శ్యామల
డిసెంబర్ నెల చలి. అమాంతంగా వాన చుట్టుకుంది. అలాంటప్పుడు ఏ రిపోర్టరూ మంచి రిపోర్టు రాయలేడు. పైగా శ్యామలాదేవి ఇంకా గేటే తెరువలేదు.
నేను ఆ కవయిత్రిని అంతకుముందు చూడలేదు. ఆమె తన కవితకంటే అందం అయిందని అనుకుంటారు. అందుకే చలిలోనూ వానలోనూ గేటు ముందు నుంచున్నాను.
అప్పటికి రాత్రి తొమ్మిదిమాత్రం అయింది. అయినా ఇంట్లో చీకటి ఉంది. ఇల్లు సాంతం మౌనంగా ఉంది. వర్షం పడుతున్నప్పుడు, పిడుగుల రొద వినిపించినప్పుడు కవులు కలవరంగా కదులుతుంటారని విన్నాను. కాని శ్యామలాదేవి ఏమి కలల్లో కరిగిపోతుందేమో!
శ్యామలాదేవి ఇంటర్వ్యూ చూచి జాయింట్ ఎడిటర్ ని చేస్తానన్నారు ఎడిటర్. జాయింట్ ఎడిటర్ అవుతానన్న ఆశతో మరోసారి గేటు చప్పుడు చేశాను. చప్పున పోర్టికోలోని లైటు వెలిగింది. ఒక స్త్రీ తలుపు తెరిచింది. తల బయటికి పెట్టింది.
"ఎవరది? ఇప్పుడెందుకొచ్చారు? ఉదయం రండి" చిరాకుగా అన్నది.
"నేనండీ-నేను 'ఊహ' పత్రిక ఆఫీసు నుండి.......'
"అవును బాబూ. కావచ్చు. ఎవరివైనా ఒక తల్లికి బిడ్డవేగా. అలాంటప్పుడు ఈ వానలో ప్రాణాలు ఎందుకు తీసుకుంటావ్!"
అది నా భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. అదృష్ట ద్వారంముందు నుంచున్నాను. అది తెరుచుకుంది. అందులో ఒక మర్యాద తెలియని ఆడది వెధవవాగుడు వాగుతూంది. ఎలా ఉంటుందంటారు? విషంలా తోచదూ! నాకు శ్యామలాదేవిమీద కోపం వచ్చింది. ఇంటర్వ్యూకు టైమ్ ఇచ్చింది. ఇప్పుడీ అమర్యాద ఏమిటి? రిపోర్టర్ కలం ఆమెను శిక్షించలేదనా ఏమిటి ధీమా!
'చూడండి ఇవ్వాళ వారి ఇంటర్వ్యూ చేయడం అత్యవసరం. కొద్ది సమయం దొరికినా ఇది చాలా ముఖ్యమైన పని అని వారికి నచ్చచెప్పగలను....ఇంకా....'
"అచ్చా.....అచ్చా" ఆమె చేయిచాచి నా మాటను ఆపేసింది.
'రండి.....లోపలికిరాండి. రేపు ఉదయం శ్యామలాదేవి ఇంటర్వ్యూ రాదు సరిగదా- ఒక మంచి రిపోర్టరును కోల్పోయిన వార్త తప్పక వస్తుంది. రండి లోనికి రండి.'
ఎంత స్వచ్చంగా ఉంది పనిమనిషి భాష! ఒక మంచి కళాకారుడు ఎన్నుకునే ప్రతిదాంట్లోనూ అందం తొంగి చూస్తుంటుంది. నేను గదిలో అడుగుపెట్టాను. హేటుమీంచి కారే నీటిధారల్లోంచి ఆమెను చూచాను. ఎందుకో పాత పుస్తకం గుర్తుకు వచ్చింది. దుమ్ము నిండిన పుస్తకం-పాత పుస్తకాల దుకాణంలోపడి-చదలు తినని పుస్తకం-పిల్లలు చించిన పుస్తకం-చదివేవాళ్ళ చేతి చెమటకు తడిసిన పుస్తకం.
శ్యామలాదేవి అందమైన కవిత రాస్తుంది. ఇలాంటి అందవికారం అయిన పాత పుస్తకం లాంటి ముఖం ఉన్నదాన్ని పనికి పెట్టుకుంది.
గదిలో విలువైన వస్తువులు ఉన్నాయి. అయినా చిందర వందరగ పడిఉన్నాయి. బల్లమీద, తివాచీ మీద, కుర్చీలమీద ఎక్కడ చూచినా పుస్తకాలు పడిఉన్నాయి. పాత కాపీలు పడిఉన్నాయి. కాగితాల గుట్టలు పడిఉన్నాయి. గోడలకు చాలా పటాలున్నాయి. దంపతుల పటం ఒకటుంది. అందులోని వధువు ముఖంమీద ముసుగుంది. వరుడు కెమెరాను తొలిసారి చూచినట్లు కళ్లు వెళ్ళబెట్టాడు. ఒక అందమైన అమ్మాయి పటం ఉంది. అది పెద్దగా ఉంది. ఆమె ముఖంలోని కొంటెదనపు కిరణాలు ఈ గదిలోని జుదాసీన్యపు చీకటిని పారదోలుతున్నాయి. ఒక యువకుని పటం ఉంది. అతడు బక్కపల్చగా ఉన్నాడు. రెండు చేతుల్తో తలపట్టుకొని కూర్చున్నాడు. ఏదో ఆలోచనలో మునిగినట్లున్నాడు. అందమైన ఒక కాశ్మీర దృశ్యపు పెయింటింగ్ ఉంది. అందులో ఒక వేటగాడు వెళ్ళిపోతున్నాడు. వడ్డున నుంచున్న యువతి చేయెత్తి వీడ్కోలు ఇస్తూంది.
నేను గదిలో అడుగు పెట్టగానే ఆమె స్టూలుమీంచి ఒక సీసా, అగ్గిపెట్టె తీసింది. అప్పుడు ఆమె నన్ను చూచిన చూపు ఎలా ఉందంటే నేను ఆమెను షూట్ చేస్తానేమో అని భయపడ్డట్లుంది. ఆమె వణికే చేతుల్తో అగ్గిపెట్టె సీసా బల్లకింద దాస్తుంటే అది పెట్రోలు సీసా అనే విషయం నా ముక్కు కనిపెట్టేసింది.
ఆమె లోనికి వెళ్ళిపోయింది. శ్యామలాదేవికి చెప్పడానికేమో? చాలా సమయం గడిచింది. ఈలోగా తడిసిన హేటు తీశాను. బూట్లు విప్పి ఒకపక్కన పెట్టాను. ఎన్నో సిగరెట్లు కాల్చేశాను. గదిలో ఉన్నవాటినన్నిటినీ పరిశీలించాను. దిండుకింద ఒక ఉత్తరం కనిపించింది. అది రంజన్ శ్యామలాదేవికి రాసింది. అదీ చదివేశాను. రంజన్ శ్యామలాదేవి భర్త. కాని ఆ ఉత్తరంలో అలా లేదు. ఆమె అతని ప్రేయసి అని ఉంది. ఆమె మందిరంలో సింహాసనం మీద కూర్చున్న దేవి. ఆమెను కన్నెత్తిచూడ్డం రంజన్ కు జీవితంలాగూ ఉంది, మృత్యువులానూ ఉంది.
తివాచీని ఒక పక్కకు జరిపి, తడిసిన బట్టలు ముడుచుకుని కూర్చుందామంటే దానికిందినుంచి కొన్ని కాగితాలు ఊడిపడ్డాయి. అందులో మా ఎడిటర్ గారి ఉత్తరం కనిపించింది. అది వారు శ్యామలాదేవికి రాశారు. ఒక మంచి కవిత పంపమని ప్రార్థించిన లేఖ అది.
శ్యామలాదేవి కవితలో దుఃఖం మెరుపులా కనిపిస్తుంది. ఆమె ఒక సుందర యువకుని ప్రియమైన భార్య. ఆమె జీవితం అందాలరాశి అని విన్నాను. అయినా ఆమె కవితలో వంటరితనం, ఉదాసీనతా చోటుచేసుకుంటాయి. శ్యామలాదేవి ఏకాగ్రంగా రాయగలిగితే అజరామరమైన అతిసుందర కవిత రచించగలదని మా ఎడిటర్ గారి అభిప్రాయం. వచ్చేప్పుడు వారు నాకు ఆమాటా చెప్పారు. కవయిత్రితో అందును గురించి ముచ్చటించవలసిందని ఆదేశించారు.
పదిహేను నిమిషాలు గడిచాయి. ఎవరూ రాలేదు. నాకు విసుగుపుట్టింది. తలుపు తడదామనుకుంటుండగానే అప్పటి ఆడది కప్పులో వేడి కాఫీ తీసుకొని ప్రవేశించింది.
"మిమ్మల్ని చాలాసేపు వర్షంలో నుంచోపెట్టాను. ఇదిగో అందుకీ పరిహారం" అని కాఫీ కప్పు అందించింది.
"కృతజ్ఞతలు" అని కప్పు బల్లమీద పెట్టాను. "శ్యామలాదేవికి చెప్పారా-?" అని అడిగాను.
"శ్యామలాదేవి.....అవును నేనే శ్యామలాదేవిని!" ఆమె నిబ్బరంగా అన్నది.
అది విన్నాను- నాకు వణుకు వచ్చింది చేతులు వత్తుకున్నాను. బట్టలు చించుకునేంత పనిచేశాను. కాఫీ కప్పు పవిత్ర గ్రంథమా అన్నట్లు అందుకున్నాను. నిప్పును అంటుకున్నట్లు వదిలేశాను. నమస్కరించడం, క్షమాపణ కోరడం కూడా మరచాను. నన్ను చూచుకుంటే నాకే నవ్వు వచ్చింది. నాలో నేను నవ్వుకున్నాను. నాకు నేను నాటకంలో హాస్యపాత్రలా కనిపించాను.
శ్యామలాదేవిది విశాల హృదయం, ఆమెను చూస్తూ నుంచున్నాను. ఆమె నిరాడంబరతకు ముగ్ధుణ్ణి అయ్యాను. తెల్లని మామూలు చీర, నగలు లేని మెడ, అలంకరణ లేని వదనం అతి సాధారణంగా ఉంది. వయసు 30,35 ఉంటుందేమో! అయినా వదనంలో బాల్యపు అమాయికత కనిపిస్తుంది. జీవితపు ఓటమి గుండెలో దాగదు. కామిలా రోగంలా ముఖం మీద తాండవం ఆడుతుంటుంది. శ్యామలాదేవి వదనంలో అలాంటి 'కామిల' కనిపించింది. అది ఆమె కవితను గుండె లోతుల్లో నొక్కివేస్తుందేమో అనిపిస్తుంది. ఆమె అంత అందం అయిందేమీ కాదు అయినా జనం అలా ఎందుకనుకుంటారు?
"మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు కదూ! నా జీవిత విషయాలు కూడా అడుగుతారనుకుంటా"
"అవును" నేను అబద్ధం చెప్పేశాను. నేను వచ్చింది సాహిత్య విషయాలు చర్చించడానికి.
"అలాగా?" ఆమెలో విషాదచ్చాయలు గోచరించాయి. అరచేయి గద్దువకు ఆనించి ఆలోచించింది.
"శ్యామల జీవితాన్ని గురించి ఇప్పుడే వినండి. రేపు ఈ సుందరకావ్యం మీద ఎవరి దృష్టి పడకపోవచ్చు" ఆమెలో అశాంతి, ఆవేదన గోచరించాయి.
"శ్యామల ఒక ఆటోగ్రాఫ్ పుస్తకం. అది జీర్ణం అయిపోయింది. దానిలోని రాతలు చెరిగిపోతున్నాయి- చదువరావు మెల్లగా, మెలమెల్లగా చెపుతూంది.
