వరి కుప్పలో పడిన సాహస్, అంకుష్ అతి కష్టంమీద లేచి నిల్చున్నారు.
కుప్ప కింద ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు. భయంతో నీలుక్కుపోయి వున్నారు వాళ్ళు.
"మరేం భయపడకండి! మేం మీ శత్రువులం కాదు" అన్నాడు సాహస్.
"అమ్మయ్య!" అంటే మీరు గవర్నమెంటోళ్ళు కారన్నమాట!" అన్నారు వాళ్ళు తెరిపిగా.
"అంటే!" అన్నాడు సాహస్.
"గవర్నమెంటోళ్ళ బాధ పడలేకనే కదండీ బాబూ - నేనూ మా ఫ్రెండ్సూ ఈ కొండల్లో సెటిలయిపోయిందీ?" అన్నాడు మొదటి వ్యక్తి.
"అంటే మీరు నేరస్తులా?" అన్నాడు అంకుష్ డైరెక్టుగా, నిర్మొహమాటంగా.
"ఓర్నాయనోయ్! మరీ అంత మాట అనెయ్యకండి! మేం గవర్నమెంటు బాధితులం అంతే!" అన్నాడు రెండో వ్యక్తి.
సందేహంగా చూశాడు సాహస్.
అది చూసి చెప్పడం మొదలెట్టారు వాళ్ళు.
"ఏం లేదు! ఊళ్ళో వున్నామనుకోండి. గవర్నమెంటుతో నిత్యం తగువే. ఎవరూ పాటించలేని, సృష్టికి విరుద్ధమైన రూల్సు పెడతారు. వాటిని ఎవరూ పాటించరు. కానీ దొరికిపోయిన వాడు దొంగ! పోలీసులు - టాక్సులు - వేధింపులు - కక్షలు - కార్పణ్యాలు! ఛీఛీఛీ! సిటీలో మనుషుల్లాగా బతకడం కంటే అడవుల్లో జంతువుల్లా బతకడం మేలనిపించి, ఈ కొండల్లోకీ, కోనల్లోకీ వచ్చేశాం!"
"కానీ మీకంటే మా కంటే కూడా ముందే ఇంకెవరో ఇక్కడ వుండి వుండాలి! వేల సంవత్సరాల క్రితమే!" అన్నాడు సాహస్.
సాహస్ అలా అనగానే, వాళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.
"మీకెలా తెలుసూ?" అన్నారు జంట కవుల్లాగా.
చిన్నగా నవ్వాడు సాహస్.
"ఇక్కడ చిరకాలం క్రితమే ఎవరో వ్యవసాయం చేసిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇక్కడి ప్రాంతం కొండని మెట్లు మెట్లుగా చెక్కినట్లు వుంది. ఆ మెట్లమీద మడుల్లాగా మట్టి! ఆ మట్టి జారిపోకుండా చుట్టూతా గోడలు! సందేహం లేదు! వేల సంవత్సరాల క్రితమే ఇక్కడేదో నాగరికత వుండి వుండాలి" అన్నాడు సాహస్.
వెంటనే వాళ్ళలో ఒకడు మాట మారుస్తూ, "ముందు మీరు కాస్త ఆకలి తీర్చుకోరూ?" అంటూ కాసిని దోసకాయలు కోసి ఇచ్చాడు.
సాహస్, అంకుష్ ఆవురావురుమని దోసకాయలు తినడం మొదలెట్టారు.
ఆ రైతుల్లో ఒకడు అన్నాడు.
"ఇంతకీ మీరెక్కడికి బయల్దేరారూ?"
"టెలిస్కోపు కొండకి!"
అది వినగానే నీలుక్కుపోయినట్టు చూశారు వాళ్ళు.
"బాప్ రే! టెలిస్కోపు కొండకే! ఎందుకూ?"
నవ్వాడు సాహస్.
"ఎందుకంటే ఏం చెప్పాలి. ఎవరెస్టు ఎందుకెక్కుతున్నారూ అంటే ఏం చెప్పాలి? అది ఎవరెస్టు కాబట్టి! అది అక్కడ వుంది కాబట్టి! అలాగే ఈ టెలిస్కోపు కొండ కూడా!"
"టెలిస్కోపు కొండ మీదకి వెళ్ళిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు"
"ఎవరు వెళ్ళారు?" అన్నాడు సాహస్.
"విచిత్ర వ్యక్తులు" అన్నాడు మొదటి రైతు.
వెంటనే, నోరు జారినట్లు నాలిక కరుచుకున్నాడు.
"విచిత్ర వ్యక్తులా? వాళ్ళెవరు?" అన్నాడు.
రైతులిద్దరూ కళ్ళతోనే ఒకళ్ళకొకళ్ళు సైగలు చేసుకున్నారు.
"ఆ విచిత్ర వ్యక్తుల గురించి మేం చెప్పకపోవడం, మీరు వినకపోవడమే మంచిది" అన్నాడు మొదటివాడు.
వాళ్ళు ఇంకా అంతకంటే ఏమీ చెప్పదలుచుకోలేదని గ్రహించాడు సాహస్.
వాచ్ చూసుకుని "ఆల్ రైట్! ఇంక మేం బయల్దేరతాం! థాంక్స్ ఫర్ ఎవ్విరిథింగ్!" అన్నాడు.
సాహస్, అంకుష్ వెళ్తుంటే ఆత్మాహుతి దళాన్ని చూసినట్లు చూశారు ఆ రైతులిద్దరూ.
మళ్ళీ ఇంకో కొండ ఎక్కడం మొదలయింది. ఆ కొండ మీదంతా దట్టమైన అడవి.
"ఇది అద్భుతమైన అరణ్యం! ఇందులో దొరకని మూలిక అంటూ లేదంటారు. ఇదిగో! ఈ మొక్క చూడు! రుగ్వేదంలో వర్ణించిన "బ్రాహ్మి" మూలిక ఇదే! ఇది జ్ఞాపకశక్తిని బాగా ఎక్కువ చేస్తుంది. ఈ మధ్యన ఈ మూలికతోనే "మెమొరీ టాఫీస్" అనే చాక్లెట్లు తయారు చేస్తున్నారు. త్వరలోనే మార్కెట్ లోకి వస్తాయి. ఇంక స్టూడెంట్స్ కి భలే ఛాన్సు" అన్నాడు సాహస్.
అంకుష్ కుతూహలంగా ఆ మొక్కవైపు చూశాడు. అంతలోనే ఉలిక్కిపడ్డాడు.
