"అదేమిటి? నా యింటికి వస్తానన్నావు కదా!" ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు.
ఒకింత ఇబ్బందిగా కదిలాయి ఆమె కళ్ళు.
"అన్నాను. బట్....వర్షం."
"అదే అడుగుతున్నాను. వర్షం వస్తే ఏమిటట? కారులో కదా వెళ్ళేది?"
ఆమె మాట్లాడలేదు.
ఇద్దరూ కారు దగ్గర ఆగారు.
"అర్చనా! నాకొక నిజం కావాలి" సడన్ గా అన్నాడు.
అతను అడగబోయేది ఆమెకు తెలుసు.
'నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?"
".........."
"నిన్ను అర్ధం చేసుకోవటం నాకు చాతకావటం లేదు అర్చనా! నీ ప్రవర్తన చూస్తే నన్ను ప్రేమిస్తున్నావనే అనిపిస్తుంది .నేను నీ మీద ప్రేమను ప్రతిక్షణం ప్రతి మాటల్లో చేతల్లో వ్యక్తం చేస్తాను. బట్... నువ్వు అటువంటిది ఏమీ వ్యక్తం చేయవు. చాలాసార్లు నాకు సందేహం వస్తుంది. నేను నిన్ను బలవంతపెడుతున్నానా! అని."
ఆమె సమాధానం చెప్పలేదు.
సైలెంటుగా డోరు తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుని, అటువైపు డోరు కూడా తెరిచింది. చంద్రకాంత్ కూడా సీట్లో కూర్చున్నాడు. డోరు మూసివేశాడు.
అప్పటికి చంద్రకాంత్ కనీసం నలభైసార్లయినా అర్చన ఇంటికి వచ్చుంటాడు. బట్....ఒక్కసారి కూడా అర్చన అతనింటికి వెళ్ళలేదు. ఎన్నోసార్లు అదే మాట అన్నాడు.
తను ఒక్కసారి కూడా చంద్రకాంత్ ఇంటికి వెళ్ళలేదని....అతను ఫీలవుతున్నాడని తెలుసు.
కానీ....
వెళ్ళాలంటే భయం....హేజిటేషన్.
కారణం....
తన ఇంట్లో చంద్రకాంత్ ఒక్కడే వుంటాడు. అతని తల్లిదండ్రులు నెల్లూరులో వుంటారు. వాళ్ళకి అక్కడ ప్రాన్స్ కల్చర్ బిజినెస్ వుందట. ఒంటరిగా ఉండే అతని ఇంటికి వెళ్ళాలంటే భయం. అలా అని చంద్రకాంత్ అంటే ఇష్టంలేక కాదు.
అతనంటే ఇష్టం. చాలా ఇష్టం. కానీ....ఆ ఇష్టం అతనికి వ్యక్తం చేయటం చేతకాదు.
'చంద్రకాంత్! ఐ లవ్ యూ' అని ఈ రోజుకీ చెప్పలేకపోతోంది.
అదే అతనికి ఇష్టంలేనిది.
ఆ విషయంలోనే ఇద్దరికీ స్పర్ధ వస్తోంది.
ఇంతవరకు అతని ఇంటి గడప తొక్కలేదని అతనెంతో బాధపడుతున్నాడని ఆమెకు తెలుసు. అందుకే అతనితో అంది "చంద్రకాంత్ గారూ! ఈ రోజు మీ ఇంటికి వస్తాను" అని.
పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు.
ఆ మర్నాడు అర్చన పుట్టినరోజు. అందుకే ఆమె షాక్ కు వెళ్ళి మూడువేల ఐదు వందలు పెట్టి మంచి చీర కొన్నది. షాపింగ్ అయిన తరువాత అతనితోపాటు తన కారులో అతనింటికి వెళ్ళి పది నిమిషాలు కూర్చుని తిరిగి రావాలనుకుంది. తను అతనింట్లో అడుగు పెట్టినప్పుడు అతని కళ్ళు ఎలా వెలిగిపోతాయో చూడాలనుకుంది.
కానీ....ఇప్పుడు మళ్ళీ భయం ఆవహించింది.
"ఆల్ రైట్! నువ్వు మా ఇంటికి రావలసిన అవసరం లేదు. నేనే సిగ్గులేకుండా మీ ఇంటికి వచ్చి టిఫిన్స్ తిని, కాఫీలు తాగి వస్తుంటా! ఈ రోడ్డు చివర నన్ను డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో. అక్కడి నుంచి నేను ఆటోలో నా ఇంటికి వెళ్ళిపోతా" చాలా కరుకుగా వుందతని కంఠం.
మాట్లాడలేదు ఆమె.
ఆమె చేయి ఇగ్నిషన్ మీదకు వెళ్ళింది.
చిన్న శబ్దంతో స్టార్టయింది కారు.
'టప్' మనే శబ్దంతో కారు బాయ్ నెట్ మీద పడింది మొదటి చినుకు.
కారు రివర్స్ చేసి పార్కింగ్ ప్లేస్ లోంచి బయటికి తీసుకువచ్చింది అర్చన.
దడదడ శబ్దం చేస్తూ పడసాగాయి చినుకులు.
రోడ్డుమీద జనాలు హడావిడిగా అటూ ఇటూ పరిగెత్తసాగారు.
విండో గ్లాసెస్ లిఫ్ట్ చేసిందామె.
కారు ముందుకు దూకింది.
ఓరకంట అతనిని గమనించింది.
అసహనంగా కూర్చుని వున్నాడతను.
టేప్ రికార్డర్ ఆన్ చేసింది.
మడొన్నా గొంతు మత్తుగా మంద్రస్థాయిలో వినిపిస్తోంది.
వైపర్స్ ఆన్ చేసింది.
రోడ్డు స్పష్టం అయింది.
కారు మరో రెండు వందల గజాలు ముందుకు కదిలింది.
"అదుగో ఆ కనిపించే హోటల్ దగ్గర కారు ఆపెయ్. నేను దిగిపోతాను" అన్నాడు దిగటానికి సంసిద్దుడవుతూ.
"ఎలా దిగుతారు?"అడిగింది దృష్టిని రోడ్ మీదుంచే.
"ఎలా దిగటం ఏమిటి? డోరు తెరుచుకుని దిగుతాను."
"అలాగా....అయితే దిగండి" అంది కారు స్లో చేస్తూ.
డోరు ఓపెన్ చేయాలని ప్రయత్నించాడు. తెరుచుకోలేదు.
నవ్విందామె
"డోర్స్ రిమోట్ కంట్రోల్ నా దగ్గరుంది. నేను ఓపెన్ చేస్తేనే కానీ డోర్స్ తెరుచుకోవు."
అసహనంగా ఆమె వైపు చూశాడతను.
"మీ ఇంటికి దారి చెప్పండి."
".........."
"మిమ్మల్నే మీ ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పండి. నేను కూడా మీతో పాటు వస్తున్నాను" ఒక రకమైన తెగింపుతో, ధైర్యంతో అందామె.
"నిజంగా!" నమ్మలేనట్లు చూశాడు.
అవునన్నట్లుగా రెప్పలు ఆర్పింది ఆమె.
భూమ్యాకాశాలు ఏకమయ్యేలా కురుస్తున్న ఆ వర్షంలో అతనికి రోడ్డుమీద వదిలి వెళ్ళడం సభ్యత కాదు.
"ఇదుగో....ఇటు. లెఫ్టుకి రోడ్డుంది కదా. ఇలా వెళ్ళాలి" ఆనందంగా అన్నాడతను.
గేరు మార్చి ముందుకు దూకింది లెఫ్ట్ కి టర్న్ చేసిందామె.
రోడ్డుమీద నీళ్ళు పారుతున్నాయి.
హెడ్ లైట్స్ ఆన్ చేసిందామె.
"ఇంటికి రాను అన్నారు కదా! మళ్ళీ రావాలని ఎందుకు మనసు మార్చుకున్నావ్?" అని అడగాలనుకున్నాడు కానీ అడగలేదు.
"ఆ సర్కిల్ నుంచి రైట్ సైడ్ తిరగాలి."
అతను చెప్పినట్లే టర్న్ చేసిందామె.
కుంభవృష్టిగా కురుస్తోంది వర్షం.
"మా ఇంటికి రాగానే నా చేతులతో ఒక కప్ టీ తయారుచేసి ఇస్తాను. అది తాగగానే వెళ్ళిపోవచ్చు. అన్నాడతను.
ఆమె భయం అతనికి తెలుసు.
ఒంటరిగా వుంటున్న అతని ఇంటికి వెళితే ఎవరు ఏం అనుకుంటారో అని ఆమె భయం.
పేరుకు సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయే కానీ....ఆలోచనలు చాలా సనాతనమైనవి. అసలామె మోడల్ గర్ల్ ఎలా అయిందా అన్న సందేహం చాలాసార్లు వచ్చిందతనికి.
"అదుగో....ఆ కనిపించే లెఫ్ట్ టర్న్ తిరిగి ఓ రెండు ఫర్లాంగులు వెళితే చాలు"చెప్పాడతను.
కుంభవృష్టిగా కురుస్తోన్న వర్షానికి రోడ్డు కూడా సరిగ్గా కనపడటం లేదు.
రోడ్లన్నీ నిర్మానుష్యం అయిపోయాయి.
మోకాలి లోతులో పారుతున్న ఆ నీటిలో ఎప్పుడో రాని ఆ రోడ్డులో జాగ్రత్తగా కారు నడవసాగిందామె.
"ఆ గేటు దగ్గర ఆపు" చెప్పాడు ఎడమ వైపు కనిపించిన గేటు చూపిస్తూ.
కారు ఆపింది ఆమె.
గేటు లాక్ చేసి వుంది.
గేటుకి లోపలగా ఒక చిన్న ఇల్లు వుంది. ఇల్లంతా చీకటిగా కనిపిస్తోంది.
"ఈ ఇంటి మొత్తం మీద మీరు ఒక్కరే వుంటున్నారా?" అడిగింది ఆమె.
ఆమె ఈ రోజుకీ చంద్రకాంత్ ని 'మీరు' అనే పిలుస్తుంది.
అవునన్నట్లుగా తల వూపాడతను.
"లాక్ తీసి వస్తాను" అంటూ కదలబోయాడు.
"బట్....వర్షంలో తడిసిపోతారు."
తల తిప్పి ఆమెను చూసి నవ్వాడు.
"ఫర్వాలేదు! ఇంట్లో చాలా టవల్స్ వున్నాయి. డ్రస్ లు వున్నాయి. ఈ వర్షం యిప్పట్లో తగ్గేలా కూడా లేదు. ఎంతసేపని యిలా కారులో కూర్చుంటాం? త్వరగా ఇంట్లోకి వెళితే నువ్వూ త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు వెళ్ళటం ఏమాత్రం లేటు అయినా మీ ఇంట్లో కంగారుపడతారు."
ఇంకేం మాట్లాడలేకపోయిందామె.
రిమోట్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసింది.
డోర్ లాక్ రిలీజ్ అయింది.
కాళ్ళకున్న షూస్, సాక్స్ తీసి కారులో పడేశాడు చంద్రకాంత్. డోరు తెరుచుకుని పరుగులాంటి నడకతో గేటును సమీపించసాగాడు.
మోకాలి లోతు నీళ్ళుండటంతో, అతను ఎంత వేగంగా పరిగెత్తినా అది నడకలాగే వుంది.
గేటును సమీపించి జేబులో చేయి వుంచి తాళాలు బయటికి తీశాడు.
ఆ కొద్ది క్షణాల్లోనే అతని శరీరం ముద్దగా తడిసిపోయింది.
సరిగ్గా అదే సమయంలో....
