"అవ్వా! ఆకలి అయ్యా! ఆకలి" - గూడెంలో ప్రతి గుడిసె నుంచీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.
ఆకలిని మించిన ఆపద లేదు అది గూడాన్ని ఆవహించింది పెంటయ్య డొక్కకూడా మాడుతూంది నిగ్రహించుకుంటున్నాడు కానీ, ఆకలికేకలు వింటుంటే గుండె మండుతూంది శివయ్య తమను మాడుస్తున్నాడు కక్ష తీర్చుకుంటున్నాడు.
"నీయవ్వ, గా శివయ్యగాని తల పగులకొట్టి గింజలు తెచ్చుకుందాం పారి ఆనాడే ఖతం చెయ్యాల్సింది, బమ్మయ్య ఆపిండు లేరి పోదాం వాడొక్కడు, మనం ఇందరం" అన్నాడు పెంటయ్య - పళ్ళు పటపట కొరికాడు - నిజంగానే శివయ్యను నరుకుతున్నట్లు అభినయించాడు.
"అరె పెంటిగా! శాన గరంగున్నవుగని- నువ్వు శివయ్యను చంపుతవు పోలీసోల్లొచ్చి పట్కపోతరు మల్ల ఇంకో శివయ్య ఎలుస్తాడు వీండ్లది రావణాసురుని సంతతి- ఓ తలకాయపోతుంటే ఇంకోటి మొలుస్తుంటది" - అప్పుడే ఆడికి చేరిన బ్రహ్మయ్య అన్నాడు.
"ఇగ చూడు, బళ్ళ గోదాం పెట్టిండు ఆ గింజ లూటీ చేస్తం ఆకలికి ఆగలేకుండన్నమే బ్రహ్మయ్యన్నా!" వెంకడు నీరసంగా అన్నాడు.
"తప్పు, అలా చేయరాదు మనం లూటీ చేస్తాం, ఇప్పటికి ఆకలి తీర్చుకుంటాం పోలీసులువచ్చి మనమీద నేరం మోపుతారు మనను దొంగలను, తాగుబోతులను చేస్తాడు శివయ్య మనం మనుషులంగా శివయ్యను ఎదురుకోవాలి దొంగలంగా కాదు నేను గవర్నమెంటుకు రాశాను ఆ గింజ మనకే దక్కుతుంది"
"సర్కార్ల అంతా శివయ్య మనుషులే కాదుండి ఆడ మనమాట్ ఎవడు ఇంటడు?" ధర్మయ్య సందేహం వ్యక్తపరిచాడు.
"ధర్మయ్యా! పరిస్థితులు మారుతున్నాయి కాకుంటే సివయి నన్నీ ఊళ్ళో ఉండనిచ్చేవాడా? మిమ్మల్ని ఇలా బతకనిచ్చేవాడా? ఇప్పటికే మిమ్మల్ని నన్నూ మసిచేసేవాడు శతాబ్దాల బానిసత్వం పోవడానికి పోరాటం జరుపుతున్నాం స్వేచ్చా స్వాతంత్ర్యాలు బలి కోర్తాయి ఎన్ని కష్టాలయినా ఓర్చుకుని నిలబడ్డప్పుడే మనం దాన్ని సాధించగలం"
"అమ్మా పావనమ్మా! నీమాటలు శాన బాగున్నాయి కాని, ఆకలిని ఆర్పేటట్టు లేవమ్మా! శివయ్య కాళ్ళన్న పట్టుకోవాలె గోదాంనుంచి గింజలన్న తెచ్చుకోవాలె నీ మాటలింటే కడుపు నిండది నీ మాటలినే ఈడికొచ్చినం ఇగ ఇనం" - పిచ్చయ్య వెటకారంగా అన్నాడు.
"ఒరే పిచ్చిగా! ఏమంటున్నావురా? దేవతను తిడ్తున్నావుర గాడ్దికొడుక! పురుగులపడి చస్తవు అరే, ఎన్నడన్న పూర కడుపుకు తిన్నావుర ఎన్నడన్న అందరం కలిసి పన్నాంర! నలుగురితోటి చావు పెండ్లితో సమానం కాదుర! అందరం కలిసి చస్తున్నం గాడ్దికొడక, ఏడవకు, చెంపలేసుకో" - ధర్మయ్య అన్నాడు- తాను లెంపలు వేసుకుంటూ.
"పిచ్చయ్యా! మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతూంది మీకు తిండి దొరకని నాటినుంచీ నేనూ తిండి మానేశాను చూడండి డొక్క" అని.
"అమ్మా తల్లీ! నువ్వు ఉపాసాలుంటున్నావా?" ముక్తస్వరంగా అన్నారంతా.
"ఇదిగో, ఇవ్వాళ నా జీతం వచ్చింది ఇదిగో డబ్బు" అని ధర్మయ్యకు అందించింది "గింజలు కొని, గంజి కాచండి ఎవరికీవారు కాదు - ఒకేచోట కాచండి అందరం తాగుదాం నేనూ మీతోనే ఉంటా" - పావని పలికింది.
"అమ్మా! అనరాని మాటన్న, తల్లీ మన్నించు నువ్వు దేవతమ్మా! మా కోసం దేవుడు నిన్ను పంపిండమ్మా! అమ్మా, గరీబోల్లమంత అంతేనమ్మా, అమ్మా! నన్ను మన్నించు తల్లీ!" అని కాళ్ళమీద పడ్డాడు పిచ్చయ్య.
పిచ్చయ్యను కాళ్ళమీద నుంచి లేవనెత్తింది "పిచ్చయ్యా! మేలుచేసేవాణ్ణి గుర్తించటం కష్టమయ్యా! గొర్రె కసాయివాన్నే నమ్ముతుంది"
"అయ్యో! ఎంత అన్నాలం జరిగింది పట్నం పోయిన ఇప్పుడే వస్తాన్న అన్ని తెలుసుకున్న ఇగ ఉపాసాలుండేడిది లేదు కుండలంమిన పైకం తెచ్చిన ఇగోనే పైకం" - నోట్లు చేతిలో ఎట్టుకుని గంతులేశాడు కొమరయ్య "పైకం శివయ్య కిచ్చెడిది లేదు"
"నీయవ్వ, ఇగేం చేస్తడే శివయ్య ఇరుకున పడ్డడే శివయ్య" అని గంతులేశాడు, పిచ్చయ్య పెంటయ్య, వెంకయ్య వంట ప్రయత్నాల్లో పడిపోయారు గంజి కాచుకుని అంతా వరసగా కూర్చుని తాగుతుంటే అందరికీ సంబరంగా ఉంది అదో కొత్త వింతగా ఉంది.
"మల్లిని చూసినవా, దొరిల్లిడిచి వస్తలేదు కూటికి చస్తమని బుగులు దానికి" వెంకడు అన్నాడు గంజి చప్పరిస్తూ.
"ఒరే ఎంకన్నా! దాని మాట ఎత్తకురా అది చచ్చిందాంట్ల లెక్క నాకు అమ్మలేదు, అక్కలేదు" అన్నాడు పెంటయ్య.
గూడెంలో ఉమ్మడి జీవితం బాగానే సాగుతూంది పావని అక్కడే మకాం పెట్టింది బ్రహ్మయ్య గూడెంలో ఉండే పనులు చేసుకుంటున్నాడు కొమరయ్య సారే అక్కడే తిరుగుతూంది పావని వారికి ప్రపంచాన్ని గురించీ, వస్తున్న - రావలసిన మార్పులను గురించీ వివరిస్తూంది శుభ్రంగా ఉండడాన్ని గురించి బోధిస్తూంది ధర్మయ్యకు ఇదంతా ఆనందంగా ఉంది చేతులెత్తి పాటలు పాడుతున్నాడు.
కూర్చుని తింటే గుట్టలు కరిగిపోతాయి కూలి సంపాదిద్దామని వెంకడూ, పెంటయ్య పొరుగూళ్ళకు బయల్దేరారు భూస్వాములు ఎవరూ పనికి రానివ్వం అన్నారు అంతటితో ఆగిపోలేదు పంటలు కోతకు వచ్చాయి గింజ రాలిపోయేట్లుంది శివయ్య పొరుగూళ్ళ నుంచి కూలీలను పిలిపించాడు వెంకడూ, పెంటయయా పొరుగూళ్ళకు వెళ్ళారు కూలీలకు తమ బాధలు వ్యక్తపరిచారు జరిగిన కధంతా చెప్పారు తమ ఊరికి కూలికి రావద్దని బ్రతిమిలాడారు శివయ్య ప్రయత్నాలు ఫలించలేదు ఒక్క కూలీకూడా ఆ ఊళ్ళో అడుగు పెట్టలేదు.
పరిస్థితి విచిత్రంగా ఉంది పొలాల్లో పంట ఉంది ఇంట్లో శివయ్య ఉన్నాడు గూడెంలో కూలీలున్నారు కూలీలు, బానిసలు, కూటికి లేనివాళ్ళు-శివయ్యకు వ్యతిరేకంగా కట్టుకట్టారంటే విపరీతంగా ఉంది వింతగా ఉంది చోద్యంగా ఉంది, జనం కళ్ళప్పచెప్పి చూస్తున్నారు చుట్టుపట్ల అందరూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.
18
శివయ్య పరిస్థితి విచిత్రంగా ఉంది ఒకనాడు అతన్ని చూస్తే పిట్టలుసైతం నీరు తాగలేదు ఇప్పుడు అతన్ని చూచి పిట్టసైతం బెదరడం లేదు ఊళ్ళో అతన్ని ఎదిరించినవాడు లేడొకనాడు ఇవ్వాళ అతనికి అనుకూలుడు లేడు శాస్త్రిగారూ జగన్నాథం కూడా అతని ఇంటికి రావడం లేదు నర్సిమ్మ పశువులకు మేత వేస్తున్నాడు అంతే మేపడానికి తీసికెళ్ళడం లేదు మల్లమ్మ ఇంటిముందు కళ్ళాపి చల్లుతూంది ఇంత ఉడకేసి పెడ్తూంది వాళ్ళిద్దరూ లేకుంటే శివయ్య పని మరీ కడుహీనం అయిపోయేది.
శివయ్యకు ఏమీ తోచటం లేదు చూస్తూ చూస్తూ తన దొరతనం కూలిపోయింది పెత్తనం రాలిపోయింది అధికారం అంతరించింది అస్తమించింది అతని మాట చెల్లడం లేదు అతని పనులు జరగడం లేదు అందుకు కారణం అతని దౌర్జన్యం, అతడు చేసిన అక్రమాలు - అన్యాయాలు, సాగించిన హింస ఆ విషయం అతడు గుర్తించలేదు అధికారానికి వివేకం ఉండదు విచక్షణ ఉండదు విజ్ఞానం ఉన్నా పని చేయదు శివయ్య వాస్తవం గుర్తించలేదు సాధించాలనుకున్నాడు జనాన్ని అణగదొక్కాలనుకున్నాడు ఊడిపోయిన తన పెత్తనం మళ్ళీ రాబట్టుకోవాలనుకున్నాడు స్థిరపరచుకోవాలనుకున్నాడు.
శివయ్య పట్నం చేరుకున్నాడు అక్కడా అతనికి చుక్కెదురు అయింది పంట పొలంలో రాలి పోతుందనీ, అది దేశానికి నష్టం అనీ, తనకు సాయం చేసి పంటను రక్షించి, తద్వారా దేశాన్ని రక్షించాలనీ అధికారులకూ, అధినేతలకూ విన్నవించాడు శివయ్య బానిస విధానం రద్దయిందనీ, వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు నిర్ణయించామనీ జవాబు వచ్చింది వాస్తవంగా తాము కల్పించుకుని బానిసల విముక్తి చేయవలసిందిగాని శివయ్యకు ఉన్న పలుకుబడిని చూచి మిన్నకున్నామన్నారు తాము జోక్యం కల్పించుకోకపోవడమే శివయ్యకు మేలు చేయడం అన్నారు.
"శాసనాలు మేమేనయ్యా చేసింది ఎందుకో ఒకందుకు చేశాం ఇప్పుడు కాదన్నామనుకో, మామీదా దుమ్ము పోసేవాళ్ళున్నారు ఏదో సర్దుకుపోవాలి తెగే దాకా లాగకు" - ఒక అధినేత, శివయ్యకు మిత్రుడు సలహా ఇచ్చాడు.
శివయ్యకు అంతా అయోమయంగా ఉంది గంపెడాశతో పట్నం వచ్చాడు నీళ్ళు కారిపోతున్నాడు "సారాయి సుంకం కట్టలేదు జప్తుదాకా రానిచ్చుకోకు" అని ఒక ఎక్సైజు అధికారి సలహా ఇచ్చాడు.
నోట్లో కరక్కాయ పడింది శివయ్యకు జనం సారాయి తాగడం బంద్ చేశారు తనకు డబ్బు రావడం లేదు పళ్ళూడకొట్టి వసూలు చేస్తామంటున్నారు అధికారులు.
మరో పిడుగు నెత్తిన పడింది శివయ్యకు.
"భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు ముందు భూమి దక్కించుకో తరవాత మిగతావి చూసుకోవచ్చు మనకు బలం భూమి అది పోతే మనం పోతాం సుభద్రమ్మ కు విడాకులివ్వు ఆమె కోపాలు దక్కుతుంది పాపం, పిల్లలు లేరాయె" అనే సలహా ఇచ్చాడొక భూస్వామి.
