"మీ ప్రోగ్రామ్ ని వైజాగ్ నుంచి హైదరాబాద్ కి మార్చుతున్నాం" ఒకింత రిలాక్స్ డ్ గా కుర్చీలో వెనక్కి వాలాడు కౌశిక్.
అర్ధం కానట్లు చూసింది సంజు.
"ఇది నా ప్లాన్ లో ముఖ్యభాగం. మీ ప్రోగ్రాం సక్సెస్ ఫుల్ గా జరగాలన్నా....మీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదమూ జరగకూడదన్నా ఇది మంచి మార్గం."
"ఇక్కడికి ప్రోగ్రాం మార్చడంలో ఆంతర్యం ఏమిటో నాకు అర్ధం కావడంలేదు. నేనే ఈ వూరిలో అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే రెండుసార్లు మర్డర్ ఎటమ్ట్ జరిగింది. బయటికి అడుగుపెట్టాలంటేనే ప్రాణాల మీద ఆశ వదులుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి వూళ్ళో అయితే చాలా సేఫ్ అంటున్న మీ మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియటం లేదు."
ఆ సమయమో కౌశిక్ మూర్ఖుడేమోనన్న సందేహం కూడా కలిగింది ఆమెలో.
ఆమె మనస్సులోని భావం అర్ధమయి చిరునవ్వు నవ్వాడు కౌశిక్.
"ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని తెలుగులో ఒక సామెత వుంది. అలా....ఒకే ప్లాన్ తో రెండు పనులు సాధించబోతున్నాం. కొంచెం కూల్ గా, సహనంగా నేను చెప్పేది వినండి" చాలా సీరియస్ గా అన్నాడతను.
టేబుల్ మీద కాయితాన్ని పిచ్చిపిచ్చిగా మడతలు పెట్టసాగాయి ఆమె చేతివేళ్ళు.
"వైజాగ్ లో మన ప్రోగ్రాం పూర్తిగా కాన్సిల్ అయినట్లుగా ఆర్గనైజర్స్ కి మెసేజ్ యిచ్చేద్దాం. వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా రిఫండ్ చేసి అవసరమయితే ఓ లక్ష, రెండు లక్షలో ఎక్కువే ముట్టచెబుదాం."
ఏదో అనబోతున్న ఆమెను ఏమీ మాట్లాడవద్దన్నట్లుగా చేతితో సైగ చేశాడు.
"ఇక్కడ జరిగే ప్రోగ్రాంకి స్టేట్ హోం మినిస్టర్ ని, డి.జి.పి.ని, మరో ఇద్దరు పోలీసు అధికారులను కూడా పిలుస్తాం. దానివల్ల నాకు ఉపయోగమేమిటి అంటున్నారు కదా? ఇక్కడి రాజకీయ పరిస్థితులు మీకు తెలియదు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో టెర్రరిజం ఎక్కువైపోయింది. రాజకీయ నాయకులకు, పోలీస్ అధికారులకు దీనివల్ల ప్రాణరక్షణ లేకుండాపోయింది. ఫలితంగా సెక్యూరిటీని చాలా కట్టుదిట్టం చేసేశారు. పురుగును కూడా దగ్గరకు రానివ్వటం లేదు. ఇప్పుడు మీ ప్రోగ్రాంకి హోం మినిస్టర్ ని, డి.జి.పి ని ముఖ్య అతిధులకు పిలవటంవల్ల జంట నరగాల పోలీస్ డిపార్టుమెంటు మొత్తం అక్కడే కాపలాగా వుంటుంది. సెక్యూరిటీ కోసం పోలీస్ ని చాలా హెవీగా డిప్లాయ్ చేస్తారు. ఫలితంగా టెర్రరిస్ట్ లు ఎవరూ ఆ ఛాయలకు వచ్చే ధైర్యం చేయరు. అంతేకాదు. మీ మీద ఎవరైతే ఎటమ్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా వచ్చే అవకాశం తక్కువ. వచ్చినా వట్టి చేతులతోనే రావాలే తప్ప ఎటువంటి ఆయుధాలతో రాలేరు. కారణం....ఆ ప్రోగ్రాంకి వచ్చే ప్రతి పురుషుడ్ని కూడా మెటల్ డిటెక్టర్లతో అణువణువు పరీక్షిస్తే తప్ప లోపలికి వదలరు. బై ఆల్ మీన్స్ వుయ్ విల్ బి వెరీ సేఫ్. మీ కార్యక్రమం కూడా సక్సెస్ ఫుల్ గా జరుగుతుంది. దీనిక్కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. హోంమినిస్టర్ డిజిపి లను ఇన్వయిట్ చేయటం లాంటివన్ని నేనే చూసుకుంటాను. మీరు నన్ను, నా సమర్ధతని నమ్మవచ్చు."
సుదీర్ఘంగా అతను అనుకున్న ప్లాన్ చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు.
దిస్ మే బిది బెస్ట్ సొల్యూషన్....ఇంతకంటే మంచి మార్గమూ లేదు. ఆ కాయితాన్ని ఇప్పుడామె చేతులు ముక్కలుగా చింపిపోస్తున్నాయి.
నిశ్శబ్దంగా వున్న ఆ గదిలోకి "అబ్బాయ్ కౌశిక్!" అన్న పిలుపు వినబడటంతో ఇద్దరూ ఒకేసారి తల తిప్పారు.
* * * *
"ఏం చేస్తున్నారు ఇక్కడ?" ఒకింత అనుమానంగా ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ ఆ గదిలోకి ప్రవేశించింది కౌశిక్ నాయనమ్మ.
మెట్లు ఎక్కి రావటంతో ఒకింత ఆయాసపడుతోంది ఆమె.
"ఏం బామ్మా! అలా ఆయాసపడుతూ మెట్లు ఎక్కి రాకపోతే నష్టమేమిటి?" ఒకింత విసుగుతో అన్నాడు కౌశిక్.
ఆ సమయంలో ఆమె ఆక్కడికి రావటంతో అసహనంగా వుందతనికి.
"క్రింద హాల్లో ఒక్కదాన్నే కూర్చున్నాను. కాలక్షేపం లేక పొద్దుపోవటం లేదు. మీ మాటలు వినిపిస్తున్నాయి. నాకూ కాలక్షేపంగా వుంటుందని వచ్చాను" అంది ఓ కుర్చీలో కూర్చుంటూ.
"బామ్మా! ఇవి కాలక్షేపం కబుర్లు కావు. కాసేపు అవతలకి వేళ్ళు."
అంత పెద్దావిడ మీద అతను అలా విసుక్కోవటం నచ్చలేదు సంజుకు.
"వెళ్ళక మీ మధ్య కూర్చుంటానేమిటి?" అని ముఖం చిన్న బుచ్చుకుంటూ అక్కడి నుంచి లేచి రెండడుగులు వేసి ఏదో గుర్తుకు వచ్చినదానిలా వెనక్కి తిరిగింది.
"మళ్ళీ ఏమయింది?"
"ఏం లేదురా! ఈ మధ్య మన కస్తూరి దగ్గర నుంచి ఉత్తరాలే రాలేదేమిట్రా?" అంది.
ఉలిక్కిపడ్డాడు ఆ మాటకి కౌశిక్.
"రెండు నెలలు దాటిందిరా! ఇంతవరకు కస్తూరి నుంచి ఒక్క ఉత్తరం రాలేదంటే....నాకేదో భయంగా వుందిరా."
"ప్రతి పది రోజులకి ఒక ఉత్తరం రాసేదిరా. ఇన్నాళ్ళయినా దాని నుంచి ఏ కబురూ లేకపోతే ఏమయిందో అని కంగారుగా వుందిరా?" తిరిగి ఆమే అంది.
ఎడమ అరచేతితో కణతలు నొక్కుకున్నాడు కౌశిక్.
కస్తూరి ఎవరో అర్ధం చేసుకోవాలని ప్రయత్నించింది సంజు. కానీ ఆమెకు తెలియలేదు.
"పోనీ ఒకసారి ఆరా తీయరాదూ! నాకు చాలా బెంగగా వుంది."
అసహనంగా తల ఎత్తి చూశాడు కౌశిక్.
"బామ్మా! నాకు లేదా ఆతృత? ఆరా తీయమంటావ్. కస్తూరి గురించి ఎవరిని అడగమంటావు? ఏమని అడగమంటావు? అది ఎక్కడుందో ఎవరికి తెలుసు? నన్నింక విసిగించకు. దయచేసి వెళ్ళు" దాదాపుగా అరిచినట్లుగా అన్నాడు అతను.
వయసుతోపాటు బలహీనపడి సన్నగా వణుకుతున్న కాళ్ళతోనే బయటికి వెళ్ళిపోయిందామె.
ఆమె పట్ల అంత కరుకుగా ప్రవర్తించడం చాలా బాధనిపించింది సంజుకి.
టేబుల్ మీద గ్లాసులో వున్న నీళ్ళు గడగడా తాగి కళ్ళు మూసుకున్నాడు అతను.
కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి.
"మేము మాట్లాడుకున్నది ఎవరి గురించి? కస్తూరి ఎవరు? అని అడగాలని వుంది కదూ!" హఠాత్తుగా అన్నాడతను.
ఉలిక్కిపడిందామె. ఆమె మనస్సులోని ఉద్దేశాన్ని అంత ఖచ్చితంగా అతను చెప్పినందుకు.
"కస్తూరి నా చెల్లెలు. ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు, సమస్యలు ఆమెను బాధించాయి. ఫలితం సుమారు రెండేళ్ళ క్రిందట ఓ రాత్రి ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడ వుందో, ఏమైందో తెలియదు. నెల తర్వాత ఉత్తరం వచ్చింది_విదేశాలలో వున్నాను అంటూ. ఏ ఉత్తరములోనూ ఆమె ఎడ్రస్ ఇవ్వలేదు. కొన్ని వుత్తరాలు జపాన్ నుంచి వచ్చాయి. కొన్ని సింగపూర్, మలేషియా, ఈజిఫ్ట్, ఇంగ్లండ్, నెదర్లాండ్ ఇలా చాలా దేశపు స్టాంపులున్న కవర్స్ వచ్చాయి. ఆమె ఎక్కడుందో తెలుసుకుందామని మా డిపార్టుమెంటు ద్వారా విశ్వప్రయత్నం చేసి విఫలం అయ్యాం.
రెండు నెలలుగా ఏ ఉత్తరమూ లేదు" చెప్పటం ఆపాడు.
"చెప్పటం మరిచాను. మీరున్న రూమ్ లో గోడకి వున్న ఫోటోలో వున్న అమ్మాయే కస్తూరి" అతనే అన్నాడు.
అదిరిపడింది ఆమె.
ఆమె పేరు కస్తూరి. కానీ తనకు తెలిసి ఆమె పేరు స్పందన.
కస్తూరి ఆమె దృష్టిలో స్పందన. "నాకు తెలుసు" అని కౌశిక్ తో చెప్పాలనుకుంది. కానీ ఆ విషయాన్ని ఆమె మనస్సు చెప్పనివ్వటం లేదు.
* * * *
నవంబర్__19.
దట్టంగా కమ్ముకొని వున్నాయి నల్లని మేఘాలు.
సాయంకాలం నాలుగున్నరే అయినా, దాదాపుగా చీకటి పడినట్లయింది.
గంట క్రిందటి వరకు వాతావరణం మామూలుగానే వుంది.
నిమిషాల్లో వూహించలేనంత మార్పు.
ఎక్కడో వర్షం పడుతూ వుండి వుండాలి.
చల్లని గాలి మొదలయింది.
ప్యాక్ చేసిన శారీని అందుకుని శాపులోంచి బయటకు నడిచింది అర్చన.
ఆమె వెనుకనే బయటికి నడిచాడు చంద్రకాంత్.
షాపులో నుండి బయటకి వస్తూనే "అరె....వర్షం వచ్చేలా వుందే!" అంటూ ఆకాశం వైపు చూస్తూ అన్నాడు.
అతని మాట పూర్తి కాకుండానే రివ్వున గాలి వీచింది.
అర్చన చేతిలోని చీర తాలూకు బిల్లు ఆమె చేతిలో నుండి గాలిపటంలా ఎగిరిపోయింది.
రోడ్డుకి అవతలివైపు పేవ్ మెంట్ మీద పెట్టి న్యూస్ పేపర్లు, వీక్లీలు ఆమ్మే కుర్రాడు ఒకడు హడావిడిగా ఆ పుస్తకాలు అన్నీ సర్దుకోసాగాడు. ఏ క్షణంలోనైనా కురవటానికి సిద్ధంగా వున్న వాన వాడి వ్యాపారాన్ని నాశనం చేస్తుందని భయం.
"వర్షం....వస్తుందేమో! ఎలాగా?" అంది చంద్రకాంత్ ని చూస్తూ.
"రానీ. మనకి ప్రాబ్లం ఏముంది? నీ కారులో కదా మనం వచ్చింది"
"నేను కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలి. చీకటి పడిపోతోంది కదా!"
అతని ముఖంలో రంగులు మారాయి.
