టూకీగా రూపొందించుకున్న ఈ కార్యక్రమంలో తొలిఅంశం ఇల్లు వెతుకుటగనక అందుకు సిద్ధమయ్యేడు కృష్ణమూర్తి.
బాగా చల్లబడ్డ తర్వాత హోటల్ విడిచి రోడ్డుమీది కొచ్చేడు.
బందర్లో మెయిన్ రోడ్లంటూ పదో పదహారో లేవు. ఒక్కటంటే ఒక్కటే రోడ్డుంది. అది ఆరేడు మైళ్ళు పొడుగుంటుంది.
సాయంత్రం పూట కాలక్షేపం కోసం వెతుక్కునే జనాభా ఆ రోడ్డెక్కితేచాలు ప్రపంచం చుట్టేసినంత అనుభూతి కలుగుతుంది.
కృష్ణమూర్తి మెయిన్ రోడ్డు విడిచి ఒక సందులో నడుస్తున్నాడు. ముందుగా ఇంగ్లీష్ పాలెం ఎక్కడుందో కనుక్కోవాలి?
ఒక ఇంటిముందు గొడవేదో జరుగుతోంది.
ఇంటి ఓనరుకాబోలు అరుస్తున్నాడు-
"నా ఇంట్లో అద్దెకున్న వాళ్ళని లాక్కుపోవడానికి నీకెన్ని గుండెల్రా? ఏదీ తీసుకెళ్ళు చూస్తాను? తోలు వల్చేస్తాను, ఏమనుకుంటున్నావో?"
"పొరపాటు జరిగిపోయిందంటున్నానుగా! ఎందుకట్లా అరుస్తారు." అంటున్నాడు శాస్త్రి.
అక్కడ శాస్త్రిని చూడగానే కృష్ణమూర్తి షాక్ తిన్నాడు. ఈ అద్దెల పిచ్చివాడు ఇక్కడి కెందుకు వచ్చినట్టు? ఏం పొరపాటు చేసినట్టు?
ఇంటి ఓనరు శాస్త్రి మీదికి వస్తూ యింకా రంకెలు వేస్తున్నాడు--
"అరవడం కాదురా! నిన్నసలు కరవాలి! కొరుకేసి మింగాలి అమ్మో! అమ్మో నా ఇంటిలో దిగినవాడు ఆర్నెల్లలో దివాళా తీస్తాడా? ఏడాదిలోగా టపాకడ్తాడా? మళ్ళా అను ఆ మాట?"
ఆ ఇంటిలో అద్దెకున్న ఆసామి కాబోలు సర్ది చెబ్తున్నాడు-
పోనిద్దురూ! పాడుగోల! కట్టుకథలు చెబితే ఖంగారుపడి మీ యిల్లు ఖాళీచేసి అతను చూపించే ఇంటిలో చేరిపోతాననుకున్నాడు అమాయకుడు!"
ఇంటి ఓనరు రెచ్చిపోయి అంటున్నాడు-
"వీడు అమాయకుడు కాదండీ బాబు! కొంపల్తీసే రకం. తెలిసిన వారు గనక వాడి ట్రిక్కులన్నీ తోసిపారేసేరు. అదే కొత్తవాళ్ళయితేనా ఇంటికి ఎంత అప్రతిష్ట? ఇంకా చూస్తూ నిలబడ్డావేరా గాడిద! పో... ఇక్కడ్నించి!"
శాస్త్రి కళ్ళనీళ్ళు పెట్టుకుని కదిలేడు.
కృష్ణమూర్తి శాస్త్రిమీద జాలి కలిగింది. పిలిచి ఓదార్చాలను కున్నాడు. కానీ- లేనిపోని తద్దినం నాకెందుకని మవునం వహించేడు!
* * *
ఆ సాయంత్రం సరిగ్గా అయిదు గంటల ప్రాంతంలో కృష్ణమూర్తి లక్ష్మీపతి ఇల్లు కనుక్కోగలిగాడు.
ఇల్లు కనిపించగానే పద్మని చూడాలనుకున్నాడు. అంచేత మెల్లిగా ఆ యింటి ఆవరణలోకి అడుగుపెట్టాడు.
పూల మొక్కలకు నీళ్ళుపోస్తున్న వ్యక్తిని పలకరించే ఉద్దేశంతో చిన్న దగ్గు దగ్గేడు.
నీళ్ళుపోసే వ్యక్తి ఆ శబ్దానికి తలెత్తి చూసేడు.
ఆ వ్యక్తి శాస్త్రి!
అద్దెల పిచ్చివాడు ఇక్కడ కూడా కనిపించేసరికి కృష్ణమూర్తికి మతిపోయినంత పనయింది.
పారిపోదామనుకున్నాడు. కానీ అంతలోనే శాస్త్రి ఎంతో మర్యాదగా పలకరించేడు-
"ఎవరు కావాలండి!"
బహుశా శాస్త్రి తనని గుర్తుపట్టి వుండడు. ఉంటే మళ్ళీ అద్దె భాగోతం తిరగేసి ఉండేవాడు.
కృష్ణమూర్తి సంబాళించుకుని అడిగేడు.
"లక్ష్మీపతిగారిల్లిదేకదూ?"
శాస్త్రి అవునన్నట్టు తల ఊపుతూనే నెత్తిమీద చెయ్యి పెట్టుకుని ఆలోచనా ముద్రొకటి అభినయించేడు.
ఆ భంగిమ చూడగానే కృష్ణమూర్తికి భయంవేసింది. తాను గుర్తుకు వస్తే మళ్ళా అద్దెగోల వినిపిస్తాడేమోనన్న ఆందోళనతో అడగవలసిందేదో అడిగేసేడు-
"వారు ఇంట్లో వున్నారా?"
శాస్త్రి ఆలోచిస్తూనే సమాధానం చెప్పేడు-
"లేరు. విజయవాడ వెళ్ళేరు."
"ఎప్పుడొస్తారు?"
"తెలీదు. ఎవరో గెస్టుని రిసీవ్ చేసుకోడానికి వెళ్ళేరు" అనేసి కృష్ణమూర్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు.
అతని వరసకి భయపడ్డ కృష్ణమూర్తి అక్కడ్నించి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వెనక్కి తిరిగేడు.
"ఆగండి!" అన్నాడు శాస్త్రి.
కృష్ణమూర్తి ఆగిపోయేడు.
"మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు!" అన్నాడు శాస్త్రి.
"చూసి ఉండొచ్చు!" అన్నాడు కృష్ణమూర్తి బెంగగా.
"అమ్మమ్మ! తమరా విధంగా తీసిపారేస్తే రాత్రి నిద్రపట్టక చస్తాను."
"అదేం పాపం?"
"అది నా జాతకం. ఏదయినా గుర్తుకు రాకపోతే నిద్రపట్టదు. దయచేసి మీరైనా గుర్తుతెచ్చుకుని చెప్పండి, నన్నెక్కడైనా చూసేరా?"
ఈ జిడ్డు సంభాషణ కృష్ణమూర్తికి చిరాకు కలిగించింది.అంచేత నిజం చెప్పినా కసిగానే చెప్పాడు.
"చూసేను?"
"ఎక్కడ?"
"బస్టాండులో, అద్దెకో పోర్షనుందని నా ప్రాణాలు తీశావు."
ఇప్పుడు శాస్త్రి మనసు కుదుటపడింది. అమ్మయ్య అనుకున్నాడు. ఆ తర్వాత యధాప్రకారం తన డ్యూటీలో పడ్డాడు.
"చూశారా! అప్పుడు అద్దెకు దిగమంటే దిగనన్నారు. ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చారు. వదిలేయండి రిక్షా పిలవండి, ఇల్లు చూపెడతాను."
కృష్ణమూర్తి కోపంగానే అనేశాడు...
"చూడు మిస్టర్! కనిపించిన ప్రతివాడూ అద్దెవేటలో ఉంటాడనుకోవడం పొరపాటు! ఒకవేళ నాకు నిజంగానే అద్దెకో పోర్షను కావాల్సివచ్చినా నువ్వు చూపించే యింట్లో చస్తే దిగను. దిగనుగాక దిగను మైండిట్!"
... అని గట్టిగా వార్నింగిచ్చేసి వెళ్ళిపోతుండగా- ఆ గొడవకి పద్మ ఇంట్లోంచి బయటకు వచ్చింది "ఎవరదీ" అంటూ.
పద్మని చూడగానే కృష్ణమూర్తి కాళ్ళకి బ్రేకు పడింది.టక్కున ఆగిపోయేడు.
కృష్ణమూర్తిని చూస్తూ పద్మ ఎంతో ఆనందంగా అన్నది...
"నువ్వా! అక్కడే నిలబడ్డావేం? రా లోపలికి."
కృష్ణమూర్తి అమెవేపు నడిచాడు.
ఆమెను చేరుకోగానే పద్మ అటూ ఇటూ చూసి అతని చేతిని సడన్ గా తీసుకుని ముద్దుపెట్టింది.
ఆ చేష్టకి అతను ఉలిక్కిపడ్డాడు. షాకు తగిలినట్టు చేతిని లాక్కున్నాడు.
పద్మ అంటోంది...
"వస్తావో రావోనని బెంగపడి చచ్చాననుకో! అవునూ- మీ నాన్నగారు కూడా వచ్చారా?"
