"సరే! అసలు విషయానికి వద్దాం. వచ్చే ఆదివారం సంజు అనే సింగర్ ప్రోగ్రాం నిజా కాలేజి గ్రౌండ్స్ లో వుందికదా! దానికి మన హోం మినిస్టరు, డి జి పి ఇద్దరూ ముఖ్య అతిధులు. వాళ్ళిద్దరి మీదా టెర్రరిస్ట్ ల దృష్టి వుందన్న విషయం మనందరికీ తెలుసు. ఇటువంటి పబ్లిక్ ఫంక్షన్స్ లో సెక్యూరిటీ మరో ప్రాబ్లం అయిపోతుంది. అందువలన సెక్యూరిటీ ఇన్ ఛార్జ్ లని ఇప్పుడే అపాయింట్ చేసి ఆ తర్వాత ఢిల్లీ వెళ్దామని అర్జెంటుగా ఈ మీటింగ్ పెట్టాను."
ప్యూన్ వచ్చి కాఫీ కప్స్ టేబుల్ మీద వుంచి వెళ్ళాడు.
"ఆ బ్లూ ప్రింట్ ఇలా యివ్వండి" తనకి ఎదురుగా కూర్చున్న ఏ.సి.పి.తో అన్నాడు ఐ.జి. రోల్ చేసిన పేపర్ని టేబుల్ మీద పరిచాడతను.
దాంట్లో వున్న గీతలవంక దృష్టి సారించాడు ఐ.జి.
"ఇది నిజాం కాలేజి గ్రౌండ్స్ సర్. దీనికి రెండు మెయిన్ ఎంట్రన్స్ లు వున్నాయి. ఒకటి బషీర్ బాగ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వైపుంది. రెండవది స్టేడియం ప్రక్కగా పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్ళే రోడ్డువైపుంది. ఈ రెండవ రోడ్డుకు దగ్గరగా స్టేజి వుంది. సాధారణంగా ఈ గేటుని వి.ఐ.పి.లకు ఎంట్రన్స్ గా వుపయోగిస్తారు. బషీర్ బాగ్ సిగ్నల్స్ పైవున్న గేటుని పబ్లిక్ ని ఎంటర్ చెయ్యడానికి వాడతారు"
"గ్రౌండ్స్ కి చుట్టుప్రక్కల ఎత్తైన బిల్డింగ్స్ ఏమైనా వున్నాయా?" అడిగాడు ఐ.జి.
ఆ ప్రశ్నలోని భావం అర్ధమైంది కౌశిక్ కి.
చుట్టుప్రక్కల వున్న బిల్డింగ్స్ మీదినుండి ఎవరయినా గన్ తోనో, రివాల్వర్తోనో స్టేజి వైపుకి కాల్చితే ఆ బుల్లెట్ స్టేజిమీది వ్యక్తులకు ప్రమాదం కల్గిస్తుందా? అని ఆయన సందేహం.
"ఆ విధమైన భయం వుండాల్సిన అవసరం లేదు సార్. హైరేంజి ఎస్సాల్ట్ రైఫిల్ తో ఎవరయినా ఎటమ్ట్ చేసినా కూడా అది స్టేజిని రీచ్ అవదు" చెప్పాడు కౌశిక్.
"నిజానికి నేనొకసారి ఆ గ్రౌండ్స్ కి వెళ్ళి పరిసరాలు పరిశీలించి ఆ తర్వాత సెక్యూరిటీ అరేంజ్ మెంట్స్ గురించి మాట్లాడటం పద్ధతిగా వుంటుంది. బట్....ఇప్పుడంత సమయంలేదు. అందువలన మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీదే ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది" ఎంబరాసింగ్ గా ఐపించడంతో తనకు తానే యిబ్బందిగా ఫీలవుతూ అన్నాడు ఐ.జి.
"రెండవ గేటు నుండి....ఐ మీన్....వి ఐ పి లు గ్రౌండ్స్ లోకి ఎంటరయ్యే గేటు నుండి స్టేజివరకూ ఎంత దూరముంటుంది?" తిరిగి ఆయనే అడిగాడు.
"సుమారు రెండు వందల మీటర్లు" జవాబు చెప్పాడు కౌశిక్.
"వి ఐ పి ళ వెహికల్ పార్కింగ్ నుండి స్టేజికి ఎంత దూరం వుంటుంది?"
"సుమారు 70 మీటర్లు వుంటుంది."
"ఈ 70 మీటర్ల దూరం నడిచి స్టేజి మీదకు రావాలి అంతేకదా?"
"ఎస్ సార్."
"ఈ దూరం తగ్గించే అవకాశం వుందా? అంటే....ఇంచుమించు స్టేజి వరకూ వెహికల్స్ ని తీసుకురావచ్చు. అలా వచ్చినట్లైతే వాళ్ళు నడిచి వచ్చే దూరం తగ్గుతుంది కాబట్టి రిస్క్ తగ్గుతుంది."
"చేయవచ్చు సార్. అయినా కనీసం 20 మీటర్ల దూరం నడవాల్సి వుంటుంది."
"దట్స్ నాటె మేజర్ డిస్టెన్స్. మీరన్నట్లుగా స్టేజికి 2 మీటర్ల దూరంలో కార్లను ఆపండి. వి.ఐ.పి లు దిగిన తర్వాత వాహనాలను అక్కడికి సమీపంలోనే పార్క్ చేయించండి. కేవలం స్టేజి మీదకు వచ్చే వ్యక్తులను మాత్రమే ఆ గేటులోంచి రావడానికి పర్మిట్ చేయండి. అన్నట్లు స్టేజి మీద ఎంతమంది వ్యక్తులు వుండవచ్చు?"
"సుమారు 50 మందివరకూ వుంటారేమో?" చెప్పాడు ఎస్.పి. అర్జునరావు.
"అంతకంటే ఖచ్చితంగా ఎక్కువే వుంటారు సార్" కలగజేసుకున్నాడు కౌశిక్.
"ఎక్కువ ఎందుకుంటారు? చీఫ్ గెస్ట్ లు అయిదుగురు. వాళ్ళ సెక్రటరీలు, సెక్యూరిటీ గార్డులు.... ఆర్గనైజర్స్ కి ఇరవై మందిని మించి అనుమతించం. అప్పుడు అంతా కలుసుకున్నా 50కి మించరు కదా?" అన్నాడు అర్జునరావు.
"సింగర్ తోపాటు ఆర్కెస్ట్రాలో దాదాపు నలభయ్ మంది యూనిట్ వున్నారు సార్" చెప్పాడు కౌశిక్.
ఆ ఆలోచన రానందుకు నాలిక కరుచుకుని నవ్వేశాడు అర్జునరావు.
"అలా అయితే లైట్స్ అరేంజ్ చేసేవాళ్ళు, ఎలక్ట్రీషియన్స్, ఇతర టెక్నీషియన్స్ ఇలా వందమంది కనీసం అయ్యేటట్లున్నారే!" అన్నాడు ఐ.జి.
అవునన్నట్లు తల వూపాడు అర్జునరావు కూడా.
"వీళ్ళు కాకుండా ప్రెస్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్....ఇలాంటి వాళ్ళు కూడా వుంటారుగా?" మళ్ళీ ఐ.జి.నే అన్నాడు.
"మరచిపోయాను సార్. ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు వీడియో షూట్ చేసి, దాని నుండి యాడ్ ఫిల్మ్ తయారుచేసుకుంటారట. ఓ ఎడ్వర్ టైజింగ్ ఏజెన్సీవాళ్ళు....వీడియో షూటింగుకి పర్మిషన్ యివ్వండి అంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు" చెప్పాడు ఒక ఏ.ఎస్. పి.
తల పట్టుకున్నాడు ఐ.జి.
"మనకి తలనొప్పి కలిగించే వ్యవహారాలు యివే" అన్నాడు ఒకింత విసుగుతో.
"సరే! ఏ రకమయిన వ్యక్తులయినా వందమందికి మించి స్టేజి పరిసరాలకు రావటానికి వీలులేదు. ఎవరెవర్ని స్టేజి దగ్గరకు పర్మిట్ చేస్తున్నామో వాళ్ళందరికీ పాస్ లు ఇష్యూ చేయండి. వాళ్ళని ఐడెంటిటీ కార్డ్స్ చూపమని స్ట్రిక్ట్ గా ఇన్ సిప్ట్ చేయండి. రెండవ గేటు ఎంట్రన్స్ నుండి స్టేజి వరకూ ప్రతి అడుగు దూరానికి ఒక రన్ మాన్ వుండాలి. స్టేజికి 70 అడుగుల దూరంలో బ్యారికేడ్లు కట్టండి. ఆ లోపు దూరంలో ఎవరికీ సీట్లు అరేంజి చేయవద్దు. ప్రోగ్రాం టైములో వుపయోగించే మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ కూడా చెక్ చేయండి. మెటల్ డిటెక్టర్లతో అణువణువు గాలించి చూడండి. ప్రోగ్రాంకి పన్నెండు గంటల ముందునుంచి మన డిపార్ట్ మెంటు మనుషులు ఆ ప్రాంతంలో కాపలా వుండాలి. కొందరు మఫ్టీలో ఆ ప్రాంతమంతా కన్ను వెయ్యాలి. ప్రోగ్రాం మొదలయ్యే కొద్ది గంటల ముందు మన పోలీస్ కుక్కలను కూడా తీసుకెళ్ళి మరోసారి ఎక్స్ ఫ్లోజిన్స్ ఏమయినా వుంటాయేమో చూడండి. వి ఐ పి లకు దండలు....బొకేలు అనుమతించవద్దు. సింగర్ దగ్గరకు ఆటోగ్రాఫ్ కావాలని జనం ఎగబడే అవకాశముంది. వాళ్ళని కూడా రానివ్వద్దు. సెక్యూరిటీ ఏర్పాట్లు నిర్లక్ష్యంవలన ఇద్దరు ప్రముఖ వ్యక్తులను పోగొట్టుకున్న దురదృష్టం మనది. అటువంటి సంఘటన రిపీట్ అవటానికి వీల్లేదు .టేక్ ఆల్ కైడ్స్ ఆఫ్ కేర్. నేను ఢిల్లీ నుంచి రాగానే పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తాను. ఆ తర్వాత ఏ మార్పులు కావాలన్నా చేస్తాను. అంతవరకూ కేర్ ఫుల్ గా వుండండి. మీలో మీరు కెపాసిటీస్ ని బట్టి ఇన్ ఛార్జ్ గా వ్యవహరించండి. ఏ అర్జెన్సీ వున్నా నన్ను ఢిల్లీ కి కాంటాక్ట్ చేయవచ్చు" సుదీర్ఘంగా మాట్లాడి వూపిరి తీసుకున్నాడు ఐ.జి.
అలాగే అన్నట్లు తలలూపారందరూ.
"నేనింక బయలుదేరుతాను. ఇంకా చాలా పనులు పూర్తిచేసుకుని ఫ్లైట్ టైమ్ కి ఎయిర్ పోర్టుకు వెళ్ళాలి" చైర్లో నుంచి లేచాడు.
ఆ వెనుకనే లేచి నిలబడ్డారందరూ.
గది నుండి బయటకు వెళ్ళేముందు మరోసారి జాగ్రత్తగా వుండండి అని చెప్పి బయటకు నడిచాడు ఐ.జి.
మరికొద్ది నిమిషాలకు ఖాళీగా మిగిలిందా హాలు.
* * * *
చెవులు చిల్లులు పడేలా రొద చేస్తోంది జీపు.
సైలెన్సర్ పూర్తిగా దెబ్బతినడంతో ఆ శబ్దం వినటం కష్టంగా వుంది.
ఎర్రటి మట్టి ఆకాశం ఎత్తున ఎగురుతోంది.
ఆ దారిలో ప్రయాణించడం దుర్భరంగా వుంది.
అసలు దారి అవటానికి ఏమీ లేదు. అన్నీ రాళ్ళు ,గోతులు. దట్టమైన అడవి అది!
ఆ అడవిలో అడ్డదిడ్డంగా మట్టిలో నుండి పోతోంది ఆ జీపు .సుమారు రెండు గంటలుగా ప్రయాణిస్తోంది అది.
ఒక గంట వరకు ప్రయాణం తేలికగానే జరిగింది. ఆ తరువాత మట్టి రోడ్డుని వదిలిపెట్టి, గతుకులు, రాళ్ళు వున్న డొంకలోకి తిరిగింది జీపు.
అంతవరకే రోడ్డు చూశాడు సెబాస్టియన్.
ఆ తరువాత అతని కళ్ళకు గంతలు కట్టారు.
అక్కడి నుంచి జీపు ఎటుగా పోతోందో అర్ధంకావటంలేదు.
జీపు వేగం మహా అయితే గంటకు పదికిలోమీటర్లు మించి వుండకపోవచ్చు.
అంతకన్నా వేగంగా వెళ్ళటం అసంభవమే అనిపించేలా వుంది.
రాజమండ్రి నుండి మన్యప్రాంతం అడవుల్లోకి ప్రయాణిస్తున్నాడు సెబాస్టియన్.
రాజమండ్రి నుండి మారేడుమిల్లి వరకు కారులో వచ్చారు. అక్కడ్నుంచి అడ్డతీగల మీదుగా ప్రయాణిస్తున్నాడు సెబాస్టియన్.
టెర్రరిస్ట్ గ్యాంగ్ లో పని చేసే కొందరు కొరియన్స్ సెబాస్టియన్ కి తెలుసు. వాళ్ళద్వారా నర్సింగ్ అనే ముఖ్యమైన టెర్రరిస్ట్ లీడర్ని కలవడానికి వెళుతున్నాడు.
జీపు డ్రైవరు కాక మరో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు కొరియన్, మరొకరు ఆ ప్రాంతం అంతా బాగా తెలిసిన ఉగ్రవాది.
ఎవరి మధ్యా మాటలు లేవు.
ఆ టెర్రరిస్ట్ వ్యక్తులు అవసరానికిమించి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అది వాళ్ళ పద్ధతి! దాన్ని డిసిప్లేస్ గా కూడా భావిస్తారు.
జీపు ఆగింది. ఇంజన్ కూడా ఆఫ్ అయింది.
ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకున్నట్లయింది.
