ఆమె అంగీకరించని విషయాన్ని కూడా సావధానంగా విని, నిదానంగా అలోచించి, విలువ కడతారు.
"ఏమంటావు అహోబలం?" అని పక్కన కూచున్న డాక్టరు గారిని అడిగారు.
నేను ఇంకా వుత్సాహంతో-----
"ఈ డాక్టర్లు. ముందు రక్తాన్ని చూడలేని వాళ్ళు చివరికి ఏమౌతారు?" అన్నాను అప్రస్తుతంగా.
అయన తలపూయించారు, అయన serious సీరియస్ గా, విషయాలు హృదయానికి దగ్గిరివి, అయన మనస్సుని గట్టిగా కదిలించినవి అయన మాటలాడరు. హృదయ సుకుమారత్వాన్ని, దయని, గొప్ప స్నేహబంధాన్ని హేళనలో ఆటలో కప్పేస్తారు. నవ్వులో , గొప్ప నవ్వులో వున్న ఔన్నత్యం దేంట్లో వుంటుంది? అందువల్లనే షేక్ స్పియర్ , కాళిదాసూ గొప్ప వేదాంతాన్ని court fools కోర్టు ఫూల్స్ చేతా విదూషకుల చేతా మాట్లాడిస్తారు. పి.జి. ఉడ్ హౌస్ నవ్వులో, డిక్కేన్సు caricatures కారికేచర్లలో, చార్లీచాప్లిన్ చిత్రాలలో ఎన్ని కన్నీళ్లు? ఎంత వేదాంతం? ఎప్పుడో పెద్దమ్మాయిగారు ప్రసంగంలో చాలా హృదయాన్ని కదిల్చినప్పుడు తప్ప అయన హృదయాన్ని ఎన్నడూ చవకగా విప్పరు అందరికీ అర్ధం కాదని సహజంగా గ్రహించిన సంస్కారి.
"కాదూ" అని నవ్వుతూనే మాట్లాడతారు.
"కాదూ మరి! ఈ యుద్ధంలో యోదులందరూ యేవరంటారు? ఇంటి దగ్గర పిరికివాళ్లే. తీరా అక్కడికి వెళితే ఆ కోలాహలమూ రక్తస్రావమూ చూసేప్పటికి స్వరక్షణార్ధం ప్రతివాడికి శౌర్యం పుట్టుకొస్తుంది." అని నాలుగు మాటల్లో గంపెడు వేదాంతం మాట లాడారు.
ఆమె ఆ మాటల్ని యేచిస్తో కూచున్నారు. ఆ మధ్యాహ్నం ఆ టీ టేబులు ముందు.
వాళ్ళిద్దరితో నేను గడిపిన మధ్యాహ్నాలు , సాయంత్రాలు , మనసులో ఎంతో పదిలంగా దాచుకుంటాను.
నేను యీ జీవితంలో నా స్వల్ప అనుభవంలో ముగ్గుర్నే అమితంగా గౌరవించాను. వారిలో వొకరు అహోబలరావు గారు. ఎంత గౌరవమంటే --------
నేను కాన్వకేషన్ హాల్లోంచి వొస్తున్నాను. సేసేటర్ల వరసలో నా కళ్ళని చెదరకొట్టింది రామలింగారెడ్డిగారు. బైటకిరాగానే నావలనే అయన రూపానికి వశ్యుడైన సహాధ్యాయుడు రెడ్డిగార్ని గురించి స్త్రీలు వ్యభిచారమూ మాట్లాడుతున్నాడు. అతని మనసు మీద అల్లాంటి ro-action రియాక్షన్ కలిగింది . ఏం చేస్తాం?
"విచిత్రమేముంది? నేను స్త్రీనైతే సంసారాన్ని వొదిలి, అయన కోసం వెళ్ళి వుండనా?" అన్నాను. పర్వవసానం వూహకి వొదిలేస్తా ఎవరి మీదన్నా గౌరవం కలగగానే ఆ వ్యక్తి మీద మురుగు పెడ చిమ్మలనే ఆసక్తి యీ అరవదేశంలో, తెలుగు దేశంలో అమితంగా చూశాను. ఒకర్ని పూజించడమనేది భరించలేరు. తమలో గాని యితరులలో కాని.
అంతకన్న యెక్కువ గౌరవం డాక్టరు గారి మీద నాకు, నేను చూసిన complete man సంపూర్ణ వ్యక్తీ అయన ఒక్కడే.
మొన్న పెద్దమ్మాయిగారిని చూడడానికి వెడితే --
"డాక్టరుపోయి అప్పుడే యేడేళ్ళయింది" అన్నారు. దృష్టి యెక్కడో పెట్టి .
"ఇంకా బందరు జీవించేవుంది" అనుకున్నాను మనసులో నేను.
ఆమె ఇంకా "ఏమంటావు అబ్బాయీ" అని అడుగుతున్నట్టు పక్కకి తిరుగుతూనే వున్నారు శూన్యం వేపు.
రామ్మూర్తి చచ్చిపోయినాడని టెలిగ్రాం రాగానే నా మనసు మొదటి తలపు -------
"ఈ సంగతి రామ్మూర్ట్టితో చెప్పాలి" అని . అట్లానే ఎదేల్ మానిన్ తన మిత్రుడి ఆత్మహత్య మీద పంచాయితీ జరిగినప్పుడు అక్కడి మనుషుల్ని వర్నిస్తో అయన శవం ముందే "ఈ సంగతులు అతనితో వర్నిస్తే ఎంత నవ్వుతారు?" అనుకున్నానని వ్రాస్తోంది. ఏదేల్ మాని --- ఎన్ని మైళ్ళ దూరాన -- ఎంత సంబంధం మనసులో!
చాలారోజులు ర -----చచ్చిపోయింతరవాత కొత్త కధ వ్రాయగానే ర -----కి వినిపించాలని అనుకునేవాణ్ణి! ! ఇప్పుడేవ్వరూ లేరు వినడానికి. ఎందుకు వ్రాస్తారు? మానిన్ వ్రాసినట్టు "Life is a habit' అన్నాట్ట Betrand Russel. అందువల్ల విధి కొట్టే ఒక్కొక్క దెబ్బతో కింద బోర్ల పడీకూడా లేచి నడుస్తో ఉంటాము. గతాన్ని వెంట యిడ్చుకుంటూ సగం నలిగిపోయిన నల్లుల లాగు.
చచ్చిపోయినవాళ్ళ జ్ఞాపకాలని ఆపాలని ఎన్ని ప్రయత్నాలు లోకంలో. గోరీల మీద వ్రాతలు చూడండి. వెర్రి హృదయాలు. ఆంధ్ర రచయితలలో ఒకరు చచ్చిపోయిన కొడుకు బొమ్మని పుస్తకం మీద అచ్చు వేయించారు. చూడగానే పెద్దదిగులు వొస్తుంది నాకు. వెర్రితనం! ఆ ప్రేమబంధం మనసులోనే దానికి వెలుగు. బైటికి తీశామా అది వుత్తతాడు.
రామ్మూర్తి చచ్చిపోగానే ముద్దుకృష్ణ , "రామ్మూర్తి జీవిత చరిత్ర వ్రాద్దామా?" అన్నాడు.
"మీరూ నేనూ చదువుకోవాలి. రామ్మూర్తి ఎవరికి గొప్ప" అన్నాను.
చావు- చచ్చిపోయినవాళ్ళు , మన రహస్యాలు మనస్తత్వం. మన ఆస్తి , ఇంకొకరికిచ్చామా , లోకం ముందు పంచామా? ఎందుకూ పనికిరాని దుమ్ము!
చచ్చిపోయినవాళ్ళు మనవాళ్ళు. మననించి వాళ్ళనెవ్వరూ తీసుకోలేరు. టాగూరు "నువ్వు యీ బైట లోకంలో చచ్చిపోయి నా అంతరాత్మలో పునర్జన్మని పొంది నివసిస్తున్నావు." అన్నారు. బతికి వున్నవాళ్ళు మనతో తగాదాలాడి విరోధులు కావచ్చు. పెళ్ళిళ్ళు చేసుకుని మర్యాదస్తులై మనకి దూరం కావచ్చు. కాని మనము ప్రేమించిన వాళ్ళు మృతి పొంది మనస్వంతమైపోతారు. జ్ఞాపకం వుంచుకో తలుచుకున్నన్నాళ్ళు వాళ్ళు మనవాళ్ళు. బ్రతికి వున్నవాళ్ళకన్న సన్నిహితులు . ఈ బ్రతికి వున్న వాళ్ళ నీడలన్నీ మనం నిజమనుకోటం లేదా? అంతకన్న తీసిపోయినారా చచ్చినవాళ్ళు, మన ప్రేమాస్పదులు?
