Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 28


                            వేదాంతి

    రాజారావు త్వరలోనే చెన్నపట్టణము వెళ్లి కాలేజీలో జేరదలచినాడు. విక్టోరియా హాస్టలులో నుండుట కతని కాయేడు వీలులేదు. విశ్వవిద్యాలయము వారు నెలకొల్పిన వసతి గృహములో నతడు విధిగా జేరవలసినచ్చెను. ఆ యేటితో నతని చదువుగూడ బూర్తియగును.
    రాజారావు వైదిక సాంప్రదాయము సంపూర్ణముగ నెఱపు వెలనాటి బ్రాహ్మణుడు. చిన్నతనములో నతనితండ్రి వసుదేవశాస్త్రిగారు సంధ్యావందనము, పురుషసూక్తము, శ్రీసూక్తము, నమకము, చమకము నతనికి నేర్పినాడు. వేదములో కొన్ని సూక్తములు పఠించినాడు. కాని రాజారావున కా చదువు నచ్చామి దండ్రిగారితో జెప్పకయే మోడేకుఱ్ఱునుండి పారిపోయి కాకినాడ జేరుకొని, కొందరు సంపన్న గృహస్థుల యింట వారములు కుదుర్చుకొని, దయాహృదయుడు, విజ్ఞాన సముద్రుడు, భగవద్భక్తుడు, బ్రహ్మమతాలంకారుడు, కళాశాలాధ్యక్షుడునగు శ్రీ వెంకటరత్నంనాయుడు గారి దయకు బాత్రుడై విద్యార్థి వెతనమును సముపార్జించుకొన్నాడు.
    తనయు డెచ్చటికి బోయినదియు దెలియక యతని తల్లిదండ్రులు బెంగగొనిపోయిరి. అతని తల్లి పేరమ్మగారికి మతిబోయి మూర్ఛ జనించినది. పిమ్మట నెల దినములకు మూడవ ఫారములో తాను జేరినాననియు, బాగుగా జదువుకొనుచున్నాననియు, రాజారావు ఉత్తరము వ్రాసెను. దానితో తల్లిదండ్రులిరువురు కాకినాడ పోయి కుమారుని జూచి, కనుల నీరు నింపుకొని, కుర్రవానిని వదిలి యుండలేక తాము సకుటుంబముగా వచ్చి కాకినాడలోనే వసింప నిశ్చయించుకొనిరి.
    రాజారావంత అద్భుతమైన తెలివితేటలుగలవాడు కాడు. ఎట్టులో కష్టించి పరీక్షలలో గృతార్ధుడగుటకు వలయు తెలివితేటలతనికాడ నున్నవి. కాబట్టి ఏ పరీక్షయు దప్పకుండ నెగ్గుచుండెను. తుద కింటరు పరీక్షలో రెండవ తరగతిలో గృతార్ధుడై మదరాసు వైద్యకళాశాలలో బ్రవేశము సముపార్జించెను. కాకినాడలో నతని తండ్రి తన తెలివితేటలచే కుటుంబ వ్యయమునకు సరిపడా సంపాదించుకొనుచు, భూమి వలన వచ్చు రాబడిని నిలువ వేసుకొనుచు, చిన్న చిన్న పద్దుల మీద వడ్డీవ్యాపారము సలువుకొనుచు కాలము బుచ్చినాడు. నేడు తన కుమారునకు మదరాసు వైద్యకళాశాలలో బ్రవేశము దొరకుట యాయనకు జాల సంతోషముగా నుండెను. రాజారావు స్కూలు పైనలు పరీక్ష చదువుచుండినప్పుడే మంచి సంబంధమొకటి వచ్చినది. పెండ్లి వైభవముగ జరిగినది. రాజారావింటరు పరీక్షకు బోవుటకు ముందే యతనిని బునస్సంధానము జరిగినది. వైద్య విద్యార్థియైన ప్రథమ సంవత్సరములోనే యుభయవంశపావనియగు కూతురు పెన్నిధివలె జనించెను.
    రాజారావునకు నారాయణరావునకు చెన్నపట్టణములో స్నేహ మేర్పడినది. చిన్నతనములో రాజన్న శాస్త్రియగు నేటి రాజారావు సహజపాత్ర శీలుడు. పదిమందితో స్నేహము చేయలేడు. క్రొత్తవారితో మాటలాడలేడు. చిన్నతనమున కాకినాడలో పెద్దలతో నెట్లు మాట్లాడెనో యెట్లు వేతనము సంపాదించుకొనెనో, పెద్దవాడైన రాజారావునకు గ్రాహ్యము కాలేదు. నారాయణరావు సహజధీర స్వభావుడు గాన సభాకంప మెఱుగడు. రాజారావు పిరికివాడు. సభలో నోరెత్తలేడు.
    అట్టి రాజారావును, నారాయణరావు కోమలవిలాస కాఫీ హోటలులో జూచినప్పుడు పలుకరించెను. ఆనాటి నుండి స్నేహ సముద్రుడైన నారాయణరావు రాజారావు గదికి వెళ్ళుట ప్రారంభించియు, సినిమాలకు దీసికొని వెళ్ళియు, కాఫీ హోటలులో దన స్నేహితులకు విందులిచ్చినప్పుడు రాజారావును గూడ లాగుకొని యేగియు, నతని హృదయమును జూరగొని యించుకించుక బెదరుదీర్చినాడు.
    రాజారావునకు దెలుగుకవితయందలి నేటి క్రొత్త పోకడలు రుచింపవు. స్వయ మాత డెద్దియు రచింపనేరడు గాని పురాణములు చదువుకొనుట యన బరమప్రీతి. వేదాంత గ్రంథములన్న ప్రాణమే. వివేకానంద, రామతీర్థులు, అరవిందఘోష, జ్ఞానానంద ప్రేమానంద రాధాకృష్ణులు మొదలగు తత్వజ్ఞులు వ్రాసిన గ్రంథములన్నియు బూర్తిగ జదివినాడు. చైతన్యుడు, రామకృష్ణ పరమహంస, హరనాథబాబా, రాధాస్వామి సత్సంగ గురువు మొదలగు వారి చరిత్రములు, బోధలు చదివినాడు.
    నారాయణరావుగూడ వేదాంత విచారమున నత్యంత ప్రీతిగలవాడు. అతడు మన పురాణేతిహాసములే గాక, వేదములు, బ్రహ్మసూత్రములు, గీత సాధు నిశ్చలదాస యోగీంద్రుని విచారసాగరము, వృత్తి ప్రభాకరముగూడ పఠించినాడు. యోగవాసిష్ఠము, జ్ఞానవాసిష్ఠము, సీతారామాంజనేయ సంవాదము, ఆధ్యాత్మ రామాయణము, ఉపనిషత్తులు, శంకర భాష్యము, పంచదశి మున్నగు తత్వవిచారగ్రంథముల సారమెఱింగిన వాడు. మధ్వరామానుజమతముల పరిచయము సంపాదించినాడు. బుద్ధ పీఠకములు, జాతక కథలు, ధర్మపథము పరికించినాడు. జెండవిష్ణా, ఖురాను, బైబిలు, జైన సాంప్రదాయములు నవగతము చేసికొన్నాడు. కారల్ మార్క్స్, నీషీ, షోపన్ హోరు, బెర్కిలీ, ఎమరుసన్, బేకను, హాల్డేను, ఎడ్వర్డు కార్సెంటరు, టాల్ స్టాయి, రోలండు, బెర్నార్డు షా, ఎయిన్ స్టీన్, ఎడింగ్టన్, ఫ్లూటో, అరిస్టాటిల్ మొదలగు పాశ్చాత్యవేత్తల భావములు హృదయస్థము చేసుకొనెను.
    నారాయణరావు రాజారావుతో నెల్లప్పుడు వేదాంత విషయముల జర్చ చేయుచు నానందము నొందును. రాజారావు తన జన్మమున నా నిమిషములే శుభ ముహూర్తములని తలచి నారాయణుని రాక కెదురుచూచుచుండును.
    'మన ఆర్షవిజ్ఞానం ముందు డార్విన్ సిద్ధాంతాలు బాలశిక్ష వంటివోయి! అతని పరిణామవాదం కేవలం భౌతికం. వినికీ, చూపు కూడా లేని కీటకాలుండేవట ఆదిలో. పిమ్మట దృష్టి శ్రవణాది జ్ఞానం గల సరీసృపాలు ఏర్పడినవట. ఆపైన పాలిచ్చే జంతువులేర్పడి, క్రమంగా కొంచెం మెదడు సంపాదించుకొని కోతులై, చివరకు మనుష్యులుగా పరిణమించినవట. జంతుకోటిలో యీ మెట్లన్నీ కనబడుతూనే వున్నాయట. ఈమాత్రం కనిపెట్టినందుకు డార్విన్ వాళ్ళకోక ఋషి అయిపోయినాడు' అనెను రాజారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS