సుబ్బయ్యశాస్త్రి గారింట్లో వంటలక్క ముసలియామె. ఆయన తల్లి వేయి కండ్లతో గోడలి ఘోషాను కాపాడుచుండును. ఆడవాళ్ళుమాత్రమామెను జూచుటకు బోవచ్చును. సుబ్బయ్యశాస్త్రి భార్యను బేరంటములకు పంపునపుడు గూడ ఘోషాను రక్షింపగల 'సెడాను' జాతి కారులో నంపును. మోటారు తోలు వాడొక పెద్దకాలపు వీరాస్వామి. వీరాస్వామికి దన మోటారుబండి తప్ప నితరమేమియు గనపడదు. పుష్పశీల ప్రపంచము చూడవలెనను గాఢ వాంఛగలది. తనయందము, తన నగలు, తన చదువు నితరులముందు, ముఖ్యంగా పురుషులముందు మెరపించుట కామె ముచ్చటపడుచుండును. కాబట్టి యత్తగారు గృహకృత్యము లొనరించుకొను నప్పుడు, మధ్యాహ్న భోజనానంతరము కునుకుదీయునప్పుడు, మేడమీదనుంచి సమస్తాభరణభూషితురాలి యాకాశము నుండి తొంగిచూచి తిలోత్తమవలె ఇన్నీసుపేట వీధిలోనికి జూచుచు, ఆ దారి నేను పడుచువాండ్రకు ఎదురువచ్చు బండ్లరాకయు కాలము పోకయు దెలియనిచ్చెడిది కాదు.
ఎంతకాలము నుండియో ముదుకమేనితో బ్రాణములకు లకెవైచికొనియున్న సుబ్బయ్యశాస్త్రి తల్లి పుష్పశీల పుణ్యము పండియో, ఆపై ఘోష కొట్టియో యుండియుండి యొక్కనాడు 'కృష్ణ కృష్ణా!' యనుచు, నెవరికి దెలియకుండ, నే ముదులోకమునకో యెగిరిపోయినది. సుబ్బయ్యశాస్త్రి తన కుడిభుజము కూలిపోయినట్లు తన భార్యకు సాయముండు వారెవ్వరూ లేకుండిరని వాపోయెను. గూటిలో చిలుక కొదమవలెనున్న పుష్పశీల కొక్కసారి రెక్కలు విప్పుకొన్నట్లయినది. సుబ్బయ్యశాస్త్రికి గడియవైచిన తన యింటి తలుపులన్నియు విప్పుకొన్నట్లయినది. గంపంత యింటిని జూచుకొని, వయసులో నొంటరిగా నున్న తన భార్యను జూచుకొని, తన కోర్టుపని దలచుకొని సుబ్బయ్యశాస్త్రి, నిలువునా నీరైపోయినాడు.
పుష్పశీలకు భర్తపై గాఢనురక్తి లేకున్నను అసహ్యము మాత్రము లేదు. భర్తతో నీయేడేండ్ల కాపురము లోకముతో పాటుగానే వెళ్ళబుచ్చినది. నేడామెకు నెత్తిమీద బరువు దింపినట్లయినది. హృదయము నుండి కత్తిమొన పెరికివేసినట్లయినది. కళ్ల గంతలు విప్పినట్లయినది.
సుబ్బయ్యశాస్త్రికి భార్యయన్న వెఱ్ఱి మమకారము. ఇతర స్త్రీలపై నుబలాటము. ఇతర వనితల కెప్పుడు నతడు మాటయిచ్చి తప్పినది లేదు. పుష్పశీల మాట కడుగుదాటినదియు లేదు. భార్య యతనికి తుష్టి గూర్చు షడ్రసోపేత భోజనము. పరకాంత లతని చపలజిహ్వకు ఫలహారములు.
పుష్పశీల గర్భమింతవరకు ఫలించలేదు. ఆమె బ్రతుకున నిండియున్న కామపరిమళము పూర్ణముగా నింక నెవ్వరిని జుట్టుకొనలేదు. ఆమెతో యౌవన మాధుర్యము నరమూతకనులతో గ్రోలి చరితార్థ మొనరించు మధువ్రతుని కొఱకామె తపించుచున్నది. తన మంజులాంగ సౌకుమార్యసరసతావిలాసముల నెమ్మేన పెనవేసుకొని మునుకలిడి, తెప్పదేల్చు పురుషవర్యుడామెకు బ్రత్యక్షము కాలేదు.
చెన్నపట్టణము నుండి వచ్చినప్పటినుండియు రాజేశ్వరునకు పుష్పశీలను జూడవలెనను వాంఛ వేయిమడుంగులైనది. అది యతనికి దపస్సయినది. సుబ్బయ్యశాస్త్రి యింటికతడెన్నిసారులు వెళ్ళెనో! కాని యతనికంటికామె తళుక్కుమనలేదు. పుష్పశీలకు గావలియుండు బ్రహ్మరాక్షసి ఇప్పుడు సుబ్బయ్యశాస్త్రి వేలువిడిచిన మేనత్త. ఒకనాడు సుబ్బయ్యశాస్త్రి మేనత్తకు జ్వరము వచ్చినది. ఆ యాదివారము నాటి సాయంసమయమున రాజేశ్వరుడు మిత్రునింటికి టీ వేళ కరుదెంచి తేనీరు గ్రోలుచుండ సుబ్బయ్యశాస్త్రి మేనత్త జ్వరముచే దనకు బెంగగా నున్నదని చెప్పినాడు. రాజేశ్వరుడది విని తనదగ్గర నద్భుతమగు జ్వరనారాయణాస్త్రమువంటి పాశ్చాత్యౌషధ మొండు కలదనియు, నది రెండు మూడు మోతాదులతో గుదుర్చుననియు జెప్పి, తానెక్కి వచ్చిన సైకిలు మీద నతివేగమున నింటికరిగి యా మందు పట్టుకొనివచ్చి యిచ్చెను.
సుబ్బయ్యశాస్త్రి, చీకటిపడువరకు రాజేశ్వరు నచ్చటనే యుంచి మాట్లాడుచుండగ, లోననుండి పనిచేయుమనిషి వేగముగా వచ్చి చెల్లమ్మగారికి చెమటలు జడివానలా పోస్తున్నాయండి' యని చెప్పెను.
స్నేహితు లిరువురు గభాలున లేచి లోనికి బొయినారు. వారిరువు రచ్చటకు బోవునప్పటికి పుష్పశీలమ్మ యొక తెల్లని వస్త్రముచే నా రోగి ముఖము తుడుచుచుండెను. ఆమె తలయెత్తి రాజేశ్వరరావును జూచెను. రాజేశ్వరుడామెను జూచెను. చెల్లమ్మ గారికి జ్వరమును తగ్గెను.
అది మొదలుకొని పుష్పశీలాదేవి తప్ప ప్రపంచమున నేవస్తువు గోచరించుట లేదు. మనమున నింకొక భావము ప్రసరించుట లేదు. అతని జీవితసూత్ర మా బాలికారూపసంపదను బెనవేసుకొని పోయినది. భోజనము రుచించుట లేదు. నిద్రపట్టుట లేదు. గ్రంథములపై మనసు పోదు. టెన్నీస్ మొదలగు నాటలాడనిచ్చలేదు. స్నేహితుల సమావేశములు వెగటైపోయినవి.
రాజేశ్వరుని జూచినప్పటినుండియు, పిపాసార్ధితులకు జల్లని మంచినీళ్లు కనులబడినట్లయినది పుష్పశీలకు. ఠీవియైన నడకతో, ఫ్రెంచి మీసముతో, పురుషత్వము వెలిగిపోవు రూపసంపదతో, రాజేశ్వరుడామెకు జయంతునివలె బొడగొట్టినాడు. దూరదూరాననే నాగరికతా సముజ్వలులగు యువకులజూచి సంతసించు నాయోషారత్నమునకు రాజేశ్వరుడు అతిలోక సుందరుడై, ముంగిటి పెన్నిధానమై తోచెను.
ప్రోడయగు పుష్పశీల నాటినుండి రాజేశ్వరుడనేక మిషలతో దన యింటికి వచ్చినప్పుడు భర్తకు దెలియ రాకుండ దర్శన మొసగుచుండును. నర్మగర్భములగు చూపుల తోడనే వారిరువురు నించుకించుక హృదయతాపోపశమన మొనర్చుకొనుచుండిరి.
భర్త కోర్టులో నొక గట్టి వ్యాజ్యములో మునిగియున్న రోజున రాజేశ్వరుని కేరీతినో చీటి వచ్చినది. ముసలమ్మకు జ్వరము మరల వచ్చునట్లున్న దనియు దామిదివరకు ఇప్పించిన మందు పట్టుకొని రావలసినది అనియు నా చీటి చెప్పినది. రాజేశ్వరుడు రెక్కలు గట్టుకొని యచ్చట వాలినాడు. కాని యతని తోడనే వచ్చినట్లు సుబ్బయ్యశాస్త్రియు నూడిపడినాడు. రాజేశ్వరుడు హృదయములో శాస్త్రిని నూరుహత్య లొనరించినాడు.
