Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 3


    "ఏమో! ఒకనాడు ఇక్కడికి రావడానికే దానికి అనవసరమౌతే బాగుంటుందని అనిపిస్తూంది నాకు." మందస్వరాన అన్నది ఆమె. దేవదాసి అప్పుడు కట్టుకోవడానికి చీరా, జాకెట్టూ యివతల తీసిపెడుతూ.

    "అంటే?" తెల్లబోయారు ఆయన.

    "పరిస్థితి ఈ విధంగా కాకుండా మామయ్య వెడుతున్నది మరోవిధంగా అయితే, దేవతను తనకోడల్ని చేసుకోమని చెప్పమనిచెప్పి ఉందును మామయ్యతో. ఆ మాట చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు."

    "ఈ ఆలోచన ఎప్పుడు కలిగింది తమరికి?" కొంచెం విస్మయం, కొంచెం వెటకరింపూ మిళితంచేసి అన్నారు ఆయన.

    "ఏం! బాగాలేదా?"

    "నిన్న మొన్నటివరకు లంగాలు తొడుక్కొంటున్న ఈ పిల్లను పాతికేళ్ళవాడికా? చక్కగా ఉంటుంది ఈడూజోడూ సాగదీశారు.

    "రేపు శ్రావణం వస్తే మీ కూతురికి ఎన్నేళ్ళో తెలుసా? పదహారు వెళ్ళి పదిహేడు పడుతుంది. ఏం? ఇంకా బుల్లి పాపాయనుకొన్నారా?"

    "అయినా ఎనిమిదేళ్ళ తేడా అవుతుంది ఇద్దరికీ."

    "ఉఁహూఁ?" మందహాసం చేస్తూ అంది శ్రీలక్ష్మి." "మీ ఇరవై రెండో ఏటకదూ మన పెళ్ళి జరిగింది? అప్పుడు నాకెన్నేళ్ళు? తొమ్మిదేళ్ళే!"

    "ఆ కాలం సంగతివేరు. నిన్న మొన్నటి వరకూ లంగాలు వేసుకొని బొమ్మల పెళ్లిళ్ళుచేసే దేవిని భార్గవుడి పక్కన ఊహించడానికి మనసొప్పడంలేదు, శ్రీలూ!" అన్నారు. గంభీరంగా సూర్యదేవులు.

    "మొగ్గగ ఉన్నదే ఒక్క రాత్రిలో రేకులు విచ్చుకొని నిండు పర్వం ఒలక బోస్తుంది సుమకన్య. ఆడపిల్ల ఎంతలో ఎదిగిపోతుంది? దేవి యవ్వనవతి కాలేదా? పుష్పవతులయ్యాక పెళ్ళిచేస్తే కన్యాదానఫలం చిక్కదని మామయ్య పోరుతుండగానే దేవి పెద్ద మనిషి అయ్యి ఏడాది దాటిపోయింది. దాని పెళ్ళి సంగతి మీకు చీమకుట్టినట్టుగా కూడా లేదు. ఆడకూతురు పెళ్ళి చింత తల్లికున్నట్లు తండ్రికి ఎందుకుంటుందిగానీ!" నిష్ఠూరమాడింది శ్రీలక్ష్మీ"భార్గవుడు ముసలివాడా? ముతకవాడా? పాతికేళ్ళు! అంతకంటే గొప్ప యోగ్యతలున్నవాణ్ణి ఎక్కడినుండి తెస్తారు? మీరు వేలుగ్రుమ్మరించి తెద్దామన్నా అలాంటి ఉత్తముడు ఉండబోడు!"

    దేవదాసి బొట్టూ, కాటుక దిద్దుకొని, పూలచెండు తెచ్చి తల్లి చేతిలో పెట్టి "జడలో పెట్టమ్మా" అంది.

    రాకిణిపెట్టి అల్లిన జడలో పూలచెండు తురిమి, ఆ పిల్లకు తన నగల పెట్టెనుండి ఒక్కొక్కనగే తీసి అలంకరించింది శ్రీలక్ష్మి.

    ఎన్నడూ చూడనిది ఇవాళ్ళ పరిశీలనగా చూశారు కూతురివంక, సూర్యదేవులు. ఒక్కరాత్రిలో రేకులు విచ్చుకొని పరువం తొణికే వీరికన్నెలాగే పరిపూర్ణ యవ్వనంతో కన్పడిందామె. సూర్య భగవానునికి వీడ్కోలిస్తూ ప్రకృతి కన్య అరుణ రాగమూ, పసిమిదనమూ, పులుముకొంటుందే అదీ, దేవదాసి శరీరపు వన్నె. ముఖం గుండ్రని చంద్రబింబం కను ముక్కు తీరు అంతా తీర్చిదిద్దినట్లు ఉంది. తల్లి అలంకరించిన బంగారు, ముత్యాల నగలలో చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతున్న ఆమె తనూలత సోపుముక్క సౌకుమార్యంతో పోటీపడి నెగ్గగలదనిపిస్తుంది. పరిపూర్ణ అంగ సౌష్ఠవంతో, నిండు ఆరోగ్యంతో యవ్వనవతి అయిన ఆమెలో నిన్న మొన్నటివరకు లంగాలుకట్టుకొని బొమ్మల పెళ్ళిళ్ళు చేసిన దేవదాసిని ఊహించలేకపోతున్నారు. 'దేవత కొత్తగా ఉందీవేళ' అనుకొన్నారు సూర్యదేవులు. ఇప్పుడాయనకు కుమార్తెను అక్కకొడుకు భార్గవరామ్ ప్రక్కన ఊహించడానికి కష్టమనిపించలేదు. ఏళ్ళ వ్యత్యాసం చాలా ఉన్నా ఈడూ జోడూ బాగానే ఉంటుందనిపించింది.

    "దేవతక్కా! బండి కడుతున్నారే!" అని చెప్పింది సువర్ణ ప్రతిమ వచ్చి. నేనూ వెళ్ళలేకపోతున్నానే అన్నదిగులుతో.

    తల్లి తీసిపెట్టిన చీరా, జాకెట్టు తీసుకొని బట్టలు మార్చడానికి మరో గదిలోకి వెళ్ళింది దేవదాసి.

    "నీ కూతురు అందగత్తేనే!" అన్నారు సూర్యదేవులు.

    "అబ్బ పోలికలు వచ్చినందుకు ఆమాత్రం మెచ్చుకోకపోతే ఎలా?" ముసి ముసిగా నవ్విందామె.

    "ఉఁ." సగర్వంగా నవ్వి, అన్నాడు: "అది సరే. దేవిని కోడల్ని చేసుకోడానికి అక్క ఇష్టపడుతుందనడంలో సందేహం ఎంత మాత్రం అవసరం లేదు. కాని భార్గవుని సంగతే. అతడి ప్రవర్తననుబట్టి చూస్తే ఇహలోక వాసనలు అంటుతున్నాయా అనిపిస్తుంది సంసార వాంఛ, వివాహేచ్ఛ అతడికి ఏకోశానా లేవనే అనిపిస్తుంది నాకు."

    "అదేమిటి? అలా అంటున్నారు? బారెడు గడ్డంపెట్టి, కావి గుడ్డలు కట్టి కనిపించాడా సంసారేచ్ఛ లేదనడానికి?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS