చచ్చినదాన్ని గురించి ఎందుకులేరి ఇట్ల బతకనియ్యరి బాంచను" - పెంటయ్య వాస్తవాన్ని బట్టలిప్పి నగ్నంగా చూపాడు.
"అరే! అట్లంటే ఎట్లరా? చచ్చింది దేవత అయితదట నువ్వు విందులు చేయకుంటే దాని జీవాత్మ ఈ ఊరిని పట్టుకొని ఏళ్ళాడుతుంటది చెప్పింది ఇను, ఎంత కావాల్నో చెప్పు ఇస్త ఇంత తాగుడు పోయించు"
"దొరవారూ! మీ అసుమంటి దానకర్నున్ని చూడలేదుండి వద్దంటే అప్పులిచ్చి దినవారాలు చేయిస్తున్నరు" - దస్తరం ముందు కూర్చున్న జగన్నాథం శివయ్యను పొగిడాడు.
"బతికినోల్లకు పూటకు లేదు, చచ్చిందానికి విందులేమిటికిలేరి అయినా, ఏం చూసి బాకీపెట్తరుండి? పెంటడు నిండ మునిగి ఉన్నడు-" వెంకయ్య వేయాల్సిన ప్రశ్నవేశాడు.
"అదేందిరా అట్లంటవు? పెంటడు లగ్గం చేసుకోడా? వానికి పిల్లలు పుట్టరా?"
"నేను లగ్గం చేసుకోన్రి బాంచోల్లను పుట్టించటానికి పెండ్లెందుకుండి? మా అయ్యా నన్ను బాంచోన్ని చేసి పుట్టించిండు చాలు, నేను కూడా బాంచోళ్ళను పుట్టించాల్నా! మీరు నాకు బాకీ ఇయ్యొద్దు, నేను లగ్గం చేసుకోవద్దు"
"రే! చిన్నగ చెప్తాంటే ఇంటలేరు, లంజకొడుకుల్లార! ఆ చచ్చినముండ గంజో, గంజో అని చచ్చిందిట ఇప్పుడది ఊరు పట్టుకుని తిరుగుతుంటది మీకేంది, మీ సంగతి చూసుకుంటాన్రు నేని ఊరిసంగతి చూడాలే ఇన్నవా? ఎంత కావాల్నో బాకీ తీసుకో, దిన వారాలు చెయ్యి, ఇన్నవా? ఇగో, శాస్త్రుర్లుగారు కూడా వస్తన్రు" అని వచ్చే శాస్త్రుర్లు గారికి స్వాగతం పలికి, కుర్చీలో కూర్చుండబెట్టి విషయం వివరించి, ధర్మం చెప్పమన్నాడు.
"అయ్యగారూ! గా చచ్చింది గంజి లేక చచ్చింది మేం కల్లుతాగితే దానికి అందుతాదుండి బాంచను, నాలం చెప్పుండి" - వెంకడు అడిగాడు.
శాస్త్రుర్లుగారు తల గోక్కున్నారు సుదీర్ఘంగా ఆలోచించసాగారు అందరూ మౌనంగా ఉన్నారు శాస్త్రిగారి తీర్పుకోసం ఎదురుచూస్తున్నట్లున్నారు.
"దొరవారూ! ధర్మం కాలాన్నిబట్టి మారుతుంటుంది యుగధర్మాన్ని మించిన ధర్మం లేదు ద్రౌపదికి అయిదుగురు భర్తలు, అది ఆనాటి ధర్మం ఈనాడు చెల్లదు శాస్త్రంలో దినవారాలు చెయ్యమన్నారుగాని శక్తినిమించి చేయమనలేదు రాముడు దశరాదునికి గారపిండితో పిండాలు పెట్టినాడు 'యదన్నః పురుషోభవతి తదన్నాస్తస్య దేవతాః' అన్నారు ఉన్నదానిలో దినవారాలు చేయమన్నారుగాని అప్పుచేసి చేయమనలేదు" అని శాస్త్రులవారు చెప్పి ఊరుకున్నారు.
"శాస్త్రిగారూ! మీరు వాండ్ల పక్షం వహిస్తున్నారు" శివయ్య మండిపడ్డాడు.
"ధర్మానికి పక్షపాతంలేదు వస్తా దొరవారూ!" అని లేచి సాగిపోయారు శాస్త్రిగారు చూస్తూ ఉండిపోయాడు శివయ్య అతనికి అంతా విచిత్రంగా ఉంది శాస్త్రిగారు కూడా మారిపోతున్నారు.
"అరే పెంటిగా! చిన్నగా చెప్పుతే నీకు నెత్తికెక్కుతలేదు తీసుకుంటవా అప్పుతీసుకుని దినవారాలు చెయ్యి, లేకుంటే తీసుకున్న అప్పు కక్కి ఈడినుంచి కదులు, ఇన్నవా?"
జనంలో కలకలం బయల్దేరింది ఏం చేయాలో ఎవరికీ అర్ధం కాలేదు తళా ఒక మాటన్నారు ఎవరేమంటున్నదీ అర్ధం కావడం లేదు.
"ఉన్నట్లుంది తెమ్మంటే యాడినుంచి తెస్తడండి?" వెంకడు తెగేసి అడిగాడు.
"లేకుంటే దావా పెట్టి జేలుకు పంపిస్తా శివయ్యంటే ఏందో నీకు అర్ధం ఆయితలేదు తీసుకో ఎంత కావాల్నో - ఇయ్యాలరాత్రికి గూడెంలో ఇందుకావలె కాదంటవా, జేలుకు తయారుగుండు, ఇన్నావా?"
"పంపుడి జేలుకు ఆడ ఇంత బువ్వన్న ఏస్తరు గద మల్లోచ్చేటాల్కల్ల బాకీ ఉండకుండ అయితది తయారుగున్ననుండి, పంపుండి ఇగో, బేడీ లేయించుండి" చేతులు ఎత్తి చూపించాడు పెంటడు.
తెగపడ్డవాణ్ణి ఏం చేయడం? ఏమీ అర్ధంకాలేదు శివయ్యకు కోపంతో మండి పోతున్నాడు కళ్ళు చింతనిప్పులవుతున్నాయి కాళ్ళూ, చేతులూ వణుకుతున్నాయి.
"ఒరే నర్సిగా! వీణ్ణిపట్టి చెట్టుకు కట్టెయ్యరా చూపిస్త తడాఖా! ఏమనుకుంటాడో గాడ్ది కొడుకు పానంతీసే ఈన్నించి పంపుత వీడు కూడ వీని అమ్మను చేరుకుంటాడు" - గట్టిగా అరిచాడు శివయ్య అరుపుకు ఇల్లు దద్దరిల్లింది.
జగన్నాథం దస్తరం వదిలి ఎవరికీ చెప్పకుండా జారుకున్నాడు-శివయ్యకు రెండు వేళ్ళు చూపించి.
"ఏమంటావురా? దొర చెప్పినట్లు ఇను గాడ్ది కొడక!" అంటున్నాడుగాని నర్శిమ్మ ఉన్నచోటునుంచి కదల్లేదు.
శివయ్య మండిపడ్డాడు వీడూ వాళ్ళలో కలవలేదు గదా అని భయపడ్డాడు.
"అరె నర్శిగా! బొమ్మోలె నిలపడ్డవేమిరా! పడ్తవా? నన్ను పట్టమంటవా?"
నర్సిమ్మ బల్లెం పట్టుకొని ముందడుగు వేశాడు వెంకడు వచ్చి పెంటనికి చాటు నిల్చున్నాడు ఉన్నజనం సాంతం పెంటన్ని చుట్టివేశారు నర్సిమ్మకు పెంటడు అందేట్టు లేడు అయోమయంలో పడ్డాడు నర్సిమ్మ బల్లెం చేతులోంచి జారుతుంది నిస్సహాయుడయి శివయ్యను చూచాడు.
"బాకీ చేయకుంటే పానం తీస్తడా? పెంటడి నెందుకుండి, అందరిని చంపుండి ఊరిని పీనిగలపెంట చెయ్యుండి కానియ్యుండి, ఎంతమందిని చంపుతరో చూస్తం అన్నాలంగ అప్పులు పెట్టి, వడ్డీలు పెంచి, కూడు పెట్టక, కూలి ఇయ్యక, ఈ ఊరినంత పశులదొడ్డి చేసిన్రు కుక్కిన పేలోలే పడుంటే ఇంకా కుక్కుతాన్రు కుక్కుండి, చంపుండ్రి ఇంత పాపం ఊరికే పోతదా! పోరలు లేకుండ అయిన్రు కద! ఇగ అందరిని చంపుండి సుబద్రమ్మ, నువ్వు ఉత్తికట్టుకొని ఊరేగున్రి, ఊరేగవయ్యా - ఊరేగూ! రా, ఇంకా కూచున్నవేం? చంపు, ఎంతమందిని చంపుతావో ఊఁ చంపవేం" - బయటినుంచి వచ్చిన బ్రహ్మయ్య ఉద్రేకంగా శివయ్య ముందుకు ఉరికాడు పైపంచె అందించి, ఉరి తీయమన్నాడు.
శివయ్యకు అంతా అయోమయంగా ఉంది అంతా కటిక చీకటిలా ఉంది ఆకాశం విరిగిపడినట్లూ, సముద్రాలు ఇంకిపోయినట్లూ, సూర్యుడు నేలకూలినట్లూ ఉంది ఏం చేయాలో అర్ధం కాలేదు చంపమని మీదికి వచ్చే బ్రహ్మయ్యను ఏం చేయగలడు? చావడానికి సిద్దంగా ఉన్న జనాన్ని ఏం చేయగలడు? వారంతా ఒక్కుమ్మడిగా తనమీద పడి ప్రాణాలు బలిగొంటే ఏం చేయగలడు? తానెంత? తన శక్తి ఎంత - అర్ధం అయింది ఎంత పెద్ద పామైతేనేం, చలిచీమలకింద నిలువగలదా? ఏం చేయాలి తాను? శివయ్య దిగ్గున లేచి నుంచున్నాడు గబగబా లోనికి ఉరికాడు తలుపులు దభాల్న వేసుకున్నాడు "అయిపోయినాదిర గాడ్ది కొడుకుల్లార! రేపన్నించి ఏం తింటరో చూస్త" - గట్టిగా కేకపెట్టాడు కాని, ధ్వనిలో వణుకు కనిపిస్తూంది భయం వ్యక్తం అవుతూంది.
"చూస్తం మేం గూడ తిండిలేకుంటే మాడి చస్తం నీ పనికి అయితే రాము చూస్తం ఎవరు గెలుస్తారో - రాముడే గెలుస్తడో - రావణాసురుడు గెలుస్తడో?" బ్రహ్మయ్య గట్టిగా అన్నాడు అతని దృష్టిలో స్థిరత్వం ఉంది పట్టుదలుంది ప్రాణానికి తెగింపు ఉంది.
"అంతే - చస్తం - తేల్చుకుంటం శివయ్య గెలుస్తడో, మేం గెలుస్తమో!" అంతా ఒక్కుమ్మడిగా అన్నారు అక్కన్నుంచి వెళ్ళిపోయారు.
శివయ్య ఇంకా వణుకుతూనే ఉన్నాడు.
శివయ్య ఇంకా వగరుస్తూనే ఉన్నాడు.
17
"చూస్తం - తేల్చుకుంటం" అని ఆవేశంగా అన్నది గూడెం ఉద్రేకంలో అన్నారు జనం కాని, వాస్తవంగా రంగంలోకి దిగుతే "తేల్చుకోవడం" అంత తేలిక కాదని తెలిసివస్తూంది బానిసత్వం అన్నా, బంధం అన్నా - సాయంకాలానికల్లా శివయ్య వొళ్ళో గింజలు పోసేవాడు ఆకలి ఆరడానికి అవి పనికి వచ్చేవి గూడెం పనులు బంద్ చేసింది తిండి బంద్ అయింది ఏదిలేకున్నా మనిషి జీవించగలడు తిండి లేకుంటే జీవించడం కష్టం గూడేనికి ఏదీలేదు ఉన్నదీ తిండి అది కూడా ఆగిపోయింది తిండి గింజలను మించిన రాజకీయం లేదు అది ఆగితే అంతా లొంగివస్తారు.
గూడెంలో నిప్పు రాజటం లేదు జనం ఆకలితో అలమటించిపోతున్నారు పసిపిల్లలు పాలులేక తల్లడిల్లిపోతున్నారు గూడెం సాంతం పాడుబడ్డట్లుంది నిర్జీవంగా ఉంది నిరామయంగా ఉంది శక్తిహీనంగా ఉంది శ్మశానంలా ఉంది.
"ఎంకన్నా, ఆకలి మండిపోతున్నదిర! ఎన్నాళ్ళని ఇట్లుంటం? అగొ చూడు, పోరలు అననుపట్టి ఏడుస్తన్రు అరే, తిండికి లేనోడు గెలిచినాడ్ర యాన్నన్న?" ధర్మయ్యకు చేతులు వచ్చినప్పటినుంచీ ఆకలి ఎక్కువయింది.
"నీయవ్వ, గిదంత గా బమ్మయ్య చేసిండు - పోదాం పారి వానింటిమీదకి" పిచ్చయ్య నేలమీద ఊసి లేచి నుంచున్నాడు.
"దొరకాడికిపోయి కాళ్ళు పట్టుకుందం ఇంత గంజన్న పోస్తాడు" - ముసలి యల్లమ్మ మూలిగింది లేవలేక కూలబడ్డది.
