Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 28


    లైటార్పి-

 

    ఆ గదిలోంచి బయటి కొచ్చేశాడు అవినాష్.

 

    అప్పుడు సమయం సరీగ్గా రాత్రి పదకొండు గంటలైంది. పది నిమిషాల్లో తిరుమల బస్టాండు దగ్గర కొచ్చాడు. కిందకు రావడానికి బస్సులేమి లేవు. అతి కష్టంమ్మీద ఓ ప్రైవేట్ టాక్సీ దొరికింది.

 

    ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ టాక్సీ ఎక్కేసాడు అవినాష్.

 

    అతని మనసిప్పుడు చాలా హాయిగా ఉంది.

 

    అతను రేపటి సాయంత్రం గురించి ఆలోచిస్తున్నాడు. అతను గౌతమిని పూర్తిగా మరిచి పోయాడు.

 

    కానీ-

 

    గౌతమి మార్ఫిన్ మత్తులో మాత్రమే సొమ్మసిల్లి పోయిందని అవినాష్ కి తెలీదు.

 

    కాటేజీలో సూట్ కేసు వెనక దాచిన 'ఆంటీమనీ' ఖాళీ సీసాను తనతో తెచ్చుకోవడం మర్చిపోయినట్లు కూడా ఇంకా అతను గ్రహించలేదు.


                                                                   10


    "గంట సేపట్నించి వెయిట్ చేస్తుంటే ఇప్పుడా రావడం..." గేటు తీసుకొని లోనకొస్తున్న అవినాష్ ని, వరండాలో ఇనుపచువ్వల వెనక నించున్న రోష్ణి గట్టిగా అరుస్తూ అడిగింది. ఆ వెంటనే ఎదురొచ్చింది.

 

    అందమైన సిమ్మెంట్ బాట కటూ ఇటూ పచ్చని పచ్చిక, కొంచెం దూరంలో రకరకాల రంగుల్లో పూల కుండీలు, ఆ పూల కుండీల్లో రకరకాల మొక్కలు.

 

    "డాడీ ఉన్నారా." వరండా మెట్లెక్కుతూ అడిగాడు అవినాష్.

 

    "ఉన్నారా...!" ఉన్నారు. ఈవెనింగ్ ప్రోగ్రామ్ కేన్సిల్ చేసుకొని నీ కోసమే ఎదురు చూస్తున్నారు... ఇంత లేటు ఇంకెవరైనా చేస్తే ఫైరైపోతారు. తెల్సా.. పద..పద" అంటూ తోసుకు తీసి కెళ్ళింది అవినాష్ ని.

 

    లోనకెళ్ళిన అవినాష్ గుండె గతుక్కుమంది ఆ భవనాన్ని చూసి, మాజీ మహారాజు పేలస్ లా ఉందా భవనం.

 

    ఎటు చూస్తే అటు తెల్లటి పాలరాతి శిల్పాలు, పైన పెద్ద షాండివీర్. గోడలకు అపురూపమైన పెయింటింగ్స్.
    ఇళ్ళంతా నిశ్శబ్దంగా ఉంది.

 

    అవినాష్ ని రోష్ణి మేడమీద తండ్రి గదిలోకి తీసికెళ్ళింది.

 

    ఆ గది విశాలంగా పెద్ద హాలులా ఉంది.

 

    ఆ గదికొమూల ధగధగ మెరిసిపోతూ పందిరిమంచం. ఆ మంచానికి అందమైన నగిషీ.

 

    ఆ సమయంలో రోష్ణి తండ్రి ధన్ రాజ్ పైపు కాలుస్తున్నారు.

 

    "డాడీ, ఈయనే అవినాష్." పరిచయం చేసింది రోష్ణి.

 

    రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేశాడు అవినాష్.

 

    పెదవుల మీద చిన్న చిర్నవ్వుతో దానిని స్వీకరించాడు ధన్ రాజ్-

 

    "కూర్చో." ఎదురుగా ఉన్న సోఫాను చూబెడుతూ కూతురు వేపు తిరిగి-

 

    "బేబీ... వారికేదైనా డ్రింక్ ఏర్పాటు చెయ్..." అని చెప్పారు.

 

    రోష్ణీ ఆ గదిలోంచి బైటకొచ్చింది.

 

    "మీరు లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నారట కదా..." అని అడిగాడు సోఫాకెదురుగా ఉన్న కేన్ చైర్లో కూర్చుంటూ.

 

    "ఎస్... సర్..." చెప్పాడు అవినాష్.

 

    "రోష్ణీకి, మీకు ఎన్నాళ్ళుగా పరిచయం..." సూటిగా అవినాష్ కళ్ళవేపు చూస్తూ అడిగారాయన.

 

    అవినాష్ కూడా ఆయన వేపే చూస్తున్నాడు.      

 

    భారీ శరీరం... పెద్ద కళ్ళు, బట్టతల, చేతి వేళ్ళకి రెండు మూడు ఉంగరాలు... మెడలో సన్నని బంగారు గొలుసు. 

     

    "మూడు నెలలైంది..."

 

    "త్రీ మంత్స్.." ఆ మాటను నొక్కి పలికాడాయన.

 

    "రోష్ణి మీద మీ అభిప్రాయం ఏమిటి..." నెమ్మదిగా అడిగారాయన.

 

    "గుడ్ గార్ల్..."

 

    "రోష్ణి మంచితనమే... నిన్నాకర్షించిందా..."

 

    ఆ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలీలేదు.

 

    "ఐ లైక్ హర్ బ్యూటీ..." తత్తరపడుతూ చెప్పాడు అవినాష్.

 

    ఆ ప్రశ్నలన్నీ ఆయనెందుకడుగుతున్నాడో అవినాష్ కేం అర్థం కావడం లేదు.

 

    "ఈ ప్రశ్నలన్నీ మీ ప్రేమను శంకిస్తూ గానీ... నిన్ను శంకిస్తూ గానీ అడగడం లేదు... గుర్తుంచుకోండి... కానీ... మిమ్మల్నో విషయం సూటిగా అడగనా...?"

 

    అవినాష్ ని ఆపాద మస్తకం చూస్తూ అడిగాడు ధన్ రాజ్.

 

    "అడగండి సార్..."

 

    "నా వ్యాపారం గురించి తెల్సుకదా..."

 

    "తెల్సుసార్..."

 

    "ఆ వ్యాపారం ఏడాదికి ఎన్ని లక్షల్లో ఉంటుందో... తెల్సా..."

 

    "తెలీదు సార్..."

 

    "ఎనభై లక్షల వరకూ ఉంటుంది... అదే గాక... నాకు ఏయే కంపెనీల్లో షేర్లున్నాయో తెల్సా..."

 

    "తెలీదు సార్..."

 

    "టెన్ లీడింగ్ కంపెనీల్లో నా షేర్లున్నాయి... ఆ కంపెనీ పేర్లు నాకు ప్రస్తుతం గుర్తుకులేవు... కానీ... ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్తున్నానో తెల్సా."

 

    "తెలీదు సార్..."

 

    "సంవత్సరానికి నీ ఆదాయమెంతో తెలీక, ఎన్ని లక్షలు నీకు ఆస్తుందో తెలీక... ఏయే కంపెనీల్లో నీకు షేర్లున్నాయో తెలీక..."

 

    ఆయనేం మాట్లాడుతున్నారో అవినాష్ కి అర్థమౌతోంది.

 

    అదే క్షణంలో-

 

    చేతిలో కూల్ డ్రింక్ గ్లాసుతో ఆ గదిలోకొచ్చి, అవినాష్ ముందున్న టీపాయ్ మీద పెట్టి, పెళ్ళి పందిరి మంచమ్మీద కూర్చుంది రోష్ణి.

 

    ఆమె వేపు చూశాడు తండ్రి.

 

    "నీ విషయం మాట్లాడుతుంటే... నువ్వుంటే ఎలాగమ్మ..." అని సాధ్యమైనంత నవ్వు పులుముకున్నారాయన.

 

    "సారీ డాడీ..." అని అవినాష్ వేపు నవ్వకుండానే చూసి, నవ్వుతూ తండ్రివేపు చూసి వెళ్ళిపోయింది రోష్ణి.

 

    ఆరిపోయిన పైపుని వెలిగించుకుంటూ-

 

    తన మాటల్ని కొనసాగించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS