ఆక్రోశించింది గౌతమి అంతరంగం.
ఆ ఆక్రోశంలో బాధ- ఆ బాధలోంచి జాలి-తనమీద తనకే జాలి- అండకోసం, తోడుకోసం, ఓ మగాడ్ని, హృదయంలేని మగాడ్ని నమ్మినందుకు తనమీద తనకే జాలివేసింది ఆమెకు.
నీరసంగా అలా నేలమీద కూలబడిపోయింది. ఆమె కళ్ళల్లో ఒక్కసారి కన్నీళ్ళు తిరిగాయి. ఆ కన్నీళ్ళకు మాటలొస్తే ఆమెను లాలించి ఉండేవి.
కానీ-
ఉద్వేగం, కోపం, జాలి కలగలిసిన ఆమె ఒక్కసారి పెద్ద పెట్టున ఏడ్చేసింది.
తల నేలకు బాదుకుంటూ ఏడ్చింది. తన చేతుల్తో తన చెంపల్ని తనే కొట్టుకుంటూ ఏడ్చింది.
కానీ ఆమె ఏడుపు ఆ గదిలో బందీగా ఉంది తప్ప, ఎవ్వరూ ఏ ఒక్కరూ ఆమెకు తోడురారు.
ఒక గంటసేపు ఆమె ఏ మాత్రం కదలలేకపోయింది.
అప్పుడామెకు-
ఒక్కసారి తన గర్భం జ్ఞాపకానికొచ్చి-తన పరిస్థితిని ఊహించుకోలేక పోతోంది. అవినాష్ చేసిన దారుణం, ఆమెలో కసి పెరుగుతోంది. తనని తల్లినిచేసి, తనని చంపడానికి పధకం పన్నిన అవినాష్ మీద.
గౌతమి అణువణువులోనూ కసి-కసి-తీరని కసి-ఆరని పగ.
ఇప్పుడు కర్తవ్యం?
ఏదో చెయ్యాలి!
అవినాష్ ని నామరూపాలు లేకుండా చెయ్యాలి.
ఏం చెయ్యాలి?
గిర్రున తిరుగుతోంది గౌతమి మనసు.
అప్పటికి గౌతమికి ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలిసాయి.
పొరపాటున 'ఆంటీమనీ' బదులుగా 'మార్ఫిన్' ఇచ్చిన అవినాష్ తను చనిపోయి ఉంటుందని అనుకుంటాడని తెల్సు.
తనని చంపడం కోసమే ప్రతిక్షణం జాగ్రత్తగా మసిలాడని తెల్సు.
అందుకే తనతో కలిసి తిరుపతి రాలేదు-అతను తన పేరుతో హోటల్ రూం బుక్ చేయకుండా, తన పేరుతో బుక్ చేసాడు.
ఒక్కోక్షణం గడిచేకొద్దీ, జరిగి సంఘటనలన్నీ ఆమె కళ్ళముందు సిన్మా రీళ్ళలా తిరుగుతున్నాయి.
అదే సమయంలో-
గౌతమి పెదవుల నుంచి ఒకే ఒక్క పదం వచ్చింది.
ఆ పదం-
"బాస్టర్డ్-"
"బాస్టర్డ్-"
ఆ రోజు సాయంత్రం అయిదు గంటలకు, తిరుపతి నుంచి వైజాగ్ వచ్చే పూరీ తిరుపతి ఎక్స్ ప్రెస్ లో ఉంది గౌతమి.
మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు గౌతమి వైజాగ్ స్టేషనులో దిగి, హాస్టల్ కి వచ్చింది.
ఆ సమయంలో డాక్టర్ మాల హాస్టల్లోనే ఉంది. తనకు జరిగిన అవమానాన్ని ఎవరకూ చెప్పకూడదని నిర్ణయించుకుంది.
"ఏం అలా ఉన్నావ్-" గౌతమిని చూస్తూనే అడిగింది డాక్టర్ మాల-
"రాత్రి నిద్రలేదు..." చెప్పింది.
"ఆ... గౌతమి-నీ కోసం... నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు... నువ్వు రాగానే... తనొచ్చి వెళ్ళినట్టు చెప్పమన్నాడు..." చెప్పింది మాల.
"ఎప్పుడొచ్చాడు..."
"నువ్వు ఊరెళ్ళిన మర్నాడు..."
అంటే... విజయవాడలో దిగిన అవినాష్ మళ్ళీ వైజాగ్ వచ్చాడన్న మాట...
గౌతమికి ఆ వెనకనున్న కథ అర్థం కావడానికి అట్టే సమయం పట్టలేదు.
"నేను హాస్పిటల్ కు వెళ్తున్నా..." ఓ అరగంట తర్వాత డాక్టర్ మాల చెప్పేసి వెళ్ళిపోయింది.
గదిలోకెళ్ళి రెండు మూడు గంటలసేపు ఏడుస్తూ కూర్చుంది గౌతమి.
దుఃఖం నుంచి సేదతీరాక...
తనేం చేయాలో, అవినాష్ ని ఎలా మానసికంగా చిత్రహింసలు పెట్టాలో నిర్ణయించుకుంది.
తనని మోసం చేసాడంటే, చంపడానికి ప్రయత్నించాడంటే అవినాష్ ని ఇంకో అమ్మాయి ఆకర్షించి ఉండాలి. ఆ అమ్మాయి ధనవంతురాలై ఉంటుంది.
ఎవరా అమ్మాయి?
ఆ అమ్మాయెవరో ముందు కనుక్కోవాలి. ఆ అమ్మాయికి అసలు విషయం చెప్పాలి.
తర్వాత-
ఆలోచిస్తోంది గౌతమి.
బడలిక తీర్చుకుని, స్నానం చేసి, భోంచేసి తన గదిలోంచి వార్డెన్ గదిలో కొచ్చింది గౌతమి.
వార్డెన్ గదిలో వార్డెన్ లేదు.
'కీబోర్డు' కున్న ఫోన్ తాళాలు తీసుకొని, అవినాష్ పనిచేసే కాలేజీకి ఫోన్ చేసింది.
"అవినాష్ నెలరోజులు సెలవుపెట్టాడు-" ఆ మాట వినగానే గౌతమి నోటంట ఏం మాటా రాలేదు.
"మీరెవరు మాట్లాడుతున్నదీ-" అవతల నుంచి ప్రిన్సిపాల్ గొంతు.
"అవినాష్ భార్యను-" తన పథకానికి అంకురార్పణ చేసింది.
"అవినాష్ భార్య-మీరు-మా అవినాష్ భార్యా- అవినాష్ ఎప్పుడూ చెప్పలేదే-" ప్రిన్సిపాల్ ఫోన్లో తెగ ఆశ్చర్యపోతూ అంటున్నాడు.
"మూడ్రోజులే అయింది మా పెళ్ళయి-" చెప్పింది గౌతమి.
"మూడ్రోజులకే భర్తను వెతుక్కుంటున్నావా- మూడ్రోజులకే భర్త పరాపైపోతే-ఈ కాలం ఆడపిల్లలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో-" ఆయన జోకువేసి, ఫోన్లోనే నవ్వుతున్నాడు.
"ఏమ్మా-అవినాష్ కి పరారై పోవడం-బాగా అలవాటేనమ్మా-కాలేజీకి అంతే-ఏదో అర్జంటు పనిమీద వెళ్లుంటాడు-ఏదైనా అత్యవసరం వస్తే-తనకు ఫోన్ చెయ్యమని ఏదో ఫోన్ నెంబరిచ్చాడు-ఆ ఫోన్ కి ట్రై చేస్తావా-" అని ఆ ఫోన్ నెంబరు చెప్పాడు ప్రిన్సిపాల్.
ఆ ఫోన్ నంబర్ని నోట్ చేసుకుంది గౌతమి.
ఈ ఫోన్ నెంబర్ ఎవరిది? అవినాష్ కొత్త గర్ల్ ఫ్రెండుదా?
