పెద్దమ్మాయిగారు తనకి అంగీకారం లేని విషయాల్లో కూడా ఎంతో insight ఇన్ సైట్ చూపగలరు.
ఒకసారి వేదాంతం మాట్లాడుతున్నాను.
"నిన్నరాత్రి మీ చెల్లెలు గారూ నేనూ చాలాసేపు అధ్వైతం చర్చించాము."
"ఈ లోకం దుఖ్కమయం. దీంట్లొంచి ఎంత త్వరగా తప్పించుకొంటె అంత నయమంటారు ఆమె.
"ఈ జీవితం చాలా సుఖంగా ఆనందమయంగా వుంది నాకు. ఏమాత్రమూ తప్పించుకోవాలని లేదు." అన్నాను నేను.
'అందరికీ అట్లావుందా?" అని ఆమె.
"ఆ దౌర్భగ్యుల్ని తప్పించుకొమనండి. తప్పించుకోవాలంటే వైరాగ్యం దాకా పోనక్కరలేదు. రైలు పట్టాలు సిద్దంగానే వున్నాయి." అని నేను అన్నాను.
పెద్దమ్మాయి గారు పకపకా నవ్వారు. కాని కళ్ళల్లో వెంటనే సీరియస్ నెస్ వొచ్చింది. ఆమె చెల్లెలి వేదాంత పాఠాలతో ఆమెకి యెక్కువ 'సింపతీ' లేదని నాకు తెలుసు. కాని -----
"ఇప్పుడట్లానే అంటారు మీరు, అట్లానే అనిపిస్తుంది కూడాను. కాని కాలం గడిచిన కొద్ది స్నేహితులు, బంధువులు, ఎంతో మనం నమ్మినవాళ్ళు మోసం చేసి ఆశలూ, కలలూ , విశ్వాసాలూ అన్నీ దుమ్మైపోయినప్పుడు ముందు ముందు ఏమంటారో మీరే?" అన్నారు ఆమె.
ఇది పది పదిహేనేళ్ళకిందట.
హృదయ భేధకమైనవీ అర్ధం కానివీ ఐన రెండు మూడు మరణాలూ, అంతకన్నా దారుణంగా కలత పెట్టిన రెండు మూడు వియోగాలూ అవసరమైనాయి, నాకీ లోకం చాలా సౌఖ్యంగా వుందనే నామాటల్ని నా మొహానే విసిరికొట్టెందుకు.
ఇతరులు కష్టంలో వున్నారంటే సానుభూతి వుండేది కాదు.
"మూర్ఖం . వినరు. జీవితాల్ని బాగుచేసుకోరు, అనుభవించనీ" అనేవాణ్ణి . దరిద్రమూ, రోగమూ, దిగుళ్ళూ , మరణాలూ, అన్నీ మానవులు స్వయంగా కల్పించుకున్నట్టు తోచేవి. అజ్ఞానమూ, భీరుత్వమూ, అన్నీ కష్టాలకీ కారణాలుగా కనపడేవి. వివేకవంతులై సయిస్సును నమ్మి సంస్కరించుకుంటే యీ లోకం ఆనందమయం కాదా అనిపించేది. కాని యీ నాడు అంతా సందేహమే. check pessarics, చెక్ పెసరీలు , potassium permangonate, సోషలిజములు, రేషనలిజిములు, శాకాహారాలు, యివన్నీ ఎంతవరకు సౌఖ్యాన్ని తీసుకురాగలవు ప్రజలకి; అజ్ఞానము, భీరుత్వమూ, మనస్సులోంచి , నాశనమైతే తప్ప. కాని అవి నాశనం కావటం ఎట్లా!
అజ్ఞానం , చెడ్డతనం . క్రూరత్వం - అవి ఏవో చాలా సులభంగా గోడల మీది రంగుల మల్లె కడిగివేసేట్టు మాట్లాడతారు నీతి వంతులు ------
దేవుడు దయమయుడే. మానవులే యీ కష్టాలూ , దుఖాలూ, తెచ్చుకుంటారు, అంటారు మతస్తులు. మరణాల్నీ, వరదల్నీ, ఉప్పెనలనీ, చూస్తోకూడా, యింకా మాట్లాడితే అవి కూడా ప్రజల మూర్ఖం మీద కోపం వల్ల దేవుడు కల్పించాడు అంటారు.
కాని యీ అజ్ఞానాన్ని, భీరుత్వాన్నీ, బలహీనతన్నీ మనుషులు, తెచ్చుకున్నవీ కావు, వదలగలవీ కావు --
ప్రజలు తప్పించుకోలేనివి. యెంత ప్రయత్నించినా ఉపవాసాల వల్ల , పశ్చాత్తాపాల వల్ల, విద్య వల్ల, కఠోరమైన దీక్ష వల్ల, దేనివల్లా వదలనివి. ఇవి పైపూతలు కాదు, నేర్చుకున్నవి కావు, ఇవి రక్తంలో , వెముకల్లో నరాలలో, వ్యక్తిత్వంలో , జీవంలో, ఉనికిలో,కలిసి ఏర్పడ్డవి. ఎంత ప్రయత్నించినా వాటి రూపాలు మారతాయి కాని అవి పోవు.
"క్షయతో ఎందుకు బాధపడతావు? క్షయను వొదిలెయ్యి" అన్నా,
"ఈ డబ్బుమీది కాపీనమేమిటి? మానుకో" అన్నా ఒకటే అర్ధం.
రాజ్యాంగాల్నీ, కుటుంబపద్దతుల్నీ , విద్యావిధానాల్నీ మార్చగలం. కాని ఆత్మలోని రోగాన్ని పోగొట్టలేము.
ఎట్లానో ఎప్పటికో మనుషులు మారతారనీ క్రమంగా అభివృద్ధి పొందుతున్నారనీ నమ్మకం.
ఈ లోకపు బాధల్నీ భరించలేక, ఆకాశంలో స్వర్గాలు కల్పించుటకున్న బలహీనత్వం.
ఆ స్వర్గంలో నమ్మకం పోయి, ఆ స్వర్గాన్ని క్రిందికి దింపి, కొన్నేళ్ళలో, యీ భూమే స్వర్గతుల్యం కాబోతుందని ఆశ.
ఈశ్వరునిలో ఇంకా గట్టి విశ్వాసం కుదురితేసరి మనం దేవతలమౌతామని కొందరూ, ఈశ్వరుడిలో నమ్మకం పూర్తిగా నశిస్తే, యీ లోకం స్వర్గంగా చేసుకోగలమని కొందరు ;
"ఈశ్వరుణ్ణి యీ లోకం లోంచి తరిమేస్తే " అన్నారు.
"దోమల్ని నాశనం చేయలేకపోయినాము ఇన్నేళ్ళ నించి" అన్నాను నేను -
"ఎన్ని రోగాల్ని సాధించాము?"
"ఎన్ని కొత్త రోగాలు పుడుతున్నాయి"
"సృష్టి శక్తుల్ని ఎన్నిటిని స్వాధీనం చేసుకున్నాము"
"సృష్టిశక్తులు ఎంత స్వాధీనం చేసుకుంటున్నాయి మనుషుల్ని క్రమంగా"
"ఎన్ని కొత్త సౌఖ్యాలు"
"ఎన్ని కొత్త దుఖాలు!"
ఏదో ఒకటి దీంతో మీకు కొత్త ఆశల్ని కలిగిస్తున్నాను. దీంతో మీ సంసార సమస్యలు తీరుతాయి' అని ఏదో వో పద్దతిని చూపలేని వాణ్ణి "Destructive" అంటారు.
లేతకొమ్మల్ని పట్టుకొని, కళ్ళు మూసుకు వేళ్ళాడే , కవులూ, ఎండు కొమ్మల్ని పట్టుకుని వూగులాడే సంస్కారులు .
-----------
