"నా గురించి నేనలా అనుకోలేదండీ. మీతోనే కలకాలం ఉండిపోవాలనుకున్నాను."
"నీ ఆలోచన తప్పు వాసంతీ. నువ్వు జోగినివై ఉండి అలా ఆలోచించకూడదు."
"నేను మొదట మనిషినండీ. తరువాత జోగినిగా మార్చబడ్డాను."
"అందులో ఆశ్చర్యమేమీలేదు. మారాక జోగిని ఆచారం ప్రకారం గడపాల్సిందే."
"కాని మీరు.... ...."
"కొన్నాళ్ళు ఉంచుకున్నాను. కొన్నాళ్ళు ఉంచుకొని వదిలేస్తూ ఉండటం ఇక్కడ అందరికీ ఉన్న అలవాటే."
"కాని నేనట్లా అనుకోలేదండీ" వాసంతి ఏడుస్తోంది. పరంజ్యోతి ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఊరుకున్నాడు.
"ఏమండీ! మీరిలా యెందుకు నాకు దూరమవుతున్నారో చెప్పరూ! నేనేమన్నా తప్పు చేశానా?"
"ఆ మాట నేననలేదు."
"మరి?"
"వాసంతీ! నువ్విలా ఎక్కువసేపు ఉండడం బావుండదు. నా కోసం రకరకాల పెద్ద మనుషులు వస్తూ వుంటారు. నేను నీ దగ్గరకు రావచ్చు. కాని నువ్వు నా దగ్గరకు రాకూడదు."
"కాని మీరు వదిలేస్తే ఆ జీవితంలోకి వెళ్ళలేక పోతున్నానండీ"
"నువ్వు జోగినివి. దేవుని మనిషివి. నిత్య సుమంగళివి. దేవుని ఇష్టప్రకారం జీవించడం నీ విద్యుక్త ధర్మం."
"కాని, నాకు చేతకావడం లేదండీ" అని వాసంతి మళ్ళీ ఏడ్చింది.
"వాసంతీ! నువ్విక్కడ గోల చెయ్యకూడదు. వెళ్ళిపో."
"నేను గోల చెయ్యనండీ అసలా ఉద్దేశంతో రాలేదు. నా గోడు వినిపించుకుందామన్న ఉద్దేశంతో వచ్చాను."
"విన్నానుగా యిహ వెళ్ళు"
"అంతే నంటారా?"
పరంజ్యోతి ఏమీ మాట్లాడకుండా రాయిలా నిలబడ్డాడు.
చేసేదిలేక వాసంతి అక్కడినుంచి కదిలి, అప్పుడు ఆవరిస్తోన్న చీకటిలో నడుస్తూ వెళ్ళిపోయింది.
"ఇదేమన్నా కట్టుకున్న పెళ్ళామా? ఎల్లకాలం గుండెలమీద కుంపటిలా ఉంచుకోవడానికి? అసలు పెళ్లాంతోనే చస్తోంటే..."
ఓ అరగంట గడిచాక పరంజ్యోతి తన గదిలో కూచొని పెగ్గుమీద పెగ్గు సేవిస్తున్నాడు.
"అక్కా!" అని పిలిచింది ఉదయమ్మ మెల్లగా ఇంట్లో కొచ్చి. చిన్నగా తారకేశ్వరి బైటికొచ్చింది.
"బావగారున్నారా?"
"ఆయన గదిలో ఉన్నారులే రా, కూచో."
"అది ఇందాకొచ్చినట్లుంది."
"వాసంతా! అవును. ఈ మధ్య ఆయన వెళ్ళడం లేదుగా అందుకని వెతుక్కుంటూ వచ్చింది."
"ఏమిటట దాని గొడవ?"
"జీవితాంతం దానితోనే ఉండాలిట. అది కూడా ఇంకొకడితో పోకుండా ఈయనతోనే ఉంటుందిట."
ఇద్దరూ పకపక నవ్వుకున్నారు.
జోగినై వుండి దానికిదేం పాడుబుద్ధి? అది మనలా మనిషితో తాళి కట్టించుకొన్నదనుకుందా? ముండ గుసగుసలాడుతూ బాగానే ఉందమ్మో. అయినా ఎంచక్కా పది మందితో పోక...ఈ వెధవ్వేషాలేమిటి?
"అదే నేనూ చెప్పేది. పైగా ఈయన్ని బాధ పెడుతుందేమిటి?"
"బావగారికేమిటక్కా మొగ మహారాజు. ఒక్కదానితోనే ఉండాల్సిన ఖర్మేమిటి?"
"ఆయనలా ఉండటమంటే నాకు అసహ్యం. అన్నట్లు మీ ఆయన అలాగే ఉన్నాడా? ఇల్లో నారాయణమ్మా! అని ఏమయినా మార్పు వచ్చిందా?"
"ఏం మార్పు నా బొంద? నన్ను తప్ప యింకెవర్నీ కన్నెత్తి చూడడు. అదేం మనిషో ఏమిటో, చక్కగా బావగార్ని చూస్తే ముచ్చటేస్తుంది. మొగాడంటే అలా ఉండాలి!"
ఉదయమ్మ తన భర్త మంచితనాన్ని తలచి దిగులు పడుతోంది.
