7
వాసంతి వారం రోజులుగా పరంజ్యోతికోసం ఎదురుతెన్నులు చూస్తోంది. ఈ మధ్య రెండు మూడు నెలలుగా పరంజ్యోతి మొహం చాటేస్తున్నాడు. వచ్చినప్పుడు కూడా ముళ్ళమీద ఉన్నట్లు గడిపి మొక్కుబడి చెల్లించినట్లు కోరిక తీర్చుకుని వెళ్ళిపోతున్నాడు. వాసంతి దానికికూడా సరిపెట్టుకుంది. కాని డబ్బులుకూడా సరిగ్గా ఇవ్వటం లేదు. అడిగితే "ఇప్పుడు మనీ బాగా టైట్ గా వుంది. తర్వాత చూద్దాంలే" అని వాయిదాలు వేస్తూ వచ్చాడు. చివరకు కంటికి కనిపించడం మానేశాడు. ఇంట్లో గడపటం చాలా కష్టంగా ఉంది. ఒకరోజు అన్నం వండుకుందామనుకుంటే బియ్యంకూడా లేకపోయాయి. చేసేదిలేక ప్రక్కింట్లో ఉన్న పదేళ్ళ పాపను బ్రతిమలాడి పరంజ్యోతి ఇంటికి పంపించింది.
పరంజ్యోతి ఇంట్లోనే ఉన్నాడు. సావిట్లో వాలు కుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. ఆ పిల్ల బెదురుతూ లోపలికొచ్చింది.
"ఏమిటి?" అన్నాడు పరంజ్యోతి. జరగకూడనిదేదో జరిగినట్లు చిరాకు ప్రదర్శిస్తూ.
"వాసంతక్కయ్య మిమ్మల్ని పిల్చుకు రమ్మంది."
"ఎందుకు?"
"ఏమో మరి?"
"నాకిప్పుడు కుదరదని చెప్పు."
"పోనీ ఎప్పుడొస్తారని చెప్పమంటారు?"
"అబ్బో! పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావే. నేనసలు రాను, వెళ్ళు" అన్నాడు కసిరేస్తూ.
"ఏం చెయ్యాలో తోచని స్థితిలో వాసంతి మరో అయిదారు రోజులు సందిగ్ధంగా గడిపింది. ఇంట్లో గడవటం మరీ కష్టంగా ఉంది. ఇరుగుపొరుగు దగ్గర కొన్నాళ్ళు అప్పు చేసింది. ఇప్పుడు అప్పు పుట్టడం కూడా కష్టంగా వుంది. తల్లిదండ్రులు డబ్బుకోసం వేధించుకు తింటున్నారు. తిండి కోసం, వాళ్ళిద్దరూ త్రాగే కల్లుకోసం వాసంతి జోగినిగా మారిపోయినప్పటినుంచి ఆమె తండ్రి పనిలోకి వెళ్ళటం మానేశాడు. కేవలం కూతురిచ్చే డబ్బులుమీదే బ్రతుకుతున్నాడు.
వాసంతికి ఇహ తప్పలేదు. ఆకలి బాధకూ, తల్లిదండ్రుల పోరుకూ తట్టుకోలేని నిస్సహాయస్థితిలో ఓ సాయంత్రం వేళ పరంజ్యోతి యింటికి బయల్దేరింది.
పరంజ్యోతికి ఆమెను చూడగానే కోపంతో మొహం ఎర్రబడింది."
"నువ్వెందుకు కొచ్చావిక్కడికి?" అన్నాడు కఠిన స్వరంతో.
వాసంతి ఏడుపు నాపుకుంటోంది. "రాకుండా ఏం చెయ్యను?" అంది దీనంగా. ఆమె గొంతు వొణుకుతోంది.
"ఏం కావాలి?"
"అదేమిటండీ అలా అంటారు? నేను జోగినిగా మారినప్పుడు ఇంకొకరి ఆధీనంలోకి పోకుండా మీరు చేరదీశారు. ఎల్లకాలం నన్ను మీతోనే ఉంచుకుంటామన్నారు."
"అలా అని వాగ్దానాలు చేశానా?"
"మనిషికి మనస్సు ముఖ్యంగానీ, వాగ్దానాలూ వ్రాసుకోడాలూ ఎందుకండీ. మిమ్మల్ని అన్ని విధాలా నమ్మి మీ అండనే బతుకుతున్నాను."
"అయితే ఏం చెయ్యమంటావు?"
"మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను మీతో ఉంచుకోండి. అందరి మనిషిని చెయ్యకండి"
పరంజ్యోతి నవ్వాడు. "కొన్నాళ్ళు సరదాపుట్టి నా మనిషిగా నిన్ను వాడుకున్నాను. వాడుకున్నందుకు ఋణమేమీ ఉంచుకోకుండా యెంతో కొంత ముట్టచెబుతూనే ఉన్నాను. ఇలా జరగడం పరిపాటే. నువ్వు జోగినివి. ఒకళ్ళ కిష్టమైనప్పుడు వాళ్ళతోనే ఉండవచ్చు. ఇష్టం తీరిపోయాక ఎంత మందితోనైనా పోవచ్చు."
