కాసెపు తర్జన భర్జనలు జరిపాక ఆ రాత్రే ఎక్కడి కైనా పారిపోయి గుట్టుగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నాం. ఆ రాత్రి ఆమె కోసం కాచుకున్నాను. కానీ ఆమె రాలేదు.
లభించిన ఆనందం దూరమై పోయింది. భవిష్యత్తు ను ఊహించుకోకుండా ఇష్ట మోచ్చినట్లు ప్రవర్తించి యుక్తా యుక్త విచక్షణలను మరిచి చరించాను. జీవితాన్నే జయించానని గర్వపడి దానిచేతనే మోసగించబడి ఓడిపోయాను అని తెలుసుకొని క్రుంగి పోయాను. అందుకు ఫలితం సమాజంలో అవహేళన, మగవారికి ఫర్వాలేదు. ఆడవారి బ్రతుకే నవ్వుల పాలవుతుంది. వారి ఆత్మ ఘోసిస్తూనే ఉంటుంది. జీవితాంతం ఆ బాధను మరిచిపోలేరు. ఆశించనిది లభించదని తెలిపోయినప్పుడు ఆత్మ హత్య చేసుకొనే బలహీనులు ఉన్నారు. ఆ ప్రేమను మరిచిపోలేక పిచ్చి వాళ్ళుగా తయారయ్యే వారూ ఉన్నారు. మనసును చిక్క బట్టుకొని జీవితమంతా ఆ బడబాగ్ని ని కడుపులో దాచుకొని బ్రతక గలిగే మహానుభావులూ ఉన్నారు. తమ మనుగడ లో కొందరికీ ఉదాహరణ గా నిలిచి కనీసం వారి జీవితాలనైనా బాగు చెయ్యాలనే కోరిక వారి కుంటుంది. ఆమె నన్ను మోసగించిందనుకోన్నాను. కానీ ఆ తర్వాత......."
'ఆ తర్వాత నేను చెప్తాను, ఖాన్." అక్కడే నిలబడి ఉన్న సరోజినీ దేవి అంది. ఆమె రాక నెవ్వరూ గమనించలేదు.
"సరూ, వచ్చావా? నువ్వు ఉంటె బాగుండును అనుకొంటున్నాను. ఇంతలో వచ్చావు రా. వీళ్ళ అనుమానాలని తొలగించు" అని కళ్ళు తుడుచుకుని లేవబోయారు ఖాన్ గారు.
"వద్దు, ఖాన్, నువ్వు కూడా కూర్చో."
ఆ ఆజ్ఞను మీరే శక్తి అతని కేనాడూ లేదు.
"ఆ రాత్రి మమత, మమకారాలను చంపుకోలేక చాలాసేపు మధనపడ్డాను. రక్తసంబందాన్ని త్రెంచుకొని ఖాన్ కోసం అన్ని బంధాలు వదిలించుకొని అంతా సిద్దం చేసుకొన్నాను. అందరూ నిద్ర పోయారనుకొని మెల్లిగా నా గది నుండి బయటి కొచ్చాను. రెండడుగులు వేసి ముందుకు చూసి భయంతో వణికి పోయాను. నాన్న. నా చేతిలోని సూట్ కేస్ క్రింద పడిపోయింది. నాన్నగారి కళ్ళు రౌద్రంగా ఉన్నాయి. అయన జేబులో నుండి రివాల్వరు తీశారు. భయపడ్డాను. కానీ అలా చనిపోవడమే మేలనుకొని స్థిర చిత్తంతో తల వంచుకొని నిలబడ్డాను. నా దగ్గరగా వచ్చారాయన. రెండు కన్నీటి బొట్లు క్రింద పడ్డాయి. తలెత్తి చూశాను. నాన్న కన్నీరు కార్చడం చూసిన నా హృదయాన్ని బాధ ఆవరించింది. అయన నా చేతులో రివాల్వరు ఉంచారు. వణికిపోతూ అయన కళ్ళలోకి చూశాను. అప్పటికే అయన వెనక్కు వెళ్లి నిలబడ్డారు. అయన ప్రక్కన కన్నీటితో జననమిచ్చిన తల్లి. అమాయకుడైన తమ్ముడు నిలబడి ఉన్నారు.
"ఊ . కానీ ఆ ట్రిగ్గర్ నొక్కు. నీకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. నిశ్చింతగా మా శవాల పైన నడిచి పో. పోయేముందు ఆ పని చేసి కాస్త పుణ్యం కట్టుకొని, ఫో."
"చలించి పోయాను. 'నాన్నా!' అంటూ రివాల్వరు దూరంగా విసిరేశాను.
"నువ్వు ఇప్పుడు చేసే పని కన్నా ఇదేం పెద్ద పని కాదు. వంశ మర్యాద, పరువు ప్రతిష్ట లు గాలిలో కలిసిపోయాయి. సహించాను. అవి నీకు అక్కరలేదు. కన్నకడుపు తీపి చేత వాటిని వదులు కొన్నాం. కానీ ఈనాడు మేమే నీకు అక్కర లేనప్పుడు ఈ జీవితలేందుకు?"
"నాన్నా!" చేతులతో మొహం కప్పుకుని గట్టిగా ఏడిచాను.
'సరే. నీకంతగా వెళ్లిపోవాలని ఉంటె ఫో. కానీ ఒక్కసారి మా మొహాలు చూడు. మేం ఎప్పుడు పోతామో మాకే తెలియదు. అప్పుడు వీడు అనాధ అయిపోయి వీధులలో బిచ్చమెత్తుకుని తిరిగుతుంటాడు. అది చూసి సంతోషించు. నిన్ను ఆపే హక్కు మాకు లేదు. నీ యిష్ట మొచ్చిన చోటికి పోవచ్చు."
"తలెత్తి వారిని చూశాను. నవమాసాలు మోసి పాలిచ్చి పెంచిన తల్లి, దేహము నిచ్చి విద్యాబుద్దులు చెప్పించిన తండ్రి, రక్తం పంచుకొని తోడుగా పుట్టిన చిన్నారి తమ్ముడు -- వారిని విడిచి పోవాలంటే కాళ్ళాడలేదు. రక్తపాశం నన్ను బంధించింది. కానీ, అక్కడ ఖాన్! ఆలోచించలేక పోయాను. ఏడుస్తూ నా గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొన్నాను.
'ఆ తర్వాత ఆ ఊరే వదిలి వచ్చేశాము. నా హృదయ వేదన ఖాన్ తో చెప్పే అవకాశం లేకపోయింది. నా ఖాన్ ని నేను మోసం చేశాననే భాధతో కుమిలిపోతూ జీవచ్చవం లా గడిపాను. నాకు వేలూరు లో కానుపు జరిగింది. నా పాపను చూసుకొని ఆనందించే అదృష్టానికి గూడా నోచుకోలేదు. ఒక అనాధ ఆశ్రమం లో చేర్పించారు. వారి మాటలకు, భోధలకు లొంగి పోయాను. ఆ సంవత్సరమే నా పెళ్ళయి పోయింది. ఆయనలో ఖాన్ ను చూసుకుంటూ జీవితాన్ని గడిపాను.
"నిజం దాచినా దాగదు. పెళ్లవగానే హనీమూన్ పోవాలని పట్టు బట్ట్టారు మా వారు. ఒక రాత్రి ట్రెయిన్ లో వస్తున్నాము. ఆ కంపార్ట్ మెంటు లో నేనూ, మా వారు తప్ప మరెవ్వరూ లేరు. మావారు పై బెర్తు మీద పడుకొన్నారు. నేను చీకటి లో కూర్చొని జీవితపు పుటలను తిరగ వేసుకొంటున్నాను. ఎవరో కంపార్టు మెంటు లోకి ప్రవేశించారు. చీకటిలో ఎవరైనదీ గుర్తించలేదు. ఆ వచ్చిన వ్యక్తీ ఎదురుగా ఉన్న బెర్తు మీద కూర్చొని లైటు వేసుకొన్నాడు. అతడు నన్ను గమినించలేదు. ఏదో ఇంగ్లీషు పత్రిక చదువు కోసాగాడు. అతని మొహం కనిపించక పోయినా అతన్ని గుర్తించి దడదడ కొట్టుకుంది హృదయం.
"ఖాన్' అన్నాను. ఉలిక్కిపడి చూశాడతను. ఒక్కసారిగా హృదయపు భారాన్నంతా అతని హృదయం పై వాలిపోయి తీర్చుకోవాలను కొన్నాను. కానీ పరాయిదాన్ని.
'సరూ, నువ్వా!' అనగలిగాడు ఖాన్. అతని మొహం లో విషాద చాయలు వ్యక్తమయ్యాయి.
"ఏం మాట్లాడలేక పొయ్యాడు. హృదయం రోదిస్తోంది. గట్టిగా ఏడవడానికి గూడా నోచుకోని నిర్భాగ్యురాలిని.
"ఖులసాగా ఉన్నావా, సరూ!" పలుకరించాడు ఖాన్. అ ప్రశ్నకు కలవరపడ్డాను. అతన్ని పరీక్షించాను. అతనిలో చాలా మార్పు వచ్చింది. గంబీర్యం అలుముకోంది. యౌవ్వనం లోనే ఏదో బాధకు గురై జీవితమంటే విసిగి నిరాశా నిస్పృహలతో జీవిస్తున్నవాడిలా కనుపించాడు.
"నువ్వు చాలా మారిపోయ్యావు, ఖాన్.' ఎంత అపుకుందామన్నా ఆగక పొర్లు కొచ్చింది దుఃఖం.
"చూడు, సరూ , జీవితమంతా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఇక మీదటైనా సుఖంగా కాకపోయినా కనీసం ప్రశాంతంగా గడపడం నేర్చుకుందాం."సలహా యిచ్చాడు.
"సాధ్యమా, ఖాన్?' అన్నాను దుఃఖాన్ని అపుకొంటూ.
"అసాధ్యాన్ని సాధ్యంగా మార్చుకొనే శక్తి నిచ్చాడు దేవుడు."
"అనుభవం వలన చాలా నేర్చు కోగలిగాడనే భావించాను. ఏదో చెప్పమని హృదయం ప్రభోదిస్తుంది.
"బిడ్డ నెం చేశావు?' అతడే అడిగాడు.
'అంతా చెప్పాలని చెప్పలేక పోయి బిడ్డ విషయం మాత్రం చెప్పాను.
'మనబిడ్డ అనాధగా జీవించడానికి వీలులేదు.' అని బండి ఆగగానే పోవటానికి ఉద్యుక్తుడయ్యాడు.
'ఖాన్' అన్నాను ఆవేదనతో.
'సరూ, అయిందేదో అయిపొయింది. నువ్వు మోసగించావని నేను బాధపడటం లేదు. నీ జీవితంలో నేను కనబడ కూడదు. అందువల్ల అనర్ధాలు సంభవిస్తాయి. జరిగిన అనర్ధం చాలు. క్రొత్త కష్టాలు కోరి తెచ్చుకోవడ మెందుకు? నీవైనా సుఖంగా ఉండు. సెలవు' అని వెళ్ళిపోయాడు.
"కనుచూపు దూరమయ్యేంత వరకూ అతన్ని చూశాను. బాధతో వెనుతిరిగి కళ్ళు తిరిగినట్లయి పడబోయాను. అంతవరకూ నన్నే నిశితంగా చూస్తుండిన మావారు నన్ను పట్టుకుని కూర్చో బెట్టారు. వారిని చూడలేక పోయాను.
"ఫరవాలేదు, సరూ. దేవుడు మీ పట్ల క్రోర్యాన్ని చూపించాడు. కానీ నేనూ ఆ పని చేయలేను. ఏ కారణం వలననో తప్పు చేసి విధి కోరలకు చిక్కి దాన్ని ఒప్పుగా మార్చుకునే అవకాశం కలగని నిన్ను క్షమించి చేరదీయలేని వాడు నా ఈ మనుగడ కే అర్ధం లేదు. అతడన్న ప్రకారం మీ బిడ్డ అనాధగా జీవించ కూడదు. ఇంటికి పోగానే ఆ బిడ్డను తెచ్చుకుందాం.'
"వారి మాటలు ఏ దేవుని దీవనలో అనిపించాయి. ఇటువంటి వారు కూడా ఉంటారా అనుకొన్నాను. సంతోషం వల్లనో, దుఃఖం వల్లనో నోట మాట రాలేదు. భక్తీ తో అతని పాదాల పై పడ్డాను.
"పిచ్చిదానా! అందుకే మీ ఆడవారు సుఖ మొచ్చినా దుఃఖ మొచ్చినా భరించలేరు' అని నన్ను హృదయానికి హత్తుకొన్నారు.
"ఆ తర్వాత ఆ బిడ్డ కై ప్రయత్నించగా ఎవరో తీసికెళ్ళి పొయ్యారని తెలిసింది. చేసేది లేక కన్న బిడ్డ చిలిపి మాటలు విని, చిలిపి చేష్టలు చూసి ఆనందించే భాగ్యానికి నోచుకో లేకపోయాను. ఇప్పుడు కన్నబిడ్డను నా బిడ్డ అని చెప్పుకోలేని నిర్భాగ్యురాలిని. అదృష్ట హీనురాలిని. ఇది నీ కన్నతల్లి కధ అసహ్యించు కొంటావో జాలి పడతావో ఆలోచించుకో."
"అమ్మా!" అంది రజియా.
"రజియా " అంటూ రజియాను తన కౌగిలి లోకి తీసుకొంది సరోజినీ దేవి.
"ఇన్నాళ్ళూ ఈ మాట నాతొ చెప్పలేదెందుకమ్మా! అంత పాపం నేనేం చేశానమ్మా!" అంది రజియా ఏడుస్తూ.
"లేదమ్మా! ఈ పాపపు గాధ చెప్పి మీ లేత హృదయాలను గాయపరచడం ఇష్టం లేక చెప్పలేదు."
"రజియా! నీకు తల్లే కాదు. తండ్రి కూడా అన్యాయం చేశాడు. ఆనాడు నిన్ను శరణాలయం నుండి తీసుకొచ్చి పురిట్లో నే మీ అమ్మ చనిపోయిందని మోసం చేశాను. తల్లి ప్రేమకు దూరం చేశాను. అందుకు నన్ను క్షమించు, తల్లీ" అన్నారు ఖాన్ గారు.
రాజ్ మౌనంగా వారిని చూడసాగాడు.
"నాన్నా! అలాంటి మాటలనకండి. మీవంటి తల్లి దండ్రులను కలిగి ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను."
తానొక హిందూ స్త్రీ అని తెలుసుకొని తన పద్దతులు మార్చుకొంది రజియా.
ఈ విశాల ప్రపంచం లో ఇలా ఎందరి జీవితాలు నాశన మవుతున్నాయో, ఎందరి జీవిత సౌఖ్యం మట్టిలో కలిసి పోతుందో, ఎందరు అమాయకుల హృదయాలు అలమటించుపోతున్నాయో, ఎందుకు తమ తొందర పాటుకు చింతిస్తూ జీవితాన్ని గడుపుతున్నారో తెలుసు కోవడం కష్టం.
20
వై. నారాయణ రావు. మేనేజర్. క్లాత్ మిల్-- అన్న బోర్డు చూసి లోపలికి నడిచాడు రాజ్. కానీ ఆ ఇంటికి తాళం వేసింది. అక్కడి నుండి నేరుగా మిల్లుకు పోయాడు.
"సార్, మీతో మాట్లాడాలని ఎవరో వచ్చారు." ఫ్యూన్ చెప్పాడు.
"లోపలికి పంపించు" అని చూస్తున్న ఫైలు ప్రక్కన పడేసి సిగరెట్ దమ్ము పీల్చాడు అయన.
"నమస్కార మండీ." లోపలికి వచ్చాడు రాజ్.
"నమస్కారం కూర్చోండి" అని కుర్చీ చూపించి 'ఎన్నడూ చూడలేదే, అయినా ఇతని కేమిటి పని! అనుకొన్నాడు అయన.'
రాజ్ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని నారాయణ రావును పరీక్షించాడు. పాతికేళ్ల వయసుతో ఉన్న నిండైన విగ్రహం. అందమైన మొహానికి రింగుల వెంట్రుకలు ఆకర్షణ నిస్తున్నాయి. మనిషిలో ఉద్యోగ హోదా ఉట్టి పడుతుంది. నోట్లో సిగరెట్టూ ఆ హోదాకు చిహ్నంగా ఉంది. కళ్ళు అహంభావాన్ని చాటుతున్నాయి. చూపుల్లో ఆత్రుత, అయిష్టత ఉంటుందప్పుడప్పుడు. మా వదినకు తగిన జోడే అనుకున్నాడు రాజ్.
"ఆ. మీరొచ్చిన పనేమిటో చెప్తారా?'
"మీతో ఏకాంతంగా మాట్లాడాలి."
"ఏ విషయం లో?'
"మీ శ్రీమతి ఇందిరగారి విషయంలో."
నారాయణరావు కనుబొమ్మలు ముడిచి ఏదో ఆలోచించాడు.
"ఆ విషయం మాట్లాడడానికి మీరెవరు?"
"నే చెప్పినా మీకు తెలియదేమో!"
"ఆమె పంపిన రాయభారులా?"
"మీరెలాగైనా భావించుకోవచ్చు."
"సూటిగా సమాధానం చెప్పండి."
"ఆమె, నేనూ బంధువులం."
"ఏ విధంగా , ఏ రకమైన బంధువులు?"
ఆ మాటలకు కోపమొచ్చినా నిగ్రహించు కొన్నాడు రాజ్.
