Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 29

జేమ్స్ యూనివర్సల్ బ్యాంక్ కి చీఫ్. ఒకప్పుడు వరల్డ్ బ్యాంక్ వున్న స్థానంలో ఇప్పుడు యూనివర్సల్ బ్యాంకు వున్న సంగతి అన్వేషికి తెలుసు. యూనివర్సల్ బ్యాంక్ అండదండలు లేకపోతే ముఖ్యంగా ఆ బ్యాంకు ఆర్ధిక సహకారం కనక లేకపోతే ఈ ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలు క్షణంలో పతనమైపోతాయి!
"మిస్టర్ జేమ్స్! హౌ నైస్! చెప్పండి" అన్నాడు అన్వేషి ఎగ్జయిటెడ్ గా.
"మిమ్మల్ని యూనివర్సల్ బ్యాంక్ కి గౌరవ సలహాదారుడిగా నియమిస్తున్నాము" అన్నాడు జేమ్స్ వరం ఇస్తున్న దేవుడిలాగా.
"ఏమిటి? నేను..." అని మాటని సగంలో ఆపేశాడు అన్వేషి. సంభ్రమంతో అతని గొంతు పూడుకుపోయినట్టు అయింది.
"అవును మిస్టర్ అన్వేషి, మీరు యూనివర్శల్ బ్యాంక్ కి గౌరవ సలహాదారు! రేపే పదవీ స్వీకారం చెయ్యాలి. అనుకోకుండా నిర్ణయం జరిగిపోయింది. విమానాశ్రయంలో మీ కోసం ఒక చార్టర్ ఫ్లయిట్ రెడీగా వుంటుంది. దయచేసి వెంటనే రాగలరా?"
"ప్రస్తుతం నేనొక ప్రయోగం మధ్యలో..." అని తమాయించుకుని "ఆల్ రైట్ వెంటనే బయలుదేరి వస్తున్నాను" అన్నాడు అన్వేషి.
ప్రయోగం ఇవాళ కాకపోతే రేపు చెయ్యవచ్చు.
కానీ యూనివర్శల్ బ్యాంక్ అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు రాదుకదా!
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే -
యూనివర్శల్ బ్యాంక్ కి గౌరవ సలహాదారుడిగా వుంటే తను ప్రభుత్వాలనే శాసించగలడు. అనేక రకాలైన పరిశోధనలని నిరాటంకంగా చెయ్యగలడు.
పవర్!
పవర్ వచ్చి ఒళ్ళో వాలుతానంటే తను వద్దనేటంత మూర్ఖుడు కాదు.
"థాంక్యూ మిస్టర్ జేమ్స్! థాంక్యూ ఎగెయిన్" అన్నాడు అన్వేషి.
"యూ ఆర్ వెల్ కమ్ ప్రొఫెసర్ అన్వేషి"
రిసీవర్ పెట్టేసి ఉత్సాహంగా చేతులు రుద్దుకున్నాడు అన్వేషి. ఆ తర్వాత చకచక నడుస్తూ టేబుల్ మీదనున్న మినియేచర్ బంగళా దగ్గరకెళ్ళాడు.  
ఆలోగా -
ఆ యువకుడి భుజం మీద వున్న దోమ మెరుపువేగంతో ఎగిరి మళ్ళీ ఆ అమ్మాయి వీపు మీద వాలి కుట్టడానికి సన్నద్దమయింది.
చటుక్కున మినియేచర్ బంగళా తలుపు తెరుచుకుంది. ప్రొఫెసర్ అన్వేషి చెయ్యి లోపలికి వచ్చింది.
తక్షణం పెద్ద రొదతో ఆ తలుపులోంచి అతి వేగంగా బయటకు వెళ్ళిపోయింది ఆ దోమ.
ఒక్కసారి తేలిగ్గా నిట్టూర్చారు ఆ అమ్మాయి, అబ్బాయి.
వాళ్ళని లాఘవంగా తన చేతిలోకి తీసుకుని మినియేచర్ బంగళా బయటకి తెచ్చాడు అన్వేషి. ఇద్దరూ అతని అరచేతిలో నిలబడి వున్నారు. అరచేతిని తన కళ్ళకి దగ్గరగా తీసుకొచ్చి వాళ్ళని పరీక్షగా చూసాడు అన్వేషి.
తమని ఆ దుస్థితికి తీసుకొచ్చిన ఆ ప్రొఫెసర్ అంటే ఆ అమ్మాయికీ, అబ్బాయికీ కూడా భరించలేనంత కోపం వచ్చేస్తోంది.
"ఏమిటిదంతా? ఎందుకు మమ్మల్ని ఇలా చేసేశావ్?" అంది ఆ అమ్మాయి ఆగ్రహంతో.
ఇంతలోనే ఆ అబ్బాయి ఎగిరి బలంగా కాలితో అన్వేషి ముక్కు మీద తన్నాడు.
ఏదో మిడత తనని తాకినట్టు యధాలాపంగా చేత్తో తుడుచుకుని నవ్వుతూ అన్నాడు అన్వేషి.
"పాపం మీకు అంతా వివరంగా చెప్పెయ్యాలని నాకు వుందిగానీ నో టైం! నో టైం! అంటూ వాళ్ళని డీప్ ఫ్రీజర్ దగ్గరకి తీసుకెళ్ళాడు.
"ఏం భయపడకండి. ఇది డీప్ ఫ్రీజర్. క్రయోజెనిక్స్ సిద్దాంతం ప్రకారం పనిచేస్తుంది. క్రయోజెనిక్స్ పద్ధతి ద్వారా శవాలని ఎంత కాలమైనా చెడిపోకుండా వుంచవచ్చును. నేను ఇంకో అడుగు ముందుకు వెళ్ళి బ్రతికి వున్నవాళ్ళని కూడా జీవచ్చవాలుగా ఎంతకాలమైనా ఫ్రీజ్ చేసి వుంచే పద్ధతి కనుక్కున్నాను" అన్నాడు.
"అంటే?" అన్నారు వాళ్ళిద్దరూ ఒకేసారిగా.
"అంటే ఏం లేదు. మళ్ళీ మీతో నాకు అవసరం పడేదాకా మీరీ ఫ్రీజర్ లో బ్రతికివున్న శవాలుగా నీలుక్కుపోయి వుంటారు." అని వాళ్ళని అనెస్తీషియా ఛాంబర్ లోకి నెట్టాడు అన్వేషి. వాళ్లకి స్పృహ తప్పిన తరువాత వాళ్ళని డీప్ ఫ్రీజర్ తాలూకు ఒక సొరుగులో వుంచి ఆ తరువాత మార్కర్ పెన్ను తీసుకుని ఆ సొరుగుపైన 'టామ్ థంబ్ - అనామిక" అని పేర్లు రాసాడు తన గుర్తు కోసం.  
టామ్ థంబ్ అంటే ప్రపంచంలో ఇప్పటిదాకా పుట్టిన అతి పొట్టి మనుషులలో ఒకడు. అతని పేరు ఆ అబ్బాయికి పెట్టాడు అన్వేషి.
అనామిక అంటే ఐదు వేళ్ళలో ఒక వేలు పేరు. ఆ పేరు ఆ అమ్మాయికి పెట్టాడు.
అతను వాళ్ళిద్దరికీ అలా పేర్లు పెట్టి వాళ్ళని డీప్ ఫ్రీజర్ లోకి తోసెయ్యడంతో వాళ్ళ ఐడెంటిటీ ఇంక మిగతా ప్రపంచానికి తెలిసే అవకాశం లేకుండా పోయింది.

                            *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS