మిరమిట్లు గొలిపే కాంతి.
ఢాం....అన్న పెద్ద శబ్దం.
అదిరిపడ్డారు ఇద్దరూ.
ఆ అదురుపాటుకి అతని చేతిలోని తాళాలు నీళ్ళలోకి జారిపోయాయి.
ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా అంధకారం అలుముకుంది.
కారు హెడ్ లైట్ల కాంతి తప్ప మరే వెలుగూ లేదు.
పిడుగు పడిందేమో అనుకుంది అర్చన.
కానీ....అది పిడుగుపాటు కాదు. అక్కడికి యాభై గాజాల దూరములో వున్న ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్ వర్షం వల్ల ఫైర్లు ఎర్త్ అవటంతో ఆ పేలుడు సంభవించింది.
ఫలితంగా కరెంటు పోయింది.
క్రిందికి వంగి తాళాలు పడిపోయినచోట నీటిలో వెదకసాగాడతను.
వర్షపు ప్రవాహంలో అవి ఎటుపోయామో!
చంద్రకాంత్ గారూ! కారులోకి రండి. ఇప్పుడు వెదికి ప్రయోజనము లేదు. వర్షం తగ్గాగ చూడాల్సిందే" అరిచి చెప్పిందామె.
తల తిప్పి వెనక్కి చూసి మరో రెండు నిమిషాలు నీటిలో చేయి వుంచి వెతికి వెనక్కి తిరిగి కారుని సమీపించి లోపల కూర్చున్నాడతను.
"డోరు వేసెయ్యండి" చెప్పిందామె.
డోరు క్లోజ్ చేశాడతను.
ముద్దగా తడిసిపోయిన అతని శరీరం నుండి నీళ్ళు కారి సీటంతా తడిగా ఆపుతోంది.
చలికి సన్నగా వణుకుతున్నాడతను.
"కనీసం మీ షర్టయినా పిండి తరువాత వేసుకోండి" చెప్పిందామె.
ఒకింత సంశయంగా చూసి షర్టు బటన్స్ విప్పసాగాడతను.
తల ప్రక్కకి తిప్పుకుందామె.
షర్టు విప్పేశాడతను.
"డాష్ బోర్డులో నాప్ కిన్ వుంటుంది తుడుచుకోండి" చెప్పిందామె బయటకు చూస్తూనే.
తన ముందున్న డాష్ బోర్డు డోరు తెరవాలని లాగాడు తెరుచుకోలేదు.
"ఇది ఓపెన్ అవటం లేదు" చెప్పాడు.
ఇంక అతని వైపు తల తిప్పక తప్పలేదామెకు.
అనచ్చాదితమైన అతని ఛాతీ బలంగా, విశాలంగా వుంది.
ఒకింత సంశయిస్తూనే అతని మీదుగా వంగి డాష్ బోర్డు ఎడమచేత్తో లాగింది.
డోరు తెరుచుకోలేదు.
ఆ సమయంలో....
ఆమె తల అతని ముఖానికి సమీపంలో వుంది.
ఆమె భుజం అతని ఛాతిని తగులుతోంది.
ఒళ్ళు జలదరించిందతనికి.
వర్షం....
వణికించే చలి....
చీకటి....
ఏకాంతం....
అతని నిగ్రహశక్తికి పరీక్ష పెడుతున్నాయి.
అతని వెచ్చని వూపిరి ఆమె మెడ మీద తగులుతోంది.
డాష్ బోర్డు ఓపెన్ చేయటానికి ప్రయత్నించుతున్న ఆమె శరీరంలో కూడా సన్నని వణుకు చోటు చేసుకుంది.
డాష్ బోర్డు ఓపెన్ అయింది.
అందులోని నాప్ కిన్ తీసి అతని కందించబోయింది.
ఆమె చేతిని అలాగే పట్టుకున్నాడతను.
"చంద్రకాంత్....వ....ద....లం....డి"
ఆమె మాట వణుకుతోంది.
అత్యంత సమీపంలో వున్న ఆమె పెదవులను హఠాత్తుగా చుంబించాడు అతను.
అదిరిపడిందామె.
"ఏయ్....ఏం....చే....స్తు....న్నా....వు నువ్వు?" తొలిసారిగా "నువ్వు" అని పిలిచింది వణుకుతున్న కంఠంతో.
అతని బలిష్టమైన బాహువులు ఆమెను బంధించాయి.
హోరున కురుస్తోంది వాన.
* * * *
"మీ ప్రోగ్రాం నిజాం కాలేజి గ్రౌండ్స్ లో జరుగుతుంది. వెన్యూని ఈ రోజే ఫిక్స్ చేశాము. వైజాగ్ లో వున్న మీ యూనిట్ అందర్నీ హైద్రాబాద్ రమ్మని చెప్పాము. వచ్చే ఆదివారం నాడు....అంటే ఐదో తారీఖున మీ ప్రోగ్రాం. అంటే యింకా తొమ్మిది రోజులు టైముంది. రేపు మీ యూనిట్ అంతా వచ్చాక మీరిక్కడే ప్రాక్టీస్ చేయచ్చు" గబగబా చెప్పి వూపిరి పీల్చుకున్నాడు కౌశిక్.
ఏ భావమూ లేని చూపొకటి చూసిందామె.
ఆ చూపులోని అర్ధాన్ని అర్ధం చేసుకోగలడు అతను.
ఏది ఏమైనా తను పుట్టిన వూరిలో ప్రోగ్రాం ఇవ్వాలన్న ఆమె కోరిక నెరవేరటం లేదు. అది ఆమెను ఒకింత బాధిస్తోంది.
"అనుకున్న ప్రకారం స్టేజ్ హోం మినిస్టర్ చీఫ్ గెస్ట్ గా పిలిచాను.
ఆయనతోపాటే డి.జి.పి.ని కూడా ప్రధాన అతిథులలో ఒకడిగా చేశాను. వీళ్ళిద్దరూ టెర్రరిస్ట్ ల హిట్ లిస్ట్ లో వున్నవాళ్ళే. వాళ్ళ కోసం పెద్ద ఎత్తున బందోబస్త్ ఏర్పాటవుతుంది. ఆ రకంగా మీ లైఫ్ కి కూడా సెక్యూరిటీ వుంటుంది. కాబట్టి వాళ్ళతోపాటే మీరు కూడా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి."
అలాగే అన్నట్లు తల వూపిందామె.
"మీ వరకు కావలసిన సెక్యూరిటీకి నేనే యిక ఇన్ ఛార్జిగా వుంటాను."
"ఇప్పుడూ మీరే కదా ఇన్ ఛార్జ్"
ఆమె మాటకు తేలిగ్గా నవ్వేశాడతను.
"మరో రెండు రోజుల్లో ఆ రోజు ఏర్పాటు చేయబోయే సెక్యూరిటీని గురించిన బ్లూప్రింట్ తాయారవుతుంది. అది రాగానే మీరు చూడవచ్చు."
"నేనా?"
"అవును"
"నేనెందుకు చూడటం?"
"నేను ఏర్పాటుచేసే సెక్యూరిటీ అరేంజిమెంట్సు మీకు సంతృప్తికరంగా వున్నాయో లేవో చెబుతారని."
నవ్విందామె.
"మీరు ఏర్పాటు చేయభోయే సెక్యూరిటీ ఏర్పాట్లు సంతృప్తికరంగా వున్నాయా లేవా అన్న విషయం నేనెలా చెప్పగలుగుతాను? మీ ఇష్టం వచ్చిన ఏర్పాట్లు చేయండి. నేను నా ప్రోగ్రాం ఎటువంటి అవాంతరాలు రాకుండా చేయగలిగితే చాలు."
ఏదో చెప్పబోయిన అతను నౌఖరు రావడంతో వెనక్కి తిరిగాడు.
"సార్! మీకు ఫోన్....ఇంటెలిజెన్స్ ఐ.జి.గారి నుండి" చెప్పాడు నౌఖరు.
"ఇంటెలిజెన్స్ ఐ.జి. నుండా? ఇప్పుడే కదా ఆయన దగ్గర్నుండి వస్తున్నాను" స్వగతాన్ని పైకి అన్నాడు కౌశిక్.
తమరితో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట" చెప్పి బయటికి వెళ్ళిపోయాడు నౌఖరు.
"ఏమయివుంటుందబ్బా?" కారణాన్ని వూహించడానికి ప్రయత్నిస్తూ లేచి "ఒక్క నిమిషంలో వస్తాను" అని సంజుతో చెప్పి అక్కడినుండి వేగంగా అడుగులు వేస్తూ బయటికి నడిచాడు అతను.
సంజు మనస్సు ఏదో కీడును శంకించసాగింది.
నిశ్శబ్దంగా వున్న ఆ హాలులోకి ఆ వ్యక్తి రాగానే చిన్నగా కలకలం మొదలయింది.
"ప్లీజ్ బి సీటెడ్" చైర్లో కూర్చుంటూ అన్నాడు ఇంటెలిజెన్స్ ఐ.జి.
కూర్చున్నారు ఆ ఎనిమిదిమంది.
ఒక్కసారి ఆ గదినీ, అందరినీ కలయచూశాడాయన.
"చూడు....ఎదురుగా వున్న ఆ కిటికీ కర్టెన్ వెయ్యి. లేకపోతే ఇక్కడున్న ఎవరి ముఖమూ నాకు కనబడటం లేదు" పక్కనే నిలబడి వున్న ప్యూన్ ని ఉద్దేశించి అన్నాడు ఐ.జి.
కర్టెన్ వేశాడు ప్యూన్!
కళ్ళమీద పడుతున్న ఆ వెలుతురు తగ్గి అందరూ స్పష్టంగా కనిపించసాగారు.
"మిస్టర్ కౌశిక్!నన్ను అర్జెంటుగా ఢిల్లీ రమ్మని సెంట్రల్ హోం మినిస్టర్ నుండి ఫోన్ వచ్చింది. అందువల్ల ఈవెనింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళుతున్నాను. తిరిగి రావటానికి కనీసం మూడురోజులు పట్టవచ్చు."
అంత అర్జెంటు విషయం ఏముంది సార్?" ఐ.జి.తో చాలా చనువుగా ప్రవర్తించే ఎస్.పి. హరిహన్ అన్నాడు.
నవ్వాడు ఐ.జి. తెల్లగా నెరిసిన మీసాల మధ్యనుంచి పళ్ళు కనిపించాయి.
"బహుశా నన్ను పంజాబ్ ట్రాన్స్ ఫర్ చేయొచ్చు."
ఆయన మాట విని అందరూ తెల్లముఖం వేశారు.
"పంజాబ్ లో టెర్రరిజం ప్రాబ్లం చాలా ఎక్కువగా వుందికదా! అందుకే నన్ను పంపిస్తున్నారనుకుంటాను. క్రిందటిసారి సెంట్రల్ హోం మినిస్టర్ సెక్రటరీని కలిసినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. ఇప్పుడు అర్జెంటుగా ఢిల్లీ రమ్మన్నారంటే కారణం అదేనని నా వుద్దేశ్యం."
ఐ.జి. ఎంతటి సిన్సియర్ పోలీస్ అధికారో అందరికీ బాగాతెలుసు. ప్రాణాలను లెక్కచెయ్యడు. డ్యూటీ అంటే ప్రాణమిస్తాడు. అటువంటి అధికార్లకు ప్రమాదకరమైన డ్యూటీ పడటంతో ఆశ్చర్యంలేదు. కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే ఆయన హైదరాబాద్ వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ట్రాన్స్ ఫర్ వస్తోంది.
