Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 28


    కొందరు స్త్రీలు జలతారు అట్టగల పుస్తకాలు అవుతారు. అవి ఆదరణీయుల ఆస్తి అవుతాయి. వాటిని అద్దాల అలమారులో దాచిపెడ్తారు. వాటిని ప్రేమగల చేతులతో విప్పుతారు, చదువుతారు. కొందరు స్త్రీలు మరోరకం పుస్తకాలు అవుతారు. పారకుడు దాని శీర్షిక చూస్తాడు, విసిరివేస్తాడు. పనికిమాలినవారు వీటిని చదివి కాలక్షేపం చేయాలనుకుంటారు. సంచార గ్రంథాలయం వాటిని ఊరూరా తిప్పుతుంది. రెండు పైసలకు ఒకని చొప్పున చేతులు మారుతుంది. చివరకు పచారీ దుకాణానికి వెళ్లిపోతుంది. అక్కడ వాడు పొట్లాలు కట్టేస్తాడు. అంతటితో ఆ పుస్తక జీవితం ముగుస్తుంది.
    ఆమె నిట్టూర్పు విడిచింది.
    "పుస్తకాలకూ జీవితం ఉంటుందా?" నాకు నవ్వు వస్తూంది. "పుస్తకాలు స్త్రీలుగా మారిపోతున్నాయి"
    "అయితే పుస్తకాలకూ స్త్రీలకూ ఏదో వ్యత్యాసం ఉందనుకుంటున్నారు. రెండూ ఒకలాంటివే. రెంటిలో దేనినీ చదవకుండా కొనడానికి ఇష్టపడరు. అంతేకాదు చదివిన కథల్ని వినడానికీ ఎవరూ ఇచ్చగించరు.
    మాట్లాడేప్పుడు ఆమెలో అందం వెల్లివిరుస్తుంది. గేయాల్లో ఈమె భాషా సౌందర్యం తొణికిసలాడుతుంటుంది.
    "మీరూ జలతారు అట్టగల పుస్తకమే కదా!" అడిగాను- అంత ధైర్యం ఎలా వచ్చిందో!
    "నేను....నేనా?" తొలిసారిగా అంతర్ధర్శనం అయినట్లు చూచుకుంది. తరువాత నన్ను చూచింది. ఆమె చూపుల్లో ఉదాసీన్యం కనిపించింది.
    "నేను ఆటోగ్రాఫ్ పుస్తకాన్ని. దాని సాదాపుటలమీద జనం అభిప్రాయాలు రాశారు. సంతకాలు చేశారు. వెళ్ళిపోయారు" ఆమె కళ్ళలో నీళ్ళు నిండుకున్నాయి. దుముకడానికి సిద్ధంగా ఉన్నాయి. నేను భయపడ్డాను. నా రిపోర్టు పుట్టి మునిగిందనుకున్నాను.
    "నేను మిమ్మల్ని మీ పూర్వ జీవితాన్ని గురించి అడిగాను. ఆడవాళ్ళ పూర్వజీవితం రోమాంచకంగా ఉంటుందని నా ఉద్దేశం."
    "అవును అదే చెపుతున్నాను. ఇంకా నాకు పధ్నాలుగేళ్ళు నిండకముందే విధవను అయినాను"
    'విధవ....' నేను ఉలిక్కిపడ్డాను. నా మనోనేత్రంలో శ్యామలాదేవి భర్త రంజన్ కనిపించాడు. అతడు తరచుగా మా ఆఫీసుకు వస్తుంటాడు. ఆమె నన్ను చూడ్డంలేదు. నా అవస్థ చూడ్డంలేదు. శూన్యంలోకి చూస్తూంది.
    "విరల్, నేను చిన్ననాటి నుంచి కలిసి ఆడుకున్నాం. కలిసి పెరిగాం. నేను అతని భార్యను అయినాను. అతడు అలిగాడు. విరల్ చనిపోయాడంటే నమ్మకం కలిగేది కాదు. దాగుడు మూతల్లో దాక్కున్నాడనిపించేది. ఆనాడే నా ముఖంమీద ముద్రవేశారు 'అరిష్టము' అని.
    "సరే అదంతా రాయకండి. ఇరవైఏళ్ళ వయసులో మెట్రిక్ పాసైనానని రాయండి. అది మాత్రం ఎలా? నాకు చదువుమీద ధ్యాసపడింది. కుట్టిపెళ్ళి తరవాత. కాకుంటే ఒక మహాకవి నాకు చదువుమీద ధ్యాస కలిగించాడని రాయండి. అతనే నన్ను శ్యామలాదేవిని చేశాడు. అవును అదిమాత్రం ఎందుకు? రాశారా? కొట్టేయండి, అక్కర్లేదు"
    ఆమె సోఫాకు తల ఆనించి ఇంటి కప్పును చూస్తూంది. నిముషాలు గడుస్తున్నాయి.
    నేను కలం పట్టుకుని కూర్చున్నాను.
    "వింత జీవితం గడిపాను" తనలోతాను గునుసుకుంది.
    'ఈ దరినుంచి ఆ దరిదాకా నావెంట ఎవరూ లేరు. నేను వంటరిని కాను. ఏ ఆడదయినా అలా జీవించగలదా?' తను సంబాళించుకొని నన్ను అడిగింది. ఆమె పెదవులు అదరుతున్నాయి ఎంత నిగ్రహించినా కన్నీరు చెంపలమీంచి జారుతోంది.
    నేను జవాబు చెప్పలేదు. ఇదంతా నా నెత్తిన వేసుకొని సిగ్గుతో కుంగిపోయాను.
    "ఇహ ఇలా చెప్పడం సాధ్యపడదు. రాసిస్తాను ఏమంటారు? మీరు మాత్రం ఇక్కడే కూర్చోవాలి. ఈ పని ఇవ్వాళే చెయ్యాలి." అన్నది గొంతు సవరించుకుంటూ.
    'సరే, అలాగే కానివ్వండి' నేను అన్ని షరతులకూ సిద్ధంగా ఉన్నాను. నేను కలం మూసి జేబులో పెట్టుకుంటే పద్నాలుగు సంవత్సరాల జైలు జీవితం నుంచి విముక్తి కలిగినట్లు నిట్టూర్చింది.
    నేను ఫైలు కట్టేశాను. సిగరెట్ ముట్టించాను.
    "రంజన్ గారు ఇంట్లోలేరా?"
    "లేరు, బయటికి వెళ్ళారు. రేపు వస్తారు."
    "ఈ ఫోటో మీ పెళ్లినాటిది అనుకుంటా. అవునా?"
    'అవును అప్పటికి నాకు పధ్నాలుగేళ్లు. అయినా పసిపిల్లలా ప్రవర్తించేదాన్ని. నేను వెధవను అయితే మా అమ్మ సైతం నన్ను మృత్యువును చూసినట్లు చూసేది. పగలంతా ఒక మూలకు కూలబడేదాన్ని. ఏంచేయాలో అర్థం అయ్యేదికాదు. ఆలోచనలకు అంతు ఉండేది కాదు. ఒకనాడు ఉదాసీనంగా ఉన్న నన్ను రత్నం చూశాడు. 'ఎన్నాళ్లయింది నువ్వు నవ్వక....' అన్నాడు. నన్ను ఎవరో కుదిపినట్లనిపించింది.
    "మనం మనకోసం నవ్వుతాం, మనకోసం ఏడుస్తాం. ఆ విషయం పరులకు ఎందుకు? అయినా జీవితంలో ఒకరోజు వస్తుంది ఆనాడు తెలుస్తుంది మన కన్నీటి కైఫియత్తులు, నవ్వుల లెక్కలు మరొకని దగ్గర ఉన్నాయని. అది తెలిసిన్నాడు ఎలా ఉంటుంది? కుదిపినట్లుంటుంది. కదిపినట్లుంటుంది. విద్యుల్లతను అంటుకున్నట్లుంటుంది. అప్పుడు మనం సూర్యునిలా వెలుగుతున్నామనీ, భూమి మన చుట్టే గుండ్రంగా పరిభ్రమిస్తూందనీ అనుకుంటాం. రత్నం మా బాబాయి కొడుకు. నాకంటే అయిదారేళ్లు పెద్ద. వరసకు మేం అన్నా చెల్లెళ్ళం. చిన్ననాటి పోట్లాటలు ఇంకా మరపురాని రోజులు. అతని పెళ్ళాం ముందే అతని జుట్టు పట్టుకొని లాగేదాన్ని. అతడు నా ముఖాన మసి పూసేవాడు. అతడు మసిపూసినా నేను నవ్వేదాన్ని. నాలుక బయటపెట్టి వెక్కిరించేదాన్ని.
    "నేను వెక్కిరించానా? అతడు నా జుట్టు పట్టుకోడానికి వచ్చేవాడుకాదు. ఎంచేతంటే అది తెలుసుకొని ముందే నేను కేకలు పెట్టేదాన్ని. ఏదైనా మనం అనుకున్నట్లు కాకుంటే సిగ్గువేస్తుంది. ఎవరో నోటిముందటి ముద్ద లాక్కున్నట్లు అనిపిస్తుంది.
    "నేను తిరిగి చూచాను-పెళ్ళాం రత్నం జుట్టుపట్టుకొని ఊపుతూంది-ఇద్దరూ విరగబడి నవ్వుతున్నారు. నాకేమైందో తెలియదు-ఉరికానూ-రత్నాన్ని విడిపించాను- జారిపోయిన వదిన పయ్యద సవరించాను.
    "ఎందుకలా సతాయిస్తావు రత్నాన్ని?" అన్నాను. ఎవరూ మాట్లాల్లేదు. ఇద్దరూ ప్రతిమల్లా నుంచున్నారు. రత్నం తలవంచుకున్నాడు. చొక్కాకు అంటిన దుమ్ము దులుపుకుంటున్నాడు. వదిన రెప్పవాల్చడంలేదు. నన్నే చూస్తుంది. నాకేదో బుగులయింది. తలవంచుకున్నాను- ముఖం దాచుకున్నాను. మళ్ళీ ఎవరో నోటిముందరి ముద్ద లాక్కుంటున్నట్లు అనిపించింది.
    "నా కాళ్ళు బలవంతంగా నన్ను గదివైపు లాక్కెళ్తుంటే వదిన చూపుల అగ్నికణాలు దోవలో పరుచుకున్నట్లు అనిపించింది. రాజ్యం శత్రువశమైన రాజులా నేను మంచంలో పడిపోయాను. నాకు తెలియకుండానే కన్నీరు దుమికింది. ఆడపిల్లలు పెళ్ళాలు కాగానే ఇలా ఎందుకవుతారు? రత్నానికి తలనొప్పి లేచిందనుకోండి- పెళ్ళానికెందుకు బాధ?
    "చూడండి-ఒకేచోట ఉండే పశువులతో కూడా అనుబంధం కలుగుతుంది- ఏమంటారు? అలాంటిది రత్నం నా చిన్ననాటి తోటివాడు. రత్నం నా సావాసకాడు- ముద్దుల అన్న. నేను విధవను అయినప్పుడు మా పిన్ని చాలా దుఃఖించింది. మా అమ్మను తిట్టి, శపించింది. నాకు పెళ్లి చేసి బావిలో తోశావంది. కాస్త ఓపికపడ్తే రత్నానికి చేసుకునేదాన్ని అన్నది. వారిద్దరూ ఎంత ప్రేమించుకునేవారు!
    "వారిద్దరూ ఎంత ప్రేమించుకునేవారు! నేను కళ్లుమూసుకున్నాను. ఆలోచించాను-ఒకడు ఒకే ఒకడున్నాడు నా కన్నీరు తుడిచేవాడు. అలాంటి నాడు నాకు అన్యాయం జరిగితే సహించగలడా? అతడు నా ముందుంటే నేను మనిషినే అనిపించేది. నా ప్రాముఖ్యం కనిపించేది. కాంతి కిరణం అద్దం మీద పడి చమక్కుమంటుందే అలా!
    "అదిగో అదీ రత్నం పటం" అని ఆలోచనలు ముసిరినా ఒక యువకుని పటం చూపింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS