"చూడు అవినాష్- నిన్ను రోష్ణి ప్రేమిస్తోందని అంది. ఆ ప్రేమ ఎన్నాళ్ళు నిలుస్తుందో నాకు తెలీదు. నువ్వు రోష్ణిని ప్రేమిస్తున్నానని చెప్పావు. అది నిజమైన ప్రేమో కాదో తెలీదు. నువ్వు డబ్బు కోసం ప్రేమించొచ్చు. లేదా వ్యామోహంలో ప్రేమించొచ్చు... ఈ ప్రేమల మీద నాకు నమ్మకం లేదు..." అని దీర్ఘంగా ఆయనో నిట్టూర్పు విడిచారు.
ఆ మాటకు అంతవరకూ అవినాష్ లో ఉన్న ఆనందం చప్పున చల్లారిపోయింది. ధన్ రాజ్ ఏమి చెప్పబోతున్నాడో ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు అవినాష్.
"మిస్టర్ అవినాష్, నీ తెలివి తేటలు, నీ లోకానుభవం ఏమిటో నాకు తెలీదు... నేను చెప్పే విషయం నీకు బాధ కలిగిస్తుందని మాత్రం నాకు తెలుసు... కానీ ఒక తండ్రిగా నేనిప్పుడు చెప్తున్నాను-విను-"
"మొదటిది :
రోష్ణికి నీకు పెళ్ళి జరగదు.
రెండోది :
ఆ విషయం నీకు మాత్రమే తెలుసు.
మూడోది :
రోష్ణికి, నీకు పెళ్ళి జరగదని తెల్సినా నువ్వు ప్రేమిస్తావు.
అంటే ప్రేమిస్తున్నట్టుగా నటిస్తావు...
నాలుగోది :
అలా నటించడానికి నీకెంత డబ్బు కావాలో అడుగు." ఒక్కక్షణం ఆగాడాయన.
అవినాష్ ముఖంలోకి చూశాడు. అవినాష్ ముఖంలో ఏఏ భావాలు కదులుతున్నాయో, ఏఏ రంగులు మారుతున్నాయో, అతని నరాల్లో ఏఏ స్పందన కలుగుతోందో, ధన్ రాజ్ కి తెలీదు. ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అవినాష్.
అవినాష్ కి ఆ సమయంలో ధన్ రాజ్ మీద చాలా కోపంగా ఉంది. ఎత్తులు వేసే అవినాష్ కి, అనుభవం ద్వారా పైఎత్తులు వేయగలిగిన ధన్ రాజ్ అంటే ఒక పక్క భయం... ఇంకో పక్క అవమానం... ఇంకో పక్క దిగులు... కలిగాయి...
అతని వంటిమీద మెల్లగా చెమట పాములా పాకింది.
"చూడు... అవినాష్-" ధన్ రాజ్ గొంతు సర్దుకొని చెప్పడం ప్రారంభించారు.
"డాడీ... నేను... అవినాష్ అన్న వ్యక్తిని ప్రేమించాను... అని... రోష్ణి చెప్పినప్పుడు నేనెంత బాధపడ్డానో తెల్సా- ఎందుకు బాధపడ్డానంటావ్- అసలే పిచ్చిపిల్ల- ఇంకా లోకం పోకడ తెలీదు... తన గురించి తనకే తెలీదు- అలాంటప్పుడు- అలా ఏమీ తెలీకుండా చెప్పిన కూతుర్ని తండ్రి ఏమంటాడు- అలాగే- నేనూ అన్నాను- నువ్వెవర్ని ప్రేమిస్తే, ఆ వ్యక్తితో నీ పెళ్ళి చేస్తానని చెప్పాను- ఎందుకు చెప్పానంటావ్- నా కూతురు మనసు గాయపడకూడదు... చిన్నప్పటినుంచీ- డబ్బుల మధ్య, సుఖాల మధ్య తను కోరుకున్న వస్తువుల మధ్య పెరిగిన నా కూతురు రేపు బాధలు చూడకూడదు- కన్నీళ్ళు కార్చకూడదు-" ఆవేశంగా చెప్తూ ఒక్కక్షణం ఆగి, 'అందుకే- అవినాష్- ఏ తండ్రీ నీలాంటివాడిని కోరని కోరిక కోరుతున్నాను...
నా కూతుర్ని ప్రేమిస్తున్నట్టుగా నటించు-
నాకు కాస్త తృప్తిని ప్రసాదించు.
నిన్ను నువ్వు చంపుకో- నువ్వు నిజంగా ప్రేమించినా ఆ ప్రేమను చంపుకో...
నువ్వు నా మాటలకు వ్యతిరేకంగా, ఏ రకంగా ప్రవర్తించినా నేను నిన్ను క్షమించను- తెల్సా-" సీరియస్ మూడ్ లోంచి బయటపడి సాదాగా అయిపోయాడాయన.
అవినాష్ కి అసలు నోటమాట రావడం లేదు. అతని తల తిరిగి పోతోంది. ఎప్పుడైనా ఎక్కడైనా తనకు ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని అతనెప్పుడూ అనుకోలేదు. తనిప్పుడేం చేయాలి. రోష్ణిని ప్రేమిస్తున్నానని, రోష్ణి లేకపోతే బతకలేడని, రోష్ణి కోసం, రోష్ణి సుఖం కోసం తనెంత త్యాగమైనా చేయగలడని ధనరాజ్ తో చెప్పగలడా? లేక -
తన దారిలోకే వచ్చిన ధన్ రాజ్ చెప్పినట్టుగా రోష్ణితో ప్రేమ నటించి, తనకు కావల్సిన డబ్బు వసూలు చేసుకోవడమా? తనకు డబ్బు అవసరం...
ఆ డబ్బు కోసమే- రోష్ణిని ప్రేమించినట్టుగా నటించాడు. ఆ డబ్బు కోసమే- తనను అమితంగా ప్రేమించిన గౌతమిని హత్య చేశాడు.
ఆ డబ్బుకోసమే- తను నిరంతరం, అహోరాత్రులు శ్రమిస్తున్నాడు-
"ఏమిటాలోచిస్తున్నావ్-" కుర్చీలోంచి లేచి కిటికీ లోంచి బయటికి చూస్తూ అన్నాడాయన.
"ఏమీలేదు-" మెల్లగా అన్నాడు అవినాష్.
"డబ్బు గురించా-" వెనక్కి తిరక్కుండానే అన్నాడాయన.
అవినాష్ జవాబు చెప్పలేదు.
"రోష్ణి గురించి-" ముందు జాగ్రత్తతో అన్నాడు అవినాష్.
"నీ గురించి నువ్వు ఆలోచించు-" కఠినంగా అన్నాడు ధన్ రాజ్.
ఆ కఠినత్వం అర్ధమైంది అవినాష్ కి.
"నా కూతురి సుఖం నాకు కావాలి... అందుకు ఎవరు కష్టపడినా, నష్టపడినా నేను పట్టించుకోను- అందుకే- నిన్ను- నా గురించి ఆలోచించమంటున్నాను-" అవినాష్ ని అనునయించే పద్ధతిలో ఒకింత సౌమ్యంగానే అన్నాడు ధన్ రాజ్. కూతురిమీద అభిమానాన్ని, ప్రేమని ఆసరాగా తీసుకుని ధన్ రాజ్ ని తను నమ్మించొచ్చు. మోసం చెయొచ్చు. ధన్ రాజ్ ని సరిగ్గా తను మోసం చేయగలిగితే-?
తన లక్ష్యం నెరవేరుతుంది.
తన స్వప్నాలు నిజమౌతాయి.
తన చుట్టూ రోష్ణి కంటే అందమైన అమ్మాయిలు.
ఆ అమ్మాయిల సహాయంతో-
ఆ అమ్మాయిల 'డబ్బు' సహాయంతో-
తనో 'టాటా' అవుతాడు, తనో 'బిర్లా' అవుతాడు. తనో కోటీశ్వరుడౌతాడు.
హత్య చేసినా, ఖూనీ చేసినా, ఒక అందమైన అమ్మాయిని ప్రేమించినా అంతా ఒకటే.
ఒకచోట రక్తం చిమ్ముతుంది.
ఇంకో చోట యౌవనం చిమ్ముతుంది-
రెండూ ఒకటే.
