"మనం రేపు ఈ నగరానికి దూరంగా-గోదావరి నదీతీరంలోని గ్రీన్ గార్డెన్స్ కు వెళుతున్నాం.
అది లవర్స్ పారడైజ్....
ఒకరోజు మనం అక్కడున్న పచ్చని పొదల్లో...నులివెచ్చని, తీయటి అనుభూతుల్ని, కోర్కెల్ని గుర్రాలుగా మార్చుకుని మాటల్ని గుండెల్లో మధురంగా దిగబడే ఈటెలుగా మార్చుకుని-ప్రణయపోరాటంలో."
"వంశీ! ఇక ఆపు. నేనవి వినలేను! ప్రేమను పండించుకోవటానికి ప్రదేశాన్ని వెదుకక్కర్లేదు! అది మన మధ్య చిగిరించిన ఆకర్షణ!
ప్రేమికులకు పారడైజ్ అక్కర్లేదు వంశీ! పరిసరాలు బాగుండకపోయినా ప్రేమైక జీవుల ప్రణయోద్వేగం ఆగదు. కటిక రాళ్ళయినా మెత్తని గ్రాస్ లాండ్స్ లా వంటికి తగులుతాయి. పూర్ కాటేజెస్ అయినా పాలరాతి భవంతుల్లా కనిపిస్తాయి. మురుగువాసనకీ, మల్లెపొదల వాసనలకీ ఆ సమయంలో తేడాతెలీదు."
నళిని అలా చెప్పుకెళుతుంటే వంశీ ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు!
"నళినీ! నా ఈ చిన్ని కోర్కెను అంగీకరించవా?"
"ఏమిటది?"
"అదే....రేపటి హాలిడేకి మనం గ్రీన్ గార్డెన్స్ కు వెళ్దాం. అక్కడ ఒకరోజు-"
"ఒక షరతు మీద"
"అంగీకరిస్తాను. ఆ షరతేమిటో చెప్పు?"
"అక్కడి నీ బిహేవియర్ ను నియంత్రించే అధికారం నాకివ్వాలి. గుర్రానివి నీవే__కళ్ళెం నా చేతిలో వుంటుంది."
"నేనెప్పుడూ నా నళినీకి విధేయుడ్నే..."
తరువాత వారు చిన్నగా ముద్దుపెట్టుకుని విడిపోయారు!
* * * *
వసుంధర ఒకదరిని గంభీరంగా కూర్చుని వుంది.
ఆమెకు కొద్ది దూరంలో మధు, గీతిక నిలబడి వున్నారు. వారికి ఎదురుగా వంశీ__నళిని నిలబడి వున్నారు.
వసుంధర జుట్టు రాగిరంగు నుండి తెలుపుకు తిరుగుతోంది. వయసు మీద పడుతున్న చాయలు ఆమె వంటి మీదకు వస్తున్నాయి. కళ్ళక్రింద కొద్దిగా నలుపు జీరలు కనిపిస్తున్నాయి. అయినా ఆ ముఖంలోని ఆకర్షణ అలాగే వుంది. కళ్ళజోడు పెట్టుకుంది. ఆ జోడు తెల్లటి అద్దాల వెనుక వున్న ఆమె కళ్ళల్లో ఎర్రటి జీరలు చోటు చేసుకుంటున్నాయి.
మధు-గీతిక అలాగే బిగుసుకుపోయి నిలబడ్డారు. వారికి ఏం మాట్లాడాలో తెలీటంలేదు!
ఆ గంభీరమైన వాతావరణానికి ముందు-
సరిగ్గా ఒ గంట క్రితం...
వసుంధర-గీతిక ఒకచోట కూర్చుని రాత్రి భోజనానికి దుంపలనీ, కూరగాయల్నీ ముక్కలు చేస్తున్నారు. వారికి కాస్త దూరంలో వార్త పత్రికను ముందేసుకుని, తరిగిపోయిన దాని పేజీల్ని, ఆందోళన కలిగిస్తున్నతనదేశం రాజకీయ వాతావరణాన్ని చూస్తూ....చదువుతూ మధ్య మధ్య నిట్టూరుస్తూ కూర్చున్నాడు మధు.
అదిగో సరిగ్గా ఆ సమయంలోనే....
వంశీ-నళిని చేతులు పట్టుకుని హుషారుగా లోనికి ఎంటరయ్యారు.
వారిరువురినీ ఆ విధంగా ఆ ముగ్గురూ ఎప్పుడూ చూడలేదు.
ముందుగా వంశీ నళిని చేతిని అలాగే పట్టుకుని చెప్పడం మొదలెట్టాడు.
"మమ్మీ!"
వసుంధర తన కొడుకువంక ఆశ్చర్యంగా చూసింది. అలాగే నళిని తల్లిదండ్రులు మధు-గీతికలు కూడా వంశీ ఏం చెప్పబోతున్నాడో అన్నట్టు విచిత్రంగా చూశాడు.
"ఈరోజు ఒక నిర్ణయాన్ని మేం ఇరువురం మీ ముందుంచుతున్నాం. అది మేము గట్టిగా తీసుకున్న నిర్ణయం. ఒ తిరుగులేని నిర్ణయం! ఈనాటి మా తరానికి చెందిన ఓ ప్రేమ పూర్వకమయిన నిర్ణయం! రెండు జీవితాలు ఒకటయ్యే నిర్ణయం....మీరు మీ అంతగా మాకు చెప్పకముందే మేముగా తీసుకున్న నిర్ణయం.
మేం జీవితంలో ఒకటిగా మారాలనుకున్నాం. కుటుంబం అనే పరిధిలో భర్తా, భార్య అనే రెండు బిందువులుగా మారాలనుకుంటున్నాం. ఆ ఏర్పాట్లు చేస్తారని అనుకుంటున్నాం" అంటూ లవ్ లీగా నవ్వాడు. అంతకంటే అందంగా నళినీకూడా నవ్వుతూ నిలబడింది.
ఆ నిర్ణయం వినడంతోనే వసుంధర ఒక్కసారిగా కదిలిపోయింది. కూరగాయల్ని తరుగుతున్న కత్తిని కోపంగా అవతలికి విసిరి-
"నో....అలా జరగడానికి వీలులేదు. అలాంటి నిర్ణయం తీసుకోటానికి మీకెలాంటి నైతిక పరమైన అవకాశం కానీ-హక్కుగానీలేదు. నా బొందిలో ప్రాణముండగా నేను దీనికంగీకరించను." అంటూ బిగ్గరగా అరిచింది.
ఆమె అలా అనడంతో వంశీ నళినిలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
వంశీ రెండడుగులు తల్లికి దూరంగా జరిగి__
"మమ్మీ! ఇందులో 'అవకాశమూ' -'హక్కు' అనే పదాలు ఎందుకు వాడతావు? నళిని స్వయంగా నాకు అక్క కూతురు. మేం ఇరువురం ప్రేమించుకున్నాం. అలా ఎంతోమంది అక్క కుమార్తెని ప్రేమించి పెళ్ళి చేసుకోవడంలేదు. ఇందులో మేం చేసిన తప్పేముంది? ఆధునిక సైన్స్ మేనరికాన్ని అంగీకరించకపోవచ్చు. కానీ మాకు అంగీకారమైంది."
వసుంధర అలాగే నిలబడి మాటల్ని కోల్పోయి ఆవేశంగా నిలబడింది.
అటూ నళిని తండ్రి కూడా ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అలా నిలబడిన భర్త దగ్గరకు గబగబా అడుగులు వేసుకుంటూ గీతిక వెళ్ళి ఆందోళనపడుతూ-ఏదో మెల్లిగా చెప్పి నిలబడింది. 'తాము ప్రేమించుకున్నాం-పెళ్ళి చేసుకుంటాం' అని చెప్పడంతో అందరూ ఆనందిస్తారని ఆశిస్తే...అలా ఎందుకు బిగుసుకుపోయారో అర్ధంకాని వంశీ-నళినిలు కూడా అయోమయంగా నిలబడ్డారు.
వారంతా అలా ఆ హాలులో బిగుసుకుపోవడానికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం__
గీతిక ఆరోజు పుట్టింటికొచ్చింది.
కుమార్తె అలా అనుకోకుండా రావడంతో వసుంధర ఆశ్చర్యపడినా మరో ఆనందానికి గురైంది. తనకు మంచి అల్లుడు దొరికాడు. కుమార్తెకు ఏమాత్రం చిన్న కష్టం కలుగకుండా పూవుల్లోపెట్టి-కాదు కాదు అంతకంటే ఎక్కువగా హృదయంలోపెట్టి చూసుకుంటాడు. కుమార్తె తనకు తెలియచేసి వచ్చినా, అర్ధాంతరంగావచ్చినా ఎలాంటి అనుమానమూ పడాల్సిన అవసరం వుండదు.
"అల్లుడేడమ్మా! ఒక్కదానివే వచ్చావు?"
"కేంప్ కెళ్ళాడు. కుమార్తె నుండి వచ్చిన ముక్తసరి సమాధానం ఈసారి ఆమెకు మనసులో ఏదో జరిగిందన్న అనుమాన బీజాన్ని నాటింది. రావడంతోటే గలగలా మాట్లాడే కుమార్తేనా ఇంతకన్నా క్లుప్తంగా మాట్లాడుతోంది.
ఆ తర్వాత గీతికకు ఎంత అణచుకుందామన్నా దుఃఖం ఆగలేదు.
ఒక్కసారిగా తల్లి గుండెలమీద తలపెట్టి బావురుమంది.
వసుంధరకు అల్లుడి పరంగా ఏదో జరిగిందన్న భయం ఆవహించింది.
"ఏమయిందిరా! చెప్పమ్మా?"
గీతిక కాస్సేపటివరకూ ఏం చెప్పలేదు. తిరిగి మరలా దుఃఖో ద్వేగాన్ని అణుచుకుంటూ-
"అమ్మా! నాకిక పిల్లలు కలగరంట. మొన్నమీ ఎల్లుడుగారు ఆసుపత్రిలో చూపించారు. ఆయాసపరంగా ఏం లోటు లేదన్నారు. ఉన్న లోపమంతా నాలోనే వుందన్నారు."
వసుంధర షాక్ కు గురైంది. కోతురు కడుపు పంపకపోతే......ముందు ముందు దీనిమీద ప్రేమ తగ్గిపోతుంది. అల్లుడికి పిల్లలమీదకు మనసుపోతే ....ప్రతిగా మరో అమ్మాయిమీదకు మనసుకు లగ్నం చేస్తాడు.
అప్పుడు మెల్లిగా తన కుమార్తెకు విడాకులు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
కుమార్తె తలను ఆప్యాయంగా నిమురుతూ-
"లోపం ఏమిటో చెప్పారా?"
"చెప్పారమ్మా! 'కంజెనిటల్ గైనిక్ ప్రాబ్లమ్" అన్నారు. నాలో గర్భంసంచి పెరగలేదంట. అండోత్పత్తి అయితే అవుతుందంట."
"ఇదేం చోద్యమే! ఇలాంటి జబ్బులుకూడా వుంటాయా?"
"మన కర్మ బాగుండకపోతే అవి మనతోనే ప్రారంభాన్ని తీసుకుంటాయమ్మా."
"ఆయనకీమధ్య పిల్లలుమీద మనసు పోతోంది. విషయం విని కాస్త విచారించినట్టున్నాడు. నన్నయితే ఏం అనలేదు. పైగా నేను బిక్కముఖంపెట్టి అదోరకంగా అయిపోయాను. దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. తర్వాత కొన్ని వివరాలు చెప్పాడు.
"పోనీ గీతికా....కొన్ని మన చేతుల్లో వుండవు. మనది విచిత్రమయిన సమస్య! నీలో సంతానయోగానికనుకూలమైన 'ఓవరీ సిస్టం' బాగానే వుందనీ....నాలోనూ పురుష బీజకణాలు ఆరోగ్యంగా వున్నాయనీ అన్నారు. అయితే అవి నీ కడుపులో ఫలించే యోగం వుండదని చెప్పారు. రెండింటినీ కలిపి ఒక 'గామేట్' గా తయారుచేసి-మరెవరి గర్భసంచిలో నయినా పెడితే-మన ఇరువురికీ చెందిన చైల్డ్ పుడుతుందని అన్నారు. అయితే గీతికా....మనకు ఏ స్త్రీ అయినా కొన్ని నెలలపాటు తన గర్భసంచిని ఒకరకంగా చెప్పాలంటే లీజుకివ్వాలి. ఆ పిరియడ్ లో ఆమెకు మనం కొంత పే చేయాలి. ఆమె యోగక్షేమాలన్నీ మనమే చూసుకోవాలి. ఒక సంవత్సరాలకాలం పట్టే ఆ ప్రాసెస్ కు ఏ స్త్రీ అంగీకరిస్తుంది?"
మనకు సంబంధించిన 'జైగోట్'ను మరో స్త్రీ తన గర్భంలో పెంచి -శక్తినీ, రక్తాన్ని పంచి కష్టపడి కని.....తిరిగి మనకెలా యిస్తుంది సో...మనం ఆ విషయం కూడా మర్చిపోదాం" అన్నాడమ్మా" అంటూ జరిగింది వివరించి గీతిక మరోసారి బావురుమంది.
