7. "రామ లక్ష్మణ సు | గ్రీవాదులతో
సీత క్షేమమని - తెలుపుము దయతో |
వారి రాక కై - వేయి కన్నులతో
ఎదురు చూతునని - తెల్పుము ప్రీతితో |
రెండు నెలలే ఇ | క మిగిలిన గడువని
మరి మరి తెల్పుము - శ్రీరామునితో |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో .... ||శ్రీ||
8. "రామచంద్రునకు - కడు ప్రియమైనది
శ్రేష్టమైనది - శుభకరమైనది |
చెంగుముడి నున్న - చూడామణీని
మెల్లగ దీసి - మారుతి కొసగి |
పదిలముగా గొని - పోయిరమ్మని
శ్రీరామునకు - గురుతుగ నిమ్మని |
ప్రీతిబల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో ..... ||శ్రీ||
.jpg)
మారుతి కొనగెను చూడామణిని
పదిలముగా గొనిపోయి రమ్మని
శ్రీరామునకు గురుతుగ నిమ్మని |
9. చేతులారగ - చూడామణిగొని
ఆనందముగ - కనుల కద్దుకొని |
వైదేహికి ప్ర | దక్షిణలు జేసి
పదముల వ్రాలి - వందనము లిడి |
మనమున రాముని - ధ్యానించుకొని
మరలి పోవగ - అనుమతినిమ్మని |
అంజనీ సుతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె ..... ||శ్రీ||
__: 38వ. స. సంపూర్ణము :__
39 వ. సర్గ
సీత హనుమంతునితో :-
1. "పోనీ హనుమా - నేటికి నిలుమా
బడలిక తీర | రేపు పొమ్మా |
నీ విందుండిన - స్వల్పకాలము
నాలో తరిగెను - శోక భారము |
నిన్నంపుట నా | కు మరో దుఃఖము
ఎటుభరింతునో - ఈ పరితాపము |"
అనిపల్కె సీత - హనుమంతునితో
తనలో కలిగిన - వాత్సల్యముతో ... ||శ్రీ||
2. "హనుమా నాకొక - అనుమానము సుమా
అరమరిక లేక - నాకు తెల్పుమా |
వానర సేనతో - సుగ్రీవాదులు
వారిధి దాటి - ఇటు రాగలరే |
రామకార్యమును - సాధించుటలో
అతి సమర్ధుడవు - నీ వందరిలో |"
అనిపల్కె సీత - హనుమంతునితో
తనలో కలిగిన - వాత్సల్యముతో ... ||శ్రీ||
మారుతి సీతతో :-
3. "తల్లీ నీకు - తెల్పెద వినుము
మాలోనున్న - వీరుల విషయము |
సుగ్రీవుడాది - వానర వీరులు
నను మించిన వీ | రాధి వీరులు
వాయువేగ మ | నో వేగవంతులు
పలుమార్లు భువిని - చుట్టిన ధీరులు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
4. "నా భుజములపై - రామలక్ష్మణుల
తిన్నగ లంకకు - తోడ్కొని రాగల |
ఆ సోదరులు - మహావీరులు
సూర్యచంద్ర స | మాన తేజులు |
తృటిలో రావణు | ని పరిమార్చ గలరు
అయోధ్యకు నిన్ను - గొనిపోగలరు |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
__: 39 వ. స. సంపూర్ణము :__
