Previous Page Next Page 
జోగబాల పేజి 30

 
    "ఉండు, కూర మాడిపోతున్నట్లుంది. గిన్నె దింపి వస్తాను" అంటూ తారకేశ్వరి లోపలికెళ్ళింది.


    పక్క గదిలో పరంజ్యోతి ఉన్నాడని తెలుసు. ఉదయమ్మ సరదా మనిషి. అటూ ఇటూ చూసి ఆ గడప వైపు నడిచి తలుపు మెల్లగా తోసింది. కాళ్ళు కొంచెం వణికినట్లున్నాయి.


    "ఎవరూ?" అన్నాడు పరంజ్యోతి గ్లాసులోంచి తల యెత్తి.


    "అక్కయ్యగారికోసం..." అన్నది తడబడే కంఠంతో.


    "నువ్వా?" అంటూ ఆమె మొహంలోకి చూసి కన్ను కొట్టాడు.


    ఆమె సిగ్గు పడిపోయింది.


    "వంటింట్లో ఉందేమో?"


    "సరే లెండి." తలుపులు మళ్ళీ చేరవేసి ఇవతలకొచ్చి నిలబడింది.


    "అమ్మో! బావగారు చాలా సరసుడే." అనుకుంటూ గుండెమీద చెయ్యివేసి అదుముకుంది.


                                                        *    *    *    *


    వాసంతి పరిస్థితి మరి రెండు రోజులు గడిచేసరికి దిగజారిపోయింది. తలిదండ్రుల పోరు మరీ యెక్కువై పోయింది.


    "తిండి గింజలు" అంటున్నది తల్లి.


    "కల్లు" అంటున్నాడు తండ్రి.


    వాసంతి ఏడుస్తోంది.


    "నువ్వు జోగినివి. జోగినిలా బతుకు అందరకూ సంతోషం కలుగుతుంది. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు." అని ఇరుగుపొరుగు సలహా యిస్తున్నారు.


    అంతరాత్మ ఒప్పుకోవడంలేదు.


    శోకమూర్తిలా పడివుండి, చాలా దీర్ఘంగా ఆలోచించింది. చివరకు గత్యంతరంలేక మాధవప్రసాద్ కు కబురు చేసింది.


    మాధవప్రసాద్ వచ్చాడు. వాసంతి అతని వంక దీనంగా చూసి దగ్గుతికతో అడిగింది. "మొదట్లో నన్ను మీరు మీ మనిషిగా వుంచుకుందామని అనుకున్నారు కదూ!"


    అవునన్నట్లు అతను తల ఊపాడు.


    "పరంజ్యోతిగారు నన్నొదిలేశారు. నేను మీదాన్నిగా వుంటాను. కాదనక నన్ను..."


    మాధవప్రసాద్ నవ్వాడు. "వాసంతీ! నువ్వు జోగినిగా మారినప్పుడు నీ మీదెన్నో ఆశలు పెట్టుకున్నాను. నిన్ను ఇంకొకరిసొత్తు కానివ్వద్దని నీ తలిదండ్రుల్ని బ్రతిమలాడాను. ఎంతో డబ్బు ఇవ్వబోయాను. కాని వాళ్ళు నా మాటలకంటే పరంజ్యోతి మాటలకు విలువ ఇచ్చారు. నన్ను కాదన్నారు. ఇప్పుడు నీకు అవసరమొచ్చింది. నన్ను కావాలంటున్నావు. వాసంతీ! ఇంకొకరి సొత్తు అయిన, నలుగురితో అనుభవించబడ్డ జోగినులు కావాలంటే నాకు బోలెడుమందున్నారు. అందులో నువ్వొకరివి అవుతావు. కాని నాకు కావాల్సిన జోగిని మాత్రం యిప్పుడు నువ్వు కాదు."


    అతను వెళ్ళిపోయాడు. ఆమె గుండెమీద కొట్టినట్లయింది. "నువ్వు జోగినివి. ఒకరితోనే వుండాలనే ఆశను చంపుకో, అందరి మనిషివి కాక తప్పదు. అది ఒక పవిత్ర కార్యంగా నీ ధర్మం నిర్వర్తించు." రకరకాల గొంతులామెను శాసిస్తున్నాయి.


    "వొద్దు...వొద్దు...నేను...నేను...ఒక్కరితో" అని రాజీ పడలేక దీనంగా ఆక్రోశిస్తోంది.


    "వాసంతీ!" కల్లు తాకకుండా ఎన్నాళ్ళు అలమటించమంటావ్" తండ్రి కోపం ఆపుకోలేక ఆమెను యెడాపెడా కొట్టి తూలుకుంటూ బైటకు వెళ్ళిపోయాడు. దెబ్బలు తగిలి ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. అందరి జోగినులాలా, అందరి మనిషిలా...అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. ఆఖరి ఆశగా చలమయ్యకు కబురు చేసింది. ఆ రాత్రి చలమయ్య వచ్చాడు."


    "ఆ రోజు మీరు నన్ను కోరుకున్నారు కదూ!"


    "కాదనడం లేదు."


    "అప్పటి పరిస్థితుల్నిబట్టి నేను లొంగలేదు. ఏవేవో ఆశల్లో మునిగి వున్నాను. కాని..."


    "పరంజ్యోతి నీకు దూరమయ్యాడని నాకు తెలుసు."


    "అందులో గుట్టేమీలేదు. మీ అండన వుంటాను. నన్ను మీదాన్నిగా..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS