Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 29


    "పటంలో ఏముంది? రత్నం అంశామాత్రంగా కూడా లేడు. అతన్ని ఒక్కసారి చూస్తే జీవితాంతం మరచిపోలేరు. అసలు అతన్ని మరచిపోవడం అసంభవం. రత్నంతో మాట్లాడుతుంటే కలల లోకంలో విహరించినట్లుంటుంది. మన చుట్టుపక్కల ఉన్నవారు కల్పనాజగత్తులోని పాత్రల్లా కనిపిస్తారు. లోకంలో అన్నింటినీ మించిన వాస్తవం రత్నం. అతడు మనముందుంటే మనం ఏమీ ఆలోచించలేం. అతడు గారడి-అవిశ్వాసి. కాని అతడు తన భార్య ఒడిలోంచి తన బిడ్డను లాక్కున్నప్పుడు నేను అతణ్ణి గుర్తించలేనంతగా మారిపోయేవాడు. అదొక వింత-విడ్డూరం. క్షణంలో ఒకవ్యక్తి ఒక వలపు కథలో పాత్ర అవుతాడు-మరుక్షణంలో చంద్రునిలో పోయి కూర్చుంటాడు. తెగిపడిన తారలా మనసు నుంచి రాలిపోతాడు. కన్నీరు జలజల రాల్తుంది.
    "కన్నీటి వలె రత్నాన్ని నా కంటినుంచి రాలుస్తున్నప్పుడు రత్నం భార్య ఆపడానికి చాలా ప్రయత్నించింది. ఆ రోజుల్లో రత్నం నాతో మాట్లాడ్డం మానేశాడు. ఎడిటర్ గారు! ఎందుకో నాకు అర్థంకాదు-భార్యలు భర్తల్ను పండిన మామిడి పళ్ళనుకుంటారు- అలా రెప్పవాలిందో దొంగలు విరుచుకుపడ్తారని భయపడ్తారు."
    "అవునండీ ఆడవాళ్ళకు అనుమానాలు మెండు" నేను విన్నవించుకున్నాను.
    "అంతేకాదు వెధవల కోరికలు అక్రమసంతానం లాంటివి" ఆమె నా మాట విన్నట్లు లేదు.
    "జనం వేలెత్తిచూపే కోరికల గొంతు నులిమెయ్యడం మంచిది. నేను వెళ్ళిపోతానని తెలిసింది. రత్నం జబ్బునపడ్డాడు. అతని బాధ చూడలేకపోయాను. మామగారి సేవలో జీవితం గడుపుదామని నిశ్చయించుకున్నాను. ఏ మాట కామాటే-వదిన వారించింది-వద్దంది. రత్నం అది విన్నాడు. కోపంగా ఉరికి వచ్చాడు 'లలితా! ఆమెను, ఆమెను ఆపకు. మామగారింట్లో మనకన్నా తనవారు దొరకుతారు' అన్నాడు.
    "రత్నం అన్నదానికి నేను ఏమీ అనుకోలేదు. నా జీవితం తెల్లకాగితం లాంటిది. ఇష్టం వచ్చిన అభిప్రాయాలు రాసుకుంటారు. ఎడిటర్ గారు! గుండెలో అనుమానాల అగ్గి రగులుతుంటే చేతిలో ప్రేమ పుష్పాల వాడిపోకుండా ఉంటాయా?"
    "అవునండీ. నిజమేనండీ" అన్నాను. నాకు తెలుసు నేను ఉన్నాననే విషయం ఆమెకు అనవసరం అని.
    "అప్పుడు మామగారి ఇంటికి వెళ్ళిపోయాను"
    "అయితే మీరు రత్నంను మరచిపోయారా?" అడిగాను.
    "అవును" ఆమె నిట్టూర్పు దిగమింగుతూ అన్నది. మరచిపోవడం అంత పెద్దవిషయమేమీకాదు.
    నగల దుకాణంలో ఉన్న వజ్రాల ఉంగరం ఊహా మాత్రంగా ఎంతకాలం దరించగలం?
    "అయితే మామగారింట్లో ఆనందంగా ఉండిపోయారన్నమాట."
    "ఉంటాననుకోలేదు. ఎంచాతంతే మా అత్త స్వభావం మంచిదికాదు. జగడాలమారి. మా ఇంటికి వచ్చినప్పుడు పోట్లాడి వెళ్ళిపోయేది. పాపం మా మామ మంచివాడు. ఈమెతో పడలేక మొత్తుకునేవాడు."
    "తన పిల్లల్ని కూడా బాదేదేమో!"
    "ఎక్కడిపిల్లలు-ఒక్కతే కూతురు కుట్టి" ఎంతో ఆప్యాయంగా అన్నది.
    "పన్నెండు, పదమూడేళ్ళుంటాయి. ఎంత మంచిదనుకున్నారు? మతాబులాగా వెలుగుతుండేది. పూలలా నవ్వుతుండేది. అలాంటి అమ్మాయిని మీరు చూచి ఉండరు. చూచిన వాడల్లా ముగ్ధుడు అయ్యేవాడు. ఆమె నా మనసులో కాపురం పెట్టింది. ఇంతకాలం ఆమెకు దూరంగా ఎలా ఉండగలిగానో అర్థంకాదు. అంత మంచి బిడ్డను కని అత్త కొంత మెత్తపడింది. వేయిసార్లు దెబ్బలు కొడ్తే ఒక్కసారి ప్రేమగా పిలిచేది."
    "అవును తల్లులైతే ఆడవాళ్ళ గుండె మెత్తపడుతుంది" నేను అన్నాను-కొత్త సిగరెట్టు వెలిగిస్తూ.
    "మెత్తదనం లేదు మన్ను లేదు. మోసం చేయడంలో మొనగత్తె, కడుపు కట్టుకొని పైస పైస కూడపెట్టేది. కుండలో డబ్బు, బంగారం ఉంచి పొయ్యి దగ్గర పాతిపెట్టింది. కుట్టీ పెళ్లిని గురించిన ఆలోచన ఆమెను కుంగదీసింది."
    "అలాంటిది మిమ్మల్ని ఎలా సహించింది?"
    "అది నిజమేకాని అత్త చాలా దూరదృష్టి గలది. వయసులో ఉన్న వెధవ ఇష్టం వచ్చినట్లు తిరిగిందనుకోండి. నిప్పులు ఎవరిమీద కురుస్తాయి? పెళ్లికాని పిల్లలమీదనేగా! కుట్టి భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే నన్ను పోషించడం అవసరం అయిపోయింది. కుట్టి ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతుండేది. ఆమె నా మనసులో పీఠం వేసింది. ఆమెను పొంది రత్నాన్ని మరచాను. నా గుండెలో బల్లెములై గుచ్చుకున్న అతని కటువైన పదాల్ని మరచిపోయాను. కుట్టి స్కూలుకు వెళితే ఆమె వస్తువులు సర్దేదాన్ని. ఆమెకోసం బొమ్మలు తయారుచేసేదాన్ని. ఫ్రాకులు కుట్టేదాన్ని. స్వెటర్లు అల్లేదాన్ని. అయినా పొద్దు గడిచేది కాదు. అంత చిన్న వయసులో పిల్లలు చదువుకు అంటుకుపోవడం నాకు బాగనిపించేదికాదు. కుట్టి సాయంత్రం ఇంటికి వచ్చేది. హోంవర్క్ స్వయంగా చేసుకునేది. నా కాళ్లమీద పడుకొని మొక్కజొన్న కంకులు తినేది. రిజల్టు వచ్చింది. కుట్టి ఫెయిలయింది. నా గుండెలో ఎవరో తుపాకి దట్టించినట్లయింది. ఏడ్చిఏడ్చి పిచ్చిదాన్ని అయినాను. నన్ను చూచి కుట్టి ఏడ్చింది. ఇవ్వాళ రేపు చదువుకున్న అమ్మాయిలకు ఆదరం ఉంది. మామ దగ్గర డబ్బేముందని బంగారంలాంటి పిల్లవాణ్ణి తేవడానికి? గుణాన్ని చూచే చేసుకుంటాడని పెళ్లిచేయాలని నిశ్చయించారు."
    "అదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాను.
    "మీకు ఇదికూడా తెలియదా? బాల్య వివాహాల వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. పిల్లచిన్నదయితే ఆమె ప్రవర్తన చూడరు. పిల్లవాడు చిన్నవాడయితే ఎలాంటి పిల్లనయినా కట్టబెట్టవచ్చు."
    "అయితే కుట్టి పెళ్లి అయింది?"
    "అవును ఎంత ఆప్యాయంగా రత్నాన్ని పెళ్లికొడుకును చేశానో, అంత ఆప్యాయంగా కుట్టిని పెళ్ళికూతుర్ని చేశాను. కుట్టి వెళ్ళిపోతే నా సర్వస్వం దొంగలు దోచుకున్నట్లు అనిపించింది. ఎడిటర్ గారూ! ఎంత బుద్ధిహీనురాలిని నేను. ఒకేసారి విరల్ తో సహగమనం చేస్తే సరిపోయేది. ఇహ ఇప్పుడు సగం కాలిన నా దేహాన్ని చితినుంచి తెస్తున్నారు.
    "కుట్టి భర్త రంజన్ మంచివాడు."
    'ఏమిటి రంజన్ కుట్టికి మొగుడా?' నేను కూర్చున్నచోట నిలువలేకపోయాను.
    'అవును....' నిబ్బరంగా అన్నది. 'మంచి కుర్రాడు కుట్టి అత్తవారింట్లో ఏడిస్తే మోటర్ సైకిల్ మీద నా దగ్గరికి తెచ్చేవాడు.
    'మేమిద్దరమూ మీకోసం ఏడుస్తున్నాం' అనేవాడు.
    'అది విని ముగ్గురమూ నవ్వాం. అతను బాగా చదువుకున్నవాడు. కాలేజీలో చదువు చెపుతాడు. అందుకే కుట్టి అంటే అంత ఇష్టం. నా విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు. నా వంటరితనం చూళ్ళేకపోయేవాడు. ప్రతి ఆదివారం ఇంటికి వచ్చేవాడు. నాతో మెట్రిక్ పరీక్ష ఇప్పిస్తానన్నాడు. బస్తీకి తీసుకెళ్ళాడు. అతడు మంచి కవి. అతని అందమైన గేయాలు విని నేను ఏడ్చేదాన్ని. నేను పటికిబెల్లపు గడ్డను. కాస్త తడి తగిల్తే చాలు, కరిగిపోతాను.
    "ఊరికి ఆవల, చేలపక్కన, చింతచెట్టుకింద మేము చదువుకునేవాళ్ళం. కుట్టి సీతాకోకచిలుకల్ని పట్టడానికి వెళ్ళిపోయేది. మేమిద్దరం చెరకు తింటూ షేక్స్పియర్ "హామ్లెట్" చదివేవాళ్ళం. అప్పుడప్పుడు అతడు 'ఒడిసీ' వినిపించేవాడు. 'పెనూలెస్' సహనం చూస్తే నాకు ఏడుపు వచ్చేది. నా కన్నీరు చూచి అతను కళ్ళు తుడుచుకునేవాడు. రాత్రిళ్లు చాలాసేపు మేలికతో ఉండి కవిత రాసేవాడు. మరుసటిరోజు పొలాల ప్రక్కన కూర్చున్నప్పుడు తన కొత్త కవిత నా పదముల వద్ద పెట్టిపోయేవాడు. మేమిద్దరం అలా మిన్నకుండడం చూసి కుట్టి నవ్వేది. నా పేరుతో ప్రచురించబడిన రంజన్ కవితలు గల పత్రికలు చూపాడు. అది చూచి నేను వణుకుచున్నాను. నేను అనాధను. పేరూ ఊరు తెలియని ఆడదాన్ని. ఎవరికన్నా తెలిస్తే? అతను నన్ను చాలా ప్రఖ్యాతిపాలు చేశాడు! ఆ మాట అంటే నవ్వేవాడు"
    "మిమ్మల్ని గురించి నా అభిప్రాయం అదే"
    "అభిప్రాయం! నేను అదిరిపడ్డాను. "నన్ను గురించి మీకూ అభిప్రాయం ఉంది" అని ఏడ్చేశాను. ఏమిటిది నా జీవితపు అన్ని పుటలమీదా పరుల అభిప్రాయాలు రాసేస్తున్నారు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS