చాలా దేశాల్లో ఎక్కువ తిండి తినేవారికి అసలు పని వుండదు. తక్కువ తిండి తినే నిరుపేదలకు నిత్యం పనే. ఈ సమతుల్యత తిండికీ పనికీ అందని రెండు వర్గాలు. ఎవరి జబ్బులకు వారు గురవుతుంటారు. తిండి అరక్క ఒకడికీ- తిండిలేక ఒకడికీ__
ఇంతలో మధు గీతికల వంతు వచ్చింది.
ఇరువురూ ఆసుపత్రిలోకి ఏంటయ్యారు.
* * * *
ఇరవై సంవత్సాలు గడచిపోయాయి.
యూనివర్సిటీ కాంపస్, విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన భవంతుల్తో గంభీరంగా ఉంది. కాంపస్ ముందు చెట్లు దట్టంగా ఉన్నాయి.
ఒక చెట్టు క్రింద వంశీ, నళిని మాట్లాడుకుంటున్నారు. ఇరువురూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. వంశీకి కోర్సు పూర్తికావస్తోంది. పి.హెచ్.డి. చేయాలనే ఆలోచనలో వున్నాడు.
నళిని అతని కంటే జూనియర్.
ఇటీవలే యూనివర్సిటీలో చేరింది.
ఇరువురిలోనూ ఒక ఆకర్షణ.
ఒకరినొకరు ఆకర్షించుకుంటున్న ఫీచర్స్.
వంశీ ఆరడుగుల ఎత్తు ఉంటాడు, ఎర్రగా ముఖం కోలగా వుంటుంది. భుజాలు విశాలంగా వుంటాయి. మనిషి బలిష్టంగా ఉంటాడు. నెత్తిమీద జుట్టు కాస్తంత నల్లగా, వత్తుగా ఉంటుంది. మెత్తగా ఉంటుంది. అది గాలికి పాయలుగా చీలుతూ- వెనక్కిపోతూ - ముందుకు పడుతూఉంటే మరింత అందంగా అతని ముఖం కనిపిస్తుంది. నళినీకి అతన్ని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది, తనకే తెలీని ఆరాధన.
"డియర్ నళినీ..."
నళిని అతన్ని అలాగే చూస్తూ....
"ఏమిటి?" అంది రెట్టించి మాట్లాడటం, వంశీని ఏడ్పించటం ఆమెకు అలవాటు. అలాంటి చనువు వారి మధ్య అంతకు ముందు నుండీ వుంది.
"మనం ఇలా ఎన్నాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ కాలం గడుపుదాం?" ఆ మాటల్తో నళినికి కాస్త తమాషా చేయాలనిపించింది. వెంటనే కిసుక్కుమని నవ్వింది.
"దానివల్ల నష్టమేముంది వంశీ! అదేమన్నా ఖరీదయిన కార్యక్రమమా? ఈ చెట్ల క్రింద కూర్చుని అంతకంటే ఏం చేస్తాం?"
"ఈ చెట్ల క్రింద కూర్చుంటే అంతకంటే ఏం చేయలేం. ఎవరూ కనిపించని ఏ పూపొదల్లోకో వెళితే__ఏదయినా చేద్దామని కదూ!"
"ఏం చేద్దామని? మనసులో ఏమన్నా అనుకున్నావా?"
"ఆ....!"
"అయితే చెప్పు!"
"దగ్గర్లో ఎవరూ లేరుగనక చెప్తాను."
"చెప్పు మరి! ఈలోపు ఇటేవరైనా వస్తే మళ్ళీ ఆగిపోతావ్."
"మనం పూపొదల్లోకి వెళదాం. అక్కడ నిన్ను మెల్లిగా నా చేతుల్లోకి తీసుకుంటాను."
"అంటే అప్పుడు నేనక్కడుంటాను? పొదలో నేల మీద పడిపోయి వుంటానా? పూవులా మెల్లిగా తీసుకోవడానికి?"
"అదిగో....నేనేదయినా మైమరచి చెప్తుంటే నువ్వేమో హాస్యంలోకి దించుతావ్."
"సరే....నిన్ను హాస్యమ్లోకి దించను కానీ-నీవు నన్ను పొదలోకి దించినట్టేనా?"
"అదేగదా చెప్తుంది. నిన్ను చేతిలోకి తీసుకున్నానా....గాలికి నీ ముఖం మీద పడే నీ తుమ్మెదరంగు ముంగురుల్ని చేత్తో అలా సవరిస్తాను."
"పొదలోకి గాలి రాకపోతే- నువ్వే నుదుటి మీదికి లాగి తిరిగి వెనక్కి సవరిస్తావా?"
"యూ నాటీ! మాటిమాటికీ మూడ్ చెడగొడతావ్" అంటూ ఆమె చెవుల్ని పట్టుకుని వంశీ మెలిపెట్టాడు. నళిని అతనికి చక్కలిగిలి పెట్టింది. వంశీ వెంటనే వదిలాడు.
వంశీ చిన్న చక్కిలిగింత క్కూడా మెలి తిరిగిపోతాడు. అప్పుడయినా తనను గట్టిగా పట్టుకుని ముద్దెట్టుకోబోతే__ నళిని గభాల్న చక్కిలిగింత పెడుతుంది. అంతే- అతడు ఆమెను వదిలేస్తాడు. తరువాత ఆమెను పట్టుకోవాలని పరిగెత్తాడు. నళిని తూనీగలా అందకుండా పారిపోతుంది.
వంశీ ముఖంలో ఈసారి ఒక అమాయకత్వం చోటుచేసుకుంది. బుంగమూతి పెట్టి అలాగే ఒక దరిని నిలబడ్డాడు. అతడలా నిలబడటం నళినికి ముద్దు. వేనుగ్గా ఆమె వచ్చి__అతన్ని వాటేసుకుని__
వీపుమీద ప్రేమగా కొరికింది.
వంశీకి మరింత పులకింత...
"డియర్ ఆ తరువాత ఏమిటో చెప్పు."
"అసలు చెప్పటమేమిటి? నిన్ను పొదలోకి లాక్కుపోయి- చేసి చూపిస్తాను."
తిరిగి ఆమె వైపుకి తిరిగి ముద్దెట్టుకోబోయాడు. నళిని అతని కందకుండా ఎడంగా జరిగింది.
"అక్కడ నన్నేం చేస్తావో చెప్తేనే నీకు ముద్దు."
"నీ అందమైన ముఖాన్ని కాస్సేపు అలా చూస్తాను."
"పొద దట్టంగా వుంటే చీకటిగా వుంటుంది గదా! నీకు నా ముఖం ఎలా కనిపిస్తుంది!"
"నీ ముఖం నాకు కళ్ళు మూసుకున్నా కనిపిస్తుంది. అంతగా ఆ అందాలు నా మనసులో ముద్రపడ్డాయి."
"అయినప్పుడు పొదలో కెళ్ళటమెందుకు?"
"అదిగో...మరలా....మూడ్ చెడగొడుతున్నావ్!"
నళిని తిరిగి కిసుక్కుమని నవ్వింది. తర్వాత అతనికి మరింత దగ్గరగా జరిగి...
"తర్వాత చెప్పు...అలా కాస్సేపు నా ముఖాన్ని చూస్తావ్..."
"ముఖాన్ని పొదలో అంత దగ్గరగా చూసి ఎవడూ ముద్దుపెట్టుకోకుండా వదలడు. అలా వదిలితే వాడ్ని ఉత్త మొద్దు వెధవాయ్ అంటారు."
"తరువాత!"
గ్రీన్ బుష్! రెడ్ కిస్! నైట్ హగ్!"
"బుష్ గ్రీన్ గా వుంటుంది. పెదాలు ఎర్రగా వుంటాయి గనుక కిస్ రెడీగా వుటుంది. హగ్ వైట్ గా వుండటమేమిటి?"
మన ఇరువురం తెల్లగా వుంటాం. ఆ పొదల్లో పెనవేసుకుపోయినప్పుడు దాన్ని వైట్ హగ్ అన్నాను.
"వంశీ!"
"మన రొమాంటిక్ కటింగ్స్ ఎలా వున్నాయి?"
"బాగున్నాయి. కానీ బుషేస్ లో పాములుంటాయి కదా! ఆ సమయంలో ఒకటి మన మధ్య దూరిందనుకో...ఏం చేస్తావ్?"
"మనం ఏం చేయకుండానే అది చచ్చి వూరుకుంటుంది. ప్రపంచాన్ని మర్చిపోయి మనం పెనవేసుకుని వుంటాం. మన ప్రేమావేశం సంఘర్షించుకుంటుంది. కొద్దిసేపటికి అది శక్తిని కోల్పోయి జారిపోతుంది."
వంశీ మాటలకు నళిని ఈసారి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు! అతనిలో నిజంగానే తనంటే ఒక ప్రేమావేశం వుంది. అది అతని కళ్ళలో స్పష్టంగా కనిపించింది.
"గ్రీన్ బుష్- రెడ్ కిస్- వైట్ హగ్!"
వంశీతో అవి పంచుకోవాలని ఆమెకు మనసులో కొద్దిగా ఆరాటం. కానీ ఎందుకో భయం!
జీవితంలో దేనికీ త్వరపడకూడదు!
స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్!
శృంగారం జీవితానికి అవుసరమే! కానీ దానికీ సమయం వుంటుంది. అమృతంలా భూమి మీదికి రాలాకే చెట్లు చిగురించటం మొదలెడతాయి.
తమకు చదువులు పూర్తికావాలి.
యూనివర్సిటీ నుండి బరువైన తలతో - విజ్ఞానాన్ని నింపుకుని ఇంటికి చేరాలేగాని....మరో వంశీని శరీరంలో నింపుకుని బరువుగా ఇంటికి చేరగూడదు.
అందుకే అయితే....ఈ విద్యాలయాలే వాటికి అవుసరం లేదు. ఇన్ని వేల రూపాయలు ఇక్కడ ఖర్చుచేయాల్సిన పనిలేదు.
ఒకనాటి ఇండియాకీ, ఇప్పటి ఇండియాకూ తేడావుంది. డాడీ-మమ్మీ కాలంలో చదువు ఫ్రీగా లభించేది. ఇప్పుడు వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక్కడ వేలరూపాయలు వెచ్చించి తను ఏం మోసుకుని ఇంటికి వెళుతుంది?
ప్రపంచ పరిజ్ఞానాన్నా...?
ప్రేమానుభూతులనా?
తనకూ వంశీని చూసినప్పుడల్లా ఏవో చిలిపి ఊసులు తలెత్తుతున్నా -త్వరపడటం మంచిది కాదని....అతని ఆవేశాన్ని హాస్యంలోకి దించి ఆటపట్టిస్తూ వస్తోంది.
కానీ, తన శరీరం కూడా ఎక్కడో పట్టుతప్పుతోంది! ఒకసారి వంశీతో తీయటి అనుభూతుల్ని పంచుకుంటే జరిగే నష్టం ఏముంటుంది?
రుచి ప్రమాదకరమయింది.
ఒకసారి అనుభవంలోకి వస్తే మరల మరల కావాలనిపిస్తోంది.
విందుకు కూర్చునే టైమ్ ఒకటి వుంటుంది.
అప్పటివరకూ ఆగితేనే ఆ ఆకలికి మరింత అర్ధముంటుంది.
తనకిప్పుడు నిజంగా ఆకలి వుందా?
వంశీని చూసినప్పుడల్లా ఏదో ఒక కోరిక- శరీర భాగాల్లో తరంగమవుతుంది.
ఆ తీయటి తరంగానికి 'అంతరంగం' వెంటనే తనకు తెలీకుండానే కళ్ళెం వేస్తుంది.
కానీ వంశీ మాత్రం తన కోసం త్వరపడుతున్నాడు.
తను వంశీని ప్రేమించాననీ- పెళ్ళి చేసుకుంటాననీ చెప్తే ఎవరు కాదంటారు? అందరూ దీవిస్తారు. కానీ తాము తొందరపడినట్టు తెలిస్తే మామ్- డాడీ తనను గురించి తేలిగ్గా అంచనా వేస్తారు!
తన వంక వారు గర్వంగా చూడాలేగాని...ఒక అనీజీ ఫీలింగ్ తో తల తిప్పుకోగూడదు.
అందుకే వంశీకి తను అందీ అందకుండా కాలాన్ని నెట్టుకొస్తుంది.
"నళినీ!"
ఊహల్లోంచి బయటపడి నళిని వులిక్కిపడింది. వంశీ ఆమె వంక ఆశగా చూస్తూ....మరింత దగ్గరయ్యాడు. నళిని రెండడుగులు వెనక్కి వేసింది.
