Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 30

టెలిస్కోప్ కొండకి వెళ్ళే దారిలో -
ఒక చెట్టు మొదలు చుట్టూ వున్న గట్టుమీద విశ్రమించిన సాహస్ కి ప్రగతి గొంతు ఇంకా వినబడుతూనే వుంది.
"సాహస్"
"ప్రగతీ"
"సాహస్"
"ఎక్కడున్నావు ప్రగతీ?"
"సాహస్! సాహస్!"
"ప్రగతీ! ఇక్కడే వున్నావా నువ్వు?"
"సాహస్! సాహస్!"
కొద్ది క్షణాల తరువాత అతనికి అర్థమయింది. ప్రగతి గొంతు తనకి వినబడుతోంది. అంతవరకూ ష్యూర్. ఇది భ్రమకాదు.
కానీ-
తన గొంతు ప్రగతికి వినబడటం లేదు. టెలిఫోన్ లో అంతే గదా! ఒక్కోసారి అవతల వాళ్ళ గొంతు మనకి వినబడుతూ వుంటుంది. కానీ మన గొంతు వాళ్లకి వినబడదు.
అతనికి చటుక్కున స్ఫురించింది.
టెలిఫోన్!
టెలిపతీ!
అతనికి ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది. ఇందాక దారిలో ఒకచోట తనకీ అంకుష్ కీ కూడా ఒక చిత్రమైన దృశ్యం కనబడి అంతలోనే అదృశ్యం అయిపోయింది.
ఒక హేతువాదీ, ఇంకో మేధావీ కలసి వాదించుకోవడం, తమ అభిప్రాయం అడగడం, అంతలోనే మాయం అయిపోవడం-
అది హల్యూసినేషన్ కావచ్చును.
కానీ -
ఆ దృశ్యం తమ ఇద్దరికీ కనబడింది.
ఇప్పుడు ఈ గొంతు కూడా...?
చటుక్కున అంకుష్ వైపు తిరిగాడు సాహస్.
"అంకుష్! నీకు ఎవరి గొంతు అన్నా వినబడుతోందా?" అన్నాడు అర్జెంటుగా.
చెవి ఒగ్గి ఆలకించాడు అంకుష్.
"ఎవరి గొంతు?"
మళ్ళీ శ్రద్ధగా విన్నాడు అంకుష్.
"ఒక గొంతు కాదు. రెండు గొంతులు" అన్నాడు.
"రెండు గొంతులా?"
"అవును. ఒకటి పాము బుస, రెండోది ముంగిస రుసరుస!"
"అంకుష్ స్టాప్ జోకింగ్" అన్నాడు సాహస్ చిరాగ్గా.
"జోకింగ్ కాదు నిజమే!"
విన్నాడు సాహస్.
అంకుష్ చెప్పింది నిజమే. తను ప్రగతి ధ్యానంలో వుండి గమనించలేదుగానీ అక్కడికి దగ్గర్లోనే పాము బుస వినబడుతోంది. పామును చూసి ముంగిస కసికసిగా చేస్తున్న శబ్దాలు వినబడుతున్నాయి.
"అంతేగానీ నీకు ప్రగతి గొంతు వినబడడం లేదా?" అన్నాడు సాహస్.
పెద్దగా నవ్వాడు అంకుష్. "ప్రగతి గొంతు! ప్రగతి గొంతు నాకు ఎందుకు వినబడుతుంది? నీకు వినబడుతోందా? అంటే...ఓహ్ బాయ్! యూ ఆర్ ఇన్ లవ్"
అసహనంగా అతన్ని వారించాడు సాహస్.
ప్రగతి గొంతు సాహస్ కి వినబడుతూనే వుంది.
లౌడ్ అండ్ క్లియర్!
"సాహస్! సాహస్! సాహస్!"
ఎంతో ఇష్టమైన పేరుని పదేపదే స్మరిస్తున్నట్లుగా!
ఏమిటీ మిస్టరీ?
అప్పుడు-
పాము ముంగిసల పోరాటం హఠాత్తుగా ఉధృతమైనట్లుగా సవ్వడి.
చూసారు.
అక్కడ నిజంగానే ఒక పామూ, ఒక ముంగిసా దారుణమైన పోరాటం సాగిస్తున్నాయి.
"వీటి విరోధం తాలూకు వివరాలు నీకు తెలుసా?" అన్నాడు సాహస్.
"ఆహా! తెలియకేం. పాముకీ ముంగిసకీ ఆజన్మ వైరం. పాములంటే అన్ని జంతువులకీ బెదురే. కానీ ముంగిస మాత్రం పాములకి భయపడకుండా పాములతో పోరాటం చేసి వాటిని విసిగించి వేధించి చంపి తినడమే తన జీవిత లక్ష్యం అన్నట్టు ప్రవర్తిస్తుంది" అన్నాడు అంకుష్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS