Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 29


    'నిజమే. కాని, అనంతంగా కనబడే యీ సృష్టిలో ఒక క్రమ విధానాన్నీ, వికాసాన్నీ, పరిణామ ధర్మాన్నీ దర్శించి చెప్పగలగడం కూడా సామాన్య విషయం కాదు. పురాణాల్లో చెప్పబడ్డ స్వర్గ విధానాన్ని విచారణ చేసి, అంతరార్థం గ్రహించకుండా గుడ్డిగా ఆ ముసలమ్మ కథలనే నమ్మకం కన్న, ఆ కథల్నీ కార్యకారణ సమన్వయాలతో ప్రమాణీకరించడం మంచిదంటావా, ఆనవా? అతీంద్రియజ్ఞానంగల మన ఋషులు చెప్పిన గంభీర సత్యాలకు, వాళ్ళు పరిశోధనా పూర్వకంగా ప్రత్యక్ష ప్రమాణాలతో వ్యాఖ్యానం చేస్తున్నారు' అనెను నారాయణరావు.
    రాజా: కావచ్చును. కాని కేవల ప్రత్యక్ష ప్రమాణం ఎంతవరకు ఉపయోగిస్తుందంటావు?
    నారా: అలాకాదు. వాళ్ళు కూడా ప్రత్యక్షం నుంచి అనుమానాన్నీ సాధిస్తున్నారు గాని ప్రత్యక్షంతో ఆగిపోవడం లేదుగదా.
    రాజా: నిజమే. ప్రకృతి విషయం ఇంద్రియ గ్రాహ్యం, బుద్ధి గ్రాహ్యమూ గనక, ఆ రహస్యం సాధిస్తారనుకో. బుద్ధి కూడా మొదటి మెట్టులోనే వుంటుంది గాని పైకి దాటిపోలేదు. బుద్ధికి గూడా గ్రాహ్యంకానీ ఆత్మానుభవైక వేద్యమైన పరతత్వం మాట ఏమంటావు?
    నారా: ప్రత్యక్షనుమానాలని కూడా గ్రహించని అంధవిశ్వాసం, శుష్క తర్కమూ కంటే వాళ్ళ బుద్ధి వ్యవసాయం ఉత్తమమంటాను. వాళ్లు నిరంతర పరిశోధన వల్ల ఆటం అనే మూలపదార్ధాన్ని పట్టుకొన్నారు. ఇంకా లోతుకు పోయి ఆటంకూడా ఎలక్ట్రాన్ల సంఘాతమని గ్రహించారు. అయితే నువ్వనేది, ఈ ఎలక్ట్రాన్లు కూడా అనిత్యపదార్థాలే కాని నిత్యాలు కావుగదా. ఈ అనిత్యాలను పట్టుకొని ఎన్నాళ్ళు ప్రాకులాడినా నిత్యమైన సత్యపదార్థాన్ని చేరలేదంటావు. సరే; బుద్ధిమార్గాన పోగలిగినంతదూరం పోయిన తర్వాత అక్కడ దారిదొరక్కపోతే ఇదికాదురా అని వాళ్ళూ మనదారికే వస్తారు. పరమాత్మ సాధనలో వాళ్లు ప్రతిదినమూ అనుభవ సిద్ధం చేసుకొంటున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా ఇది బుద్ధి గ్రాహ్యం కాదురా అని తెలుసుకొని, దూరదూరాన అఖండజ్యోతిని దర్శిస్తున్నారు. అప్పుడే ఎయిన్ స్టీన్, ఎడింగ్టను వంటి సాధకులు బయలుదేరారు. పూర్వం మనవాళ్లెప్పుడో ఆ నిత్యపదార్థాన్ని యోగసాధనల చేత చేరారు. ఇప్పుడా మార్గాలన్నీ చీకటితో నిండి దుర్బేద్యాలుగా వున్నాయి. పాశ్చాత్య సాధకులు తిరిగి విజ్ఞాన దీపం వెలిగించి ఆదారి కోసం వెదుకుతున్నారు. వాళ్ళు సంపాదించిన విజ్ఞాన మార్గంలో దానికి రాచబాట వేస్తున్నారు. అంతేకాని మావాళ్ళకు ఇవన్నీ పూర్వమే తెలుసునంటూ మనం చంకలు కొట్టుకుంటూ కూర్చుంటే మనం ఇక్కడేవుంటాం. వాళ్లు పురుషకారపరులు, మనం పండితమ్మన్యత్వం చేత తమస్సులో పడివున్నాము.'
    ఇట్టి చర్చలు తరచు జరుగుచు, రాజారావు నారాయణరావుల మైత్రికి దోహదము సల్పుచుండెడివి.
    రాజారావు ప్రపంచములో దిరుగనేర్చినవాడుకాడు. మిత్రులతో గలసిమెలసి తిరుగక వేరుగా నుండును. సహాధ్యాయినులగు యువతులను మోమెత్తి చూడడు. జుట్టు కట్టు మున్నగు వేష భాషలలో నతడు శుద్ధ శ్రోత్రియుడు. వేషధారులగు తోడి నాగరిక విద్యార్ధులతని గాంచి పల్లెటూరి సరుకనియు, ఛాందసుడనియు లోలోన నవ్వుకొనుచున్నను, సహాధ్యాయినులతని వింతమృగమువలె జూచుచున్నను, రాజారావా పెదవి విరుపులను, అవహేళనములను సరకుగొనక సంచరించెడివాడు.
    అతనితో గాఢ పరిచయమున్న కతిపయమిత్రులు మాత్ర మతని సరళహృదయము, వినయశీలము, మధుర స్వభావము, గార్యదీక్షయు నెఱింగి యతనినెంతయు ప్రీతిమై మన్నించుచుందురు.
    
                           నౌకావిహారము

    నారాయణరావత్తవారింట మనుగుడుపులు గడుచు మూడవరోజున నతని యుత్తరముల ప్రకారము రాజారావు, పరమేశ్వరమూర్తి, లక్ష్మీపతి వచ్చినారు. జమిందారుగారు, నాడు తాను రైలులో చూచిన మిత్రులందరినీ యల్లునితోబాటు మనుగుడుపులన్నినాళ్లు తనయింట విందులకు రండని ఆదరపూర్వకముగ నాహ్వానించెను. ఆ విధమున నల్లునిచేగూడ వారికి వ్రాయించెను.
    ఆ రోజంతయు రాజేశ్వరరావుగూడ వారితో గడిపెను. చిత్రలేఖన విద్య పూర్తిగావించి నిరుద్యోగియై కాలముగడపు పరమేశ్వరమూర్తి తనకు గురువగు అవనీంద్రుడు పంపిన యుత్తరము స్నేహితులకు జూపించెను. 'పొట్టకై ఎవరికో మమ్ముకొని కళారాధన మొనర్పనెంచిన వారికి కళాసరస్వతి సాక్షాత్కరింపదు. కళాధిదేవతనే నమ్ముకొన్నచో పొట్టగడవకపోదు. నీ కష్టమంతయు కళకే ధారబోసిననాడే నీవు కళాప్రతిష్టలతో పేరుగాంతువు. ఉద్యోగమూ లేకపోయెనని చింతింపకుము. నీవు అదృష్టవంతుడవు. కావుననే యీ విధముగా నీకు గళారాధనకు గావసినంత సావకాశము లభించినది. కళాస్రష్టవగుట కిదియే సమయము. కళారాధకుడవై లోకారాధ్యత గడించుకొనుము.
    'నీకు సహాయ మొనరించు పట్ల నేనేమాత్రము శక్తివంచన చేయనని యెరుగుదువు, ఒక్కసారి దేశసంచారము చేసి ప్రకృతిలోని బాహ్యాభ్యంతర సౌందర్యముల దిలకించిరమ్ము. ప్రకృతి కంటే మంచి గురువు నీకెచ్చటను లభింపదు. విశ్వస్రష్ట కళా నైపుణితో మానవ కళావిలాసము పోల్చి చూచుకొనుము. అంతియే కాని విషాదయోగము పాల్పడకుము. ధీరుడవు కమ్ము. నీవు నా దగ్గర దిగవిడిచి వెళ్ళిన చిత్రములు రెంటిని నా స్నేహితులు చూచి సంతోషించి, కొనిపోయినారు. వారు సొమ్మిచ్చిన వెంటనే నీకు పంపుదును.'
    ఈ యుత్తరము నారాయణరావు చూచి యాలోచనా నిమగ్నుడయ్యెను. ఆంధ్రదేశమునందే లలితకళయు వృద్ధియగు నుపపత్తులు కానరావు. ఏనాడు చక్రవర్తులు, మహారాజులు కాలగతులై మాయమైరో యానాటితో నాంధ్రదేశ సౌభాగ్యము మన్నయినది యని యతడనుకొనెను.
    రాజే: ఒరే పరం! ఏదో స్నేహితుడవు. వేస్తున్నావు. నువ్వు చెప్పిన ముక్కల్లా సరేనని ఊరుకున్నాము. నాకెప్పుడు తిన్నగా అర్థం అవలేదు. ఏమిట్రా మీ బొమ్మల విషయం? ఆ వంకరటింకర మనుష్యులేమిటి, ఆ విపరీతపు రంగులేమిటి? ఏమిటీ బెంగాలు సాంప్రదాయం?
    పరం: అయితే చిత్రలేఖన ఎలా ఉండాలంటావు?
    రాజే: ప్రకృతిననుసరించి ఉండనక్కరలేదట్రా?
    నారా: అంటే నీ ఉద్దేశం ఏదో విపులంగా చెప్పరా?
    రాజే: రవివర్మ బొమ్మలు తీసుకో, వాటిల్లో మనుష్యులు మన మనుష్యుల్లా ఉన్నారు.
    లక్ష్మీపతి: కళ సృష్టే కాని అనుకరణం కాదు, అని కాదూ మీ యిద్దరూ అనేది నారాయణా?
    నారా: అవును బావా. రవివర్మ మహావిష్ణువుకు శివుడికి నాలుగు చేతులు వున్నట్లు చిత్రించాడుగదా, అలా ప్రకృతిలో ఉన్నాయా? లేవు. మరి ఎందుకు వేశాడు? పోనీ పాశ్చాత్య చిత్రలేఖకుణ్ణి తీసుకో. రాఫెలు రెక్కలతో ఎగిరివచ్చే దేవమూర్తుల్ని చిత్రించాడు. మనుష్యులకు ఎక్కడైనా రెక్కలుంటాయా?
    పరం: రవివర్మ వేసిన కృష్ణుడు, చెట్లు, రాళ్లు, యమునానది నిజంగా సృష్టికి అనుకరణాలు కావు.
    రాజే: ఆయన ఊహ చేశాడు.
    లక్ష్మీ: ఓరి వెర్రివాడా! అదేరా సృష్టి!
    రాజే: మరికొందరు చిత్రకారులు దృశ్యచిత్రాలంటూ, ఏ పాపికొండలో, గోదావరో, కృష్ణానదో చూచి అదేరకంగా వేస్తారుగదా అని సృష్టా, అనుకరణమా?
    పరం: అవి ఏవీ కావురా.
    నారా: ఎందుకంటే, ఒకడు గోదావరి మధ్యకు వెళ్ళి చూస్తే ఎటు చూచినా నీరే కనబడుతుంది. అందుకని ఆ నీరే పటం నిండా చిత్రిస్తాడు. అది గోదావరవుతుందా? అలాగే ఒక పర్వత పాదాన ఎదురుగా నిలుచుంది తన కళ్లయెదుటనున్న ఆ రాతిగోడనే చిత్రిస్తే పర్వతమవుతుందా? కాదు. కాబట్టి దృశ్యచిత్రాల్లో కూడా దేశ కాల పాత్రల్ని వర్ణించాలి.
    రాజే: సరే. బొమ్మ వేయాలంటే ఏం చేస్తాడురా చిత్రకారుడు?
    నారా: ఏ చిత్రంలోనైనా ప్రధానంగా బావపూర్ణత ఉండాలి. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS