"ఆమె నాకు వదిన అవుతుంది."
"ఏమిటీ ? నువ్వెక్కడి క్రొత్త మరిదిని దొరికావు! నాకెప్పుడూ చెప్పెలేదే ఆమె!"
"ఆమెకే తెలియనప్పుడు మీకేం చెపుతుంది?"
"నువ్వు వింతగా మాట్లాడుతున్నావు. ఆమెకు తెలియకుండానే ఆమెకు బంధువులున్నారా?"
"అప్పటికి తెలియదు కానీ ఈ మధ్యనే తెలిసికోంది."
"ఇంతకూ ఏం మాట్లాడాలను కున్నావో త్వరగా మాట్లాడి వెళ్లిపోవచ్చు."
నవ్వుకొన్నాడు రాజ్.
"ఆ విషయం త్వరగా తెల్చవలసినది మీరే. నాకు శ్రమ తగ్గిస్తే సంతోషిస్తాను."
ఇదేదో మొండి ఘటమేనే అనుకొన్నాడు నారాయణరావు.
"ఆ విషయాలన్నీ మాట్లాడడానికి ఇది సరైన తావు కాదు."
"ఆ విషయం నాకూ తెలుసు. అదీ కాక ఇది అంత త్వరగా తేలే విషయం కూడా కాదు. మరి మీ అడ్రసు చెప్పండి. సాయంకాలం ఇంటి దగ్గరే మాట్లాడతాను." కావాలనే ఇంటి అడ్రసు అడిగాడు రాజ్.
"నిన్ను పంపిన ఆవిడ అది చెప్పలేదా?"
"మీ పేరు కూడా చెప్పని ఆవిడ మీ అడ్రసు చెపుతుందన్న నమ్మకం లేదు."
"ఎందుకు చెప్పలేదు? నేనంటే అంతగా అసహ్యించు కొంటుందా!"
"అపార్ధాలు చేసుకోవడం మంచిది కాదు. ఆమె మీమీద ఉన్న భక్తీ చేత, నేను మీ దగ్గరికి రావడానికి ఒప్పుకోక చెప్పలేదు."
"మరి ఎలా తెలుసుకున్నావు?"
"మన కోడి , కుంపటీ లేకుంటే తెల్లవారదా అన్న సామెత ప్రకారం మిగతా లోకం మూగది కాదుగా!"
"అయినా ఆమెకు పతిభక్తి అనేది ఉందా? ఉంటె నన్నలా ధిక్కరించి పోతుందా?"
"ఆవేశం అనర్ధాలకు దారి తీస్తుంది. మన మొదటి కలయికలోనే అది జరగడం నా కిష్టం లేదు. అందులోనూ ఇది అటువంటివాటికి సరైనా స్థలమూ కాదు. మళ్ళీ సాయంకాలం కలుసుకొంటాను." అని బయటికి నడిచాడు రాజ్.
బయట ఉన్న ఫ్యూన్ ను పిలిచి "మీ అయ్యగారికి భోజనం హోటలు నుండి తెచ్చేది నువ్వేనా?' అనడిగాడు.
"ఔను , సార్! అయ్యగారికి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చేస్తుంటాను." అన్నాడు అతడు గర్వంగా.
"మీ అయ్యగారు ఇంకా డోస్ వేసుకుంటున్నారా?"
"లేదు, సార్! అమ్మగారు వెళ్లి పోయినప్పటి నుండి దాని జోలికే పోరు."
"నీకంతా తెలుసన్న మాట. మరి ఆ టైపిస్టు...."
"ఇంకెక్కడి టైపిస్టండి! అన్నాడే ఉద్యోగం లోంచి తీసేశారు."
'అలాగా" అని వాడి చేతిలో కొంత చిల్లర పోశాడు రాజ్. వాడి కళ్ళు తృప్తిగా మెరిశాయి. నవ్వుకొని ఇంటికి బయలుదేరాడు.
"అసలు నిన్ను అక్కడి కెళ్లమని ఎవరు చెప్పారు?" అంది ఇందిర కోపం నటిస్తూ.
"కోప్పడకమ్మా, వదినా! నన్ను ఒకరు అక్కడికి పొమ్మని చెప్పాకనే పోయాను."
"ఎవరు వాళ్ళు? చెప్పు. వాళ్ళ పళ్ళు రాలగొడతాను." లతే చెప్పి ఉంటుందని అనుకొంది ఇందిర.
"మరి రాత్రి నే పడుకోనుండగా ఒక కల వచ్చింది. ఆ కలలో భగవంతుడు కనిపించి 'భక్తా!' అన్నాడు. 'స్వామీ' అని చేతులు జోడించాను. 'నువ్వు రేపు ఉదయమే మీ వదిన గారి భర్త గారి దగ్గరకు పోయి మాట్లాడిరా' అని ఆజ్ఞాపించాడు. ఆ అజ్ఞ అక్షరాలా పాటించాను."
ఇందిర కోపమంతా ఎగిరిపోయింది. అతని మాటల కొచ్చే నవ్వు నాపుకొంటూ "నాకు మంచి మరిదే దొరికాడు" అంది.
"వదినా, ఒక శుభవార్త. మీ భర్త గారు అంటే మా అన్నగారు ఈ మధ్య దురలవాట్లను దూరం చేశారు."
ఇందిర హృదయం ఆ వార్త విని పొంగి పోయింది. తన ఆనందాన్ని బయటికి కనుబడ నీకుండా "అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు, మరిది గారూ!" అంది.
"ఆ ఆనందాన్ని బయటికి కనబడ నీయకుండా లోపలే అణగద్రోక్క వద్దంటూన్నాను, వదిన గారూ! మీరు సంతోషంగా ఉంటె మాకు మహదానందం."
"రాజూ, నీలో రోజు రోజుకూ చిలిపితనం ఎక్కువవుతోంది. త్వరలో నీ మెడకో గుది బండ కట్టి నీనోరు మూయించమని అమ్మతో చెప్తా నుండు. అన్నట్లు మరిచాను. రజియాను తీసుకోస్తానన్నావు. తీసుకు రాలేదేం?"
"ఆవిడ గారు సిగ్గు పడుతున్నారు."
"ఎందుకూ?"
"పిన్ని గారింటికి రావాలంటే సిగ్గుగా ఉందండీ. అంది."
"అప్పుడే వరుస కూడా కలిపెసిందా?"
"అంతా అయిపొయింది. చదువై పోగానే ముహూర్తం పెట్టించాలని వాళ్ళ నాన్నగారి నిశ్చయం. లత ఏదీ?"
"వచ్చేశాను, బావా!" అంటూ లోపలి కొచ్చింది లత.
"మరి ఆ గోపీ గాడితో కబుర్లు అయిపోయ్యాయా, లతా ? ఏమన్నాడు వాడు? త్వరలో ముహూర్తం పెట్టిస్తానన్నాడా లేక చదువైపోయేంత వరకు ఆగుతానన్నాడా?"
"ఫో, బావా! నీకెప్పుడూ నన్ను ఏడిపించడమే పని" అంది లత సిగ్గుతో.
"ఇంతకూ నీ ఉద్దేశ్యం చెప్పావు కాదు."
"చదువై పోనీ, రాజూ" అంది ఇందిర , చెల్లెలి వైపు ప్రేమగా చూస్తూ.
"వదినా! నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది."
"కారణం మేం వినకూడదా బావా!' అడిగింది మధ్యలోనే లత.
"చెప్తాను విను, లతా. నా అన్నవారు లేని నాకిప్పుడు ఇంతమంది ఆప్తులు , బంధువులు ఉన్నారు. అంతకన్నా ఆనంద మేముంటుంది? ఇటువంటి ఆప్తులను , బంధువులను ప్రసాదించిన ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలుపు కొంటున్నాను."
"కానీ మేం మాత్రం మాకు ఇటువంటి మరిదిని ఆలశ్యంగా ప్రసాదించి నందుకు చింతిస్తున్నాం "
"ఊ."
"ఔను , బావా! అక్క చెప్పింది అక్షరాలా నిజం."
"నీకు కూడా తెలుసా!' అన్నాడు రాజ్ వెక్కిరింపుగా. అది విని సిగ్గుతో చిన్నబుచ్చుకుంది లత. ఫక్కున నవ్వేశాడు రాజ్. ఇందిర కూడా రాజ్ హాస్యానికి నవ్వింది. దానితో తుర్రున లోపలికి పారిపోయింది లత.
"ఏమిటర్రా, అంతగా నవ్వుతున్నారు" అని అక్కడి కొచ్చింది వాళ్ళమ్మ.
* * * *
కుర్చీ చూపించి "సిగరెట్?' అన్నాడు నారాయణరావు.
"నో థాంక్స్" అని కూర్చున్నాడు రాజ్.
"మీరు చెప్పదలుచుకున్నది నిరభ్యంతరంగా చెప్పండి."
"మా వదినను ఎప్పుడు దిగబెట్ట మన్నారు?"
ఆమె తరపు నుండి ఏ క్షమాపనో , అర్ధింపో వస్తుందని ఆశించాడు అతడు. కానీ ఆసూటి ప్రశ్న వస్తుందని ఊహించని రావు ఆలోచన లో పడ్డాడు. తన ఇందు తిరిగి తన యింటి కొస్తుంది. అంతకన్నా తనకు కావలసిన దేముంది? కాని ఇంత సులభంగా తను అంగీకరించకూడదు.
"ఆమెను ఇక్కడెందుకు దిగబెట్టడం?'
"విచిత్రమైన ప్రశ్న వేశారు. ఆమె మీ భార్య కనుక మీ దగ్గరే ఉండాలి."
"ఆ విషయం ఆమె కిప్పుడు జ్ఞాపక మొచ్చిందా?"
"జరిగి పోయినా విషయాలు త్రవ్వితే మీరు కూడా సిగ్గుపడి బాధపడవలసి వస్తుంది."
"ఆనాడు నన్ను దిక్కరించి వేడుకొన్నా వినక వెళ్లిపోయిందే! ఆమెను నేనిప్పుడు ఎలా స్వీకరిస్తాను?"
"స్వీకరించక విడిచి పెడతారా!" గద్దించాడు రాజ్.
ఆ గద్దింపు కు ఉలిక్కిపడ్డాడు రావు.
"నా మాటకు జావబియ్యండి."
"నేను ఆ మాట అనలేదే!"
"మరి ఏమిటి మీ ఉద్దేశ్యం?"
"చేసిన తప్పుకు పశ్చాత్తాప పడి నా కాళ్ళ పై బడి క్షమాపణ వేసుకోవాలి."
నవ్వు వచ్చింది రాజ్ కు. భార్య ఎప్పటికి భర్తకు పాదదాసే! ఇతడు అర్ధం లేని పట్టుదలతో ఉన్నాడు. తప్పక దారికి వస్తాడులే అనుకోని నవ్వును లోపలే అణుచుకోన్నాడు.
'అదేం వీల్లేదు. ఆమె మీ యింటికి వస్తుంది. మర్యాదగా ఎలుకోండి."
'అలా చేయకపోతే?"
"ఎలా చేయరో నేనూ చూస్తాను."
"అసలు నువ్వెవరు? ఆమెకూ, నీకూ ఏదో సంబంధ ముంది. మీ రహస్యం బయటపడింది. అందుకే ఆమెను నా దగ్గర చేర్చాలని ప్రయత్నిస్తున్నావు." అన్నాడు రావు లేచి.
"నోర్మూయ్!" అని రాజ్ కోపంతో లేచి అతని కాలరు పట్టుకొని "ఆమెకు భర్త వయ్యవు కనుక సరిపోయింది. లేకుంటే ....." అని రావును వెనక్కు త్రోశాడు. పాపం కింద పడ్డాడు రావు. భయపడి పోయాడు రావు.
"నువ్వు ఇంత మూర్ఖుడి వనుకోలేదు. అలోచించి నీ నిర్ణయం చెప్పు, మళ్ళీ వస్తాను" అని అక్కడి నుండి చరచరా వచ్చేశాడు రాజ్.
* * * *
"రాజూ! కారు ఆనంద్ చేత పంపిస్తాను. అందరూ కలిసి రాత్రికి అందులో వచ్చెయ్యండి. నేను అక్కడ అన్ని ఏర్పాట్లూ చేసి ఉంటాను. మరిచి పోవద్దు. మరి నే వెళతాను. అవతల చాలా పని ఉంది." అని గోపీ కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.
"ఏమిటి, రాజ్ , ఆలోచిస్తున్నావు?' అంది రజియా.
'ఆనందరావు గారు బాల్య మిత్రుడి కుమార్తె పెళ్ళికి తాను రాలేనంటూ వాళ్ళమ్మా యిని పంపిస్తానని ముకుందయ్యగారితో చెప్పాడట. నన్ను పిలిచి వసంత తో కూడా వెళ్లి రమ్మన్నాడు. ఎలాగూ వెళ్ళుతున్నాం కదా అని సరే అన్నాను. కానీ ఇంతమంది ఉన్నామె, ఒక కారులో ఎలా వెళ్ళడం?"
"పోనీ మనం మాత్రం ట్రెయిన్ లో వెళదాం."
"అదే ఆలోచిస్తున్నాను."
"రాజ్, ఆ కారెవరిది? ఆనందరావు గారిది కదూ?"
రాజ్ అటు చూశాడు. అవును. ఇటు ఎక్కడికి వస్తుంది అనుకుంటుండగా కారు వారి ముందు నిలిచింది. అందులో నుండి వసంత రతీ దేవిలా అలంకరించుకుని చిరునవ్వుతో దిగింది. ఆమె రాకకు కారణం ఊహించలేక పోయాడు.
"నాన్నగారి నడిగి కారులో వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాను. మీకా విషయం చెబుదామని వచ్చాను." అంది వసంత , అతని సందేహ నివృత్తి చేస్తూ.
సమస్య తీరిపోయిందిగా అన్నట్లు చూసింది రజియా.
"ఏమంటారు?' అంది వసంత.
"మరేం లేదు. కారులో అతిధులు ఎక్కువ వుతారు."
"మరేం ఫర్వాలేదు. కారు అరిగి పోదుగా !" నవ్వింది వసంత.
ఇంతలో అక్కడికి సుగుణ వచ్చింది.
"ఏం, సుగుణా , నువ్వు తయారుగా ఉన్నావా?"
"ఓ, నేను రెడీ అన్నయ్యా!' అంది సుగుణ ఉత్సాహంతో.
"మనం వీధిలో నిలబడి మాట్లాడుతున్నాం. లోపలికి రండి." అంది రజియా . అందరూ లోపలికి పోయారు.
