Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 29


    వాచ్ మన్ డైరెక్షన్ లిస్తున్నాడు.

 

    "అదుగో, అక్కడ కేంటీనుందా?"

 

    "ఉంది!"

 

    "అందులో కాఫీ తాగుతున్నాడు."

 

    "ఆ మాటకొస్తే అక్కడ చాలామంది కాఫీలు తాగుతున్నారు నాయనా వారిలో ఎవరు, అది చెప్పు?" అన్నాడు శాస్త్రి ఆదుర్దాగా.

 

    "ఆ గళ్ళచొక్కాని చూడు" అన్నాడు వాచ్ మన్ సీరియస్ గా.

 

    "చూశాను" అన్నాడు శాస్త్రి ఆనందంగా.

 

    "ఆ శాల్తీ నిన్నే వచ్చాడు."

 

    "ఏ ఊర్నుంచి వచ్చాడో?"

 

    "అదేదో ఊరు చెప్పాడు. అక్కడ నీళ్ళుకూడా దొరకవట. దిక్కుమాలిన ఊరు, ఆ పేరు మరిచేపోయాను."

 

    "అది నే చూసుకుంటాన్లే తండ్రీ! ఈ ఊళ్ళో ఎక్కడుంటున్నాడో చెప్పగలవా?"

 

    వాచ్ మన్ విసుక్కుంటూ అన్నాడు...

 

    "నిన్నేగా వచ్చేడు, అంచేత ఆఫీసులోనే ఒక మూల పడి వున్నాడు."

 

    "పాపం! ఇల్లు దొరకలేదేమో?"

 

    "దొరికితే ఆఫీసులో ఎందుకుంటాడు?"

 

    "నా నాయనే. చాలా మంచి విషయాలు చెప్పావు. ఇంద ఉంచు" అని ఒక రూపాయిబిళ్ళ అతని చేతిలో ఉంచాడు.

 

    రూపాయి తీసుకున్న తర్వాత అడిగాడు వాచ్ మన్...

 

    "అవునూ! ఈ వివరాలన్నీ ఎందుకడిగావు?"

 

    "ఏం చెప్పమంటావు? ఆ జీవితోనే నా జీవితానికి రక్ష! అంతకంటే ఎక్కువ చెప్పలేను" అనేసి కేంటీను వేపు నడిచాడు శాస్త్రి.

 

    కేంటీనులో గళ్ళచొక్కాని పట్టుకున్నాడు.

 

    అతని కళ్ళలో కళ్ళుపెట్టి గంభీరంగా అడిగాడు...

 

    "మీరు ఇక్కడికి కొత్తగా బదిలీ అయి వచ్చారుగదూ?"

 

    ముక్కూ మొహం తెలీని మనిషెవరో అంత గంభీరంగా అడిగినందుకు గళ్ళచొక్కా వెంటనే బిక్కమొహం పెట్టేసింది. నోట మాటరాక అవునన్నట్టు తలూపింది.

 

    "మీ పేరేమిటన్నారు?" శాస్త్రి అడిగాడు.

 

    "మాధవరావు" అన్నాడతను.

 

    ఆ పేరు వినగానే శాస్త్రీ కళ్ళు మూసుకుని వేళ్ళతో ఏవో గుణింతాలు పూర్తిచేసి, కళ్ళువిప్పి అన్నాడు.

 

    "అయిదు!"

 

    "అంటే?" అర్ధంగాక అడిగాడు మాధవరావు.

 

    "మీ యొక్క పేర్లో అక్షరాలు అయిదున్నాయి. 'మా' తో ప్రారంభమయి 'ధ' తో నడిచి 'వ' ని కలుపుకుని 'రావు'తో పూర్తయింది. ఓహ్! దశగల పేరు. మొత్తం అయిదక్షరాలు" అన్నాడు శాస్త్రి.

 

    మాధవరావు మొహం వికసించింది.

 

    శాస్త్రి అక్కడితో ఆగిపోలేదు.

 

    "ఇంతకు పూర్వం మీరు పనిచేసిన ఊరు ఒక దిక్కుమాలిన దరిద్రగొట్టు ప్రదేశం! నీళ్ళుకూడా దొరక్క పలు బాధలు పడ్డారు అవునా?"

 

    శాస్త్రి చేస్తున్న మాజిక్కుకి మాధవరావు పూర్తిగా పడిపోయాడు. అడక్కుండానే తన జాతకం చెబుతున్న అతని ధోరణికి ఆకర్షితుడవుతున్నాడు. అందుచేతనే అన్నాడు...

 

    "చాలా కరెక్టుగా చెప్పావు. ఆ ఊర్నుంచి ఈ ఊరికి ట్రాన్స్ ఫర్ కావడానికి అయిదేళ్ళనుంచి ప్రయత్నిస్తుంటే- ఇదిగో యిప్పటికి రాగలిగాను."

 

    "అయిదేళ్ళ ప్రయత్నమా! ఓహ్! మళ్ళా అయిదే! ఇక ఫర్లేదు. దశ తిరిగింది, ప్రమోషన్ కూడా యిచ్చి ఈ ఊళ్ళోనే ఉంచుతారు."

 

    "నిజంగానా? ముందు కాఫీ పుచ్చుకోండి చెబుతాను" అన్నాడు మాధవరావు ఎంతో ఆనందంగా.

 

    "వద్దు, కాఫీలు గీఫీలు తాగను" అని మళ్ళా కళ్ళుమూసుకుని వేళ్ళతో గుణింతాలు చేసి అన్నాడు శాస్త్రి...

 

    "చూడండి మాధవరావుగారూ! మీరు ఇంకా ఇల్లదీ చూసుకోలేదను కుంటాను."

 

    "అవునండి ఇవాళ చూద్దామనుకుంటున్నాను. ఇల్లు దొరకగానే ఫేమిలీ తెచ్చుకుంటాను."

 

    "అలాగే చేయండి. కానీ ఒకటి" అన్నాడు శాస్త్రి.

 

    "చెప్పండి" ఆత్రంగా అడిగాడు మాధవరావు.

 

    "ఇల్లంటూ తీసుకుంటే మీ ఆఫీసుకి తూర్పు దిక్కునవున్న ఇల్లే తీసుకోండి, కలిసొస్తుంది."

 

    "ఈ ఊళ్ళో నాకు దిక్కులు తెలీదండి" అన్నాడు మాధవరావు దిగులుగా.

 

    "నే చెబుతాగా! మీ ఆఫీసుకి గొడుగుపేట తూర్పుదిక్కునే వుంది."

 

    "ఉండచ్చనుకోండి, అక్కడ అద్దెకిచ్చే ఇల్లు దొరకాలిగదా?"

 

    "దొరుకుతుంది! తుందేవిటి? దొరికింది! చక్కటి పోర్షను. గదులు ఐదు! ఓహ్... మళ్ళా అయిదే! సెభాష్... ఏదీ ఒక్క ఏభై రూపాయలు అడ్వాన్సు యిప్పించండి. రిక్షా పిలిపించండి. ఇల్లు చూసి పెడతాను" అన్నాడు శాస్త్రి.

 

    ఆ మాటకి మాధవరావు చాలా సంతోషించాడు. మరోమాట చెప్పకుండా ఏభైరూపాయల నోటుతీసి శాస్త్రి చేతికిచ్చాడు.

 

    శాస్త్రి తీసుకుంటూ అన్నాడు...

 

    "ఈ ఏభైలోకూడా అయిదేవుంది. ఓహ్... చూడండిక మీరు వినేవన్నీ శుభవార్తలే!"

 

    అని శాస్త్రి అంటుండగా కేంటీన్ లోకి ఒక కుర్రగుమాస్తా పరుగెత్తుకుంటూ వచ్చేడు.

 

    "గురూగారూ! మీకో వార్త!" అన్నాడు.

 

    అతని ప్రకటనకి మాధవరావుతోపాటు శాస్త్రికూడా ఆశ్చర్యపోయేడు. శాస్త్రి తన ఆశ్చర్యాన్ని కప్పి పెట్టుకుని చిద్విలాసంగా నవ్వేస్తూ అన్నాడు-

 

    "చూసేరా! వార్త అంటున్నాడు. వార్తలోకూడా అయిదే వుంటుంది"

 

    కుర్రగుమాస్తా విసుక్కుంటూ అన్నాడు-

 

    "అయిదో పదో- ఆ లెక్కలు నాకు రావు గానీ- గురువుగారి ట్రాన్స్ ఫర్ కేన్సిలైంది. ఎక్కడ్నించి వచ్చేడో అక్కడికే వెళ్ళమని ఆర్డర్స్ వచ్చేయి!"

 

    అంతమాట వినగానే మాధవరావు నిలువుగుడ్లు వేసేడు. ఆ గుడ్లలో నీళ్ళు గిర్రున తిరిగేయి. ఆ నీళ్ళల్లో నీళ్ళు దొరకని దిక్కుమాలిన శ్రమ శాస్త్రిక్కనిపించింది.

 

    మాధవరావు దిగ్గునలేచేడు. శాస్త్రి చేతిలో వున్న ఏభై నోటు గబుక్కున లాక్కున్నాడు.

 

    శాస్త్రి బిక్క మొహం పెట్టుకుని అన్నాడు.

 

    "ఇచ్చింది లాక్కోకూడదు."

 

    మాధవరావు వెర్రెత్తిపోయి శాస్త్రి మెడమీద చెయ్యివేసి అన్నాడు.

 

    "విన్నావుగా శుభవార్త ఇంకో క్షణం నా ముందున్నావంటే చెప్పుతో కొడతాను అవుట్!"

 

    ఆ వరసకి కేంటీన్లో ఉన్న జనం ఏమిటేమిటని గుమిగూడుతున్నారు.

 

    శాస్త్రికి భూమి బద్దలవుతున్నట్టు భ్రమ కలిగింది.

    
                                        18


    కృష్ణమూర్తి తన భవిష్యత్ కార్యక్రమంపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు.

 

    మొట్టమొదట లక్ష్మీపతిగారిల్లు వెతకాలి. అవకాశం దొరికితే ఆయన్ను కలుసుకోవాలి. కలుసుకున్న తర్వాత ఆ మనిషి గుణగణాలు తెలుసుకోవాలి.

 

    ఆ అధ్యాయం పూర్తయ్యేక ఆ మనిషిని ఆకర్షించుకునే విధంగా తాను నడుచుకోవాలి. తద్వారా పద్మని పొందాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS