Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 28


    "ఎందుకండీ!"

 

    "ఎవర్నో ఒకర్ని ఆ వాటాలో అద్దెకు దించడానికి!"

 

    శాస్త్రికి ఇప్పుడు ఖచ్చితంగా భయంవేసింది. అందుకే అన్నాడు-

 

    "అమ్మో! ఇరవయి నాలుగ్గంటల్లో. అది నావల్లవుతుందంటారా?"

 

    "వల్లకాకపొతే నీ జీతంలో పాతిక తెగ్గోస్తాను."

 

    "మహాప్రభో!" అరిచేడు శాస్త్రీ.

 

    "ఎందుకు అరిచావు!"

 

    "చౌదరి బాకీ విషయమై ఇంతకుముందే ఒక పాతిక మింగేశారు."

 

    "అంచేత ఇప్పుడిది రెండో పాతికవుతుంది!"

 

    "ఈ విధంగా దెబ్బకో పాతిక చొప్పున తెగ్గోస్తే మూడు దెబ్బలతో జీతమ్మొత్తం ఉష్ కాకి అవుతుంది. నేను పూర్తిగా అన్యాయమైపోతాను"

 

    "ఆ వాటాలో అద్దెకెవ్వరూ దిగకపోతే నేను అన్యాయమైపోతాను."

 

    "మీకు జరిగే అన్యాయం నాకంటే చిన్నది సర్!"

 

    "లెక్కలనవసరం. చెప్పిన పనేదో చూడు. ఇరవై నాలుగ్గంటలే టైము."

 

    శాస్త్రి మరింకేం మాటాడే ఓపిక లేక అక్కడ్నించి లేచి వీధినపడ్డాడు.

 

    వీధిన పడిన తర్వాత 'హే! భగవాన్' అని కేక పెట్టాడు.


                                        *  *  *


    సరిగ్గా అదే సమయానికి బందరు బస్టాండులో కృష్ణమూర్తి బస్సు దిగాడు.

 

    పుట్టి బుద్దెరిగిన తర్వాత అతనెప్పుడూ ఈ ప్రాంతాలకు రాలేదు. బందరులో అడుగుపెట్టడం అదే తొలిసారి.

 

    నేలమీద అడుగుపెట్టి చుట్టూ చూస్తూ-ఊరందంగా ఉంది అనుకున్నాడు.

 

    తను మనసారా ప్రేమించి ఆరాధించే పద్మ ఏ ఊళ్ళో ఉన్నా ఆ ఊరు అందంగానే ఉంటుందని ఆ తర్వాత అనుకున్నాడు.

 

    బస్సుస్టాండుకి దగ్గిరలోనే అందమయిన హోటలొకటి కనిపించింది. ముందు అందులో దిగేసి స్నానాదికాలు పూర్తి చేసుకొన్న తర్వాత భవిష్యత్ కార్యక్రమం ఆలోచించాలనుకున్నాడు.

 

    హోటల్ వేపు ఒక అడుగువేశాడో లేదో అతనికి "భగవాన్" అంటూ పొలికేక వినిపించింది.

 

    చప్పున వెనక్కి తిరిగి చూశాడు.

 

    అట్లా ఆర్తనాదం చేసిన వ్యక్తి శాస్త్రి. అంతకుముందు అతను ఆ విధంగా ఎన్ని తడవలు భగవంతుడ్ని పిలిచివుంటాడో కృష్ణమూర్తి అంచనా కట్టలేకపోయేడు.

 

    బందరు పట్టణం పిచ్చివాళ్ళకి ప్రసిద్ధి అని అతను ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం.

 

    చదివి అప్పుడది అబద్దమనుకున్నాడేగాని ఇప్పుడు శాస్త్రీని చూడగానే ఆ స్టేట్ మెంట్లో ఎంతో కొంత నిజం వుందని పూర్తిగా నమ్మాడు.

 

    మనిషిన చూస్తే పిచ్చివాడనుకోలేరు. పచ్చగా ఉన్నాడు కుర్రాడు. ఎక్కడ ఎల్లాంటి దెబ్బతిన్నాడో-బస్టాండు మధ్యలో నిలబడి భగవాన్ అని పిలుస్తున్నాడు.

 

    కృష్ణమూర్తి శాస్త్రిమీద జాలి కలిగింది. అంచేత అయ్యో పాపమనే స్టయిల్లో అతనివేపు దిగులుగా చూసేడు.

 

    తనవేపు రెప్పార్చకుండా చూస్తున్న కృష్ణమూర్తి శాస్త్రిని ఆకర్షించాడు. ఇదేదో అద్దెకేసే అయివుంటుందన్న ఆశ కలిగింది.

 

    అంచేత అతను గబగబా కృష్ణమూర్తిని చేరుకున్నాడు?

 

    "మీరు ఈ ఊరికి కొత్తకదూ!" అని అడిగాడు.

 

    కృష్ణమూర్తి తాపీగా సమాధానం చెప్పాడు.

 

    "కావచ్చు. కాని నా పేరు భగవాన్ మాత్రం కాదు!"

 

    "భగవాన్ అని ఎవరన్నారు?"

 

    "నువ్వు నన్ను పిలిచింది ఆ పేరుతోనే కదా!"

 

    "అదా! ఆ పేరుతో మిమ్మల్ని పిలవలేదు. భగవంతుడ్ని పిలిచేను."

 

    పిచ్చిలోకూడా పిసరంత తెలివివుంటుందని కృష్ణమూర్తి గమనించ గలిగేడు. అంచేత అడిగేడు.

 

    "భగవంతుడు బస్టాండులొ దొరుకుతాడా?"

 

    "దొరకవచ్చనే ఆశ! ఆ మాటకొస్తే నాక్కావలసిన భగవంతుడు బస్టాండులోనో, రైల్వే స్టేషన్లోనో దొరుకుతాడని నమ్మకం. అదంతా వదిలేయండి సర్. మీకు అర్జెంటుగా వసతి కావాలి కదా?"

 

    "ఎట్లా చెప్పగలిగావు?"

 

    "మీ వాలకం చూస్తుంటే ఈజీగా అర్ధమైపోతుంది సర్. ఇంక మీరేమీ మాటాడొద్దు నావెంట వచ్చేయండి. ఫస్టుక్లాసు పోర్షన్, అద్దె కేవలం రెండువందలు!"

 

    ప్రేమపిచ్చి, పెళ్ళిపిచ్చి, పదవిపిచ్చి ఇట్లాగ రకరకాల పిచ్చివాళ్ళ గురించి కృష్ణమూర్తి విన్నాడేగాని, ఈ అద్దెపిచ్చి గురించి అతను మునుపెన్నడూ వినలేదు.

 

    ఇంకా సంభాషణ పొడిగిస్తే వ్యవహారం ఎంతవరకు సాగుతుందోనన్న భయంచేత కృష్ణమూర్తి అక్కడ్నించి కదిలాడు.

 

    అయినా శాస్త్రి అతన్ని విడిచిపెట్టలేదు. అతన్ని అనుసరిస్తూ మాటాడుతూనే ఉన్నాడు.

 

    "సార్! నాది గండాల బతుకు సర్! ఇరవయి నాలుగ్గంటల్లో పాతిక రూపాయల బలయిపోతుంది సర్! ఆ సూటుకేసు ఇలా ఇవ్వండి, ఓన్లీ రెండువందలే అద్దె!"

 

    రిక్షావాళ్ళు జట్కా వాళ్ళు బేరంకోసం బస్సుదిగాక పాసింజర్ల ప్రాణాలు తింటారంటే అర్ధమయింది.

 

    అద్దెకు దిగమని పోరుపెట్టే మనుషులు బందరుకి ఒక అలంకార మేమోనన్న డవుటు కలిగింది కృష్ణమూర్తికి.

 

    పిచ్చివాడితో అనవసరంగా పెట్టుకున్నందుకు అతను మొదట సిగ్గుపడ్డాడు, పిదప కోపం తెచ్చుకున్నాడు.

 

    అంచేత క్షణంసేపు ఆగాడు శాస్త్రికూడా ఆశతో ఆగేడు. ఏమి సెలవంటూ చేతులు కట్టుకుని కృష్ణమూర్తి మాటకోసం ఎదురుచూస్తున్నాడు.

 

    అతను ముక్కుపుటాలెగరేస్తూ శాస్త్రికి ఒక అల్టిమేట మిచ్చాడు.

 

    "చూడు మిస్టర్! ఇంతసేపూ పోనీలే పాపమని ఓర్చుకున్నాను. ఇంకో తడవ అద్దెమాట ఎత్తినా, నా వెంట పడినా పళ్ళురాల గొడతాను, మైండిట్."

 

    చెప్పవలసిందేదో చెప్పేసి అతడు హోటల్ వేపు వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

 

    శాస్త్రి చాలా గట్టిగానే నిట్టూర్చాడు.


                                     *  *  *


    జీవితభీమా వారి కార్యాలయం బందరులో వున్న పెద్ద సైజు ఆఫీసుల్లో ఒకటి.

 

    శాస్త్రి ఆ ఆఫీసుకి చేరుకున్నాడు.

 

    గేటుదగ్గిర వాచ్ మెన్ తో మెల్లిగా మాట కలుపుకున్నాడు...

 

    "నువ్వు నాకో సాయం చేయాలి తమ్ముడూ! మరేంలేదు... ఈ ఆఫీసుకి కొత్తగా బదిలీమీద వచ్చిన వాళ్ళెవరయినా ఉన్నారా?"    

 

    అతనెందుకు అలా అడుగుతున్నాడో కనుక్కోకుండానే చెప్పేశాడు వాచ్ మెన్...

 

    "ఎందుకుండరూ బోలెడుమంది ఉంటారు."

 

    శాస్త్రి ఆ మాటకి ఆనందిస్తూ అన్నాడు...

 

    "నా తండ్రే! చల్లటి కబురు చెప్పావు నీకు తెలిసినంతవరకూ అలాంటి కేసు ఒక్కటి, కనీసం ఒక్కటయినా చూపించగలవా?"

 

    "గలనా అంటే గలను" అన్నాడు వాచ్ మన్ వరాలిచ్చే దేవుడి ఫోజులో."

 

    శాస్త్రికి ఆరాటం పెరిగింది...

 

    "ఏమిటో ... ఈ దీనుడికి నువ్వే ఆశాకిరణంలాగా కనిపిస్తున్నావు! ఎక్కడున్నారు నాయనా వారు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS