"అమ్మో! అదేమిటి?"
సాహస్ అటువైపు చూశాడు.
"అదా! నాన్ వెజ్ తినే చెట్టు! పేరు వీనస్ ఫ్లై ట్రాప్!"
అంకుష్ కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఒక పురుగు వీనస్ ఫ్లైట్రాప్ ఆకుమీద వాలింది. వెంటనే దాని ఆకులు ముడుచుకు పోయాయి. పురుగు ఆకు లోపలే ట్రాప్ అయిపోయింది.
"ఇది కాసేపట్లో ఆ పురుగుని జీర్ణం చేసుకుంటుంది కాబోలు!" అన్నాడు అంకుష్.
అక్కడ నుంచి మళ్ళీ ముందుకి నడవడం మొదలెట్టారు.
చాలా దూరం నడిచాక... చీకటి ఆవరించుకోవడం మొదలెట్టాక...
ఒక చెట్టు దగ్గర ఆగారు. దాని చుట్టూ ఒక రాతి గట్టు వుంది. శిధిలావస్థలో వుంది అది కూడా!
"ఇక్కడ పడుకుందాం ఈ రాత్రికి!" అన్నాడు సాహస్.
ఇద్దరూ దానిమీద పడుకున్నారు.
మగత నిద్ర పడుతూ వుండగా -
ప్రగతి గుర్తు వచ్చింది సాహస్ కి -
ఆశ్చర్యంగా -
అతనికి ప్రగతి గుర్తు వచ్చీరాగానే -
ప్రగతి గొంతు వినబడింది.
"సాహస్! సాహస్!"
ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు సాహస్.
మళ్ళీ వినబడింది పిలుపు. ఎక్కడో... వందల, వేల కిలోమీటర్ల అవతల నుంచి వినబడుతున్నట్లుగా, అతి చిన్నగా -
కానీ -
అతి స్పష్టంగా!
తనని తాను గిల్లుకుని చూసుకున్నాడు.
కల కాదు.
నిజమే!
కానీ -
ఎలా సాధ్యం ?
"ప్రగతీ!" అన్నాడు సందేహంగా.
"సాహస్! సాహస్!" అంది ప్రగతి.
* * * *
ప్రొఫెసర్ అన్-వే-షీ ఇంట్లో -
ఒక చిన్న బల్లమీద వున్న మినియేచర్ బంగళాలో -
ప్రాణభయంతో నిలబడి వున్నారు ఆ యువతీ ఆ యువకుడు. అన్ వేషీ వలన అంగుష్టమాత్రులై పోయిన ఆ యువ జంట.
ఆ మినియేచర్ బంగళాలోకి ప్రవేశించిన దోమ జెట్ బాంబర్ యుద్ధవిమానంలా విపరీతమైన శబ్దం చేస్తూ వాళ్ళిద్దరి తలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.
వాళ్ళ ప్రాణాలకు అదేమో బ్రహ్మాండమైన గండభేరుండ పక్షిలా కనబడుతోంది.
ఆ దోమ తమని కుడితే?
రక్త నష్టం! భరించలేని బాధ! ప్రాణపాయం కూడా సంభవించవచ్చునేమో?
దోమ ఇంకో రౌండు కొట్టింది.
ఆ అమ్మాయి నిస్పృహగా అంది "ఎన్నోసార్లు దోమలు వంటిమీద వాలితే దెబ్బతో చంపేసేదాన్ని. ఇప్పుడు ఇలా ఒక దోమని చూసి భయపడవలసిన స్థితి వస్తుందనుకోలేదు."
దోమ హఠాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఆ అమ్మాయి భుజం మీద వాలింది.
ఆ యువకుడు తక్షణం తన చొక్కా విప్పి దానితో దోమని అదిలించాడు.
అది క్షణంలో అక్కడినుంచి అదృశ్యమై మరో క్షణంలో మళ్ళీ అతని తలమీద వాలింది.
ఇక్కడ ఇది ఇలా జరుగుతూ వుండగా -
అక్కడ అన్వేషి టేబుల్ మీద ఫోన్ రింగ్ అయింది.
విసుగ్గా ఫోన్ ఎత్తాడు అన్వేషి.
"హలో!"
"ప్రొఫెసర్ అన్వేషీ!" అని వినబడింది లైన్లో వున్న గొంతు.
"స్పీకింగ్"
"మీకో గుడ్ న్యూస్"
"గుడ్ న్యూసా? ఏమిటది? ఎవరు మాట్లాడుతున్నారు?"
నవ్వు వినబడింది. "గుర్తు పట్టలేదా? నేను! జేమ్స్! యూనివర్సల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను.
