Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 30


    పరం: ఆ భావం రమణీయంగా ఉండాలి.
    లక్ష్మీ: అందుకనేగా 'సౌందర్యమే ఆనందము' అని గానం చేశాడు కీట్సు?
    రాజారావు: లక్ష్మీపతీ! ఉండు. వాళ్ళిద్దరూ ఏదో చెప్తున్నారు, ఒక మోస్తరుగా ఇంతవరకూ వాళ్ళ వాదన శాస్త్రపద్ధతిగానే ఉంది.
    రాజే: నీకు ఎన్ని చెప్పినా, మన బ్రతుకు వేళాకోళం కాదోయి బాబూ అంటే, ఏమి తెలియదేమిటి నాయనా!
    లక్ష్మీ: నేను వేళాకోళంగా బతుకుని చూస్తున్నానురా రాజేశ్వరుడా! చాలా తీక్షణంగానూ తీవ్రంగానూ చూస్తున్నాను. కాని ఆ బ్రతుకెక్కడా నాకు కనపడదు.
    రాజే: నువ్వు కూడా మా సంఘంలో చేరరా మరి.
    నారా: మీ సంఘం ఒక బౌద్ధ సంఘారామం వంటిదిరా మరి. భిక్కులు, భిక్కిణీలు, జీవితం ఆనందం బాగుందోయి.
    రాజే: అసలు నేనడిగిన విషయానికి మీరిద్దరూ జవాబియ్యలేదేమిటిరా?
    పరం: కళ మనుష్య సృష్టి అనేగా ఇంగ్లీషులో అర్థం?
    నారా: అవును. ఇంతలో జమిందారుగారా ప్రదేశమునకు వచ్చినారు. ఆయన స్నేహితులందరిని తన చిన్న లాంచిలో గౌతమీ విహారమునకు దీసికొని వెళ్ళినారు. ఆంధ్రులకు బ్రత్యేకరాష్ట్ర మావశ్యకమా కాదా యను చర్చ వచ్చినది. రాజేశ్వరరావు, లక్ష్మీపతియు నాంధ్రదేశమునకు బ్రత్యేక రాష్ట్ర మావశ్యకమని వాక్రుచ్చినారు. రాజారావామోదించినాడు.
    నారా: దేశమునకంతా స్వరాజ్యం తెచ్చే ప్రయత్నాలు మాని, ఆంధ్రరాష్ట్రం మాత్రం తెచ్చే ప్రయత్నం నేను ఆమోదించను. ఎందుకంటారా యావద్దేశ బంధమోక్షానికి పోటుపడవలసిన ఉత్కృష్ట వ్యక్తులకు ఆంధ్ర సమస్య సైంధవుడులాగ అడ్డు అవుతుంది. దేశ పరిపాలన చేతికి వచ్చిన తరువాత మీ చిత్తము వచ్చినట్లు భాషను బట్టో మరొక దాన్ని బట్టో రాష్ట్రవిభజన చేయడం సులభం. అనవసరపు ఖర్చులతో నెత్తి బరువెక్కిన ఈ రోజులలో రాష్ట్ర విభజన చేస్తే ఖర్చుకు డబ్బుండక భాగింపబడ్డ రాష్ట్రాలన్నీ దివాళా రాష్ట్రాలయితే ఏమి లాభం?
    జమిందారు గారు" స్వరాజ్యము అంటే నీ ఉద్దేశం సంపూర్ణ స్వాతంత్ర్యమనేనా?
    నారా: ఏదైనా సరేనండి. సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినా సరే, లేదా, ఆస్ట్రేలియా కెనడాల వలె డొమినియను ప్రభుత్వం వచ్చినా సరే. ఏది వచ్చినా ఆదాయ వ్యయాలు సంపూర్ణంగా మన చేతుల్లోకి వస్తే రాస్త్ర జనలు మనకు సులువుగా అవుతవని ఉద్దేశం.
    జమీం: కాని ఈ లోపుగా మనవాళ్ళకి జరిగే అపరిమితమైన నష్టం సంగతి ఆలోచించు. అరవవాళ్ళవే గొప్ప ఉద్యోగాలన్నీ. అరవ దేశం కోసం డబ్బు ఖర్చయినంత తెలుగు దేశ లాభానికి ఖర్చగుట లేదు.
    నారా: కాని రామారాయణం గారు మొదలగు తెలుగువారే మంత్రిత్వాలు నడుపుతున్నారు. నెమ్మది నెమ్మదిగా పెద్ద ఉద్యోగాలలో కూడా మనవాళ్ళు చేరుతున్నారు. ఒక పది సంవత్సరాల పాటు మనం తొందరపడకుండా స్వతంత్ర సంపాదన దీక్ష వహిస్తే, స్వతంత్రంతో అన్ని చిక్కులు మంచి విడిపోయినట్లు విడిపోతాయని నా ఉద్దేశం అండి.
    జమీం: నేననేది మన దేశానికి ప్రస్తుతం సంపూర్ణ స్వాతంత్ర్యము రాదని, వచ్చినా మనకు చాలా నష్టం. సంపూర్ణ స్వాతంత్ర్యము రాకుండా డొమినియను ప్రభుత్వం వచ్చేటట్లయితే మనం రాష్ట్ర విభజన కోసం చేసే ప్రయత్నాలన్నీ డొమినియను ప్రభుత్వం వచ్చేటందుకు ప్రయత్నాలవుతవి. పైగా కాంగ్రెస్ తరఫున గాంధీగారి ననుసరించి పనిచేసేవాళ్లు ఏ కారణం వల్లను ఇతర వెర్రులలో పడరు. వాళ్ళ మార్గం రాజమార్గమే. ఇక నాబోటి వాళ్ళా, మాకు గోఖలేగారి మార్గమే. నీ పద్ధతులు మాకు నచ్చవు. నచ్చక ఇక ఏమి చేయుము? ఈ పనులు మేము చేస్తాము.
    నారా: చిత్తం.
    లక్ష్మీ: మావాడు మనకు ఆంధ్రరాష్ట్రం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర హైకోర్టు అన్నీ కావాలనేరకమేనండి. ఆంధ్ర ప్రతిభ, ఆంధ్ర పౌరుషము, ఆంధ్రవిజ్ఞానము తలుచుకు తలుచుకు పరవశుడౌతాడు. నేను ఆంధ్రదేశ దురదృష్టం వల్ల ఆంధ్రులెవ్వరూ ఏ విషయంలోనూ ఆంధ్రదేశంలో ఉన్నంతకాలం పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవడంలేదని విచారిస్తాడు.
    పరం: ఆ! ఆంధ్రదేశానికి కుజుడో శనో రాజ్యం చేస్తూ ఉన్నాడు, లేకపోతే, పూర్వకాలంలో కోటీశ్వరులున్న దేశంలో నేడు పదిలక్షలున్న షావుకార్లరుదు. మహారాజులు కవితా పోషకులై కృతులు గొన్న కాలం పోయి కవిత్వం పేరు చెపితే నిరసించే దిక్కుమాలిన కాలం వచ్చింది. అమరావతిలో నాగార్జున మెట్టలో, ఒరంగల్లులో, హంపిలో, మహాబలేశ్వరంలో విరిసిపోయిన శిల్పం నేడు నామమాత్రావశిష్టం అయింది. ఇంక ఎవరికైనా పేరొచ్చింది అంటే దేశం విడిచి వెళ్ళారు గనుక. విశ్వదాత నాగేశ్వరరావు గారు, ఆచార్య రాధాకృష్ణ గారు, నాగపురంలో లక్ష్మీ నారాయణగారు, నియోగి గారు, చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి గారు దేశాలు విడిచి వెళ్లి మహోన్నత పదవులకు వెళ్ళారు. బొంబాయి కామాఠీలని, రంగూనులో గౌడ రెడ్లనీ, నాగపురంలో నాయుళ్ళనీ ప్రఖ్యాతిగన్న వారంతా యిలా తెలుగు గడ్డ విడిచి వెళ్లినవారే.
    రాజేశ్వరరావు: జిడ్డు కృష్ణమూర్తి గారో?
    పరం: అవును. ప్రపంచ విఖ్యాతిగన్న మహాజ్ఞాని.
    రాజే: తర్వాత వారిలో పండిత వంగల శివరాము, పున్నయ్య గారు. ఇంకా ముఖ్యులు ఇంజనీరు విశ్వేశ్వరయ్య, దివాను నాగుమయ్య.
    పరం: అదేనండి! చిన్న చిన్న వాళ్ళు కూడా దేశం విడిచిపోతే మన ఆంధ్రులు బయటికి వస్తారండి. దామెర్ల రామారావును చూడండీ!
    లక్ష్మీపతి: ఆంధ్రదేశం వదిలితే అరవగ్రహ బాధ వదిలి పైకి వస్తారోయి పరమేశ్వరం.
    జమీం: పరమేశ్వరమూర్తి గారూ! మీరు చెప్పినదానిలో సత్యం ఉన్నట్లే తోస్తున్నది. కారణం మీరు చెప్పింది కాకపోవచ్చును. యశం సంపాదించుకోవాలంటే మనం మనదేశమే కాదు మద్రాసు రాష్ట్రం విడిచిపోవాలండీ! అయితే పరమేశ్వరమూర్తి గారు! మీరు కలకత్తాలో ఎన్నాళ్లు అవనీంద్రుని దగ్గిర చిత్రలేఖనం నేర్చుకున్నారు?
    పరమేశ్వర: బి.ఏ. కలకత్తాలో చదవడానికి వెళ్లాను. పాళీ, సంస్కృతం పుచ్చుకొని ఆర్కియాలజీ శాఖలో చేరుదామని ఉద్దేశం. అప్పటికి నాకు ఇష్టమైనది రామారావు గారి సంప్రదాయమే. నేను ఇంటరు తరగతిలో చదివిన రెండేళ్ళు ఆయన దగ్గర చిత్రలేఖనం నేర్చుకున్నాను. నా బొమ్మలు రెండు బొంబాయిలోను, ఒకటి చెన్నపట్టణంలోను అమ్ముడైనాయండి. తర్వాత కలకత్తా వెళ్ళి, బి.ఏ. చదువుతూ అవనీంద్రబాబు పాదాలకడ చిత్రలేఖనానికి దీక్ష వహించాను.
    లక్ష్మీ: అప్పుడు వేసిన కొన్ని చిత్రలేఖనాలకు ఇంగ్లండు, వెంబ్లీలో కూడా ప్రఖ్యాతి వచ్చిందండి మా పరమేశ్వరునికి. ఆస్ట్రేలియాకు వెళ్ళినది ఒక బొమ్మ. ఆ రోజుల్లో పరమేశ్వరుని బొమ్మలెన్నో కలకత్తా ప్రదర్శనములో అమ్ముడయ్యాయి.
    జమీం: మీరిప్పుడు వేసిన బొమ్మలేవైనా ఉంటే నాకో బొమ్మ ఖరీదు వేసి పంపించండి. ఖరీదుకు వెరవకుండా మంచి పెద్దరకమే పంపండి. మరీ చిన్నరకము పంపకండి. నా గ్రంథాలయం గదిలో కొన్ని బొమ్మలు కొన్ని పెట్టవలెనని వున్నది. నారాయణరావూ, మీరూ ఆలోచించి పంపించండి.
    రాజే: నారాయణరావు పరమేశ్వరుని బొమ్మలు నాలుగు కొన్నాడు. అతనికడ గొప్ప చిత్రాలు ఉత్తమ చిత్రకారులవి యిరవై ఉన్నాయండి.
    ఇంతలో కూడవచ్చిన గుమాస్తా 'బాబు గారు! ఏడుగంటలయింది. పడవ తిప్పమని సెలవా?' అని వినయముగా జమీందారు గారి నడిగెను. రాజేశ్వరరావు 'ఓహో ఈగాలి! గోదావరి సముద్రంలో ఉన్నదే కెరటాలతో అని పాదములు నీటిలోనికి వ్రేలవైచెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS