసిరాడు.
పాము తనమీద పడినట్లు కెవ్వుమంది సుభద్రమ్మ.
"ఏమండీ! మీ కాళ్ళు పట్టుకుంట, మన బంధం బూమితో రాలేదండీ, ఆస్తి కోసం ఈ బంధాన్ని తెంపొద్దండి ఈ బంధం ఆస్తికంటే గొప్పదండి, భూమికంటే గొప్పదండి, చచ్చిందాక ఇది మనను వదలదండీ వద్దండీ, ఈ పని నాతోని చేయించకండి" - చేతులు ఎత్తి, చేతులు జోడించి, రెక్కలు తెగుతున్న పక్షిలా బతిమిలాడింది.
అది శివయ్యమీద పనిచేయలేదు అతనికి ఆస్తిభూతం ఆవహించింది అది మానవతను మంట కలుపుతుంది ప్రేమ బంధాలను కూల్చేస్తుంది, కాల్చేస్తుంది, నరునిలో మానవతను మంట కలుపుతుంది.
"దస్కతు పెడ్తవా, లేదా?" అని సుభద్రమ్మ జుట్టుపట్టుకొని, వంచి గుద్ద సాగాడు.
సుభద్రమ్మ పెద్దగా ఏడ్చింది, మొత్తుకుంది "మీరు నన్ను చంపండి, చీల్చండి, కాల్చండి, నేను దస్కతు పెట్టను" - ఆమె అరుస్తూంది, కేకలు పెడ్తూంది జుట్టు పట్టుకుని వదలడంలేదు శివయ్య, దెబ్బలు కొట్టడం మానడం లేదు.
కేకలు విని మల్లమ్మ ఉరికి వచ్చింది తలుపు పెట్టుకుని లోపలికి ఉరికి వచ్చింది నర్సిమ్మ కూడా వచ్చాడు "దొర్సానీ! దొర్సానీ!" అని అరిచారు.
"అడ్డమొస్తిరా పానాల్తీస్త" అని సుభద్రమ్మను వదిలి, కర్ర అందుకొనడానికి వెనక్కు ఉరికాడు శివయ్య ఇద్దరూ కలిసి చాకచక్యంగా సుభద్రమ్మను బయటికి లాగారు శివయ్య కర్ర పట్టుకుని వెనక్కు తిరిగాడు "పానాల్తీస్త" అని కర్ర లేపాడు.
"దొరా!" అని కేక పెట్టింది మల్లమ్మ ఆ కేకలోని ఆవేశానికి బొమ్మలా నిలబడిపోయాడు శివయ్య.
శివయ్య మల్లమ్మను చూచాడు ఆమెముఖం ఎర్రబడుతూంది కళ్ళు జ్యోతులవుతున్నాయి ఆమెకు శివం వచ్చేట్లుంది గ్రహించాడు శివయ్య కర్ర పారేసి విసురుగా దొడ్లోకి వెళ్ళిపోయాడు.
సుభద్రమ్మ తల దిమ్ముపట్టింది క్షణం ఏమీ కనిపించలేదు చూపందుతే మొదలు కనిపించింది కాగితం లేచి పోయి పరపరా కాగితాన్ని చించేసింది "నర్సిమ్మా! నన్ను మావాండ్ల ఇంటికి తోలిరా" అని చరచరా వాకిట్లోకి నడిచిపోయింది మళ్ళీ ఏమనుకుందో వెనక్కు వచ్చింది మల్లి చేతులు పట్టుకుంది.
"మల్లీ! ఇవి చేతులుకావు కాళ్ళనుకొ మా ఆయనను కాపాడు ఈ ఇల్లు వదిలి పోకు ఏమంటవ్? చేతుల చెయ్యెయ్యి"
మల్లమ్మ బొమ్మలా నిలబడి ఉంది యాంత్రికంగా చేతిలో చేయివేసింది.
సుభద్రమ్మ వెళ్ళిపోయింది నర్సిమ్మ ఆమె వెంట వెళ్ళిపోయాడు.
మల్లమ్మ నుంచునేవుంది ఆమె కళ్ళవెంట ధారాపాతంగా కన్నీరు కారుతూంది. తాను పరంయ్యను పెళ్ళాడింది తనను పెళ్ళాడటానికే పరమయ్య విడిపోయాడు పరమయ్యా వస్తాడనే ఆశతో ఈ బానిసత్వంలో జీవిస్తూంది ఇప్పుడు శివయ్యా, సుభద్రమ్మా విడిపోయారు తన బతుకే అంతా? విడదీయడం తప్ప కూర్చలేదా? ఇంతలో మరో ఆలోచన వచ్చింది నర్సిమ్మ వెళ్ళిపోయాడు ఈ ఇంట్లో తానూ-దొర గూడెం ఏమనుకుంటుంది? ఇప్పటికే తనమీద ఆడి పోసుకుంటూంది? ఏం చేయాల? వెళ్ళడానికిమాత్రం వీల్లేదు.
"ఏయ్ లంజముండా! ఎల్లు ఇంట్ల నర్సిమ్మ కూడా లేడు దొరతోని కులుకుతావా? ఎల్లవే ముండా" -ఇంటిముందు నుంచొని పెంటయ్య అరుస్తున్నాడు.
"అమ్మా!" అని పెద్దగా ఏడ్చింది మల్లమ్మ తరవాత నోట్లో కొంగుపెట్టుకుని దొడ్లోకి ఉరికింది.
19
సుభద్రమ్మ వెళ్ళిపోయిన ఇల్లు పిట్ట లేచిపోయిన గూడులా ఉంది ఇల్లంతా బావురుమంటూంది వెలవెలపోతూంది కళావిహీనంగా ఉంది పాడుబడిన ఇల్లులా ఉంది శీనయ్య అదోలా ఉన్నాడు, అతని అధికారం అస్తమించింది వైభవం విరిగిపోయింది ఏకాకిగా ఏడుస్తున్నాడు.
