కొండ అంచుమీంచి గౌతమి ముందుకి లోయలోకి తూలింది.
ఆమె పెదాల్లోంచి కెవ్వునకేక వెలువడబోయేటంతలో,
ఆ లోయ నాలుగు పక్కలా-
ఆ కొండ నాలుగు గోడల్లో-
ఒక భయానక ఆర్తనాదం ప్రతిధ్వనించింది.
గౌతమి గాల్లో తేలుతోంది-గాల్లో బొమ్మలా తేలుతోంది.
అప్పటివరకూ కంటికి కనిపించని లోతుల్ని వెతుక్కుంటూ గాలిలో సుడులు తిరుగుతూ, పెనువేగంతో గిరగిరా తిరుగుతోంది.
కింద పచ్చని పచ్చిక-ముళ్ళ కుంపలు-బండరాళ్ళు-
ఇంకా రెండు క్షణాల్లో అందమైన గౌతమి-పచ్చ గన్నేరులాంటి గౌతమి
శవమై పోతుంది.
పెద్దగా, బిగ్గరగా, గుండెలు అవిసిపోయేలా, శక్తినంతా కూడదీసుకుంటూ అరిచింది.
అరుస్తూ కళ్ళు తెరిచింది.
కనురెప్పలు బరువుగా లేచాయి. మత్తులోంచి తెప్పరిల్లాయి.
తన వేపు చూసుకుంది.
మంచమ్మీద నగ్నంగా-!
పక్కకు తప్పుకున్న దుప్పటి.
కాటేజ్ లో నలువేపులా చూసింది. ఎక్కడా ఏ అలికిడీలేదు.
గబుక్కున లేచి మంచం కిందనున్న చీర, జాకెట్టు తీసుకుంటూ-
"అవినాష్" అంటూ పిలిచింది.
జవాబు లేదు.
ఇంతవరకూ కల భయపెట్టిన గౌతమిని ప్రస్తుతం వాస్తవం భయపెడుతోంది.
పన్నెండు గంటలసేపు, తను నగ్నంగా, మత్తులోపడి ఉందని ఆమెకు అర్ధం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
"అవినాష్-అవినాష్-" అంటూ ఆ గదిలోంచి బయటికొచ్చి వరండాలో చూసింది. లోనకెళ్ళి బాత్ రూం, టాయ్ లెట్ వెతికింది.
గౌతమి మదిలో పెనుతుఫాను సృష్టిస్తున్న అలజడి ఆమె శరీరంలో ప్రతి అణువునీ కుదిపేస్తోంది. ఆగి, ఆగి కొట్టుకుంటోన్న గుండెచప్పుడు ఆమె చెవులకు స్పష్టంగా విన్పిస్తోంది.
నుదుటి మీద చెమట బొట్లు బొట్లుగా కారుతోంది.
ఎక్కడికెళ్ళాడు అవినాష్?
గోడకున్న గడియారం వేపు చూసిందామె.
పన్నెండు దాటింది.
వెంటనే ఏదో ఆలోచన ఆమెలో కదిలింది. ఆ ఆలోచన ఆమెలో కలిగిన మరుక్షణం ఆమె గుండె వేగం మరింత రెట్టింపయింది.
పన్నెండు గంటలు-
పన్నెండు గంటలు-
ఈ సమయంలో తను అవినాష్ తో పెళ్ళిపీటల మీద ఉండాలి. అవినాష్ తన మెడలో తాళి కడుతూ ఉండాలి.
మరి అవినాష్ ఏమయ్యాడు?
ఇంత మత్తులో తనెలా పడిపోయింది?
గబాగబా ప్రశ్నల పరంపర. జవాబులు లేని ప్రశ్నల చిచ్చు.
అవినాష్-అవినాష్-అవినాష్-
ఆమె మనసు ఏమీ ఆలోచించలేకపోతోంది.
ఆమె మనసు ఏదో కీడుని శంకిస్తోంది-జరగరానిదేదో జరిగినట్లుగా పిచ్చిగా అటూ ఇటూ తిరిగింది.
అప్పుడు-
సరిగ్గా అప్పుడు-
ఆమె చూపులు-ఎదురుగా ఉన్న టేబిల్ మీద పడ్డాయి.
అక్కడ అవినాష్ సూట్ కేస్ లేదు.
బట్టల స్టాండుకి అవినాష్ బట్టలు లేవు-
స్టూలుమీద ఫ్లాస్కులేదు. ఒక కాఫీ కప్పులేదు-
ఏదో జరిగింది.
ఆ క్షణంలో-
ఆమె చూపులు టేబిల్ మీదున్న అవినాష్ మరిచిపోయి వదిలేసినా 'ఆంటీమనీ' సీసామీద పడ్డాయి.
పరుగులాంటి నడకతో వెళ్ళి ఆ సీసాను చేతుల్లోకి తీసుకుంది.
ఆ సీసా మీదున్న నల్లటి అక్షరాలు 'ఆంటీమనీ' ఆమెను వెక్కిరించాయి.
ఆ సీసాను, ఆ అక్షరాల్ని చూడగానే ఆమె భయపడింది. కెమిస్ట్రీలో పోస్టుగ్రాడ్యుయేట్ అయిన గౌతమికి ఆంటీమనీ గురించి బాగా తెల్సు.
సీసా మూత విప్పి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది.
అది 'ఆంటీమనీ' వాసనకాదు. మార్ఫిన్ వాసన.
ఆంటీమనీ సీసాలో మార్ఫిన్.
అంటే-
అవినాష్ తనని చంపడానికి ప్రయత్నించాడు.
అంటే-
అవినాష్ తన అడ్డు తొలగించుకోడానికి ప్రయత్నించాడు.
గౌతమికి ఒక్క క్షణంలో మొత్తం అంతా అర్ధమైంది.
'ఆంటీమనీ' సీసాలోకి వచ్చిన 'మార్ఫిన్' తనను రక్షించిందని-
మరి 'ఆంటీమనీ' ఏమైంది?
ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు.
రెండు రోజుల గతాన్ని ఆమె ఒక్కసారి నెమరువేసుకుంది.
తండ్రిని తీసుకొస్తానని విజయవాడలో దిగిపోయిన అవినాష్ తండ్రి లేకుండా ఒక్కడే వచ్చాడు.
అంటే-
భీమా లాడ్జిలో తనకు రెండుసార్లు వచ్చిన ఫోన్లు అకస్మాత్తుగా 'కట్' అయ్యాయి.
తనని కొండ మీదకు తీసికెళ్ళాడు-తను వెనక కాసేపు నిలబడిన సమయంలో-తనను అక్కడ నుంచి తోసేద్దామనుకున్నాడా అవినాష్-!
ఫ్లాస్కులోని కాఫీ-తనకు మాత్రమే ఇచ్చాడు.
అంటే-
అన్నీ ప్రశ్నలే. జవాబులు లేని ప్రశ్నలు-
అలిసి, సొలసిన మత్తులో తను తాగిన కాఫీ ఏదో వాసన వస్తోంది. అవినాష్-అన్న తనతో "ఫ్లాస్కు సరిగ్గా కడిగుండడు-" అని అవినాష్ అన్న మాటలు జ్ఞాపకానికొచ్చాయి.
