40 వ . సర్గ
సీత మారుతితో :-
1. "రామ లక్ష్మణ సు | గ్రీవాదులగొని
వానరసేనతో - వేగరమ్మని |
అశ్రులు నిండిన - నేత్రములతో
గద్గదమైన - కంఠస్వరముతో |
జానకి పలికె - అతి దుఃఖముతో
పోయి రమ్మని - హనుమంతునితో |
అంతట మారుతి - కాయము పెంచె
ఉత్తర దిశగా | కుప్పించి ఎగసే .... ||శ్రీ||
__: 40 వ. స. సంపూర్ణము :__
41 వ. సర్గ
మారుతి అశోకవనమును పాడు చేయుట :-
1. "సీత జాడగని - మరలిన చాలదు
చేయవలసినది - ఇంకను గలదు |
కల్పించుకొని - కలహము పెంచెద
అసుర వీరుల - పరిశీలించెద |
రాక్షస బలముల - శక్తి గ్రహించెద
సుగ్రీవాదులకు - విన్నవించెద |"
అని హనుమంతుడు - యోచన జేయుచు
తోరణ స్తంభము - పైన నిల్చెను .... ||శ్రీ||
2. "సామదాన భే | దోపాయములు
దానవుల యెడ - నిరుపయోగములు |
దండోపాయమె - తగిన సాధనము
ప్రారంభించెద - బల ప్రయోగము
రావణుడాదిగ - అసురులందరు
రామ దూత మహి | మ ఇక జూచెదరు |"
అని హనుమంతుడు - యోచన జేయుచు
తోరణ స్తంభము - పైన నిల్చెను .... ||శ్రీ||
3. తరువుల బెరికి - శాఖల విరిచి
తీవల ద్రెంచి - పూవుల ద్రుంచి |
పుష్పకుంజముల - మట్టము జేసి
గిరిశిఖరముల - బ్రద్దలు చేసి |
సోపానముల - ముక్కలు చేసి
నడబావుల - కూలగ ద్రోసి |
సుందరమైన అ | శోకవనమును
చిందర వందర | చేసె మారుతి .... ||శ్రీ||
4. పద్మాకరములు - పాడొనరించి
జలాశయముల - గట్టులు త్రెంచి |
ఫలవృక్షముల - నేలను గూల్చి
ఉద్యానముల - రూపును మాపి |
ప్రాకారముల - బ్రద్దలు చేసి
ద్వారబంధముల - ధ్వంసము చేసి |
సుందరమైన అ | శోకవనమును
చిందర వందర | చేసె మారుతి .... ||శ్రీ||

సుందరమైన అశోకవనమును
చిందరవందర చేసె మారుతి |
5. మృగసమూహములు - భీతిల్లినవై
తత్తరపాటుగ - పరుగులు తీయగ |
పక్షుల గుంపులు - చెల్లాచెదరై
దీనారవముల - ఎగిరిపోవగ |
సీతయున్న శిం | శుపాతరువు వినా
వనమంతయు వి | నాశము కాగా |
సుందరమైన అ | శోకవనమును
చిందర వందర | చేసె మారుతి .... ||శ్రీ||
__: 41 వ. స. సంపూర్ణము :__
