9. "నను గొనిపోయేడి - నినుగని అసురులు
ఒక్కసారిగా - నిన్నేదిరించగ |
అస్త్ర శస్త్రములు - కలిగిన వారితో
| నిరాయుధుడవై - ఎటు పోరగలవు ?
క్రూర కర్ములగు - అసుర వీరులతో
నన్ను మోయుచు - ఎటు పోరగలవు ?"
అని పల్కె సీత - హనుమంతునితో
తనలో కలిగిన - వాత్సల్యముతో .... ||శ్రీ||
10. "యుద్ధమందు జ | యాప జయములు
తెలియరాని దై | వాధీనములు |
ఎందులకయిన - మంచిది వినుము
కీడెంచి పిదప - మేలెంచుదము
రాక్షసులే నిను - గెలిచిరనుకొనుము
పూర్తిగ చెడును - రామకార్యము | "
అని పల్కె సీత - హనుమంతునితో
తనలో కలిగిన - వాత్సల్యముతో .... ||శ్రీ||
11. "హనుమా నీవే - అసురులు గెల్చి
ఒకవేళ నన్ను - రాముని జేర్చిన |
| మహాపరాక్రమ - విశ్రుతుడైన
| సాకేత పతికది - కీర్తికరమా ?
తిరుగులేని అ | గ్ని శరములు గల
కోదండపాణి క | ది కీర్తికరమా ?"
అని పల్కె సీత - హనుమంతునితో
తనలో కలిగిన - వాత్సల్యముతో .... ||శ్రీ||
12. "శ్రీరాముడు నా - ప్రాణ విభుడు
నన్నంటగల - పురుషోత్తముడు |
ఒంటరి దానను - వివశురాలను
నను స్పృశించి గొని | వచ్చె రావణుడు |
రాముడెపుడు దశ | కంఠుని ద్రుంచునో
అపుడే నాకు - శాంతి కలుగును |"
అని పల్కె సీత - హనుమంతునితో
తనలో కలిగిన - వాత్సల్యముతో .... ||శ్రీ||
__: 37 వ. స. సంపూర్ణము :__
38 వ. సర్గ
మారుతి సీతతో :
1. "తల్లీ నేను - నీయందుగల
భక్తి భావమున - ఆటలు దెల్పితి |
క్రూర రాక్షసుల - బారినుండి నిను
కాపాడనెంచి - అటుల బల్కితి |
వేగమే నిన్ను - రాముని జేర్చెడు
శుభగడియలకై - త్వరపడి పల్కితి |"
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
2. "తల్లీ నీవు - తెలిపిన వన్నీ
శ్రీరామునకు - విన్నవించెదను |
సత్యధర్మ ప | విత్ర చరిత్రపు
శ్రీరామునకు - తగిన భార్యపు |
అమ్మా ఇమ్ము - ఏదో గురుతుగ
శ్రీరాముడు గని - ఆనందించగ | "
అని హనుమంతుడు - సీతతో పలికె
అంజలి ఘటించి - చెంతన నిలిచె .... ||శ్రీ||
సీత హనుమంతునితో :-
3. "మును చిత్రకూట - పర్వత మందున
వివిధ పుష్పఫల - వనము లందున |
రాముడు నేను - క్రీడల తేలి
అలసి చేరితిమి - చెట్ల నీడల |
శ్రీరాముడు నా - తొడపై తలనిడి
నిదుర బోయెను - హాయిగ ఒరిగి |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో .... ||శ్రీ||
4. "కాకాసురుడను - ఇంద్ర కుమారుడు
ఆ సమయమున అట చేరినాడు |
ముక్కుతోటి నా - స్తనాంతరమును
రక్తము చిందగ - చీరినాడు
రాముడు మేల్కొని - ఆగ్రహ మొందేను
బ్రహ్మాస్త్రముగా - దర్భను విసరెను |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో .... ||శ్రీ||
5. "బ్రహ్మాస్త్రము ఆ - కాకాసురుని
వంటలజి మ్ముచు - వెంబడించెను |
భయపడి కాకి - కావు కావు మని
తిరిగి చూచెను - లోకాలన్నీ |
దిక్కులేక తుద | కు శరణు శరణని
శ్రీరాముని చర | ణముల వ్రాలెను |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో .... ||శ్రీ||
6. "ప్రయోగించిన - బ్రహ్మాస్త్రమును
వ్యర్ధము జేయగ - సాధ్యము గాదని |
కాకి యొక్క కుడి | కన్ను హరించి
రాముడు వదలె - కడకు మన్నించి |
చావుదప్పి క | న్ను లొట్టబోయి
కాకాసురుడు త | న దారిని బోయె |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమైన - విశ్వాసముతో .... ||శ్రీ||
