Previous Page Next Page 
పావని పేజి 27


    "మల్లీ" - మళ్ళీ అరిచాడు లేచి ఉరకబోయాడు ధోవతి కాళ్ళలో తట్టుకుంది ధోవతి సవరించుకుని ఉరికాడు ఉరుకుతున్న శివయ్యకు కర్ర అందించింది సుభద్రమ్మ "వట్టి చేతులతో పోకుండి-ఏం చేస్తదో లంజముండ" అని.
    శివయ్య కేక విని మల్లమ్మ చేతిలో చెంబుతో అలాగే ఉరికివస్తూంది లోనికి - కర్రతో శివయ్య బయటికి ఉరికి వస్తున్నాడు ఇద్దరూ గుమ్మం దగ్గర ఢీ కొన్నంత పనయింది మల్లమ్మ చేతిలో చెంబు జారి పడిపోయింది.
    "చెంబు పగల కొడ్తావు, లంజ ముండ" అని కర్రతో బాదాడు - అతనికి ఆ నెపం దొరికింది - మల్లమ్మ ఏం చేసిందో అతనికి తెలియదు కాని, కసి పేరుకు పోయింది చాలా కాలంగా - కారణం ఇది దొరికింది.
    "చేయి జారింది బాంచెను - చంపకుండి" చేతులడ్డం పెట్టి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూంది మల్లమ్మ.
    "చేయి జారినాది! అట్లనే జార్తదే మదం ఎక్కుతే" అని మరోటి వేశాడు.
    మల్లమ్మ భుజానికి తాకింది దెబ్బ - బురబురా పొంగింది.
    "నాకేమెర్కలే బాంచను-కాల్మొక్త, నన్ను కొట్టకుండి బతకనియ్యరి బాంచను కాల్మొక్త" - విలవిలలాడిపోతూంది మల్లమ్మ.
    శివయ్యలో రాక్షసుడు చేరాడు వీరావేశంతో కొడ్తున్నాడు శివయ్య కర్ర మల్లమ్మ నొసటికి తాకింది చర్మం చిట్లింది, రక్తం కారుతూంది, జుట్టు ముడి విడిపోయింది, విరబోసుకుంది వళ్ళంతా దెబ్బలతో హూనం అయింది, దద్దులు వచ్చాయి, శివయ్య లాగి మరోదెబ్బ కొట్టాడు, కర్ర విరిగింది నిలబడిపోయాడు.
    మల్లమ్మను చూచాడు.
    మల్లమ్మ శక్తిలా ఉంది, కాళిలా వుంది, దుర్గలా ఉంది నొసటి నుంచి రక్తం స్రవిస్తూంది జుట్టు విరిసివుంది, కళ్ళలో రక్తం కనిపిస్తూంది, చేతులు ఎత్తింది అరచేతుల్లోంచి రక్తం కారుతూంది, శక్తీరూపం భీకరంగా ఉంది చూచాడు శివయ్య అమాంతంగా నరసింహుని చూచినా హిరణ్యకశిపునిలా ఒక్క అడుగు వెనక్కు వేశాడు.
    మల్లమ్మ ఒక అడుగు ముందుకు వేసింది తల ఒక్కసారి విదిలించింది వెంట్రుకలు చిందులు తొక్కాయి కొన్ని నొసటి రక్తంలో చిక్కుకుని నిలిచి పోయాయి మిగతావి చిందులు తొక్కి నిలిచిపోయాయి.
    మల్లమ్మకు శివం వచ్చింది గంతులేసింది.
    "ఊఁ ఊఁ ఉదేస్త కూరెస్త నరికేస్త ఒరే, నా మీదనే తిరగబడ్తావుర ఒరే నేనెవర్ననుకున్నవుర ముత్తాలమ్మను పోచమ్మను మరియమ్మను ఇన్నవార! ఇన్నవా?"
    సుభద్రమ్మకు మనిషంటే భయం లేదు- దేవర అంటే వణుకు వణికిపోయింది సుభద్రమ్మ వణికిపోయాడు శివయ్య.
    "ద్బ్రూ" ఊదింది మల్లమ్మ "ఊఁ ఊ మింగుత నరుకుత తరుగుత తిరుగుత ఉరుకుత"
    "అమ్మో! కొంప మునిగిందే! తల్లీ, నువ్వెవరు చెప్పు, ఏమి కావాల్నో చెప్పు  ఎట్ల పోతవో చెప్పు ఒరే నర్సిమ్మా! బాపనాయిన్ను పిలువరా!" సుభద్రమ్మ రొప్పుతూంది, మల్లమ్మ కాళ్ళమీద పడింది.   
    "నేనెవరో ఎరిక లేదానే పుల్లమ్మను నిన్న చచ్చిన ఇయ్యాలోచ్చిన నాకు గంజి పొయ్యనియ్యలే నీ ఇల్లు తుడిచిపెడ్త ఇల్లు ఊదుత వాకిలి ఊదుత ఇదంత మశాణం చేస్త"
    "తల్లీ, మన్నించు తెలియక తప్పు చేసినం నీకు కల్లు కుండలు పోస్తం సార సీసలిస్తం అన్నపు రాసులు పెడ్తం అన్ని పెడ్తం ఎల్లిపోతల్లీ!"
    శాస్త్రిగారు వచ్చారు వారు నిరాసక్తంగా ఉన్నారు వారిలో ఏదో బలమయిన మార్పు కొట్టవచ్చినట్లు కనిపిస్తూంది శివయ్య శాస్త్రులను చూచాడు.
    "శాస్త్రిగారూ! కాపాడండి శివశక్తి మా యింటికి వచ్చింది, పారదోలండి"
    "శివయ్యగారూ! పుల్లి గంజిలేక చచ్చింది దాని ఆత్మ ఘోషించి ఉంటుంది ఇట్ల బిడ్డమీద పూనింది"
    "ఊఁ ఊఁ పుల్లమ్మనే గంజి పొయ్యనియ్యలే నీ ఇల్లు తుడిచిపెడ్త ఊఁ ఊఁ"
    "తల్లీ, చల్లబడు, శాంతించు అపరాధం జరిగిపోయింది కావలెనన్నయి ఇస్తరు, సాంబ్రాణి తెండి, నిమ్మకాయలు తెండి, కొబ్బరికాయలు తెండి" - ఆదేశించారు గౌరీనాధశాస్త్రిగారు.
    "ఊఁ ఊఁ పుల్లమ్మనే అన్ని కావాలె అన్ని పొయ్యాలె"
    "అన్ని ఇస్తం తల్లీ, అన్ని పోస్తం" - సుభద్రమ్మ భక్తిగా మొక్కింది.
    శాస్త్రిగారు సాంబ్రాణి పొగ వేశారు నిమ్మకాయలు నరికారు, కొబ్బరికాయలు కొట్టారు.
    మల్లమ్మ అలసిపోయినట్లు పడిపోయింది స్పృహ తప్పినట్లు పడిపోయింది.
    "మంచంమీద పడుకోబెట్టండి తెలివి వచ్చేదాకా ఏమనొద్దు తెలివొచ్చిం తరవాత ఈ సంగతులేమి అడగొద్దు" అని శాస్త్రిగారు వెళ్ళిపోయారు.
    సుభద్రమ్మా, శివయ్యా కలిసి మల్లమ్మను ఎత్తి మంచంమీద పడుకోబెట్టారు.
    మల్లమ్మకు దెబ్బలు తిన్న బాధలేదు, జయించాననే ఉత్సాహం ఉంది తాను దొరను వణికించింది దొరసాన్ని వణికించింది!
    
                              16
    
    శివయ్య వాస్తవం తెలుసుకున్నాడు, మల్లమ్మ విషయంలో వాస్తవంగానే బాధ పడ్డాడు మల్లమ్మ చేసింది పెద్ద అపరాధం అనిపించలేదు అతనికి కాసిన్ని నూకలు పట్టుకుపోయింది, చచ్చే తల్లిగొంతులో కాలే గంజి పోయడానికి మల్లమ్మా మనిషే తల్లి విషయంలో అనురాగం ఉండడం తప్పుకాదు గోరంతను కొండంత చేశాడు నర్సిమ్మ దాన్ని మరింత చేసి చెప్పింది సుభద్రమ్మ ఆమె మాట విన్నాడు తాను రెచ్చిపోయాడు మల్లమ్మ శక్తి స్వరూపం వహించింది తల్చుకుంటేనే గుండె జల్లుమంది శాస్త్రిగారు రక్షించారు నిజంగా మల్లమ్మ నిప్పులాంటిది భర్త ఋణం తీర్చుకోవడానికి తన ఇంట్లో పడి చాకిరి చేస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS