"ఒకరోజు ముగ్గురం ఇంటికి తిరిగివస్తే అత్తకు చాలా కోపం వచ్చింది. రంజన్ను కూడా రత్నం అనుకుంటున్నావా అన్నది.
"ఇవాళ మళ్ళీ విషం పూసిన బాణం నా గుండెలో దిగింది. ఇన్ని స్మృతుల సమాధులున్న గుండెల ఆడదానికి అది ఎంత బాధాకరమో మీకు తెలియదు."
ఆమె కళ్ళను కొంగుతో తుడుచుకుంది. గదిలో గంభీరమైన నిశ్శబ్దం ఆవహించింది. నేను ఊపిరి బిగపట్టి కూర్చున్నాను. ఎన్ని కరకు తలపులు తలచుకుందో కొంతసేపు అలాగే ఉండిపోయింది. తరువాత మెల్లగా చెప్పింది.
"మరుసటి రోజు నన్ను పొగడుతూ వచ్చిన సంపాదక లేఖలు చూచాను. రంజన్ రాసిన కవితలన్నీ కుట్టివడిలో వేశాను. నేటినుంచి కవితలు నీవి, పేరు నాది అన్నాను. రంజన్ను కోప్పడ్డాను. 'ఇహ మీరిద్దరూ పట్నం వెళ్ళిపోండి. మళ్ళీ ఇటు ముఖం చూపించవద్దు, తెలిసిందా?' అన్నాను.
"అది విన్నాడు అతడు అలిగాడు 'ఇంత రాతి గుండెదానివని అనుకోలేదు, అన్నాడు.'
"వెళ్ళిపోయేప్పుడు వాస్తవంగానే కోపంతో పెదవి కొరికేస్తున్నాడు.
"సరే నేను విఫల కామనల స్వప్నాల మధ్యనున్నాను. నన్ను గురించిన అభిప్రాయాలన్నీ మునుపెప్పుడూ విన్నట్లే ఉంటాయి. కాని కుట్టి పట్నంపోయి చాలా సుఖపడింది. ఆమె బి.ఏ. పాసైంది. ఆమె గొప్ప కవయిత్రి అయింది. ఆమెకు పట్నంలో గొప్ప ఆదరాభిమానాలు ఉన్నాయని విన్నాను. రంజనంటే ఆమెకు చాలా ఇష్టం. ప్రతివారం నాకు ఉత్తరం రాస్తుంది. దాన్నిండా రంజన్ ప్రేమకు సంబంధించిన ముచ్చట్లే ఉంటాయి. గతవారం మీ సంపాదకుని ఒక లేఖ నాకు పంపింది. మీ ఎడిటర్ చాలా కరినుడు."
"ఏమి? ఏమైంది?"
ఆమె మాట్లాడలేదు. కాని ఆమె ముఖంలో ఆవేదన చూచి నాకే సిగ్గనిపించింది.
"మీ గీతల్లో వేదన చూచి మీరు రుచికరమైన బాధాకవిత రాయగలరనిపిస్తూంది. ప్రయత్నించగూడదూ అని రాశారు కుట్టికి మీ సంపాదకుడు.' ఆ ఉత్తరం చదివి రంజన్ చాలా బాధపడ్డాట్ట. శ్యామలాదేవి ఊళ్ళో నవ్వుతూ ఉన్నన్నాళ్ళు నాకలా ప్రశాంతంగా ఉంటుంది. ట్రాజిడీ రాయలేను అన్నాట్ట. అసలా ఉత్తరం అతడు చించేసేవాడేనట. కుట్టి లాక్కొని రహస్యంగా నాకు పంపింది."
"నిజం!" నేను నిస్సహాయునిలా కేక పెట్టాను. ఆమె జారిపడనున్న భాష్పబిందువులా వణికింది.
'అయితే మీరు కుట్టికి ఏంరాశారు?'
'ఏమీలేదు' ఆమె పంటితో పెదవిని కొరుకుతూ అన్నది.
'ఆ ఉత్తరానికి జవాబుగా ఇక్కడికే వచ్చేశాను. నేను ఇక్కడికి రావడం కుట్టికి ఏమాత్రం ఇష్టంలేదు. ఇంకా ఆమె పసిపిల్ల కాదుగా, ఊరికే నవ్వుతూ ఉండిపోవడానికి! అయినా నేను ఆమెను సమాధానపరచగలను. ఇక్కడే రంజన్ ముందే అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే రంజన్ చాలా బాధపడ్తాడు. కుట్టి కోరిక తప్పక పూర్తి అవుతుంది.'
నాకు భయం అయింది. శ్యామల దాచిపెట్టిన సీసా, అగ్గిపెట్టె చూడసాగాను. పదాలు గొంతులో ఇరుక్కున్నాయి. బయటపడ్డంలేదు. నేను చకితుణ్ణయి కూర్చున్నాను-ప్రతిమలా. ఆమె మెల్లగా కళ్లు తెరిచింది. నన్ను చూచింది. ఉలిక్కిపడ్డది. చప్పున లేచింది. నుంచుంది.
'క్షమించండి. అనవసరంగా మీ సమయం వ్యర్ధపరచాను. లోకం శ్యామలాదేవి అని పిలిచేవారి ఇంటర్వ్యూ కోసం వచ్చారు మీరు' అని లోనికి వెళ్ళిపోయింది.
నేను నిశ్చేష్టుణ్ణయినాను. మొత్తంమీద కదలడానికి సిద్ధపడ్డాను. అదే సమయంలో జలతారు బైండు పుస్తకంలాంటి అందమైన ఆడది గదిలో ప్రవేశించింది. ఆమె ధరించిన అందమైన బట్టలు వలపు కవితల సంకలనంలా ఉన్నాయి.
"క్షమించండి-ఆలస్యం అయింది. నా కవితా శిల్పాన్ని గురించి అడగదలచుకున్నారు కదూ?" అన్నది. ఆమె ధ్వనిలో ఒక మహాకళాకారిణికి ఉండే దర్పం ఉంది. సోయగం వలకబోస్తూ సోఫాలో కూర్చుంది.
'అవును నిజమే - కాని ఇప్పటికే ఆలస్యం అయింది' అని లేచి నుంచున్నాను.
* * * *
