Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 30


    గడ్డ కట్టే ప్రతి చలనం- ఒక అజ్ఞానానికి నిదర్శనం.

 

    "మీరేం చేస్తే నేనది చేస్తాను-" ఎట్టకేలకు, చాలా తెలివిగా అన్నాడు అవినాష్.

 

    అలా అవినాష్ అంటాడని ధన్ రాజ్ కి తెల్సు.

 

    ఆ విశాలమైన హాల్లో పచార్లు చేస్తూ-

 

    ధన్ రాజ్ ఇలా అన్నాడు.

 

    "రోష్ణితో నువ్వు మూడునెలలు మాత్రమే నటించాలి. నెలకో రెండు లక్షలు రూపాయలిస్తాను- కానీ రోష్ణికి ఎక్కడా అనుమానం రాకూడదు... రోష్ణికి అనుమానం వచ్చిందని తెల్సిందో... మరుక్షణంలో నువ్వుండవు... ఎందుకుండవంటే- మన ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచి- నీ మీద నా నిఘా ఉంటుంది- ఏ క్షణంలోనైనా... నువ్వు- మన నిబంధనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే- నువ్వనే వాడివి ఈ లోకంలో ఉండవు... జాగ్రత్తగా ఆలోచించు..." చెప్పడం ఆపేడాయన.

 

    "నా మనసుని చంపుకోడానికి మీరిచ్చే ఖరీదు రెండు లక్షలా..." పక్కకు మొహం తిప్పుకుని అన్నాడు అవినాష్-

 

    ఆ మాటకు వేమనే జవాబివ్వలేదు ధన్ రాజ్.

 

    రెండు నిమిషాలసేపు అక్కడ నిశ్శబ్దం...

 

    "నీకు రెండు లక్షలు చాలదన్నమాట-" మూడో నిమిషంలో అన్నాడాయన.

 

    "ఎంత కావాలో అడుగు... నీకెంత కావాల్సినా నేనిస్తాను- బీ-ఏ. బిజినెస్ మాన్-" కంచుకంఠంతో అన్నాడాయన.

 

    అప్పుడు ఆ అవకాశాన్ని పూర్తిగా అవినాష్ ఉపయోగించుకోదలచుకున్నాడు.

 

    కూతురి మీద ప్రేమతో తనతో బేరమాడిన ధన్ రాజ్ దగ్గర్నించి ఎలాగైనా-

 

    కొన్ని లక్షలు...

 

    సంపాదించాలని ఆలోచించాడు అవినాష్.

 

    అవును. తన ఆలోచన రక్తి కట్టాలంటే-తను ధన్ రాజ్ ని నమ్మినట్టు నటించాలి... రోష్ణిని ప్రేమిస్తున్నట్టు నటించాలి.

 

    రోష్ణిని ప్రేమిస్తున్నట్టు నటించాలా!

 

    తను నటించడు. తను ప్రేమించడు.

 

    తను కామిస్తాడు.

 

    రోష్ణి లాంటి అందమైన అమ్మాయి ఏ మగాడి చుట్టూ అయినా తిరుగుతుంటే...

 

    ఎవ్వరైనా ఒంటిమీద చెయ్యి వెయ్యకుండా ఊరుకుంటాడా?

 

    ఊరుకోడు.

 

    అంచేత తను-

 

    తన అవసరాలకు రోష్ణిని ఉపయోగించుకుంటాడు.

 

    తన అవసరాలకు ధన్ రాజ్ ని ఉపయోగించుకుంటాడు.

 

    "ఇంకో లక్ష పెంచండి... మనసుని చంపుకో మన్నారుగా..." అని అన్నాడు అవినాష్. చాలాసేపు ఆలోచించినమీదట...

 

    ఆ మాటతోనే అవినాష్ ఏమిటో అర్ధమైపోయింది ధన్ రాజ్ కి.

 

    "ఇంకో లక్ష- అది నువ్వు ప్రేమించిన రోష్ణి విలువా-లేక... రోష్ణిని ప్రేమించిన నీ మనసు విలువా-" ధన్ రాజ్ అడిగాడు.

 

    ఆ ప్రశ్న అవినాష్ కి అర్థం కాలేదు.

 

    అవినాష్ కి ఒక్క విషయం మాత్రం అర్థమైంది- ధన్ రాజ్ చాలా తెలివైనవాడని. అతన్ని మోసం చేయడం అతికష్టం అని.

 

    కానీ-

 

    తను తల్చుకుంటే ధన్ రాజ్ ని మోసం చేయగలడు-

 

    రోష్ణిని మోసం చేయగలడు. ఇంకా అందమైన అమ్మాయిల్నీ మోసం చేయగలడు.

 

    "మీరెలా అనుకుంటే అలా..." చాలాసేపు ఆలోచించిన మీదట అన్నాడు అవినాష్.

 

    ధన్ రాజ్ పెదవుల మీద చిర్నవ్వు మెదిలింది. ఆ నవ్వుని ఆపుకుంటూ.

 

    "రోష్ణి రేపట్నించి ఇంట్లోంచి బయటకు కదలదు. కదిలితే-కాలేజీకి- అదీ-నా ఎస్కార్టుతో-ఆ తర్వాత-వస్తే-నీ దగ్గరికే వస్తుంది-నీ దగ్గరికి రావడానికి చాలా అబద్ధాలాడుతుంది. అవన్నీ నిజమని నేను నమ్మినట్టుగా నటించి-నీ దగ్గరకు పంపుతాను-నువ్వు కూడా... కాసేపు భ్రమించి- నటించి...మాయమాటలు చెప్పి-నా దగ్గరకు- అంటే-ఇంటికి పంపుతావు- అర్ధమైందా-"

 

    ఆగాడు ధనరాజ్.

 

    "అలాగే-" చెప్పాడు అవినాష్.

 

    "ఇంకో విషయం-మర్చిపోయాను-ఎప్పుడొచ్చినా-నీ దగ్గర గంటకంటే ఎక్కువ రోష్ణిని ఉంచొద్దు-అర్ధమైందా-"

 

    ఆ మాట ధనరాజ్ ఎందుకన్నారో అర్థం కాలేదు అవినాష్ కి.

 

    ఆ తర్వాత, ఓ పదినిముషాల తర్వాత అవినాష్ అక్కడ నుంచి బయటికి వచ్చేశాడు.


                                       11


    ఎర్రటి సూర్యబింబం పడమటి కొండల వెనక్కి కొద్దికొద్దిగా తప్పుకుంటోంది.

 

    పచ్చటి చెట్లమీద నల్లటి నీడలు ముసురుకుంటున్నాయి. అప్పటివరకూ ఆహారం కోసం ఎగిరి, ఎగిరి అలసిపోయిన చిన్ని పిట్టొకటి ఆకుల చాటునున్న గూటిలోకి వాలి సేద తీరుతుంది.

 

    కొండ అంచున నిలబడి కింద కనిపిస్తున్న అంతులేని అగాధంలోకి విప్పారిన కళ్ళతో చూస్తోంది. గౌతమి, కంటికి కనిపించని అగాధపు లోతు ఆమెను భయపెడుతోంది. మరుక్షణంలో, ఆ లోయల అణువణువుల్లో పరుచుకున్న సౌందర్యం ఆమెను ఆశ్చర్యకితురాల్ని చేస్తోంది.

 

    ఆ ఆశ్చర్యంలో ఆనందం.

 

    ఆ ఆనందంలో తన్మయత.

 

    ఆ తన్మయతలో భయం.

 

    పాము కుబుసం విప్పుకుంటున్నట్టుగా భయం.

 

    నరాల్లో తీగలాగా పాకుతూ భయం...

 

    సరిగ్గా-

 

    ఆ సమయంలో అపూర్వమైన సౌందర్యంలో ఆమె తేలియాడుతున్న వేళ-

 

    ఉన్నట్టుండి, ఒక దృఢమైన హస్తం, ఆమె మెడ మీద పడింది. ఆ రాక్షస హస్తం ఆమెను ముందుకు నెట్టింది.

 

    అంతే-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS